• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థిక సంఘం

         ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే సాధారణంగా ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేస్తారు. ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించే అధికారం రాష్ట్రాలతోపాటు మరెవరికీ లేదు.
 

        భారత ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, అర్ధ న్యాయ సంస్థ (Quasi-federal). ఇది ఒక సలహా సంస్థ. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కాబట్టి సమాఖ్యలో ఆర్థిక వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోన్న సహకార సమాఖ్యలో ఆర్థిక సంఘం సిఫారసులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. పన్నుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయ వనరులు సమకూరతాయి. రాష్ట్రాలు ప్రజలకు సన్నిహితంగా ఉంటూ తక్కువ వనరులతో, అధిక వ్యయంతో కూడిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయ వనరుల విషయంలో కేంద్రం - రాష్ట్రాల మధ్య (Verticle), రాష్ట్రాల మధ్య (Horizontal) అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని వనరులను పునఃపంపిణీ చేయడానికి రాజ్యాంగ నిర్మాతలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఏ సమాఖ్య వ్యవస్థలోనూ ఇలాంటి అధికారాలతో ఏర్పడిన సంస్థ మరొకటి లేదు.
 

రాజ్యాంగ హోదా
 

     రాజ్యాంగంలోని XII వ భాగంలో 280 నుంచి 281 వరకు ఉన్న నిబంధనలు ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం, విధులు, సిఫారసులను సమర్పించడం లాంటి అంశాలను వివరిస్తాయి.
 

నియామకం - అర్హతలు
 

     ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. 280(1) నిబంధన ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా అవసరమని భావించినప్పుడు రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇది ఒక తాత్కాలిక సంస్థ. ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా ప్రజా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారిని నియమిస్తారు. ఉదాహరణకు 2017, నవంబరు 27న 15వ ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా నియమితులైన ఎన్.కె. సింగ్ మాజీ రాజ్యసభ సభ్యుడు. పదవీ విరమణ పొందిన కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు. ఆర్థిక సంఘంలో సభ్యులుగా నియమితులు కావడానికి కిందివాటిలో ఏదో ఒక అర్హత ఉండాలి.
* హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అవసరమైన అర్హతలు ఉండాలి.
* ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఖాతాలకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి.
* ఆర్థిక పాలనా వ్యవహారాల్లో విస్తృతమైన అనుభవం ఉండాలి.
* అర్థశాస్త్ర నిపుణుడై ఉండాలి. అయితే నియమించే సభ్యుడి వ్యక్తిగత ప్రయోజనాలు ఆర్థిక సంఘం విధులను ప్రభావితం చేసే అవకాశం ఉండకూడదు. ఈ మేరకు రాష్ట్రపతి సంతృప్తి చెందాలి. రాష్ట్రపతి కోరిన సమాచారాన్ని అందించాలి.

 

అనర్హతలు:
  1) మానసిక బలహీనత ఉండకూడదు.
  2) ఆర్థికంగా దివాలా తీసి ఉండకూడదు.
  3) దుర్మార్గమైన కార్యకలాపాల్లో పాల్గొని నేరస్తుడై ఉండకూడదు.
  4) ఆర్థిక సంఘం విధి నిర్వహణను ప్రభావితం చేసే వ్యక్తిగత ప్రయోజనాలు ఉండకూడదు.

 

ఆర్థిక సంఘం నిర్మాణం

      ఆర్థిక సంఘం బహుళ సభ్య సంఘం. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరి నియామకానికి కావాల్సిన అర్హతలు, ఎంపిక చేసే విధానాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. పార్లమెంట్ 'ఆర్థిక సంఘ చట్టం' (ఇతర నిబంధనలు) 1951 (Finance Commission (Miscellaneous Provisions) Act 1951) ని రూపొందించింది. ఇందులో ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యుల నియామకం, అర్హతలు, అనర్హతలు, పదవీ కాలం, అధికారాలు లాంటి అంశాలను పేర్కొన్నారు.
 

పదవీ కాలం:
        ఆర్థిక సంఘం శాశ్వత సంస్థ కాదు. కాబట్టి దీనికి నిర్ణీత పదవీ కాలం ఉండదు. ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యులు నియామక పత్రంలో రాష్ట్రపతి ప్రత్యేకంగా పేర్కొన్న కాలం వరకు విధులు నిర్వహిస్తారు. నిర్దేశించిన కాలపరిమితి లోపల నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబరులో నియమించారు. 2019 అక్టోబరు లోపల నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్రపతి ఆదేశించారు. అయితే ఆర్థిక సంఘం నివేదిక నిర్ణీత కాలవ్యవధి వరకు అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 14వ ఆర్థిక సంఘం నివేదిక 2015 నుంచి 2020 వరకు, 15వ ఆర్థిక సంఘం నివేదిక 2020 నుంచి 2025 వరకు అమల్లో ఉంటాయి.
* ఒకసారి ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తిని తిరిగి ఆ పదవిలో నియమించవచ్చు. ఆర్థిక సంఘం సభ్యులు రాజీనామా చేయాలంటే తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి పేరుమీద రాసి, రాష్ట్రపతికి సమర్పించాలి. ఆర్థిక సంఘంలోని సభ్యులు పూర్తికాలం (Full time) లేదా పాక్షిక కాలం (Part time) రాష్ట్రపతి కోరిన విధంగా విధులను నిర్వహిస్తారు. ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ప్రత్యేక అధికారాలు


* భారత ఆర్థిక సంఘం అర్ధ న్యాయ సంస్థ కాబట్టి విధి నిర్వహణలో సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఈ సంఘానికి ఉంటాయి.
* భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి లేదా సంస్థనైనా సాక్ష్యంగా తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయగలదు.
* తనకు కావాల్సిన సాక్ష్యాధార పత్రాలను (Documents) సమర్పించాలని ఆదేశించగలదు.
* ప్రభుత్వ రికార్డులు ఇవ్వాలని ఏ కోర్టును లేదా ప్రభుత్వ కార్యాలయాన్నైనా కోరవచ్చు.

విధులు


రాజ్యాంగంలోని నిబంధన 280(3) ప్రకారం కింది అంశాలకు సంబంధించి తగిన సూచనలు చేయాలి    

 * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ అయ్యే లేదా పంపిణీ చేయాల్సిన పన్నుల (Divisible pool)నికర రాబడులను, కేంద్రం - రాష్ట్రాల మధ్య కేటాయించడానికి అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సిఫారసు చేయడం.
* భారత సంఘటిత నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన సహాయక గ్రాంటులను ఇవ్వడానికి తగిన నియమాలను (Principles) సూచించడం (275వ రాజ్యాంగ నిబంధన).
* రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లోని పంచాయతీల ఆర్థిక వనరులను పెంచేందుకు తగిన సిఫారసులు చేయడం (73వ రాజ్యాంగ సవరణ చట్టం).
* రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లోని మున్సిపాలిటీలకు మరిన్ని ఆర్థిక వనరులను అందజేయడానికి రాష్ట్ర సంఘటిత నిధిని పెంచడానికి అవసరమైన చర్యలను సూచించడం (74వ రాజ్యాంగ సవరణ చట్టం).
* భారతదేశ ఆర్థిక స్థిరత్వ సాధన కోసం రాష్ట్రపతి కోరిన అంశంపై తగిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను రూపొందించడం.

 

పనితీరు

     ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యుల నియామకం జరిగి, దాని విధి, విధానాలను నిర్ణయించాక రాబోయే అయిదేళ్లకు సాధారణ వ్యయం, రెవెన్యూ వివరాలను సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తారు.
* రెవెన్యూ, వ్యయానికి సంబంధించి రాష్ట్రాల నుంచి అందిన వివరాలను, అందులోని విశ్వసనీయతను పరిశీలించి, సంబంధిత రాష్ట్రాల అధికారులను సమావేశపరచి అసాధారణమైన, ఆచరణకు సాధ్యం కాని వాటిని తొలగిస్తుంది.
* తర్వాతి దశలో ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలను సందర్శించి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రాలకు కావాల్సిన ఆర్థిక సహాయం గురించి వారి వాదనలను వింటుంది.
* ప్రతి రాష్ట్రం తమకు కావాల్సిన ఆర్థిక సహాయం పెంచాల్సిన అవసరాన్ని ఆర్థిక సంఘానికి ప్రతిపాదిస్తుంది. ఆర్థిక సంఘం కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థలు, వివిధ సంఘాలు, ప్రముఖ వ్యక్తులు సమర్పించే నివేదికలను స్వీకరిస్తుంది.
* ఆర్థిక సంఘం చివరగా దిల్లీలో సమావేశమై చర్చించి, తుది నివేదికను రూపొందించి, రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఆ నివేదికను కేంద్ర కేబినెట్‌కు పంపిస్తారు. చివరగా ఆర్థిక సంఘం సిఫారసులు, దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి వివరించే నోట్‌తో సహా రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల ఎదుట ఉంచేలా చూస్తారు. పార్లమెంట్‌లో చర్చించి, ఆమోదించాక ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయడం లేదా సవరణలు చేయడం జరుగుతుంది.

 

ఆర్థిక సంఘాలు, పేర్కొన్న ముఖ్యాంశాలు

* మొదటి ఆర్థిక సంఘం ఆదాయ పన్నులో 55 శాతం, ఎక్సైజ్ సుంకంలో 40 శాతం రాష్ట్రాలకు కేటాయించింది. కేటాయింపులకు జనాభాను 80 శాతం, పన్ను వసూళ్లను 20 శాతం ప్రాతిపదికగా తీసుకున్నారు.
* రెండో ఆర్థిక సంఘం ఆదాయ పన్నులో 66 శాతం, ఎక్సైజ్ సుంకంలో 25 శాతం రాష్ట్రాలకు కేటాయించింది. కేటాయింపులకు జనాభాను 90 శాతం, పన్ను వసూళ్లను 10 శాతం ప్రాతిపదికగా తీసుకున్నారు. నిధుల కేటాయింపునకు జనాభానే ప్రధానాంశంగా పరిగణించారు. కొద్దిపాటి మార్పులతో ఇదే విధానం 4వ ఆర్థిక సంఘం వరకు కొనసాగింది.
* 5వ ఆర్థిక సంఘం మొదటిసారిగా మూడు రాష్ట్రాలకు (జమ్మూ కశ్మీర్, అసోం, నాగాలాండ్) ప్రత్యేక హోదా కల్పించాలని సూచించింది. జాతీయాభివృద్ధి మండలి సిఫారసు మేరకు (అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్) ఈ సంఖ్య 11కు పెరిగింది.
* ఏడో ఆర్థిక సంఘం జనాభాతోపాటు తలసరి ఆదాయం (25 శాతం), వెనుకబడినతనం లేదా పేదరికం, రెవెన్యూ వ్యయాలను ప్రామాణికంగా తీసుకుని 50 శాతం నిధులను కేటాయించింది.
* 12వ ఆర్థిక సంఘం మార్కెట్ల నుంచి నేరుగా రుణాలను సేకరించే స్వేచ్ఛ రాష్ట్రాలకు కల్పించాలని సిఫారసు చేసింది. అలాగే నిధులను నేరుగా పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాలని సూచించింది.
* ప్రస్తుతం (2015 - 20) 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు కేటాయింపులు 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని సూచించింది. స్థానిక సంస్థలకు నిధులను 2011 జనాభా ప్రాతిపదికన బదిలీ చేయాలని పేర్కొంది. ఆంధ్రపదేశ్ సహా రెవెన్యూ లోటు ఉన్న 11 రాష్ట్రాలకు రూ.1.94 లక్షల కోట్ల గ్రాంట్లను సిఫారసు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.22,113 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది. నిధుల కేటాయింపునకు మొదటిసారిగా పర్యావరణం అనే అంశాన్ని (అటవీ విస్తీర్ణం) ప్రాతిపదికగా తీసుకుంది.
* వస్తు, సేవల పన్ను (GST) అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలకు రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని 100 శాతం కేంద్రం భరించాలని, నాలుగో సంవత్సరం 75 శాతం, అయిదో సంవత్సరం 50 శాతం భరించాలని సూచించింది. దీనికోసం 'వస్తు, సేవల పన్ను నిధి'ని ఏర్పాటు చేయాలని పేర్కొంది.
* 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్, ఆర్థిక సంఘం సభ్యులు: శక్తికాంతదాస్ (ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి), రమేష్ చాంద్ (నీతిఆయోగ్ సభ్యులు), అశోక్ లాహిరి (మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు), అనూప్ సింగ్ (జార్జి టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్).
* ఇది సహకార సమాఖ్య లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీతో పాటు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై 'వస్తు సేవల పన్ను' ప్రభావంపై ప్రత్యేకంగా సమీక్షిస్తుంది. రుణస్థాయులు, నగదు నిల్వలు, కేంద్ర రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ లాంటివి పరిశీలించి తగిన సిఫారసులు చేస్తుంది. సమర్పించాల్సి ఉంది.

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌