• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో సామాజిక వికాస పథకాలు

         భారతదేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, వాటి ప్రగతిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని జాతిపిత మహాత్మా గాంధీ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి దృష్ట్యా రాజ్యాంగంలో దీనికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఆర్టికల్‌ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచిస్తుంది.
 

సామాజిక వికాస పథకాల ఆవశ్యకత
 

* 1947లో స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశం ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
* భారత ప్రభుత్వం ‘గ్రో మోర్‌ ఫుడ్‌’ అనే నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని సంకల్పించింది.
* మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గ్రామీణాభివృద్ధికి అవసరమైన సిఫారసులను సూచించాలని వి.టి. కృష్ణమాచారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటుచేశారు. 
* వి.టి. కృష్ణమాచారి కమిటీ సిఫారసుల మేరకు దేశంలో ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 సమితుల్లో (బ్లాక్స్‌) 1952, అక్టోబరు 2న ‘సమాజ అభివృద్ధి కార్యక్రమం’ (CDP - Community Development Programme)ను ప్రారంభించారు.

 


సమాజ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) 
 

* భారతదేశ అభివృద్ధికి నమూనాగా అమెరికాలో అమల్లో ఉన్న బ్లాక్‌ వ్యవస్థను తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాకు చెందిన ‘ఫోర్డ్‌ ఫౌండేషన్‌’ ఆర్థిక సహకారంతో ప్రారంభించారు.
* సమాజ అభివృద్ధి కార్యక్రమం అమలుకు అప్పటి అమెరికా రాయబారి చెస్టర్‌ బౌల్స్‌ ద్వారా ఫోర్డ్‌ ఫౌండేషన్‌ అయిదు మిలియన్‌ డాలర్ల ఆర్థిక తోడ్పాటును అందించింది. ఈ ఫౌండేషన్‌ నుంచి సీడీపీ 1971 నాటికి సుమారు 104 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారాన్ని పొందింది.

 

లక్ష్యాలు:
 

* సమాజ వనరుల ఆధారంగా వివిధ ప్రణాళికల రూపకల్పన.
* దేశ సమగ్రాభివృద్ధిలో గ్రామీణ ప్రజలందరినీ భాగస్వాములను చేయడం.
* ప్రజలే సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడం.

 

ముఖ్యాంశాలు:
 

* సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని మొదటిసారిగా ఎంపికచేసిన 50 జిల్లాలోని 55 బ్లాకుల్లో ప్రారంభించారు. తర్వాతి కాలంలో సీడీపీ 5011 బ్లాకులకు విస్తరించింది. ప్రతి బ్లాకులో 100 గ్రామాలు, సుమారు 70,000 జనాభా ఉంటుంది. 
* ప్రతి బ్లాకుకు బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (బీడీవో) కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. బ్లాకును ఒక యూనిట్‌గా తీసుకుని దాని పరిధిలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తారు.

 

సీడీపీ ద్వారా సమగ్రాభివృద్ధికి ఎంపిక చేసిన అంశాలు
 

* వ్యవసాయం, కుటీర పరిశ్రమలు
* ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం
* ఆర్థిక ప్రగతి, గృహవసతి
* సామాజిక సేవ, సాంఘిక సంక్షేమం
* గ్రామీణ సమాచార వ్యవస్థ
* పేదరిక, నిరుద్యోగ నిర్మూలన
* గ్రామీణ ప్రాంతాల ప్రజలు స్వయం స్వావలంబన, సాముదాయక దృక్పథం, పరస్పర సహకారం అలవరచుకోవడానికి ఈ పథకం ద్వారా సాంకేతిక, ఆర్థిక సహకారం లభించింది. దీనికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.
* సీడీపీని ప్రచారం చేయడానికి గ్రామ స్థాయిలో ‘గ్రామసేవక్‌’ అనే అధికారిని నియమించారు.

 

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extension Service Scheme - NESS)
 

* సీడీపీకి కొనసాగింపుగా దేశంలోని 1700 బ్లాకుల్లో జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని 1953, అక్టోబరు 2న ప్రారంభించారు.
* సీడీపీని ముందుగా మూడేళ్ల కాలపరిమితికి, ఎన్‌ఈఎస్‌ఎస్‌ను శాశ్వత ప్రాతిపదికపై రూపొందించారు.
* ఈ పథకం ద్వారా వ్యవసాయం, విద్య, గ్రామీణ పరిశ్రమలను సమగ్రాభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 
* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం లాంటిదని ఎస్‌.కె.డే పేర్కొన్నారు. ఈయన సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌లకు ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించారు.
* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం భారత్‌లో ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిదని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

 

సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌లపై వి.టి. కృష్ణమాచారి తెలిపిన వివరాలు
 

* సహకార సిద్ధాంతాలను సాధ్యమైనంతవరకు విస్తృతం చేసి, గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యాలను కల్పించడం.
* గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, బావులు, పాఠశాలలు, సమాజసేవా కార్యక్రమాలను చేపట్టడం; నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయడం.
* శాస్త్రీయ విద్య, విధానాలను అనుసరించడం ద్వారా గణనీయమైన ఉత్పత్తులను సాధించడం.

 

ఎన్‌ఈఎస్‌ఎస్‌ వివిధ స్థాయిల్లో అమలు
 

i) కేంద్రస్థాయి:
* కేంద్ర స్థాయిలో ఈ పథకం సమాజ అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. ఇది కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన విధానాలను అమలు చేస్తుంది.

 

ii) రాష్ట్రస్థాయి:
* రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘రాష్ట్ర అభివృద్ధి సంఘం’ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంఘంలో రాష్ట్ర సమాజాభివృద్ధి శాఖా మంత్రి సభ్యుడిగా, అభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యదర్శిగా ఉంటారు.

 

iii) జిల్లాస్థాయి:
* జిల్లా స్థాయిలో ఈ పథకం అమలు జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఉంటుంది.

 

iv) బ్లాకుస్థాయి:
* బ్లాకు స్థాయిలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాడు.

 

v) గ్రామస్థాయి:
* గ్రామ స్థాయిలో ఈ పథకం అమలుకు విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌ (VLW) ను నియమిస్తారు. వీరికి సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలపై శిక్షణ ఇస్తారు కాబట్టి వీరిని మల్టీ పర్పస్‌ వర్కర్స్‌గా పేర్కొంటారు.

 


బల్వంతరాయ్‌ మెహతా కమిటీ
 

* సమాజ అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాల పనితీరుపై అధ్యయనం చేసేందుకు, వాటి లక్ష్యాలను అవి ఎంతమేరకు సాధించాయో సమీక్షించేందుకు జాతీయాభివృద్ధి మండలి (NDC) 1957, జనవరి 16న బల్వంతరాయ్‌ మెహతా కమిటీని నియమించింది. 
* బల్వంతరాయ్‌ మెహతా కమిటీ ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం’ అనే అంశాలతో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫారసు చేస్తూ 1957, నవంబరు 24న నివేదికను సమర్పించింది. ఈ నివేదికను జాతీయాభివృద్ధి మండలి 1958 జనవరిలో ఆమోదించింది.

 

ప్రధాన సిఫారసులు:
 

* దేశం సమగ్రాభివృద్ధి సాధించాలంటే ‘మూడంచెల పంచాయతీరాజ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. అది కింది విధంగా ఉండాలి.
1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ
2) మధ్య/బ్లాకు స్థాయి - పంచాయతీ సమితి
3) ఉన్నత/జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌
* ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
* ప్రభుత్వం అభివృద్ధి పథకాలను సమర్థంగా నిర్వహించాలంటే వాటిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి.
* స్థానిక సంస్థలకు ప్రతి అయిదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. పార్టీ ప్రాతిపదికన కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు జరగాలి. 
* స్థానిక స్వపరిపాలనలో జిల్లా కలెక్టర్‌ కీలకపాత్ర పోషించాలి. భవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.
* స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు, అధికారాలు కల్పించాలి.
* దిగువ స్థాయిలో మినహాయించి మాధ్యమిక, ఉన్నతస్థాయిలో అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా జరగాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి.
* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లా పరిషత్‌కు సలహా పర్యవేక్షక అధికారాలను కల్పించాలి.
* మొదటిసారిగా మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని 1959, అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఉన్న సికార్‌ ప్రాంతంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూ ‘నేడు ప్రారంభిస్తున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తూ, జాతి నిర్మాణంలో కీలకపాత్రను పోషిస్తూ, భవిష్యత్‌ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి’ అని వ్యాఖ్యానించారు.
* మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. ఈ విధానాన్ని 1959, నవంబరు 1న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.

 

అశోక్‌ మెహతా కమిటీ
 

         1977లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం దేశంలో సమగ్ర పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫారసు చేయడానికి 1977 డిసెంబరులో అశోక్‌ మెహతా కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 1978 ఆగస్టులో 132 సిఫారసులతో నివేదికను సమర్పించింది.
 

ప్రధాన సిఫారసులు:
 

* దేశంలో రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి.
 

అవి: 1) బ్లాకు స్థాయిలో - మండల పరిషత్‌
        2) జిల్లా స్థాయిలో - జిల్లా పరిషత్‌
* వీటిలో మండల పరిషత్‌ అతికీలకమైన అంచె. 15,000 నుంచి 20,000 జనాభా కలిగిన గ్రామాలను ఒక మండలంగా ఏర్పాటుచేయాలి. గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటిస్థానంలో గ్రామ కమిటీలను ఏర్పరచాలి. 
* అభివృద్ధి పథకాల విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా సబ్‌ యూనిట్‌గా ఏర్పాటుచేయాలి.
* పంచాయతీరాజ్‌ వ్యవస్థల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ మంత్రిని నియమించాలి.
* షెడ్యూల్డు కులాలు, తెగలవారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
* స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి తగిన అధికారాలు, ఆర్థిక వనరులను కల్పించాలి.
* సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఖర్చుచేసే విధానంపై సామాజిక తనిఖీ జరగాలి.
* స్థానిక ప్రభుత్వాలను బలమైన కారణం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఒకవేళ రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాలి.
* స్థానిక సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకునే అవకాశాన్ని కల్పించాలి.
* మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా జరగాలి.
* 1979లో నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అశోక్‌ మెహతా కమిటీ సిఫారసులను చర్చించారు. వీటిని కొన్ని రాష్ట్రాలు స్వల్ప మార్పులతో అమలుచేశాయి. 
* మొదటిసారిగా మండల పరిషత్‌ విధానాన్ని 1985, అక్టోబరు 2న కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ప్రారంభించారు. 
* మండల పరిషత్‌ విధానాన్ని అమలుచేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1986, జనవరి 13న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఈ విధానాన్ని ప్రారంభించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను 1985లో ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం ప్రారంభించింది. 

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌