• facebook
  • whatsapp
  • telegram

రాజ్యసభ

      పార్లమెంట్ అధ్యయనంలోభాగంగా రాజ్యసభ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సభ ఏర్పాటు, ప్రత్యేక అధికారాలు, వివిధ సందర్భాల్లో దాని పాత్ర, సంబంధిత అధికరణలపై దృష్టి పెట్టాలి. దీంతో పాటు లోక్‌సభతో పోల్చి అభ్యర్థులు స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి.
పార్లమెంట్‌లోని ఎగువ సభను రాజ్యసభ (Council of States) అంటారు. రాజ్యాంగంలోని 80వ అధికరణ రాజ్యసభ నిర్మాణం గురించి వివరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. అయితే ప్రస్తుత సభ్యుల సంఖ్య 245. ఇందులో ఎన్నికైన సభ్యులు 233 మంది, నియమించినవారు 12 మంది. ఎన్నికైన సభ్యుల్లో 229 మందిని రాష్ట్రాల నుంచి, నలుగురిని కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ (03), పుదుచ్చేరీ (1) నుంచి విధానసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో, బహిరంగ ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. సాహిత్యం, విజ్ఞానం, కళలు, సామాజిక సేవారంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం ఉన్న వారిని ప్రధాని సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు.
* రాజ్యసభ శాశ్వత సభ. దీనిలోని సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు. ప్రతి రెండు సంవత్సరాలకు 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవుతారు.
* రాజ్యసభ కూడా లోక్‌సభమాదిరి రాజ్యాంగం ప్రకారం సంవత్సరానికి కనీసం రెండు సార్లయినా సమావేశం కావాలి.
* రాజ్యసభ సమావేశం కావడానికి కోరం 1/10వ వంతు. కోరం ఉన్నదీ లేనిదీ నిర్ణయించే అధికారం సభాధ్యక్షుడికి ఉంటుంది.
* రాజ్యసభకు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలోనే జీతభత్యాలు స్వీకరిస్తారు. రాజ్యసభలో నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజ్యసభ మొదటి ఛైర్మన్‌, ఎస్.వి.కృష్ణమూర్తిరావు మొదటి డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుత ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.
తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి విధులు నిర్వహిస్తున్న కాలంలో రాజ్యసభకు అధ్యక్షత వహించడానికి వీలుండదు.
* రాజ్యసభకు అనేక అంశాల్లో లోక్‌సభతో సమాన అధికారాలు ఉంటాయి. ఉదాహరణకు సాధారణ బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లు, రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం, రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సుల ఆమోదం, అత్యవసర పరిస్థితి ప్రకటన మొదలైనవి.
* రాజ్యసభకు కొన్ని అంశాల్లో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఉదాహరణకు 249 అధికరణ ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనాధికారాన్ని పార్లమెంట్‌కు కల్పించే అధికారం రాజ్యసభకు ఉంది. అదే విధంగా 312 అధికరణ ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటుచేసే అధికారాన్ని పార్లమెంట్‌కు కల్పిస్తూ రాజ్యసభ తీర్మానం చేయగలదు.
* రాజ్యసభకు కొన్ని అంశాల్లో లోక్‌సభ కంటే తక్కువ అధికారాలుంటాయి. ఉదాహరణకు ద్రవ్యబిల్లును మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా వచ్చిన ద్రవ్య బిల్లును 14 రోజుల్లో తగిన సిఫారసులతో లేదా యథాతథంగా స్పీకర్‌కు పంపాల్సి ఉంటుంది. బిల్లును తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు. బడ్జెట్‌పై చర్చించే అధికారం మాత్రమే ఉంది, ఓటు వేసే హక్కులేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించే అధికారం లేదు, కేవలం చర్చించే అధికారం మాత్రమే ఉంటుంది.
 

రాజ్యసభ అభ్యర్థి అర్హతలు
1. భారత పౌరుడై ఉండాలి.
2. వయసు 30 సంవత్సరాలు నిండి ఉండాలి.
3. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి.
 

పార్లమెంట్ సమావేశాలు

రాజ్యాంగంలోని 85వ అధికరణం ప్రకారం అవసరానికి అనుగుణంగా రాష్ట్రపతి పార్లమెంట్‌ను సమావేశపరచగలరు. అయితే ఏ రెండు సమావేశాల మధ్య గడువు 6 నెలలకు మించకూడదు. సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతాయి. మొదటి లోక్‌సభ సమావేశం 1952, మే 13న జరిగింది. రాష్ట్రపతి పార్లమెంట్‌ను 'ప్రోరోగ్' (సమావేశ ముగింపు) చేయగలరు.
* సభను సమావేశపరచడానికి లోక్‌సభ మొత్తం సభ్యుల్లో కనీసం 1/10వ వంతు సభ్యులు హాజరు కావాలి. దీన్నే 'కోరం' అంటారు. 'కోరం' ఉన్నదీ, లేనిదీ నిర్ణయించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.
* రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ వ్యవహారాలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహించాలి. ఇంగ్లిష్ భాషను రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల (1965) వరకే అనుమతించినప్పటికీ అధికార భాషల చట్టం (1963) ప్రకారం హిందీతో పాటు ఇంగ్లిష్‌నూ కొనసాగిస్తున్నారు. సభ్యులు తమ మాతృభాషలో మాట్లాడటానికి స్పీకర్ అనుమతిస్తారు. అనువాదానికి తగిన ఏర్పాట్లు చేస్తారు.
 

పార్లమెంట్ అధికారాలు
పార్లమెంట్‌కు అత్యున్నత శాసన సంస్థగా కేంద్రజాబితాపై (100 అంశాలు) సంపూర్ణ అధికారాలు, ఉమ్మడి జాబితాపై (52 అంశాలు) ఆధిక్యత, రాష్ట్ర జాబితాపై కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శాసనాధికారాలుంటాయి.
ప్రశ్నలు అడగడం, విశ్వాస, అవిశ్వాస, కోత, సావధాన తీర్మానాలు, బిల్లులను తిరస్కరించడం మొదలైన పద్ధతుల ద్వారా కార్యనిర్వాహక వర్గాన్ని పార్లమెంట్ నియంత్రిస్తూ ఉంటుంది.
ఆర్థిక విషయాల్లో పార్లమెంట్ అనుమతి లేకుండా పన్నులు విధించడానికి, సవరించడానికి, రద్దుచేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. పార్లమెంట్ ఆమోదంతోనే బడ్జెట్ అమలు చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రపతి (మహాభియోగ తీర్మానం), ఉపరాష్ట్రపతి తొలగింపు, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎన్నికల సంఘం ప్రధాన, సాధారణ కమిషనర్లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులపై వచ్చే ఆరోపణలను పార్లమెంట్ విచారించి తొలగించగలదు.
భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. కేవలం కొన్ని అంశాల్లో ముఖ్యంగా సమాఖ్య విధానాన్ని ప్రభావితం చేసే అంశాల్లో రాజ్యాంగాన్ని సవరించడానికి సగం రాష్ట్రాల విధానసభల ఆమోదం అవసరం.
ప్రభుత్వ విభాగాల్లో భారత పార్లమెంట్‌కు విశేష స్థానం ఉంది. దేశ చరిత్రను మలుపు తిప్పిన అనేక శాసనాలను ఆమోదించింది. ఉదాహరణకు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది, ఓటు హక్కు పొందే వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది. అలాగే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టాలను (R.T.I.) ఆమోదించింది.

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌