• facebook
  • whatsapp
  • telegram

కార్మికుల సంక్షేమం - చట్టాలుకార్మికుల ఆవశ్యకత

ఏ దేశ ప్రగతినైనా నిర్దేశించే సత్తా కార్మిక వర్గానికి ఉంటుంది. దేశ విధానకర్తలు కార్మిక సంక్షేమాన్ని విస్మరించలేరు. కార్మికులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని వాతావరణం, వేతనాలు అందిస్తే వారు దేశ ప్రగతికి మరింత తోడ్పాటు అందిస్తారు. 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక కార్మికులు ఉన్న దేశంగా భారత్‌ అవతరిస్తుందని అంచనా.


రాజ్యాంగంలో - ప్రస్తావన


భారత రాజ్యాంగంలోని IV వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల్లో కార్మిక సంక్షేమం గురించి పేర్కొన్నారు.


 ఆర్టికల్‌ 39 (D): స్త్రీ, పురుషులకు సమానపనికి సమాన వేతనం చెల్లించాలి.


 ఆర్టికల్‌ 39 (E) : కార్మికులు వారి శారీరక దారుఢ్యానికి మించి పనిచేయకుండా చూడాలి.


ఆర్టికల్‌ 42: కార్మికులకు పని ప్రదేశాల్లో గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాలి. స్త్రీ కార్మికులకు తగిన ప్రసూతి సౌకర్యాలు అందించాలి.


 ఆర్టికల్‌ 43: కార్మికులకు కనీస వేతనం అందించాలి. కార్మికులకు విరామం, విశ్రాంతి, మానసిక వికాసాన్ని కల్పించేందుకు ప్రయత్నించాలి.


 ఆర్టికల్‌ 43 (A):పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.


కార్మిక సంక్షేమ పథకాలు


అటల్‌ పెన్షన్‌ యోజన


 ఈ పథకాన్ని  కేంద్రం 2015లో ప్రారంభించింది. అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం దీని లక్ష్యం. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ దీన్ని నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా కలిగి, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. కనీసం 20 ఏళ్లు ఈ పథకంలో కొనసాగాలి. 


60 ఏళ్లు నిండాక వారు డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్‌ లభిస్తుంది.


ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన


 ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు. ఇది జీవిత బీమా పథకం. వార్షిక ప్రీమియం రూ.330. రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా ఉండి, 18 సం. నుంచి 50 సం.లోపు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 


దీన్ని ఏటా రెన్యువల్‌ చేసుకోవాలి. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్నవారు ఈ పథకంలో చేరితే, 55 సం.లు వచ్చేవరకు వార్షిక ప్రీమియం చెల్లిస్తే, బీమా సదుపాయం లభిస్తుంది.


స్వావలంబన్‌


దీన్ని 2010లో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని కార్మికుల్లో పొదుపు అలవాటును పెంపొందించడం దీని లక్ష్యం. ఈ పథకంలో చేరిన ప్రతి కార్మికుడికి కేంద్ర ప్రభుత్వం రూ. 1000 చొప్పున తన వాటాగా చెల్లిస్తుంది.


ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన


ఇది వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. 2015లో ప్రారంభించారు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. బ్యాంక్‌లో పొదుపు ఖాతా కలిగి, 18 - 70 ఏళ్ల మధ్య వయసు వారు దీనికి అర్హులు. 


పాలసీదారు ఏదైనా ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షల పరిహారం నామినీకి లభిస్తుంది.


అసంఘటిత రంగ వాటా పెరుగుదల


మనదేశ ఉపాధిరంగంలో అసంఘటిత రంగ కార్మికుల వాటా 1977-78 నాటికి 92.2 శాతంగా ఉంది. అప్పటికి ఇంకా ప్రపంచీకరణ ప్రభావం మొదలుకాలేదు.  National Commission for Enterprises in the Unorganised Sector - NCEUS అధ్యయనం ప్రకారం, వ్యక్తులు లేదా కుటుంబాల యాజమాన్యంలో లేదా భాగస్వామ్యంలో ఉండి, ఉత్పత్తి, అమ్మకాల్లో నిమగ్నమై పదికంటే తక్కువ మందితో పనిచేసే సంస్థలన్నీ అసంఘటిత సంస్థలే.


E-Shram Card


అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రతను కల్పించడంతోపాటు సంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం ‘E-Shram Portal ను ప్రారంభించింది. దీని ద్వారా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వారికి అందిస్తారు. దీని కోసం కార్మికులకు ‘E-Shram Cards ను ఇస్తారు. 


ప్రయోజనాలు: - దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందొచ్చు.


 ప్రతి కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. పూర్తి అంగవైకల్యానికి గురైతే రూ.2 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం అందిస్తారు.


 అసంఘటిత రంగంలో పనిచేసే 16 - 59 ఏళ్ల వయసు వారు E-Shram Card కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఉచితం. 


 ఈ కార్డుదారులకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన, స్వయం ఉపాధి కోసం జాతీయ పెన్షన్‌ పథకం, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రజాపంపిణీ వ్యవస్థ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి ప్రయోజనాలు పొందొచ్చు.


కార్మిక చట్టాలు


కర్మాగారాల చట్టం, 1948


ఈ చట్టం ప్రకారం, సంస్థ ప్రతి 150 మంది కార్మికులకు ఒక ప్రథమ చికిత్స పేటిక (బాక్స్‌)ను, 500 మందికి మించి కార్మికులు ఉంటే, అంబులెన్స్‌ సౌకర్యాన్ని కల్పించాలి. 


 కార్మికులకు విశ్రాంతి గదులు, భోజనశాలను ఏర్పాటు చేయాలి. 500 కంటే ఎక్కువ కార్మికులు ఉంటే వారి యోగక్షేమాల పర్యవేక్షణకు ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. 30 మందికి మించి మహిళా కార్మికులు పనిచేస్తుంటే శిశు సంరక్షణా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 250 మందికి మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ కల్పించాలి.


ప్లాంటేషన్‌ కార్మికుల చట్టం, 1951


ఈ చట్టం ప్రకారం, 300 లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేస్తుంటే, వారి సంక్షేమ పర్యవేక్షణకు ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య, వినోద సౌకర్యాలను కల్పించాలి. మహిళా కార్మికులకు ‘ప్రసూతి భత్యాన్ని’ ఇవ్వాలి. 150 మంది లేదా అంతకు మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ కల్పించాలి.


గనుల చట్టం, 1952


ఈ చట్టం ప్రకారం, గనుల్లో పనికోసం బాలబాలికలను కార్మికులుగా నియమించకూడదు. 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మహిళా కార్మికులు ఉంటే తప్పనిసరిగా ‘శిశు సంరక్షణా కార్యాలయాన్ని’ ఏర్పాటు చేయాలి. 500 లేదా అంతకు మించి కార్మికులు ఉంటే వారికి భోజనశాల, విశ్రాంతి గదుల సౌకర్యాన్ని కల్పించాలి. 250 మంది లేదా అంతకు మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ అందించాలి. 150 మంది కార్మికులు ఉంటే వారికి ప్రథమ చికిత్స పేటికలు అందుబాటులో ఉంచాలి.


బోనస్‌ చెల్లింపు చట్టం, 1965


యాజమాన్యం కార్మికులకు వేతనాలతో పాటు అదనంగా చెల్లించే ఆర్థిక ప్రయోజనమే ‘బోనస్‌’. దీని ద్వారా కార్మికులకు అదనపు ఆర్థిక ప్రతిఫలం లభిస్తుంది. సంస్థ లాభ-నష్టాలతో సంబంధం లేకుండా బోనస్‌ను చెల్లించాలి. పరిశ్రమలు, కంపెనీల యాజమాన్యంపై బోనస్‌ చెల్లించాల్సిన చట్టపరమైన బాధ్యత ఉంది. ప్రతి యజమాని తన సంస్థలో పనిచేసే కార్మికుడికి సంవత్సరంలో తను సంపాదించుకునే వేతనంలో 8.33% ఆర్థిక వనరును కనీస బోనస్‌గా చెల్లించాలి.


అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1979


ఈ చట్టం ప్రకారం, వివిధ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికులకు చట్టపరమైన రక్షణ, సదుపాయాలను కల్పించాలి. కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలి. వారికి సరైన పని పరిస్థితులను, నివాస వసతి కల్పించాలి.


మోటార్‌ రవాణా కార్మిక చట్టం, 1961


ఈ చట్టం ప్రకారం, రవాణా వాహనంలో తప్పనిసరిగా ప్రథమ చికిత్స పెట్టెను (First Aid Box) ను ఉంచాలి.


ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన


దీన్ని 2015లో ప్రారంభించారు. దీని ద్వారా 20కి పైగా కేంద్ర మంత్రిత్వశాఖలు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ, కార్మికులను ఉన్నత స్థితిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. 


 నూతన వ్యాపారాలను ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేస్తూ భారత్‌లో తయారీ, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ లాంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా కార్మికులకు వివిధ రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. 


 స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, ముద్ర లాంటి పథకాలతో కార్మికుల్లో సృజనాత్మక ఆలోచనాధోరణులను పెంపొందించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.


బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, 1986


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 24 ప్రకారం మన దేశంలో బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. దీని ద్వారా 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలను కర్మాగారాల్లో, గనుల్లో పనుల కోసం నియమించకూడదని నిర్దేశించారు.


 బాల కార్మిక నిషేధ చట్టం, 1986 ప్రకారం బాలలు అంటే 14 ఏళ్లలోపు వయసువారు. 


 ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం 13 వృత్తులు, 57 ప్రక్రియల్లో  పనుల కోసం పిల్లలను ఉపయోగించడం నేరం.


 ఈ చట్టంలోని సెక్షన్‌ 3లో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించి ఏ వ్యక్తి అయినా బాలలను పనుల కోసం ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తికి 3 నెలలకు తక్కువ కాకుండా ఒక సంవత్సరం వరకు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు.


బాల కార్మిక వ్యవస్థ నిషేధ సవరణ చట్టం, 2016


కేంద్ర ప్రభుత్వం బాల కార్మికుల నిషేధ సవరణ చట్టాన్ని 2016లో రూపొందించింది. ఇందులోని అంశాలు 2016, సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం, 18 ఏళ్లలోపు కౌమార దశలో ఉన్న పిల్లలను ప్రమాదకర పనుల్లో నియమిస్తే సంబంధిత యజమానులకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారు.


 ఈ చట్టం ప్రకారం, కార్మిక - ఉపాధి మంత్రిత్వశాఖ జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్‌ (NCLP) పథకాన్ని అమలుచేస్తోంది. ఇందులో ప్రతి జిల్లాకు ఒక సొసైటీ ఉంటుంది. వీటిని జిల్లా ప్రాజెక్ట్‌ సొసైటీలు అంటారు. ఇవి బాల కార్మికులకు పునరావాసం కల్పిస్తాయి. వీటికి జిల్లా మెజిస్ట్రేట్‌ అధ్యక్షత వహిస్తారు.


రచయిత

బంగారు సత్యనారాయణ

విషయ నిపుణులు 

Posted Date : 13-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌