• facebook
  • whatsapp
  • telegram

అక్షాంశాలు - రేఖాంశాలు

        భూమి మీద కోట్లాది జంతురాశి, వృక్షజాలం, సూక్ష్మజీవులతో పాటు సమస్త మానవాళి కూడా నివసిస్తోంది. భూమి మీద మానవాళి లక్షల సంవత్సరాల కిందట ఉద్భవించింది. భూమి మొదట్లో చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ భూమి చుట్టూ తిరుగుతూ ఉండేవని భావించారు.
* టాలెమీ ప్రతిపాదించిన భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం - భూమి విశ్వానికి కేంద్రంగా ఉండి నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి.
* ఇటలీ దేశానికి చెందిన గెలీలియో దూరదర్శినిని కనుక్కోవడం ఖగోళశాస్త్ర అధ్యయనానికి నాంది పలికింది. కోపర్నికస్ భూమి అనేది సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో ఒకటని పేర్కొన్నాడు.
* భూగోళానికి మోడల్ (Model)గా ఉన్న గ్లోబ్‌ను పరిశీలిస్తే భూమి ఆకారం, భూమిపై ఉన్న ఖండాలు, మహాసముద్రాలు, వాటి ఆకారాలు, రకరకాల దీవులు, అక్షాంశ - రేఖాంశాలు మొదలైన ఎన్నో అంశాలు గ్రహించవచ్చు.

 

జియాయిడ్ (Geoid)

      భూమి ఆకారాన్ని 'జియాయిడ్' అంటారు. ఏ వస్తువు అయితే భూమి ఆకారం కలిగి ఉందో దాన్ని జియాయిడ్ అంటారు. (Any body having the earth's shape is called Geoid).
* ధ్రువాల వద్ద భూమి కొద్దిగా నొక్కబడి, భూమధ్యరేఖ వద్ద ఒక మోస్తరు ఉబ్బెత్తుగా ఉండే ఆకారాన్ని 'జియాయిడ్' అంటారు. ఈ ఆకారం మన భూమి ప్రత్యేకత.
* భూమిపై ఖండాలు, మహాసముద్రాలు విస్తరించి ఉన్నాయి. ఖండాలు, దేశాల ఉనికి విస్తరణను అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా తెలుసుకోవచ్చు.

 

అక్షాంశాలు

         అక్షాంశాలు అనేవి భూమిపై ఉన్న అడ్డుగీతలు. వీటిని వృత్తాలు అని కూడా పిలుస్తారు. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు. భూమధ్యరేఖ భూమిని రెండు సమభాగాలుగా విభజిస్తుంది. ఈ రేఖను 0º (Zero డిగ్రీ) అక్షాంశం అని పిలుస్తారు. 0º అక్షాంశం భూమి మధ్యగా వెళ్తుండటం వల్ల దానికి భూమధ్యరేఖ అనే పేరు వచ్చింది.
* భూమి/ భూగోళాన్ని ఈ అక్షాంశం ఉత్తర-దక్షిణ అర్ధగోళాలుగా విభజిస్తోంది.
* రేఖాగణిత శాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు (º), నిమిషాలు ('), సెకన్ల ('') లో సూచిస్తారు.
* అక్షాంశాలు అనేవి భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు సమాంతర వృత్తాలుగా ఉంటాయి. అక్షాంశాలన్నింటిలో పెద్దది భూమధ్యరేఖ.
* భూమధ్యరేఖ అతిపెద్ద వృత్తం. భూమధ్యరేఖకు రెండు వైపులా మిగిలిన అక్షాంశాలు, ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ చిన్నవిగా అవుతాయి.
* ధ్రువాల వద్ద 90º ఉత్తర అక్షాంశం, 90º దక్షిణ అక్షాంశాలు వృత్తాలుగా కాకుండా బిందువులు (.)గా ఉంటాయి.
* ప్రతి అక్షాంశం వద్ద ఉత్తరానికి - ఉ. అని, దక్షిణానికి ద. అని తప్పనిసరిగా సూచికలు ఉంటాయి (ప్రతి అక్షాంశాన్ని దాని దిశతో సూచిస్తారు).
* Note: భూమధ్యరేఖకు ఉత్తర - దక్షిణ సూచికలు ఏవీ ఉండవు.
* '0º' కంటే తక్కువ విలువ ఉన్న అక్షాంశంగానీ, 90º కంటే ఎక్కువ విలువ ఉన్న అక్షాంశాలు గానీ లేవు.
*భూమధ్యరేఖకు - ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న సగభాగాన్ని ఉత్తరార్ధ గోళం అని, భూమధ్యరేఖకు - దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధ గోళం అని అంటారు.
భూమధ్యరేఖ నుంచి ఉత్తర ధ్రువానికి 1º తేడాతో 90 ఉత్తర అక్షాంశాలు, అదేవిధంగా దక్షిణ ధ్రువానికి 90 దక్షిణ అక్షాంశాలు ఉంటాయి.
* భూమధ్యరేఖతో కలిపి 181 ప్రధాన అక్షాంశాలు ఉన్నాయి.
* అక్షాంశాన్ని ఆంగ్లంలో Latitude అంటారు. అంటే 'వెడల్పు' అని అర్థం. ఒక్కొక్క అక్షాంశానికి మధ్య ఉన్న దూరం 111 కి.మీ. లేదా 69 మైళ్లు.
* భూమధ్యరేఖ పొడవు 40,075 కి.మీ.

భూమిపై ఉన్న ముఖ్యమైన అక్షాంశాలు
 

* కర్కట రేఖ - మకర రేఖల మధ్య ప్రాంతాన్ని 'అయనరేఖా మండలం' అంటారు.
* అక్షాంశాల్లో 90º ఉత్తర, దక్షిణ అక్షాంశాలు మినహా మిగిలిన అక్షాంశాలను సమాంతర వృత్తాలు అంటారు.
* అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. కాబట్టి వాటిని సమాంతర రేఖలు అని కూడా అంటారు.

 

రేఖాంశాలు

         రేఖాంశాలు భూమిపై ఉన్న నిలువు గీతలు. వీటిని అర్ధవృత్తాలు అని కూడా అంటారు. రేఖాంశాలు ధ్రువం నుంచి ధ్రువం వరకు ఉండే అర్ధవృత్తాలు. ప్రతి రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని చేధిస్తుంది. రేఖాంశాన్ని ఆంగ్లంలో 'Longitude' అంటారు. అంటే 'పొడవు' అని అర్థం.
* ఒక వృత్తంలో 360º ఉన్నట్లే భూగోళం మీద కూడా 360 రేఖాంశాలు ఉన్నాయి.
* వృత్తాన్ని 360º గా విభజించిన వ్యక్తి- హిప్పార్కస్. భూమిపై గీసిన ప్రారంభ రేఖాంశం 0º రేఖాంశం.
* 0º రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు.
* ఇంగ్లండ్‌లోని గ్రీన్‌విచ్ (Greenwich) లో ఉన్న నక్షత్రశాల మీదుగా వెళ్లే రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం లేదా 0º మెరీడియన్ లేదా గ్రీనిచ్ మెరీడియన్ అంటారు.
* 0º ల గ్రీనిచ్ రేఖాంశాన్ని అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అంటారు.
* ప్రపంచ దేశాలు తమ దేశం మీదుగా వెళ్లే రేఖాంశం ఆధారంగా ఒక ప్రామాణిక రేఖాంశాన్ని నిర్ణయిస్తున్నాయి. భారతదేశం కూడా 82 1/2º తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించింది.
* భూమిపై గీసిన మొత్తం రేఖాంశాల సంఖ్య 360 (గ్రీనిచ్‌తో కలిపి). ఈ రేఖాంశాలు 0º నుంచి ప్రారంభమై తూర్పు, పడమర అనే రెండు సమూహాలుగా ఉన్నాయి.
     1. 0º - 180º ల వరకు తూర్పు రేఖాంశాలు
     2. 0º - 180º ల వరకు పశ్చిమ రేఖాంశాలుగా ఉన్నాయి.
* 180º రేఖాంశానికి, తూర్పు - పశ్చిమ రేఖాంశం అని పేరు.
* Note: 0º రేఖాంశానికి 180º తూర్పు - పశ్చిమ రేఖాంశానికి తూర్పు- పశ్చిమ దిశలను సూచించే గుర్తులు/ సూచికలు ఉండవు.
* 0º రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న 180º ల రేఖాంశాన్ని 'యాంటీ-మెరీడియన్' అంటారు. తూర్పు రేఖాంశాలతో తూర్పు అర్ధగోళం, పశ్చిమ రేఖాంశాలతో పశ్చిమ అర్ధగోళం ఏర్పడతాయి.
* రేఖాంశాలను 'మెరీడియన్స్' అని కూడా అంటారు. ఒక రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు.
రేఖాంశాలన్నీ ధ్రువాల వద్ద కేంద్రీకృతమవుతాయి.
* ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి సూర్యకిరణానికి 4 నిమిషాల సమయం పడుతుంది. ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరీడియన్‌కు, తూర్పు, పడమరలను కలిపి మొత్తం 24 కాల మండలాలుగా విభజించారు. ఒక్కొక్క కాల మండలం 15º రేఖాంశాల మేర ఉంటుంది (24 × 15º = 360º). అంటే ఒక కాల మండలానికి మరొక కాల మండలానికి ఒక గంట తేడా ఉంటుంది. (15º రేఖాంశాలు × 1º అక్షాంశానికి 4 నిమిషాలు = 60 నిమిషాలు) గ్రీనిచ్ మెరీడియన్ నుంచి తూర్పువైపు వెళుతుంటే సమయాన్ని కలపాలి. పడమరవైపు వెళుతుంటే సమయాన్ని తీసేయాలి.
* 180º E.W రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.

 

భూమి నమూనా గ్లోబు (Model of the Earth)

        గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. అక్షాంశాలు నిలువు గీతలు, రేఖాంశాలు అడ్డుగీతలు. ఈ నిలువు, అడ్డు గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీన్ని గ్రిడ్ (Grid) అంటారు. ఈ గడుల సహాయంతో ఒక ప్రదేశాన్ని గుర్తించి, దానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటారు. భూగోళంపై 5 మహాసముద్రాలు, 7 ఖండాలు ఉన్నాయి.

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌