• facebook
  • whatsapp
  • telegram

వాయురవాణా

చారిత్రక నేపథ్యం


 1911, ఫిబ్రవరి 18న మనదేశంలో మొట్టమొదటి వాయురవాణా ప్రారంభమైంది. ఆ సమయంలో హెన్రీఫికెట్‌ అనే వ్యక్తి అలహాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌) నుంచి నైనిటాల్‌ (ఉత్తరాఖండ్‌)కి ఉత్తరాలు బట్వాడా చేశాడు.


 1912లో మొదటి అంతర్జాతీయ విమానం లండన్‌ - కరాచీ - దిల్లీ మధ్య ప్రారంభమైంది. 1922లో దేశీయ విమాన సర్వీసులు మొదలయ్యాయి.


 1927లో సివిల్‌ ఏవియేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పడింది.


 1932లో కరాచీ - ముంబయి మధ్య మొదటి విమానాన్ని జె.ఆర్‌.డి.టాటా నడిపారు.


 1953లో వాయురవాణాను జాతీయం చేశారు. దేశీయ సర్వీసుల కోసం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను, ఇంటర్నేషనల్‌ సర్వీసుల కోసం ఎయిర్‌ ఇండియాను ఏర్పాటు చేశారు.


 డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ పౌర విమానయాన నియంత్రణ సంస్థ. ఇది పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధీనంలో ఉంటుంది.


ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) 


 ఇది 1995, ఏప్రిల్‌లో ఏర్పాటైంది. 


 భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విమానాశ్రయ మౌలిక సదుపాయాలు కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.


 దేశంలోని 115 విమానాశ్రయాలు, 23 సివిల్‌ ఎన్‌క్లేవ్స్‌ దీని నిర్వహణలో ఉన్నాయి. ఏఏఐ వీటితోపాటు 11 ఇతర విమానాశ్రయాల్లో కమ్యూనికేషన్స్‌ అండ్‌ నావిగేషన్‌ సిస్టం (CNSATH) సౌకర్యాలను కల్పిస్తోంది. 


 బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో సుమారు 2.8 మిలియన్‌ నాటికల్స్‌ చదరపు మైళ్ల జాతీయ వాయు/ గగన తలాన్ని, వాయు రవాణా సర్వీసుల కోసం కేంద్రం ఏఏఐకి అప్పగించింది.


జాతీయ పౌర విమానయాన విధానం (2016)


 మనదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఇంటిగ్రేటెడ్‌ సివిల్‌ ఏవియేషన్‌ పాలసీని 2016, జూన్‌లో ప్రకటించారు.


  ఇది పౌర విమానయాన రంగం అభివృద్ధికి సహాయపడుతుంది.


 ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించి, ఉపాధిని పెంచుతుంది.


ఘోస్ట్‌ విమానాశ్రయం


దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారికి విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీటిని ఏర్పాటు చేశారు. 


 భారతదేశంలో మొత్తం 33 ఘోస్ట్‌ విమానాశ్రయాలు ఉన్నాయి. 


ఉదా: రాజస్థాన్‌లోని జైసల్మీర్, తెలంగాణలో వరంగల్‌ వద్ద ఉన్న మూమనూరు విమానాశ్రయం.


గగన్‌ ప్రాజెక్టు ( GPS Aided Geo Augmented Navigation Project )


 పౌర విమానయాన అవసరాల కోసం GPS సిగ్నళ్ల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థను  AAI, ISRO భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. దీన్ని 3 దశల్లో అమలు చేస్తారు. 


 భారత గగనతలంలో కచ్చితత్వం, సమగ్రతతో కూడిన ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ దీని ముఖ్య ఉద్దేశం.


కర్బన తటస్థ విమానాశ్రయాలు  (Carbon Neutral Airports)


 కర్బన ఉద్గారాలను ఎంత పరిమాణంలో విడుదల చేస్తున్నాయో, అదే స్థాయిలో వాటిని శోషించుకునే (Net zero) విమానాశ్రయాలను కర్బన తటస్థ విమానాశ్రయాలు అంటారు.


 వీటిని ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ACI)  ప్రకటిస్తుంది. ఇది  యూరప్‌లో ఉంది.


 భారతదేశంలో లేదా ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో కర్బన తటస్థ హోదా పొందిన మొదటి ఎయిర్‌పోర్ట్‌: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (న్యూదిల్లీ), రెండోది: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్‌).


 ఈ విమానాశ్రయాల నిర్వహణ కార్యక్రమాన్ని ‘ఎయిర్‌ పోర్ట్‌ కార్బన్‌ అక్రిడిటేషన్‌’ అంటారు. 


2021-22 ఆర్థిక సర్వే అంశాలు 


 భారతదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య 202021 నాటికి 137 మిలియన్లకు చేరింది. 


 2025 నాటికి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను కలుపుకుని ప్రపంచంలో 3వ అతిపెద్ద వాయురవాణా మార్కెట్‌గా భారత్‌ ఎదుగుతుందని అంచనా.


 కొవిడ్‌-19 నేపథ్యంలో విదేశాల్లోని భారతీయులను మనదేశానికి తెచ్చేందుకు 2020, మే 7 న ప్రభుత్వం ‘వందే భారత్‌ మిషన్‌’ను ప్రారంభించింది. దీని ద్వారా సుమారు 30 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు.


 2019లో 35 లక్షల టన్నులు, 2020లో 32 లక్షల టన్నుల కార్గో రవాణా జరిగింది. 


 2021 ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి 14.44 లక్షల టన్నుల కార్గో రవాణా జరిగింది. 


హరిత విమానాశ్రయాలు (Green Airports)


బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, దేవనహళ్లి: ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగసామ్యంలో (PPP)ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల వరకు నిర్మించు - సొంతదారు - నిర్వహించు, బదాలాయించు (Build - Own  Operate - Transfer : BOOT) పద్ధతిలో హరిత విమానాశ్రయంగా అమలు చేస్తున్నారు.


రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ దగ్గరలోని శంషాబాద్‌ వద్ద ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో దీన్ని నిర్మించారు. దీన్ని కూడా BOOT పద్ధతిలోనే అభివృద్ధి చేశారు.


ఎయిర్‌పోర్ట్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (AERA) 


దీన్ని 2009, మేలో స్థాపించారు. దీని ప్రధాన ఉద్దేశాలు: 


 దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పడం.  విమానాశ్రయ సదుపాయాల కల్పనలో పెట్టుబడులను ప్రోత్సహించడం. 


 
వైమానిక సేవల సుంకాలను నియంత్రించడం, వినియోగదారుల సహేతుక ప్రయోజనాలను రక్షించడం.


నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌/ ఎయిర్‌ ఇండియా 


 2007లో ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విలీనమయ్యాక అధికారికంగా నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌/ ఎయిర్‌ ఇండియా ఏర్పాటైంది.


 దీన్ని హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (HCO) గా పిలుస్తున్నారు.  HCO ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ప్రభుత్వ కంపెనీ. అప్పటి ప్రపంచ వాయు రవాణా రంగంలోని పరిస్థితుల బట్టి ఎయిర్‌ ఇండియా హోటల్స్‌ రంగంలోకి ప్రవేశించింది.


 దీని ప్రధాన ఉద్దేశం అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇతర పర్యాటక ప్రదేశాల్లో ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించి, దేశంలో పర్యాటక రంగాన్ని విస్తరింపజేయడం.


వాయు రవాణా సంస్థలు (Institutes Related to Aviation)


మనదేశంలో కింది సంస్థలు వాయురవాణాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.


1 ) ఎయిర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ 


2 ) ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ 


3 ) వాయుదూత్‌ 


4 ) పవన్‌హాన్స్‌ లిమిటెడ్‌ 


5 ) ఉడాన్‌


ఎయిర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ 


* ఇది 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ పేరుతో ఏర్పడింది. దీని స్థాపకులు జె.ఆర్‌.డి.టాటా.


* టాటా ఎయిర్‌లైన్స్‌ 1946లో ఎయిర్‌ ఇండియా పేరుతో ప్రభుత్వరంగ సంస్థగా మారి, వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది.


* ఇది అంతర్జాతీయ సర్వీసులతో పాటు, దేశీయంగానూ సర్వీసులు నడుపుతోంది.


* ఎయిర్‌ ఇండియా లోగో: ఎరుపు రంగులో ఎగురుతున్న హంస, దాని మధ్యలో నారింజ రంగులో ఉండే కోణార్క్‌ రథచక్రం (Flying Swan with the wheel of Konark).


ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ 


 దీన్ని దేశీయ సేవల కోసం ఎయిర్‌ ఇండియా కార్పొరేషన్‌ చట్టం, 1953 ద్వారా ఏర్పాటు చేశారు.


 2005, డిసెంబరులో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ బ్రాండ్‌ పేరును ‘ఇండియన్‌’ అని మార్చారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 


 2007లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్‌ ఇండియాలో విలీనం చేశారు.


వాయుదూత్‌ 


 చిన్న పట్టణాలు, నగరాలకు విమాన సేవలు అందించేందుకు 1981లో వాయుదూత్‌ (Vayudut) పేరుతో సర్వీసులను ప్రారంభించారు.


 ఈశాన్య రాష్ట్రాలకు విమాన సర్వీసులను అందించడంలో వాయుదూత్‌ ప్రధానపాత్ర పోషించింది.


 1997, ఏప్రిల్‌లో దీన్ని ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశారు.


పవన్‌హాన్స్‌ హెలికాప్టర్స్‌ లిమిటెడ్‌ (PHHL)


 1988, అక్టోబరులో ఏర్పాటైంది.


 చమురు రంగంలో హెలికాప్టర్‌ సేవలను అందించడానికి; పర్వత, మారుమూల ప్రాంతాలను చేరుకోవడానికి; రవాణా, పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఛార్టర్డ్‌ విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు PHHL ని ఏర్పాటు చేశారు.


 దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది.


 ఇది ఓఎన్‌జీసీ, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌లోని వివిధ ద్వీపాల మధ్య సర్వీసులను నడుపుతోంది. 


(UDAN (Ude Desh ka Aam Naagrik)


 ఈ పథకాన్ని ప్రభుత్వం 2016, అక్టోబరు 21న ప్రారంభించింది. 2017, ఏప్రిల్‌ 17న అమల్లోకి వచ్చింది. ప్రాంతీయంగా ముఖ్య నగరాల్లో తక్కువ ధరల్లో వాయు రవాణాని అందుబాలోకి తేవడం దీని ముఖ్య ఉద్దేశం.


 ఇందులో మార్కెట్‌ ఆధారిత యంత్రాంగం ద్వారా వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తారు.


 ఈ పథకం ద్వారా ఒక గంటలో గమ్య స్థానాన్ని చేరుకునే ప్రయాణానికి కొన్ని సీట్లను తక్కువ ధరలో అందిస్తారు.


 ఇప్పటివరకు ఉడాన్‌ కింద 70 విమానాశ్రయాలు, 128 వాయు మార్గాలను అనుసంధానం చేశారు.


రచయిత

పి.కె. వీరాంజనేయులు

విషయ నిపుణులు 

Posted Date : 27-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌