• facebook
  • whatsapp
  • telegram

భారత ద్రవ్య వ్యవస్థ - కరెన్సీ

రూపాయి విశిష్ట చిహ్నం (Rs)

భారత కరెన్సీ రూపాయిని ప్రతిబింబించే విశిష్ట చిహ్నానికి కేంద్ర కేబినెట్‌ 2010, జులై 15న ఆమోదం తెలిపింది. దేవనాగరి లిపిలో ‘ర’, రోమన్‌ అక్షరం ‘ఆర్‌’ల కలయికతో ఇది Rs లా కనిపిస్తుంది.

చిహ్నంలోని రెండు సమాంతర రేఖలు దీని విలువ రూపాయికి సమానమని సూచిస్తాయి. ఈ డిజైన్‌ను బాంబే ఐఐటీ పూర్వ విద్యార్థి డి.ఉదయ్‌కుమార్‌ రూపొందించాడు.

ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా - డాలర్, బ్రిటిష్‌ - పౌండ్, ఐరోపా సమాఖ్య - యూరో, జపాన్‌ - యెన్‌లకు మాత్రమే విశిష్ట చిహ్నం ఉంది. అమెరికా డాలర్‌కు ‘ఎస్‌’, బ్రిటిష్‌ పౌండ్స్‌కు ‘ఎల్‌’, జపాన్‌ యెన్‌కు ‘వై’, యూరోకు ‘ఇ’ అక్షరాలను పోలేలా గుర్తులు ఉంటాయి.

రూపాయి చిహ్నాన్ని రూపొందించడానికి ఆర్‌బీఐ 2009, మార్చిలో దేశవ్యాప్త పోటీని ప్రకటించింది. ఇందులో సుమారు 3000 పైగా ఎంట్రీలు వచ్చాయి. అప్పటి ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఉషా థోరట్‌ నేతృత్వంలోని కమిటీ డి.ఉదయ్‌కుమార్‌ రూపొందించిన గుర్తును ఎంపిక చేసింది. ఇతడికి రూ.2.50 లక్షల బహుమతి లభించింది. ఈ చిహ్నం మన దేశంలో అమల్లోకి రావడానికి 6 నెలలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేందుకు దాదాపు రెండేళ్ల కాలం పట్టింది.

కరెన్సీ నోట్లు, నాణేలపై ఈ గుర్తును ముద్రిస్తున్నారు. కంప్యూటర్లలో, రాతలో, టైపింగ్‌లో ఉపయోగిస్తున్నారు. ఈ గుర్తు అమల్లోకి రాకముందు భారత కరెన్సీని ళి’. లేదా ళి(. తో సూచించారు. పొరుగుదేశాలైన పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, ఇండోనేసియాల కరెన్సీ కూడా రూపాయే.


(Rs) గుర్తు వల్ల ప్రయోజనాలు:


రూపాయికి బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పడి, అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది.

అంతర్జాతీయంగా మన కరెన్సీతో ట్రేడింగ్‌ మరింత ఊపందుకుంటుంది.

 అంతర్జాతీయ ప్రాచుర్యంతో భారత్‌లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయి.


డిజిటల్‌ రూపాయి (కరెన్సీ) 


ఇది సంప్రదాయ పేపర్‌ కరెన్సీకి డిజిటల్‌ రూపం. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ఆధారిత వ్యాలెట్ల ద్వారా డిజిటల్‌ కరెన్సీ బదిలీ జరుగుతుంది. వీటిని మన దేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్వహిస్తుంది. 

వివిధ దేశాలు డిజిటల్‌ కరెన్సీని అధికారికంగా ప్రవేశపెట్టడంపై దృష్టి కేంద్రీకరించాయి. భారత్‌లో డిజిటల్‌ కరెన్సీని తెస్తున్నట్లు ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. 2022, డిసెంబరు 1న ఆర్‌బీఐ పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద దీన్ని ప్రారంభించింది. 

డిజిటల్‌ కరెన్సీని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) గా పిలుస్తారు. దీన్ని ఆర్‌బీఐ జారీ చేస్తుంది. భౌతికంగా పేపర్‌ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్‌ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు.

డిజిటల్‌ కరెన్సీని స్టోర్‌ చేయడంతోపాటు వాటితో చేసిన లావాదేవీలను నమోదు చేయడానికి ఉపయోగపడే సాంకేతికతే బ్లాక్‌ చైన్‌. ఇది డిజిటల్‌ లెడ్జర్‌. 

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో రూపొందించడం వల్ల ఈ లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి. ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌లో కూడా దీనికి చోటు కల్పిస్తారు. కాబట్టి చట్టబద్ధత ఉంటుంది.

స్వీడన్‌ కేంద్ర బ్యాంకు ఇప్పటికే డిటిజల్‌ తరహ ‘ఈ-క్రోనా’ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.


ఉపయోగాలు:

కరెన్సీ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు డిజిటల్‌ కరెన్సీ ఉపయోగపడుతుంది. ప్రాథమికంగా సబ్సిడీ పథకాలకు సంబంధించిన చెల్లింపులు మొదలైన వాటికి దీన్ని వాడొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

 నగదు వినియోగాన్ని తగ్గించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది ఊతమిస్తుంది. 

 దీనివల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలో సానుకూల మార్పులు వస్తాయి.


బిట్‌కాయిన్‌


జపాన్‌కు చెందిన ‘సతోషి నకమొటో’ను దీని సృష్టికర్తగా పేర్కొంటారు. లెడ్జర్‌ ప్రారంభం 2009, జనవరి 3.

దీన్ని డిజిటల్‌ కరెన్సీ (క్రిప్టో)గా వ్యవహరిస్తారు. లావాదేవీలు కేవలం ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఇందుకు ప్రత్యేక వ్యాలెట్లు ఉంటాయి. 

బిట్‌కాయిన్‌లపై సెంట్రల్‌ బ్యాంకులకు నియంత్రణ ఉండదు. ఒక స్వతంత్ర వ్యవస్థ ఆధారంగా బలమైన కంప్యూటర్లు, సర్వర్ల సాయంతో దీని లావాదేవీలు జరుగుతాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు డిజిటల్‌ రూపంలో మారే కరెన్సీగా ఇది రూపాంతరం చెందింది. 

 కొత్త బిట్‌ కాయిన్లను సృష్టించడాన్ని మైనింగ్‌ అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన వ్యాలెట్‌ నుంచి మరో వ్యక్తి వ్యాలెట్‌కు బిట్‌కాయిన్లను పంపాడనుకుందాం. ఇవి అవతలి వ్యక్తి వ్యాలెట్‌లోకి వెంటనే చేరవు. అవి ఓ బ్లాక్‌గా మారతాయి. ఇలాంటి కొన్ని బ్లాక్‌లు చైన్‌గా ఏర్పడి ఒక అల్‌గారిథమ్‌ ఈక్వెషన్‌గా రూపొందుతాయి. దీన్ని పరిష్కరించాక వ్యాలెట్‌కు బిట్‌కాయిన్లు బదిలీ అవుతాయి. ఈ ఈక్వేషన్లను పరిష్కరించేందుకు ఓ బృందం పని చేస్తుంది. వీరిని మైనర్లు అంటారు. వీరు ఈ ఈక్వేషన్‌ను వ్యాలిడేట్‌ చేయడం వల్ల కొత్త బిట్‌కాయిన్ల సృష్టి జరుగుతుంది. ఇవి రివార్డు కింద మైనర్లకే లభిస్తాయి. ఎందుకంటే ఈక్వేషన్ల పరిష్కారం కోసం వీళ్లు శక్తిమంతమైన సర్వర్లు వాడతారు. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. దానికి ప్రతిఫలంగా వాటిని పొందుతారు.

ప్రస్తుతం బిట్‌కాయిన్‌ను 10 కోట్ల వంతుకు విడదీస్తున్నారు. ఈ విలువకు సతోషి నకమొటో పేరు మీదుగా ‘సతోషి’ అని పేరు పెట్టారు. అంటే 10 కోట్ల సతోషిలు ఒక బిట్‌కాయిన్‌కు సమానం.

బిట్‌కాయిన్‌ కొనాలంటే ముందుగా వ్యాలెట్‌ను తీసుకోవాలి. తర్వాత వ్యక్తులు లేదా ఎక్స్ఛేంజీల నుంచి బిట్‌కాయిన్‌లను కొనొచ్చు. ఇందుకు బిట్‌స్టాంప్‌ (అమెరికా), ఓకేకాయిన్‌ (చైనా) సహా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు, ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. మన దేశంలో జెబ్‌పే, ఉనోకాయిన్, కాయిన్‌ సెక్యూర్‌ లాంటి సంస్థలు బిట్‌కాయిన్‌ క్రయవిక్రయాలకు వీలు కల్పిస్తున్నాయి. భారత్‌లో మొబైల్‌ బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన మొదటి సంస్థ జెబ్‌పే.


క్రిప్టో కరెన్సీ


ఇది ఒక రకమైన డిజిటల్‌ కరెన్సీ. దీన్నే ప్రత్యామ్నాయ కరెన్సీ లేదా వర్చువల్‌ కరెన్సీ అంటారు. బ్లాక్‌ చైన్‌ సాంకేతికత ఆధారంగా దీన్ని చలామణిలోకి తెచ్చారు. 

ఆర్‌బీఐ మనదేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగాన్ని నిషేధించింది. ఈ కరెన్సీ వికేంద్రీకృత నియంత్రణను ఉపయోగిస్తుంది. బిట్‌కాయిన్‌ మొట్టమొదటి వికేంద్రీకృత క్రిప్టో కరెన్సీ.

క్రిప్టో కరెన్సీ డిజిటల్‌ ఆస్తి. ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉండే క్రిప్టోకాయిన్లు, టోకెన్లను క్రిప్టో కరెన్సీగా పిలుస్తారు. వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు, చెల్లింపు సాధనాలుగా వినియోగిస్తున్నారు. 

 క్రిప్టోకరెన్సీ భౌతికంగా ఉండదు. డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. రూపీ, డాలర్, యూరో మాదిరి ఇవి ఫియట్‌ కరెన్సీలు కావు. వీటిపై కేంద్ర బ్యాంకులకు నియంత్రణ ఉండదు. వీటిని డీసెంట్రలైజ్డ్‌గా పేర్కొంటారు.

ఇంటర్నెట్‌ వేదికగా యూజర్ల మధ్య ఇవి చలామణి అవుతాయి. ప్రతి కాయిన్‌ లేదా టోకెన్‌ ఒక వినూత్నమైన ప్రోగ్రాం లేదా కోడ్‌తో రూపొంది ఉంటుంది. వీటిని ట్రాక్‌ చేయడం, గుర్తించడం సులభం. క్రిప్టోగ్రఫీ, కరెన్సీ రెండింటి కలయికే క్రిప్టో కరెన్సీ. ఇవి క్రిప్టోగ్రఫిక్‌ సాంకేతికత ఆధారంగా లావాదేవీలను ధ్రువీకరిస్తాయి.

 బ్లాక్‌ చైన్‌ మొత్తం కంప్యూటర్ల నెట్‌వర్క్‌ పరిధిలోని ప్రతి లావాదేవీని రికార్డెడ్‌గా నిర్వహిస్తుంది. ప్రతి కొత్త లావాదేవి నెట్‌వర్క్‌ పరిధిలోని భాగస్వామి లెడ్జర్‌లో నమోదవుతుంది. బ్లాక్‌ చైన్‌ ఎవరి నియంత్రణలో ఉండదు. 

బ్లాక్‌ చైన్‌లో సమాచారం వ్యాలెట్ల రూపంలో ఉంటుంది. దీన్ని బ్లాక్‌లుగా పిలుస్తారు. ఇవి ఒక చైన్‌ (గొలుసు)గా అనుసంధానమై ఉంటాయి. వీటిని ఎడిట్‌ చేయడం అసాధ్యం. ఇందులో ప్రతి లావాదేవీ సురక్షితంగా నమోదై ఉంటుంది.


రచయిత

బండారి ధనుంజయ

విషయ నిపుణులు 

Posted Date : 25-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌