• facebook
  • whatsapp
  • telegram

వజ్రం - గ్రాఫైట్

                  ప్రకృతిలో లభించే అన్నిటికంటే కఠినమైన పదార్థం వజ్రం. అత్యధిక వక్రీభవన గుణకం ఉన్న పదార్థం కూడా వజ్రమే. గ్రాఫైటు, వజ్రం రెండింటిలో ఉండే మూలకం కార్బన్. ఇది కఠిన, మృదు రూపాల్లో లభించే మూలకం. వజ్రం, గ్రాఫైట్‌లు రెండూ ఒకదానికొకటి రూపాంతరాలు. 
* గాజును కోయడానికి వజ్రాన్ని ఉపయోగిస్తారు. దీనికి కారణం వజ్రం కఠినంగా ఉండటమే.
* వజ్రం కఠినత్వానికి కారణం దానికి బలమైన కార్బన్- కార్బన్ సమయోజనీయ బంధాలు ఉండటమే.
* వజ్రం సమయోజనీయ స్ఫటికం.
* వజ్రం చతుర్ముఖీయ బృహదణు నిర్మాణంతో ఉంటుంది. దీనిలో కార్బన్-కార్బన్ బంధ దూరం 1.54 Ao ఉంటుంది. బంధ కోణం 109o 28' ఉంటుంది.
* వజ్రం విద్యుద్వాహకం కాదు. దీనికి కారణం వజ్రంలో కార్బన్లపై స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండవు.
* వజ్రం గాజు కంటే ఎక్కువగా మెరుస్తుంది. ఎందుకంటే- 1) అది అధిక వక్రీభవన గుణకం (2.41)తో ఉంటుంది. 2) కాంతిని సంపూర్ణాంతర పరావర్తనం చెందిస్తుంది.
* గ్రాఫైట్‌లో షట్కోణ వలయాలున్న పొరజాలక నిర్మాణం ఉంటుంది. అంతేకాకుండా ఈ పొరల మధ్య బలహీనమైన వాండర్‌వాల్ బలాలు ఉంటాయి. అందుకే ఇది మృదువుగా ఉంటుంది.
* గ్రాఫైట్‌లో కార్బన్-కార్బన్ బంధ దూరం 1.42Ao ఉంటుంది. బంధకోణం విలువ 120o ఉంటుంది.
* గ్రాఫైట్, బంకమన్ను మిశ్రమాన్ని పెన్సిల్‌లెడ్ అంటారు.
* కాగితంపై రాసే స్వభావం ఉన్న ఒకే ఒక లోహం లెడ్ (సీసం) కాబట్టి, పై మిశ్రమానికి పెన్సిల్‌లెడ్ అని పేరు వచ్చింది.
* పెన్సిల్‌లెడ్‌లో ఉండే లెడ్ శాతం సున్నా. సిల్వర్ పెయింట్‌లో ఉండే సిల్వర్ శాతం సున్నా. జర్మన్ సిల్వర్‌లో ఉండే సిల్వర్ శాతం సున్నా.
* గ్రాఫైట్ మంచి విద్యుద్వాహకం. దీనికి కారణం గ్రాఫైట్‌లోని ఒక్కో కార్బన్‌పై ఒక్కో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ ఉండటం.
* గ్రాఫైట్ కడ్డీని నిర్జల ఘటం (Dry Battery Cell) లో ధనధ్రువంగా ఉపయోగిస్తారు.


కేంద్రక విచ్ఛిత్తి:
* దీన్ని ఆటోహాన్, స్ట్రాస్‌మన్ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
* ఆటంబాంబు, అణురియాక్టర్లలో యురేనియం-235ను ఇంధనంగా ఉపయోగించి దాన్ని న్యూట్రాన్లతో తాడనం జరుపుతారు.
* ఆటంబాంబు నిర్మాణంలో ఇమిడి ఉండే సూత్రం అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి.
* ఆటంబాంబు రూపకర్త ఓపెన్ హామర్.
* కేంద్రక అణు రియాక్టర్ నిర్మాణంలో ఇమిడి ఉండే సూత్రం నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి.
* అణు రియాక్టర్లలో 1) నియంత్రణ కడ్డీలుగా కాడ్మియం, జిర్కొనియం లేదా బోరాన్ కడ్డీలను ఉపయోగిస్తారు. 2) న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారిగా భారజలాన్ని ఉపయోగిస్తారు. 3) శీతలీకరణిగా ద్రవసోడియం ఉపయోగిస్తారు.


కేంద్రక సంలీనం:
* సూర్యుడు, నక్షత్రాల్లో శక్తి విడుదలయ్యేందుకు కారణం కేంద్రక సంలీనం.
* వీటిలో హైడ్రోజన్ వాయువు సంలీనం చెంది హీలియం వాయువు ఏర్పడుతుంది.  

* హైడ్రోజన్ బాంబు తయారీలో ఉపయోగించే సూత్రం కేంద్రక సంలీనం.
* ఈ చర్య జరగడానికి కొన్ని మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. కాబట్టి, హైడ్రోజన్ బాంబు తయారీకి ఆటంబాంబును అగ్గిపుల్లలా ఉపయోగిస్తారు.

కార్బన్ డేటింగ్:
* పురాతనమైన వృక్ష, జంతు శిలాజాల వయసును నిర్ణయించడానికి కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు.
* ఈ పద్ధతిలో పదార్థంలోని కార్బన్-14, కార్బన్-12ల నిష్పత్తిని లెక్కిస్తారు.
* వీటిలో కార్బన్-14 రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది. దీని అర్ధ జీవితకాలం 5730 సంవత్సరాలు.
* కార్బన్ డేటింగ్ పద్ధతి 30వేల సంవత్సరాల లోపు వస్తువుల వయసు నిర్ణయించడానికి మాత్రమే పనికివస్తుంది.
* భూమి, పురాతన శిలల వయసును యురేనియం డేటింగ్ పద్ధతి ద్వారా నిర్ణయిస్తారు.
* ఈ పద్ధతితో శిలల్లోని U-238, Pb-206 ల నిష్పత్తిని నిర్ణయించి, వయసును లెక్కిస్తారు.

ఫొటోగ్రఫీ: ఇది కాంతి సమక్షంలో జరిగే రసాయనిక చర్య.
* ఫొటోగ్రఫీ కాగితాన్ని ముఖ్యంగా ప్రభావితం చేసేవి దృగ్గోచర కాంతి కిరణాలు.
* ఫొటోగ్రఫీ కాగితంపై సిల్వర్‌బ్రోమైడ్ (AgBr) అనే రసాయనాన్ని పూస్తారు.
* ఇది కాంతితో ప్రభావితం చెందినప్పుడు సిల్వర్‌బ్రోమైడ్ సిల్వర్‌గా క్షయకరణం చెందుతుంది. కాబట్టి ఫొటోగ్రఫీ క్షయకరణ చర్యకు ఉదాహరణ.
* డెవలప్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో నల్లగా కనిపించేది సిల్వర్ లోహం.
* ఫొటోగ్రఫీలో హైపో అనే రసాయనాన్ని స్థిరీకరణి (fixer) గా ఉపయోగిస్తారు.
* హైపో రసాయనిక నామం సోడియం థయోసల్ఫేట్ (Na2S2O3).
* సిల్వర్ హాలైడ్లను ఫొటోగ్రఫీలో, మేఘమథనం కార్యక్రమంలో ఉపయోగిస్తారు.
* కృత్రిమ వర్షాలు కురిపించడానికి మేఘాలపై చల్లే రసాయనం సిల్వర్ అయొడైడ్ (AgI).

కిరణజన్య సంయోగక్రియ: ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి.
* దీనిలో CO2 వాయువును, H2O ను ఉపయోగించుకుని కార్బోహైడ్రేట్లు, O2 వాయువును ఉత్పత్తి చేస్తాయి.
* ఈ ప్రక్రియ సూర్యకాంతి, పత్రహరితం సమక్షంలో జరుగుతుంది.  
         
* పత్రహరితం కాంతిశక్తిని రసాయనశక్తిగా మారుస్తుంది.
* పత్రహరితంలో మెగ్నీషియం లోహం ఉంటుంది. దీనివల్ల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
* కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు ఆక్సిజన్ CO2 నుంచి తయారు కాదు. అది H2 O నుంచి తయారవుతుంది.
* మొక్కలను ఎక్కువగా పెంచడంవల్ల కింది ఫలితాలు ఉంటాయి:
       1) కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరుగుతుంది. 
       2) గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. 
       3) గాలిలో CO2 శాతం తగ్గుతుంది. 
       4) గాలిలో CO2, O2 ల సమతౌల్యం ఏర్పడుతుంది. 
       5) హరితగృహ ప్రభావం తగ్గి పర్యావరణం చల్లబడుతుంది. 
       6) శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.


బొగ్గు రకాలు:
* బొగ్గు భూమిలోని శిలావరణం నుంచి లభిస్తుంది. దీన్ని మండించినప్పుడు అధికంగా పొగ వస్తుంది.
* వంట చెరకుగా వాడే బొగ్గు రూపం కోక్. బొగ్గును విధ్వంసక స్వేదనం జరిపినప్పుడు కోక్ వస్తుంది. దీన్ని మండించినప్పుడు పొగరాదు.
* బొగ్గులో నాలుగు ముఖ్యమైన రకాలున్నాయి: 
       1) ఆంథ్రసైట్ బొగ్గు (90% C) 
       2) బిట్యుమినస్ బొగ్గు (80% C) 
       3) లిగ్నైట్ (70% C) 
       4) పీట్ (60% C)
* ఆంథ్రసైట్ బొగ్గు అన్నిటికంటే పరిశుద్ధమైన బొగ్గురూపం. ఇది అన్ని బొగ్గు రూపాల్లో పురాతనమైంది, అధిక కెలోరిఫిక్ విలువ ఉన్నది.
* గృహాలు, పరిశ్రమల్లో ఉపయోగించేది బిట్యుమినస్ బొగ్గు.
* లిగ్నైట్‌ను బ్రౌన్‌కోల్అంటారు. దీన్నే క్వాటర్నరీ కోల్ అని కూడా పిలుస్తారు.
* పీట్ అనే బొగ్గు రూపం వృక్షాల అవశేషాలతో ఉంటుంది. వృక్ష సంబంధ పదార్థాల కార్బనేషన్ వల్ల ఈ బొగ్గు ఏర్పడిందని తెలుస్తోంది.


ఇంధన వాయువులు:
* మండించినప్పుడు అధిక ప్రమాణంలో ఉష్ణాన్ని ఇచ్చే వాయువులను ఇంధన వాయువులు అంటారు.
* అన్ని ఇంధన వాయువుల్లో సాధారణంగా ఉండే మూలకం కార్బన్.
* భూమిలోని శిలావరణంలో వెలువడే సహజవాయువు (Natural gas) లో ముఖ్యంగా ఉండేది మీథేన్ (CH4).
* మీథేన్ వాయువును మార్ష్‌గ్యాస్ లేదా ఫైర్‌డాంప్ అని పిలుస్తారు.
* చిత్తడి నేలల్లో బుడగల్లా వెలువడే వాయువు మీథేన్. చిత్తడి నేలలను మార్ష్ అంటారు. కాబట్టి మీథేన్‌కు మార్ష్‌గ్యాస్ అనే పేరు వచ్చింది.
* బొగ్గు గనుల్లో ఆక్సిజన్‌తో మీథేన్ వాయువుకు మండిపోయే స్వభావం ఉంటుంది.
* మురికిగుంటల్లో నీరు నల్లగా కనిపించడానికి కారణం దానిలో ఏర్పడిన కార్బన్‌డైసల్ఫైడ్.
* గృహాల్లో ఉపయోగించే ఎల్.పి.జి. గ్యాస్‌లో ముఖ్యంగా బ్యుటేన్ , ప్రొపేన్ ఉంటాయి. బ్యుటేన్ ఫార్ములా C4H10, ప్రొపేన్ ఫార్ములా C3H8.
* ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే CO+H2 వాయువుల మిశ్రమం. ఎర్రగా కాలిన కోక్‌పై గాలిని పంపి, ప్రొడ్యూసర్ గ్యాస్‌ను తయారుచేస్తారు.
* ప్రొడ్యూసర్ గ్యాస్‌ను ఐరన్, స్టీలు పరిశ్రమల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు.
* వాటర్ గ్యాస్ అంటే CO+H2 వాయువుల మిశ్రమం. ఎర్రగా కాలిన కోక్‌పై నీటి ఆవిరిని పంపి దీన్ని తయారుచేస్తారు.
* వాటర్‌గ్యాస్‌లోని CO, H2 వాయువులు రెండూ నీలిరంగులో మండుతాయి. కాబట్టి వాటర్‌గ్యాస్‌ను నీలి గ్యాస్ అని కూడా అంటారు.
* వాటర్ గ్యాస్‌ను గాజు పరిశ్రమలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
* సెమీ వాటర్‌గ్యాస్ అంటే CO, H2, N2 వాయువుల మిశ్రమం.
* ఎర్రగా కాలిన కోక్‌పై గాలి, నీటి ఆవిరి మిశ్రమాన్ని పంపి సెమీ వాటర్ గ్యాస్ తయారుచేస్తారు.


యుద్ధ వాయువులు:
రసాయన యుద్ధాల్లో ఫాస్‌జీన్, టియర్ గ్యాస్, మస్టర్డ్ గ్యాస్‌లను ఉపయోగిస్తారు.
* ఫాస్‌జీన్ ఫార్ములా COCl2 కార్బన్ మోనాక్సైడ్‌తో క్లోరిన్ వాయువు చర్య వల్ల ఫాస్‌జీన్ ఏర్పడుతుంది. 
CO+Cl2  COCl2
* ఫాస్‌జీన్‌ను కార్బొనైల్ క్లోరైడ్ అని కూడా పిలుస్తారు.
* టియర్ గ్యాస్ అంటే క్లోరోపిక్రిన్. దీని రసాయన నామం ట్రైక్లోరో నైట్రో మీథేన్. దీని అణు ఫార్ములా CCl3 NO2
* క్లోరోఫాంకు నైట్రిక్ ఆమ్లం కలిపినప్పుడు టియర్‌గ్యాస్ తయారవుతుంది.
      CHCl+ HNO2 ® CClNO2 + HCl
* టియర్ గ్యాస్ కంటికి సోకినప్పుడు కళ్లు మండి బాష్పాలు వస్తాయి. కాబట్టి టియర్ గ్యాస్‌ను బాష్పవాయువు లేదా ఏడిపించే వాయువు అంటారు.
* మొదటి ప్రపంచ యుద్ధంలో మస్టర్డ్ గ్యాస్‌ను ఉపయోగించారు. ఇథిలీన్‌కు సల్ఫర్ మోనోక్లోరైడ్‌ను కలిపినప్పుడు ఈ వాయువు తయారవుతుంది.

మినిమాటా జబ్బు: మినిమాటా అనేది జపాన్‌లో ఒక ద్వీపం (Island). ఈ ప్రదేశంలో ఒక పి.వి.సి. (పాలివినైల్ క్లోరైడ్) తయారుచేసే పరిశ్రమ ఉంది. ఇందులో మెర్క్యురిక్ క్లోరైడ్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. ఇది సముద్రంలో కలవడం వల్ల మెర్క్యురీ కాలుష్యం ఏర్పడుతోంది.
* ఈ మెర్క్యురీని చేపలు గ్రహించి మిథైల్ మెర్క్యురీగా మారుస్తాయి. ఈ చేపలను తిన్న మానవులకు మినిమాటా జబ్బు వస్తుంది. ఈ జబ్బులో క్రోమోజోముల్లో మార్పులు జరిగి వంశపారంపర్య లక్షణాలు నశిస్తాయి.
* చేపలు తినడం, మెర్క్యురీ కాలుష్యం వల్ల మినిమాటా జబ్బు వస్తుంది.

బంగారం క్యారెట్ విలువ: శుద్ధమైన బంగారం ఆభరణాల తయారీకి పనికిరాదు. దీనిలో గట్టిదనం కోసం రాగిని కలుపుతారు.
* పరిశుద్ధమైన బంగారం విలువ 24 క్యారెట్‌లు.
* ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం ఉపయోగిస్తారు. దీనిలో రెండు క్యారెట్‌ల రాగి కలిసి ఉంటుంది.
* 18 క్యారెట్ల బంగారంలో రాగి 6 క్యారెట్లు ఉంటుంది.
* 18 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం =
                                           18/24 × 100 = 75%
* 18 క్యారెట్ల బంగారంలో రాగి శాతం =
                                            6/24 × 100 = 25%

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌