• facebook
  • whatsapp
  • telegram

జలమార్గాలు

జలమార్గాలు రెండు రకాలు. అవి.. (Inland Water Transport) 


1. అంతఃస్థలీయ జలమార్గాలు (National Water Ways) 


2. జాతీయ జలమార్గాలు (National Water Ways)
 

అంతఃస్థలీయ జలమార్గాలు: వీటినే ఉపరితల జలరవాణా అంటారు. 


 రైల్వే వ్యవస్థ కంటే ముందు ఉపరితల జలరవాణా ఎగుమతి, దిగుమతుల్లో ప్రముఖ పాత్ర పోషించేది.  అత్యంత చౌకైన రవాణా మార్గం అంతఃస్థలీయ జలమార్గం.


 ఒక దేశ భూభాగంలోని నదులు, కాలువలు, ప్రాజెక్టులు, డ్యాముల ద్వారా రవాణా చేయడాన్ని అంతఃస్థలీయ జలమార్గం అంటారు.


 భారతదేశం నదులు, కాలువలు, బ్యాక్‌ వాటర్, క్రిక్స్‌ రూపంలో అంతర్గత జలమార్గాల విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.


 మనదేశంలో 14,500 కి.మీ. పొడవైన జలమార్గాలు ఉన్నాయి. వీటిలో 5,200 కి.మీ. నదులు, 485 కి.మీ. కాలువల ద్వారా ఉపరితల జలరవాణా జరుగుతోంది. 


 ఇది దేశ రవాణాలో 1% ఉంటుంది.


Inland Water ways Authority of India [IWAI]: 


 దీన్ని 1986లో నోయిడాలో (యూపీ) ఏర్పాటు చేశారు.


 దీని ప్రధాన బాధ్యత: అంతఃస్థలీయ జలరవాణా అభివృద్ధి కోసం కావాల్సిన మౌలిక వసతులను కల్పించడం.


 ఇది దేశంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆర్థిక సాధ్యాసాధ్యాలను సర్వే చేయడం, వాటి పరిపాలన, నియంత్రణలను చూస్తుంది.


 నేషనల్‌ ఇన్‌లాండ్‌ నావిగేషన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ను పట్నాలో స్థాపించారు.


సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌ ప్రాజెక్టు


రామసేతు రవాణా కాలువ ప్రతిపాదించిన మొదటి వ్యక్తి జేమ్స్‌ రెన్నెల్‌.


రామసేతు నిర్మాణంతో భారత వాణిజ్య నౌకలు శ్రీలంక చుట్టూ 400 కి.మీ. లేదా 30 గంటలు అధిక దూరం/సమయం ప్రయాణించాల్సి వస్తుంది.


దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం జులై 2, 2005న సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌ ప్రాజెక్టును ఆమోదించింది.


పాక్‌ జలసంధి ద్వారా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ను బంగాళాఖాతానికి కలిపే జలమార్గాన్ని నిర్మించడానికి, అవసరమయ్యే నిధులను సేకరించడానికి, ఇతర పనులను చేపట్టడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు.


హుగ్లీ డాక్‌ అండ్‌ పోర్ట్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ 


 ఇది 1984లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా నమోదైంది. ఈ కంపెనీకి పశ్చిమ్‌ బంగాలో హీరా జిల్లాలోని సైకియా వద్ద ఒక యూనిట్, నిజర్‌గంజ్‌ వద్ద మరో యూనిట్‌ ఉంది.


 ఈ యార్డ్‌ ఏడాదికి 1100 టన్నుల సరకులను ఎగుమతి, దిగుమతి, 125 ఓడలకు మరమ్మతులు చేయగల సామర్థ్యం కలిగి ఉంది.


ప్రధాన ఓడరేవులు 


వస్తువులను ఎగుమతి, దిగుమతి చేసి భూమార్గాల ద్వారా పంపిణీ చేసే తీర ప్రదేశమే నౌకాశ్రయం.


 దేశంలో మొత్తం 12 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి.


 ఇందులో 11 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఎన్నోర్‌ ఓడరేవును కార్పొరేట్‌ ఓడరేవుగా ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అభివృద్ధి చేశారు.


 12 ప్రధాన ఓడరేవుల్లో 6 తూర్పు తీరంలో, 6 పశ్చిమ తీరంలో ఉన్నాయి.


పశ్చిమ తీర ఓడరేవులు


కాండ్లా ఓడరేవు: గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ సింధుశాఖకు ఉత్తరానున్న క్రీక్‌ వద్ద దీన్ని అభివృద్ధి చేశారు. పోటుపాట్లపై ఆధారపడిన ఏకైక ప్రధాన ఓడరేవు. దీన్నే టైడల్‌ పోర్టు అని పిలుస్తారు.


 దీని పేరును 2017లో దీన్‌దయాళ్‌ పోర్టుగా మార్చారు.


 స్వాతంత్య్రానంతరం కరాచీ ఓడరేవు పాకిస్థాన్‌ నియంత్రణలోకి వెళ్లడంతో వాయవ్య ప్రాంతాల అవసరాల కోసం వేగంగా అభివృద్ధి చేసిన ఓడరేవు. దేశ విభజన కారణంగా అభివృద్ధి చెందిన ఓడరేవు అయినందున దీన్ని విభజన సంతానం (Child of Partition) అంటారు.


 ఈ రేవును స్వేచ్ఛా వ్యాపార ఓడరేవుగా దిగుమతుల కోసం ఉపయోగిస్తారు..


 ఆసియాలోనే మొదటి  SEZ (Special Economic Zone), EPZ (Export Processing Zone) ను 1956లో కాండ్లా ఫ్రీ ట్రేడ్‌ జోన్‌ పేరుతో ఏర్పాటు చేశారు.


ముంబయి ఓడరేవు: దేశంలోనే అతిపెద్ద ఓడరేవు అయిన ముంబయి ఓడరేవు మహారాష్ట్రలో ఉంది. ఇది దేశంలో రెండో సహజ, పురాతన ఓడరేవు


 ఇది 20 కి.మీ. పొడవు, 610 కి.మీ. వెడల్పుతో, 54 బెర్తులను కలిగి ఉండటంతో పాటు దేశంలోనే అతిపెద్ద ఆయిల్‌ టెర్మినల్‌ను కలిగి ఉంది.


 1869లో సూయజ్‌ కాలువను తెరిచిన తర్వాత ఈ ఓడరేవు ప్రాముఖ్యత పెరిగింది. ఇది మధ్య ప్రాచ్యం, ఉత్తర అమెరికా, ఉత్తర ఆఫ్రికా, యూరప్‌కు సమీపంలోని భారతీయ ఓడరేవు.


 ఇక్కడ జవహర్‌ ద్వీపం పెట్రోలియం, ముడి చమురు హ్యాండ్లింగ్‌ ప్రసిద్ధి.


నవసేన ఓడరేవు: ఇది మహారాష్ట్రలో ఉంది. ముంబయి ఓడరేవు రద్దీని తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఓడరేవు.  ముంబయి శాటిలైట్‌ ఓడరేవుగా (Satellite Port of Mumbai) పనిచేస్తుంది.


 దీన్ని ‘జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌ (JNPT)' అని అంటారు.


 దేశంలో అత్యంత ఆధునికమైన సౌకర్యాలు, అతిపెద్ద కంటెయినర్‌ కలిగిన ఓడరేవు. ఇక్కడి నుంచి కాటన్‌ దుస్తులను ఎగుమతి చేస్తుంటారు.


మర్మగోవా ఓడరేవు: ఈ ఓడరేవు గోవా తీరంలో వాస్కోడిగామా పట్టణం వద్ద ఉంది. ఇక్కడి నుంచి ఎక్కువగా ముడి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నారు. కొంకణ్‌ రైల్వే నిర్మాణం తర్వాత దీని వృష్ఠభూమి విస్తరించింది.


న్యూమంగళూర్‌ ఓడరేవు: కర్ణాటక రాష్ట్ర తీరంలో పాత మంగళూర్‌ ఓడరేవుకు 10 కి.మీ.ల ఉత్తరాన గురుపుర నది ఒడ్డున నిర్మించారు. దీన్ని గేట్‌ వే ఆఫ్‌ కర్ణాటక లేదా పనంబర్‌ ఓడరేవు అంటారు. పశ్చిమ తీరంలో లోతైన ఓడరేవు.


కొచ్చిన్‌ ఓడరేవు: ఇది కేరళ తీరంలో ఉంది. దీన్ని వెంబనాడ్‌ లాగూన్‌ ముఖ ద్వారంలోని విల్లింగ్‌డన్‌ ద్వీపంలో నిర్మించారు.


 ఇది పశ్చిమ తీరంలో సహజ, సౌందర్యవంత ఓడరేవు. దీన్ని ‘అరేబియా సముద్రపు రాణి’ అంటారు. తుపానుల సమయంలోనూ సురక్షితంగా ఓడల రాకపోకలకు వీలవుతుంది.


 ప్రధాన ఎగుమతులు: కొబ్బరి పీచు ఉత్పత్తులు, రబ్బరు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు.  


తూర్పు తీర ప్రధాన ఓడరేవులు


ట్యుటికోరిన్‌ ఓడరేవు: ఈ ఓడరేవు తమిళనాడు రాష్ట్రంలో ఉంది.


 భారతదేశ దక్షిణాగ్రాన హిందూ మహాసముద్రంలో ఉన్న ఏకైక ఓడరేవు. దీనికి ఉన్న మరో పేరే వీఓ చిదంబరనర్‌ ఓడరేవు. మన్నార్‌ సింధు శాఖలోని కృత్రిమ ఓడరేవు.


చెన్నై ఓడరేవు: దీన్ని 1859లో నిర్మించారు. ఇది మానవ నిర్మిత ఓడరేవు. ఈ ఓడరేవును దక్షిణ భారతదేశ ముఖ ద్వారం(Gate way of South India)అంటారు. కోరమాండల్‌ తీరంలో బ్రిటిష్‌వారు అభివృద్ధి చేసిన ఓడరేవు.


 ఇది దక్షిణ భారత్, తూర్పు తీరంలో అతిపెద్ద ఓడరేవు కాగా దేశంలో రెండో పెద్ద ఓడరేవు. 


 ప్రధాన ఎగుమతులు: తోళ్లు, పొగాకు, మైకా, పసుపు, బెరైటీస్‌. ప్రధాన దిగుమతులు: క్రూడాయిల్, రసాయనాలు, వంటనూనెలు, పత్తి, బొగ్గు.


ఎన్నోర్‌ ఓడరేవు: చెన్నై ఓడరేవుపై ఒత్తిడి భారం తగ్గించడానికి చెన్నైకి 25 కి.మీ.ల ఉత్తరాన అభివృద్ధి చేసిన ఓడరేవు. ఇది కృత్రిమ ఓడరేవు. దీన్ని నెదర్లాండ్స్‌ సహకారంతో నిర్మించారు. 


 దీన్ని ప్రస్తుతం కామరాజార్‌ పోర్ట్‌ లిమిటెడ్‌గా పిలుస్తున్నారు. ఇది దేశంలో మొదటి సహకార రంగ పోర్టు.


విశాఖ ఓడరేవు: దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో అత్యంత లోతైన సహజసిద్ధ భూపరివేష్టిత ఓడరేవు. తూర్పు కనుమల్లో భాగమైన డాల్ఫిన్‌నోస్‌ కొండ, యారాడ కొండలు ఈ ఓడరేవును ఎత్తయిన అలల తాకిడి నుంచి రక్షిస్తూ సహజసిద్ధమైన ఓడరేవుగా మారడానికి దోహదపడుతున్నాయి.


 విశాఖపట్నం ఓడరేవుకు ఉపగ్రహ ఓడరేవుగా భీమిలి ఓడరేవును అభివృద్ధి చేసే ప్రతిపాదన ఉంది.


పారదీప్‌ ఓడరేవు: ఈ ఓడరేవు ఒడిశా తీరంలో ఉంది. దేశంలో అతిలోతైన నౌకాశ్రయం కలిగిన ఓడరేవు.  దీన్ని మహానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో నిర్మించారు.


కలకత్తా ఓడరేవు: భారతదేశంలోని ఏకైక నదీ ఆధారిత ఓడరేవు. దీన్ని బంగాళాఖాతానికి 128 కి.మీ. దూరంలో హుగ్లీ నదిపై నిర్మించారు.


 ఈ ఓడరేవును తూర్పు భారత ముఖద్వారం(Gateway of Eastern India) అంటారు.


 నదీ ఆధారిత ఓడరేవు అయినందున పూడికకు గురికావడం, వేసవిలో నీటిమట్టం తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటోంది.


హల్దియా ఓడరేవు: కలకత్తా ఓడరేవు రద్దీని తగ్గించడానికి కలకత్తాకు 150 కి.మీ.ల దిగువన ఈ ఓడరేవును నిర్మించారు. హుగ్లీ నది హల్దియా నదిలో కలిసేచోట దీన్ని నిర్మించారు.


జలమార్గ్‌ వికాస్‌ ప్రాజెక్టు(JMVP) 


 ఇది NW-1 సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించింది. దీని అమలులో ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వానికి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది.


 కేంద్ర అంతఃస్థలీయ జలమార్గాల కార్పొరేషన్‌ను 1967లో కలకత్తాలో స్థాపించారు.


సాగరమాల ప్రాజెక్టు


 ఈ ప్రాజెక్టు పనులు మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి పాలనలో మొదలవగా, 2015లో ప్రాజెక్టును ప్రారంభించారు.


ఉద్దేశాలు..


 తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, కీలక ఓడరేవుల దగ్గర స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేయడం. ఓడరేవుల అభివృద్ధి, వాటి సామర్థ్యాన్ని పెంచడం.  సమర్థవంతమైన, వేగవంతమైన సరకు రవాణాపై దృష్టి సారించడం.


 పోర్టుల వృద్ధిని వేగవంతం చేయడానికి నాలుగు రంగాలను గుర్తించారు. అవి...


1 ) బొగ్గు     2 ) పెట్రోలియం 3 ) చమురు, లూబ్రికెంట్స్‌ 4 ) ఉక్కు కంటెయినర్లు 


 ఈ నాలుగు పరిశ్రమలు ఓడరేవు రద్దీలో దాదాపు 80% వాటా కలిగి ఉన్నాయి. 


 మొత్తం 173 ప్రాజెక్టుల్లో ఈ నాలుగు రంగాలను సాగరమాల ప్రాథమిక అంశాలుగా పేర్కొన్నారు.


జాతీయ జలమార్గాలు


 జాతీయ జలమార్గాల చట్టం 2016 ప్రకారం దేశంలో 111 జాతీయ జలమార్గాలను గుర్తించారు.  వీటి మొత్తం పొడవు 20162 కి.మీ. వీటిలో 5 నిర్వహణ దశలో ఉన్నాయి. అవి..


జాతీయ జలమార్గం - 11 (NW-1) :దీన్ని గంగానది జలరవాణా మార్గం అని అంటారు. ఈ జలమార్గం అలహాబాద్‌ నుంచి హల్దియా వరకు ఉంది. దీని పొడవు 1620 కి.మీ.


 దీన్ని 1986, అక్టోబరు 27న పార్లమెంట్‌ చట్టం ద్వారా జాతీయ జలమార్గంగా గుర్తించారు.


 అభివృద్ధి దృష్ట్యా ఈ మార్గాన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి... 


i ) హల్దియా - ఫరక్కా (560 కి.మీ.)   ii ) ఫరక్కా - పట్నా (460 కి.మీ.)   iii ) పట్నా - అలహాబాద్‌ (600 కి.మీ.)


జాతీయ జలమార్గం - 2 (NW-2) :భారత్, బంగ్లాదేశ్‌ల్లో సుమారు 1384 కి.మీ. పొడవున దిబ్రూగర్‌ వరకు స్టీమర్ల రవాణాకు అనుకూలమైంది.


 దేశంలోని తూర్పు రాష్ట్రాలకు దీన్ని వినియోగిస్తున్నారు. ఇందులో సాడియా నుంచి దుబ్రి వరకు సుమారు 891 కి.మీ. మార్గాన్ని 1988, అక్టోబరు 26న జలమార్గంగా గుర్తించి అభివృద్ధి చేశారు.


జాతీయ జలమార్గం - 3 (NW-3) దీన్ని పశ్చిమ తీరకాలువ (West Coast Canal) అంటారు.


 ఇది కేరళ రాష్ట్రంలో కొట్టాపురం నుంచి కొల్లాం వరకు సుమారు 205 కి.మీ. పొడవు ఉంది.


 ఇది మూడు భాగాలుగా ఉంటుంది. 


1. పశ్చిమ తీరకాలువ (168 కి.మీ.)


2. చంపకర కాలువ (23 కి.మీ.)


3. ఉద్యోగ మండల్‌ కాలువ (14 కి.మీ.)


జాతీయ జలమార్గం - 4 4 (NW-4) : 


2008లో జాతీయ జలరవాణాగా గుర్తించి అభివృద్ధి చేశారు. 

 ఈ జలమార్గంలో కాకినాడ నుంచి రాజమండ్రి వరకు 50 కి.మీ. దూరం ఉన్న కాకినాడ కాలువ, రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఉన్న ఏలూరు కాలువ, విజయవాడ నుంచి పెద్దగంజాం వరకు ఉన్న కొమ్మమూరు కాలువ, పెద్దగంజాం నుంచి పాండిచ్చేరి వరకు ఉన్న బకింగ్‌హామ్‌ కాలువలు ఉన్నాయి. కొల్లేరు, పులికాట్‌ సరస్సు మీదుగా రవాణా జరుగుతుంది.

 ఇది దేశంలో అతి పొడవైన జాతీయ జలమార్గం. దీని పొడవు 1995 కి.మీ.


జాతీయ జలమార్గం - 5 (NW-5): 


దీన్ని 2008 నవంబరులో జాతీయ జలమార్గంగా ప్రకటించారు. ఇది ఒడిశా, పశ్చిమ్‌ బంగాల్లో కొంత భూభాగంలో ఉంది.

 తాల్చేర్‌ నుంచి ధమ్రా వరకు 588 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ జలమార్గం బ్రాహ్మణి నదీ మార్గంలో కొంతభాగం, మహానది డెల్టా వ్యవస్థతో పాటు ఈస్ట్‌ కోస్ట్‌ కెనాల్‌ ప్రాంతాల్లో విస్తరించి ఉంది.


రచయిత

పి.కె. వీరాంజనేయులు

విషయ నిపుణులు 

Posted Date : 16-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌