• facebook
  • whatsapp
  • telegram

జీవ వైవిధ్యం - సంరక్షణ

జీవవైవిధ్య సంరక్షణకు రెండు రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. అవి:


1. ఆవాసాంతర సంరక్షణ  (In-Situ Conservation) 


2. ఆవాసేతర సంరక్షణ (Ex-Situ Conservation) 


ఆవాసాంతర సంరక్షణ 


ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అదే ప్రదేశంలో మానవ ప్రమేయంతో రక్షించే విధానాన్ని ఆవాసాంతర సంరక్షణ అంటారు. ఈ పద్ధతిలో 4 రకాల కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. అవి: 


1. జాతీయ పార్కులు  


2. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు (అభయారణ్యాలు)


3. బయోస్పియర్‌ రిజర్వ్‌లు  


4. వన్యప్రాణుల సంరక్షణ


జాతీయ పార్కులు 


 ప్రకృతి సంపద, సుందర ప్రదేశాలు, దృశ్యాలు, వన్యప్రాణులను సంరక్షించేందుకు జాతీయ పార్కులను ఏర్పాటు చేస్తారు. వీటికి నిర్ణీత సరిహద్దులు ఉంటాయి. ఈ హద్దులను పార్లమెంట్‌ నిర్ణయిస్తుంది.


 జాతీయ పార్కుల్లో ప్రైవేట్‌ కార్యకలాపాలు నిషేధం. అంటే వంట చెరకు సేకరణ, పశువులను మేపడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం, వ్యవసాయ కార్యకలాపాలు చేయకూడదు.


 భారతదేశంలో మొత్తం 106 జాతీయ పార్కులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 44,402.95 చ.కి.మీ. ఇది దేశంలోని భౌగోళిక ప్రాంతంలో 1.35%.


 మన దేశంలో అత్యధిక జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం - మధ్యప్రదేశ్‌ (11), కేంద్రపాలిత ప్రాంతం - అండమాన్‌ నికోబార్‌ దీవులు (6).


 ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో 3 జాతీయ పార్కులు ఉన్నాయి.


 దేశంలో 104వ జాతీయ పార్కు కునో (మధ్యప్రదేశ్‌), 105వ జాతీయ పార్కు దేహింగ్‌ పాట్కాయ్‌ (అసోం), 


106వ జాతీయ పార్కు రైమాన్‌ (అసోం). జాతీయ పార్కులు లేని రాష్ట్రం పంజాబ్‌.


జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌


దేశంలోనే మొట్టమొదటి నేషనల్‌ పార్క్‌. దీన్ని 1936లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. దీని అసలు పేరు ‘హేలీ నేషనల్‌ పార్క్‌’.


 2000లో ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించాక, ఈ పార్కు ఉత్తరాఖండ్‌లో భాగమైంది. తర్వాత దీని పేరును జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌గా మార్చారు.


 దేశంలో అతిపెద్ద నేషనల్‌ పార్క్‌ హెమిస్‌ (లద్ధాఖ్‌), అతి చిన్నది దక్షిణ బదన్‌దీవి నేషనల్‌ పార్క్‌ (అండమాన్‌ నికోబార్‌)


భారత్‌లోని ముఖ్యమైన జాతీయపార్కులు


హెమిస్‌ నేషనల్‌ పార్క్‌: సింధూనది పరీవాహక ప్రాంతంలో ఉంది. దేశంలో అతిపెద్ద నేషనల్‌ పార్క్‌. లద్దాఖ్‌లో ఉంది.


కిష్టానర్‌ నేషనల్‌ పార్క్‌: జమ్మూకశ్మీర్‌లోని హిమాద్రి శ్రేణుల్లో ఉంది. మంచు చిరుత, గడ్డపు రాబందులు (Bearded Vulture),హిమాలయ అడవి కాకులు ఈ పార్కులో ఉన్నాయి.


గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్క్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులోయ ప్రాంతంలో ఉంది.


 ఇది రెండు విభిన్న జీవ ఆవాసాల కూడలి. దక్షిణాన ఇండోమలయన్‌ జీవరాజ్యం, ఉత్తరాన పేల్‌ ఆర్కిటిక్‌ జీవరాజ్యం ఉంది.


 నీలం రంగు గొర్రెలు, మంచు చిరుత, హిమాలయన్‌ గోధుమరంగు ఎలుగుబంట్లు ఇక్కడ ముఖ్యమైనవి.


 దీన్ని యునెస్కో (UNESCO) సహజ వారసత్వ  ప్రదేశంగా గుర్తించింది.


వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌: ఉత్తరాఖండ్, కుమయూన్‌ హిమాలయాల్లో ఉంది.


 దీన్ని చూసేందుకు మే నుంచి అక్టోబరు మధ్య కాలంలో ఎక్కువమంది పర్యాటకులు వస్తుంటారు. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.


దుద్వా నేషనల్‌ పార్క్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్న ఏకైక నేషనల్‌ పార్క్‌. అసోం నుంచి తెచ్చిన ఖడ్గమృగాలకు ఈ పార్క్‌లో రక్షణ కల్పిస్తున్నారు.


వాల్మీకి నేషనల్‌ పార్క్‌: భారత్‌-నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలోని బిహార్‌లో ఉంది.


 దీన్ని కొనసాగిస్తూ నేపాల్‌లో చిత్వాన్‌ నేషనల్‌ పార్క్‌ ఉంది. రాయల్‌ బెంగాల్‌ టైగర్స్, ఖడ్గమృగాలు, వైల్డ్‌ వాటర్‌ బఫెలోస్‌ ఇందులో నివసిస్తున్నాయి.


జల్దపార నేషనల్‌ పార్క్‌: పశ్చిమ్‌ బంగాలో ఉంది. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి.  కజిరంగా నేషనల్‌ పార్క్‌ తర్వాత ఖడ్గమృగాలు అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి.


కజిరంగా నేషనల్‌ పార్క్‌: అసోంలో ఉంది. బ్రహ్మపుత్రా నది దక్షిణ తీరంలో ఉంది. దేశంలో ఖడ్గమృగాలు ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి.


కెయిబుల్‌ లామ్జావో నేషనల్‌ పార్క్‌  (Keibul Lamjao National Park): మణిపూర్‌లో లోక్‌తక్‌ సరస్సు ప్రాంతంలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయపార్క్‌  (Floating park). మణిపూర్‌ రాష్ట్ర జంతువైన సాంగాయ్‌కి (Eld’s deer) ఇది ఆవాస ప్రాంతం.


సైలెంట్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్‌: దీన్ని 1984లో ప్రకటించారు. కేరళలోని నీలగిరి కొండల్లో ఉంది.  పులులు, ఏనుగులు, సింహపుతోక కోతులకు (Lion tailed Macaque) ఆవాస ప్రాంతం.


 నీలగిరి బయోస్పియర్‌లో అంతర్భాగం. 


 దీన్ని సైరంధ్రి వనం అని కూడా అంటారు.


నాగర్‌హాల్‌ నేషనల్‌ పార్క్‌: పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలో భాగంగా ఉంది. దీన్ని రాజీవ్‌గాంధీ నేషనల్‌ పార్క్‌ అని కూడా అంటారు.


 ఈ పార్క్‌లో కనిపించే నల్లచిరుతను ‘కబిని ప్రాంతపు దెయ్యం’ (Ghost of Kabini)   అంటారు.


రణ థంబోర్‌ నేషనల్‌ పార్క్‌: రాజస్థాన్‌లోని బనాస్‌ నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది.


 ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్వీన్‌ మదర్‌ ఆఫ్‌ టైగర్స్, రణ థంబోర్‌ టైగర్‌ రాణి, మొసళ్ల హంతకిగా పిలిచే మచాలి పులి ఇక్కడ ఉంటాయి.


తెలంగాణలోని జాతీయ పార్కులు


కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్‌ పార్క్‌: 1994లో ఏర్పాటు చేశారు.


* హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఉంది.


మహావీర్‌ హరిణ వనస్థలి నేషనల్‌ పార్క్‌: 1994లో ఏర్పాటు చేశారు.


* హైదరాబాద్‌కి తూర్పు శివార్లలో విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉంది.


* హైదరాబాద్‌ చివరి పాలకుడైన ఉస్మాన్‌ అలీఖాన్‌ తాను వేటాడటానికి ఈ దట్టమైన వనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.


మృగవని నేషనల్‌ పార్క్‌: మొయినాబాద్‌ దగ్గర్లోని చిలుకూరు గ్రామంలో సుమారు 850 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. రక్షిత అడవిలో భాగంగా 1998లో ఈ ప్రాంతాన్ని జాతీయ పార్క్‌గా మార్చారు. ఇది హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌కు 20 కి.మీ. దూరంలో ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ పార్కులు


శ్రీ వెంకటేశ్వర నేషనల్‌ పార్క్‌: 1989లో ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఉంది.


* శేషాచల కొండల్లో 136 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది.


* తలకోన, గండలకోన, గుంజాన జలపాతాలు ఈ పార్కులో భాగంగా ఉన్నాయి.


* ఎర్రచందనం వృక్షాలు ఇక్కడి ప్రత్యేకత.


* ఎల్లో-థ్రోట్‌ బుల్‌బుల్‌ పక్షులకు ఇది ఆవాస కేంద్రం.


రామేశ్వరం (రాజీవ్‌గాంధీ) నేషనల్‌ పార్క్‌: పెన్నానదికి ఉత్తరాన వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉంది. 2005లో ఏర్పాటు చేశారు.


* దీని వైశాల్యం 2.4 చ.కి.మీ.


* మచ్చల జింక, నల్ల కుందేలు, ముంగీస లాంటి క్షీరదాలు; చిలుకలు, నెమళ్లు, పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.


పాపికొండ నేషనల్‌ పార్క్‌: 2008లో ఏర్పాటు చేశారు.


* పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ ఉద్యానవనం కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


* ఈ నేషనల్‌ పార్క్‌ ఉన్న ప్రాంతాన్నే రామాయణంలో ‘కిష్కింద’గా పేర్కొన్నారు.


* ప్రస్తుతం ఈ పార్కు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భాగంగా ఉంది.


యునెస్కో గుర్తించిన సహజసిద్ధ వారసత్వ ప్రదేశాలు

       పేరు            రాష్ట్రం 

    గుర్తించిన సంవత్సరం

కజిరంగా నేషనల్‌ పార్క్‌        అసోం 1985
కియోలాడియో ఘనా నేషనల్‌ పార్క్‌       రాజస్థాన్‌ 1985
మానస్‌ నేషనల్‌ పార్క్‌     అసోం  1985
వ్యాలీ ఆఫ్‌ నేషనల్‌ పార్క్‌    ఉత్తరాఖండ్‌   2005
సుందర్‌బన్స్‌ నేషనల్‌ పార్క్‌   పశ్చిమ్‌ బంగా   1987
పశ్చిమ కనుమలు      మహారాష్ట్ర,       2012 
గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్క్‌ హిమాచల్‌ప్రదేశ్‌   2014


రచయిత

పి.కె. వీరాంజనేయులు


 

Posted Date : 25-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌