• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర శాసన నిర్మాణ శాఖ  పార్లమెంటు

  పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పుట్టినిల్లైన బ్రిటన్ పార్లమెంటును ప్రపంచ 'పార్లమెంటరీ వ్యవస్థకు మాత'గా పేర్కొంటారు. పార్లమెంటరీ తరహా వ్యవస్థలో పార్లమెంటు దేశ అత్యున్నత శాసన శాఖగా పనిచేస్తుంది. మనదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించింది.
* భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో రెండు సభలు ఉండే పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పరిచింది. మనదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా రూపొందించడం వల్ల సమాఖ్య వ్యవస్థకు అవసరమైన విధంగా 2 సభలను ఏర్పాటు చేశారు.

* 'పార్లమెంటు' అనే పదం ఫ్రెంచి భాషలోని 'పార్లర్', లాటిన్ భాషలోని 'పార్లమెంటమ్' అనే పదాల నుంచి వచ్చింది. పార్లర్ లేదా పార్లమెంటమ్ అంటే "To-Talk" (చర్చించే స్థలం) అని అర్థం.
* 'జాతి ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంటు భారతదేశంలో అతిపెద్ద పంచాయతీ' అని మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు.
* పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని 'వెస్ట్ మినిస్టర్' తరహా ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. బ్రిటన్ దేశపు పార్లమెంటు ఆ దేశంలో 'వెస్ట్ మినిస్టర్' అనే ప్రాంతంలో ఉంది.

* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 2వ అధ్యాయంలో ఆర్టికల్స్ 79 నుంచి 122 మధ్య భారత పార్లమెంటు నిర్మాణం, శాసన ప్రక్రియ, అధికారాలు, విధులను వివరించారు.
* ఆర్టికల్, 79 ప్రకారం మనదేశానికి అత్యున్నత శాసన నిర్మాణ శాఖ ఉంటుంది. దాని పేరు పార్లమెంటు. పార్లమెంటు అంటే రాష్ట్రపతి + రాజ్యసభ + లోక్‌సభ.
* 1952, ఏప్రిల్ 3న రాజ్యసభ; 1952, ఏప్రిల్ 17న లోక్‌సభ ఏర్పడ్డాయి.
* 1952, మే 13న పార్లమెంటు మొదటి సమావేశం జరిగింది.
* లోక్‌సభ మొదటి స్పీకరైన జి.వి. మౌలాంకర్ ఎగువసభ అయిన 'కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌'ను రాజ్యసభగా, దిగువ సభ అయిన 'హౌస్ ఆఫ్ పీపుల్‌'ను లోక్‌సభగా నామకరణం చేశారు.
* రెండు సభల సభ్యులను పార్లమెంటు సభ్యులుగానే పరిగణిస్తారు. అందుకే ఏ సభలోని సభ్యుడినైనా 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' అంటారు.

 

భారత్‌లో పార్లమెంటు పరిణామ క్రమం
* 1833 చార్టర్ చట్టం ద్వారా మనదేశంలో తొలిసారిగా కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన నిర్మాణ శాఖను వేరుచేశారు.
* 1853 చార్టర్ చట్టం ద్వారా మనదేశంలో జాతీయ స్థాయిలో మొదటి సారిగా 'లెజిస్లేటివ్ కౌన్సిల్‌'ను ఏర్పాటు చేశారు.
* 1861లో భారత కౌన్సిల్ చట్టం ప్రకారం కేంద్ర 'లెజిస్లేటివ్ కౌన్సిల్‌'లో ముగ్గురు భారతీయలకు ప్రాతినిధ్యం కల్పించారు.
* 1892 భారత్ కౌన్సిల్ చట్టం ప్రకారం తొలిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
* 1909 మింటోమార్లే సంస్కరణల చట్టం ద్వారా పరిమితి ప్రాతిపదికపై మనదేశంలో కొద్దిమందికి ఓటుహక్కును కల్పించి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
* 1919 మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా కేంద్ర స్థాయిలో 'ద్విసభా విధానాన్ని' ప్రవేశపెట్టి ఎగువ సభను 'కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌'గా , దిగువ సభను 'లెజిస్లేటివ్ అసెంబ్లీ'గా ఏర్పాటు చేశారు. ఈ ద్విసభా విధానం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.
* భారత పార్లమెంటరీ భవనాన్ని 1921 - 1927 మధ్య నిర్మించారు. పార్లమెంటరీ భవనానికి రూపకల్పన చేసింది ఎడ్వర్డ్ బేకర్, ఎడ్వర్డ్ ల్యూటిన్స్.
* 1921లో గవర్నర్ జనరల్ లార్డ్ ఛెమ్స్‌ఫర్డ్ పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు.
* 1927, జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు.
* పార్లమెంటు భవనం దిల్లీలోని 'సన్‌సద్' మార్గ్‌లో ఉంది. పార్లమెంటును హిందీలో 'సన్‌సద్' అంటారు.
* పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించేందుకు 15వ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఒక కమిటీని ఏర్పాటుచేయగా, ప్రస్తుత 16వ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ కమిటీ నివేదిక ఆధారంగా నూతన పార్లమెంటు భవన ఏర్పాటును ప్రతిపాదించారు. దీనికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

రాజ్యసభ
* దీన్ని ఎగువసభ, పెద్దలసభ, శాశ్వతసభ, రాష్ట్రాల మండలిగా పేర్కొంటారు.
* మనదేశ రాజ్యసభను అమెరికాలోని 'సెనేట్‌'తో పోలుస్తారు. అమెరికా సెనేట్‌లో ఆ దేశంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ మనదేశంలో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభా మేరకే నిర్ణయిస్తారు.
* ఆర్టికల్, 80 రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్, 80(3) ప్రకారం కళలు, సాహిత్యం, సామాజిక సేవ, విజ్ఞాన శాస్త్రం లాంటి రంగాల్లో విశిష్టమైన 12 మందిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
* 238 మందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకుంటారు.
* 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అనే విధానాన్ని చేర్చారు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం ఎన్నుకుంటారు.
* రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల శాసన సభలోని ఎన్నికైన శాసన సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో ఎన్నుకుంటారు.
* 4వ షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సీట్లు కేటాయించారు.
* రాజ్యసభకు నియోజక వర్గాల ప్రాతిపదికన ఎన్నికలు జరగవు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల రాజ్యసభను 'రాష్ట్రాల మండలి'గా పేర్కొంటారు.


 


 

* రాష్ట్రపతిని ఎన్నుకున్నట్లే ప్రాధాన్యత పద్ధతిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు.
* రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతిని మనదేశం దక్షిణాఫ్రికా నుంచి గ్రహించింది.
* రాజ్యసభ పదవీకాలం శాశ్వతం.
* రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు.
* రాజ్యసభ సభ్యులు మొత్తం ఒకేసారి ఎన్నికకారు. ఒకేసారి పదవీ విరమణ చేయరు. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3వ వంతు సభ్యులు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పదవీ విరమణ చేయగా, అంతే స్థాయిలో కొత్తవారు ఎన్నికవుతారు.

రాజ్యసభ సభ్యులు - అర్హతలు (ఆర్టికల్, 84)
* భారతీయ పౌరుడై ఉండాలి.
* 30 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
* పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలుండాలి.
* మిగిలినవన్నీ లోక్‌సభ సభ్యుల అర్హతలే.
* 1951 భారత ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్, 3 ప్రకారం ఒక వ్యక్తి రాజ్యసభకు ఒక రాష్ట్రం నుంచి ఎన్నికవ్వాలంటే అతడు అదే రాష్ట్ర నివాసి అయి ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలో పొందుపరిచారు. దీన్ని 2003లో సవరించారు.
* ఈ సవరణ ప్రకారం ఏ రాష్ట్ర నివాసితుడు అయినప్పటికీ దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావచ్చు. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

 

రాజ్యసభ - ఛైర్మన్
* ఆర్టికల్, 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్అఫీషియా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని రాజ్యసభకు వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు.
* ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు సభాకార్యకలాపాల నిర్వహణకు 1 నుంచి 6 వరకు ప్యానల్ ఛైర్మన్లను ఛైర్మన్ నియమిస్తారు.
* రాజ్యసభలో ఏదైనా బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తున్నపుడు బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తన నిర్ణాయకపు ఓటు (Casting Vote) వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.
* రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కావాల్సిన కనీస సభ్యుల కోరం 1/10వ వంతు.
* రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవీకాలం రాజ్యాంగబద్ధంగా నిర్ధారించనప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినంతకాలం అంటే ఆ పదవీకాలం ముగిసే వరకు (6 ఏళ్లు) పదవిలో కొనసాగుతారు.
* రాజ్యసభ ఛైర్మన్‌ను పార్లమెంటు, డిప్యూటీ ఛైర్మన్‌ను రాజ్యసభ సభ్యులు 14 రోజుల ముందస్తు నోటీసుతో సాధారణ మెజార్టీ ద్వారా తొలగించవచ్చు.
* ఛైర్మన్ లేదా డిప్యూటీ ఛైర్మన్‌లపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు వారు సభకు అధ్యక్షత వహించరాదు. కానీ సభా సమావేశాల చర్చల్లో పాల్గొనవచ్చు.
* రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ సాధించాల్సిన కనీస సభ్యుల సంఖ్య 1/10వ వంతు.
* 1967లో కాంగ్రెస్(ఓ)కు చెందిన శ్యామ్ నందన్ మిశ్రాను రాజ్యసభలో మొదట గుర్తింపు పొందిన ప్రతిపక్షనాయకుడిగా గుర్తించారు.
* 1977లో భారత పార్లమెంటు గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి 'గుర్తింపు నిచ్చే చట్టాన్ని' ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రాజ్యసభలో మొదటి ప్రధాన ప్రతిపక్ష పార్టీనేత కమలాపతి త్రిపాఠి (1977, కాంగ్రెస్ పార్టీ).
* ప్రస్తుతం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్.
* రాజ్యసభకు మొదటి సభానాయకుడు ఎన్. గోపాలస్వామి అయ్యంగార్.
* రాజ్యసభకు ప్రస్తుత సభానాయకుడు అరుణ్ జైట్లీ.
* రాజ్యసభకు మొదటి ఛైర్మన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
* రాజ్యసభకు ప్రస్తుత ఛైర్మన్ హమీద్ అన్సారీ.
* రాజ్యసభకు మొదటి డిప్యూటీ ఛైర్మన్ ఎస్.వి. కృష్ణమూర్తి.
* రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ పి.జె. కురియన్.
* రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌లుగా పని చేసిన మహిళలు
    వయోలెట్ అల్వా, ప్రతిభా పాటిల్, నజ్మా హెప్తుల్లా.
* రాజ్యసభకు అత్యధికంగా 17 సంవత్సరాలు డిప్యూటీ ఛైర్మన్‌గా పని చేసిన వారు నజ్మా హెప్తుల్లా.
* ఆర్టికల్, 90 ప్రకారం రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* ఉపరాష్ట్రపతి ఏదైనా కారణం వల్ల తన పదవిని కోల్పోతే రాజ్యసభకు అధ్యక్షత వహించే అర్హతను కూడా కోల్పోతారు. ఆయనను తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.
* డిప్యూటీ ఛైర్మన్ తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించాలి.
* రాజ్యసభకు అత్యధిక కాలం సభానాయకుడిగా వ్యవహరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ (2004 - 2014).
* రాజ్యసభకు ప్రస్తుత సెక్రటరీ జనరల్ షంషేర్ కె. షరీఫ్

 

రాజ్యసభ - ప్రత్యేక అధికారాలు
* ఆర్టికల్, 67(b) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 249(1) ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై జాతీయ ప్రాధాన్యం ఉందని రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే పార్లమెంటు శాసనం చేస్తుంది. ఈ విధంగా రూపొందించిన శాసనం దేశం మొత్తానికి లేదా కొంత భాగానికైనా వర్తిస్తుంది.
* ఆర్టికల్, 249(2) ప్రకారం ఈ విధంగా రూపొందించిన శాసనం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. రాస్యసభ 2/3వ వంతు మెజార్టీతో మరొక తీర్మానాన్ని ఆమోదిస్తే, మరో సంవత్సరం ఇలా ఎంతకాలమైనా పొడిగించవచ్చు.
ఉదా: 1952లో ఆహార కొరత ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్ధం చేయడానికి రాజ్యసభ ఒక తీర్మానాన్ని చేసింది.
* ఆర్టికల్, 312 ప్రకారం రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే పార్లమెంటు నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేస్తూ చట్టాన్ని రూపొందిస్తుంది.

ఆర్టికల్, 312 ప్రకారం రాజ్యసభ ఇంతవరకు ఆమోదించిన తీర్మానాలు
1961లో
1. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
2. ఇండియన్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్
3. ఇండియన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్
1965లో
1. ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్
2. ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్
* వీటిలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ను మాత్రమే 1966లో ఆలిండియా సర్వీసులో చేర్చారు.
* 1961లో వరకట్న నిషేధ బిల్లును రాజ్యసభ వ్యతిరేకించింది.
* 1970లో మాజీ సంస్థానాధిపతుల హక్కుల రద్దు బిల్లును రాజ్యసభ వ్యతిరేకించింది.
* 1978లో బ్యాంకింగ్ సర్వీసెస్ రద్దు బిల్లును, గుంటూరులోని టొబాకో బోర్డ్‌ను వేరే ప్రాంతానికి మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ వ్యతిరేకించింది.
* 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినప్పుడు దానిలోని 7 అంశాలను రాజ్యసభ వ్యతిరేకించగా, వాటిని తొలగించారు.
* ఆర్టికల్, 368 ప్రకారం జరిగే రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో లోక్‌సభతో సమానంగా రాజ్యసభకు కూడా అధికారాలు ఉన్నాయి.
* రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు. అయితే ఇంతవరకు 41వ రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రమే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మిగిలిన బిల్లులన్నీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
* 41వ రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు వ్యతిరేకంగా సివిల్, క్రిమినల్ కేసులు నమోదు కాకుండా మినహాయింపును ఉద్దేశించారు.
* ఆర్టికల్, 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన
* ఆర్టికల్, 356 ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన
* ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనలను రాజ్యసభ కూడా ఆమోదిస్తేనే అవి అమల్లోకి వస్తాయి లేకపోతే రద్దవుతాయి.
* 1976, మార్చి 22న జనతా పార్టీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి సెలవుకోసం అనుమతి కోరగా రాజ్యసభ తిరస్కరించింది.
* రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకునే 'ఎలక్టోరల్ కాలేజీ'లో, రాజ్యసభలోని మొత్తం సభ్యులు (ఎన్నికైన + నామినేటెడ్) ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు.

 

మారిస్ జోన్స్ తన గ్రంథమైన 'ది గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా'లో రాజ్యసభ 3 ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు.
1. లోక్‌సభ తొందరపాటుతో చేసే శాసనాలను పునరాలోచన చేసి, లోటుపాట్లను సవరించడానికి తోడ్పడుతుంది.
2. అవసరమున్న అదనపు రాజకీయ పదవులను రాజ్యసభ సమకూరుస్తుంది.
3. శాసన నిర్మాణపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి సహకరిస్తుంది.
* పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు ప్రతి శుక్రవారం రాజ్యసభలో రెండున్నర గంటల పాటు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చిండానికి అవకాశం కల్పిస్తారు.


రాజ్యసభపై వ్యాఖ్యానాలు
* 'మనం అధికారాన్ని రాజ్యాంగం నుంచి పొందుతున్నాం. రాజ్యసభ, లోక్‌సభలను ఎగువసభ, దిగువసభ అని పిలవడం సరైంది కాదు. ఈ రెండింటిలో ఏ ఒక్క సభ భారత పార్లమెంటు కాదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా పనిచేయాలంటే ఈ రెండు సభల మధ్య చాలా సన్నిహిత సహకారం ఉండాలి'- జవహర్‌లాల్ నెహ్రూ
* 'ఎగువసభ ఉదాత్తమైన చర్చలను జరుపుతుంది. క్షణికమైన ఆవేశాల వల్ల జరిగే శాసన నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా మేధావులు, విజ్ఞాన వేత్తలు ఈ సభా కార్యకలాపాల్లో పాల్గొని, తమ విద్యావిజ్ఞానాల ప్రయోజనాన్ని దేశానికి అందజేయడానికి రాజ్యసభ అవకాశం కల్పిస్తుంది' - గోపాలస్వామి అయ్యంగార్
* రాజ్యసభను 'కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్' అనడం కంటే 'రాష్ట్ర విధానసభల రాజకీయ పక్షాల కౌన్సిల్ అనడం సరైంది'- గిరిధర్‌లాల్

                                            
లోక్‌సభ
* లోక్‌సభను దిగువసభ, ప్రజాప్రతినిధులసభ, అనిశ్చితసభగా పేర్కొంటారు. పార్లమెంటరీ విధానాన్ని అనుసరించే మన దేశంలో పార్లమెంటులో భాగమైన లోక్‌సభలో మెజార్టీ సాధించినవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.
* ఆర్టికల్, 81 లోక్‌సభ నిర్మాణం, ఎన్నిక లాంటి అంశాలను తెలియజేస్తుంది. సార్వత్రిక వయోజన ఓటుహక్కు ప్రాతిపదికన లోక్‌సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
* 1950లో మొదటి డీలిమిటేషన్ కమిషన్ ద్వారా నిర్ణయించిన లోక్‌సభ సభ్యుల సంఖ్య 525.
* 1972లో మూడో డీలిమిటేషన్ కమిషన్ సిఫారసుల మేరకు 31వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించిన లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 552.
* ఆర్టికల్, 81(1a) ప్రకారం రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు 530.
* ఆర్టికల్, 81(b) ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు 20.
* ఆర్టికల్, 331 ప్రకారం ఆంగ్లో ఇండియన్ల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు ఇద్దరు.
* అయితే ప్రస్తుతం లోక్‌సభలోని సభ్యుల సంఖ్య 545. వీరిలో రాష్ట్రాల నుంచి 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13, ఆంగ్లో ఇండియన్ల ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

లోక్‌సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ
* ఆర్టికల్, 82 ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ అనంతరం లోక్‌సభ స్థానాలను పునర్వ్యవస్థీకరిస్తారు.
* ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలోని స్థానాల సంఖ్యను 2000 సంవత్సరం వరకు మార్చరాదని నిర్దేశించింది.
* అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలోని స్థానాల సంఖ్య 2026 వరకు పొడిగించరాదని నిర్దేశించింది.
* ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యను 1971 జనాభా లెక్క ఆధారంగానే కొనసాగిస్తున్నారు.
* సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కుల్‌దీప్ సింగ్ నేతృత్వంలో 4వ డీలిమిటేషన్ కమిషన్‌ను 2002లో నియమించారు.
* షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల జనాభాలో వచ్చిన మార్పులను అనుసరించి ఎస్సీ, ఎస్టీ జనాభాలో పెరుగుదలకు అనుగుణంగా వారికి కేటాయించిన సీట్లలో మార్పులు, చేర్పులు చేయాలని, నియోజక వర్గాల్లోని ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భౌగోళికంగా పార్లమెంటు, శాసన సభల నియోజక వర్గాలను పునర్వ్యవస్థీకరించి, 1991 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా 2001 జనాభా లెక్కల ఆధారంగా పునర్వ్యస్థీకరించాలని 87వ రాజ్యాంగ సవరణ చట్టం - 2003 ద్వారా నిర్దేశించారు.
* 4వ డీలిమిటేషన్ కమిషన్ కంటే ముందు లోక్‌సభలో ఎస్సీ వర్గాలకు 79 సీట్లు ఉండగా, ప్రస్తుతం 84కు పెరిగాయి.
* ఎస్టీ వర్గాలకు 41 సీట్లు ఉండగా, ప్రస్తుతం 47కు పెరిగాయి.


లోక్‌సభ సభ్యుల ఎన్నిక
* లోక్‌సభ సభ్యులు ఆర్టికల్, 326 ప్రకారం ఓటర్ల ద్వారా నేరుగా నియోజక వర్గాల ప్రాతిపదికన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నికవుతారు. దీన్నే "First past the post" అంటారు.
* భారత పార్లమెంటు ఎన్నికల నియమాల గురించి 1950, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో రూపొందించారు. 1961లో ఎన్నికల నిర్వహణ చట్టం రూపొందించారు.
* భారత మౌలిక రాజ్యాంగంలో వయోజన ఓటింగ్ వయసు 21 ఏళ్లు ఉండేది. దీన్ని 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 18 ఏళ్లకు తగ్గించారు.


ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
* ఆర్టికల్ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ఆధారంగా కొన్ని స్థానాలు రిజర్వ్ చేసేవారు. ఇది ప్రారంభంలో 10 ఏళ్ల వరకు ఉండేది.
* ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలో స్థానాల రిజర్వేషన్‌కు సంబంధించి ఇంతవరకు ఆరు పర్యాయాలు రాజ్యాంగాన్ని సవరించారు. అవి:
1. 8వ రాజ్యాంగ సవరణ చట్టం - 1960
2. 23వ రాజ్యాంగ సవరణ చట్టం - 1969
3. 45వ రాజ్యాంగ సవరణ చట్టం - 1980
4. 62వ రాజ్యాంగ సవరణ చట్టం - 1989
5. 79వ రాజ్యాంగ సవరణ చట్టం - 1999
6. 95వ రాజ్యాంగ సవరణ చట్టం - 2009
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గాలకు 4 లోక్‌సభ స్థానాలు రిజర్వ్ చేశారు. అవి:
  1) అమలాపురం       2) బాపట్ల          3) చిత్తూరు        4) తిరుపతి
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానం అరకు.
* ఒక్కో లోక్‌సభ సభ్యుడు 5 నుంచి 10 లక్షల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు.
* ఆర్టికల్, 331 ప్రకారం రాష్ట్రపతి లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. ప్రారంభంలో ఇది 1960 వరకే ఉండేది. దీన్ని 2009లో 109వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2020 వరకు పొడిగించారు.
* ప్రస్తుతం 16వ లోక్‌సభలోని ఆంగ్లో ఇండియన్లు
   1) జార్జి బకెర్ (కేరళ),       2) రిజర్డ్‌హె (పశ్చిమ్ బంగా)


లోక్‌సభకు పోటీచేసే సభ్యుల అర్హతలు, షరతులు
* భారతీయ పౌరుడై ఉండాలి.
* 25 ఏళ్లు నిండి ఉండాలి.
* ఎన్నికల వ్యయ పరిమితి రూ.70 లక్షలు మించరాదు.
* దివాళాతీసిన వ్యక్తయి ఉండకూడదు.
* శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండకూడదు.
* నామినేషన్ పత్రంతోపాటు సాధారణ అభ్యర్థులైతే రూ.25000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12500 డిపాజిట్‌గా చెల్లించాలి.
* ఆర్టికల్, 17 ప్రకారం శిక్షకు గురై ఉండకూడదు.
* 1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం శిక్షకు గురై ఉండరాదు
* నేరారోపణ రుజువై ఉండకూడదు.
* దేశంలో ఏదైనా లోక్‌సభ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
* 25% ప్రభుత్వ పెట్టుబడులున్న కంపెనీల్లో డైరెక్టర్ స్థాయిలో ఉండరాదు.
* ఎన్నికల వ్యయాన్ని గురించి ఆడిట్ నివేదికను 15 రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించని కారణంగా నిషేధం ఉండరాదు.
* ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951 ప్రకారం నియమాలను ఉల్లంఘించారనే కారణంతో ఎన్నికల కమిషన్ నిషేధానికి గురై ఉండరాదు.
* 2002లో సవరించిన ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి తమ వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.


లోక్‌సభ పదవీకాలం
* ఆర్టికల్, 83 ప్రకారం సాధారణంగా లోక్‌సభ పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం ముగియకముందే రాష్ట్రపతి లోక్‌సభను అర్ధాంతరంగా రద్దు చేయవచ్చు. 
* ఏదైనా కారణం వల్ల లోక్‌సభ పదవీకాలాన్ని మధ్యలోనే రద్దు చేస్తే 6 నెలల్లోగా ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలి.
* ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా లోక్‌సభ పదవీకాలాన్ని 5 నుంచి 6 సంవత్సరాలకు పొడిగించింది.
* మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా లోక్‌సభ పదవీకాలాన్ని తిరిగి 6 నుంచి 5 సంవత్సరాలకు మార్చింది.

 

ప్రమాణ స్వీకారం
* ఆర్టికల్, 99 లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన వ్యక్తి సమక్షంలో 3వ షెడ్యూల్లో ప్రస్తావించిన విధంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండా సభా కార్యక్రమాల్లో పాల్గొంటే, పాల్గొన్న ప్రతి రోజుకు రూ.500 అపరాధ రుసుము చెల్లించాలి.


పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు (ఆర్టికల్, 106)
   2010లో పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు
వేతనం                              రూ.50,000
నియోజకవర్గ అలవెన్స్       రూ.45,000
దినసరి అలవెన్స్               రూ.2,000
ఇతర ఖర్చులు                  రూ.45,000
* పైన పేర్కొన్న వేతనంతోపాటు ఉచిత నివాసం, ఉచిత రవాణా, వైద్య ఖర్చులు కూడా లభిస్తాయి. పదవీకాలం ముగిసిన తర్వాత నెలకు రూ.20,000 పెన్షన్ లభిస్తుంది.

 

పార్లమెంటు సభ్యుల రాజీనామా
* పార్లమెంటు సభ్యులు నిర్ణీత ప్రొఫార్మాలో ఆయా సభాధ్యక్షులను (లోకసభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్) సంబోధిస్తూ రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు దాన్ని ధ్రువీకరించుకున్న తర్వాత సభాధ్యక్షులు సభ్యుల రాజీనామాను ఆమోదిస్తారు.
* ఆర్టికల్, 85 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని 'సమన్స్', పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని 'ప్రోరోగ్', లోక్‌సభను రద్దు చేయడాన్ని 'డిసాల్వ్' అని అంటారు.
* ఆర్టికల్, 86 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభలకు సంయుక్తంగా లేదా విడివిడిగా తన సందేశాలను పంపుతారు.
* ఆర్టికల్, 87 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి విశేష ప్రసంగాలను చేయవచ్చు. లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత, ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశాల కంటే ముందు జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
* ఆర్టికల్, 101 ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సభల్లో సభ్యుడిగా వ్యవహరించరాదు.
* ఒక వ్యక్తి రెండు సభలకు ఏకకాలంలో ఎన్నికైతే నిర్ణీత కాల 10 రోజుల్లోగా తాను ఏ సభలో సభ్యుడిగా కొనసాగాలనుకుంటున్నాడో తెలపాలి. లేకపోతే సంబంధిత వ్యక్తి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతారు.
* పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైతే 14 రోజుల నిర్ణీత సమయంలోగా తన ప్రాధాన్యాన్ని తెలియజేయకపోతే శాసనసభ సభ్యత్వాన్ని కలిగి ఉండి, పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతారు.
* రాజ్యసభ లేదా లోక్‌సభల్లో ఏదైనా ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు ఎన్నికైతే 10 రోజుల్లోగా తన నిర్ణయాన్ని తెలియజేయకపోతే మొదటి సభ సభ్యత్వాన్ని కోల్పోతారు.
* పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాష్ట్రాల్లో ఏదైనా పదవిని చేపడితే ఆ పదవిని చేపట్టిన నెలరోజుల్లోగా తన ప్రాధాన్యాన్ని తెలియజేయకపోతే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.


ఆర్టికల్, 102 ప్రకారం కింద పేర్కొన్న సందర్భాల్లో పార్లమెంటు సభ్యులు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు
* లాభదాయక పదవుల్లో కొనసాగినప్పుడు
* భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు
* మతిస్థిమితం కోల్పోయినప్పుడు
* దివాళా తీసినప్పుడు
* వరకట్నం, సతీ, అస్పృశ్యతా చట్టాల కింద శిక్షకు గురైనప్పుడు
* పదవి దుర్వినియోగానికి పాల్పడినప్పుడు
* న్యాయస్థానం దోషిగా ప్రకటించినప్పుడు
* పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభాపతి అనర్హుడిగా ప్రకటించినప్పుడు
* ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనప్పుడు
* కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయరాదు.


సుప్రీం కోర్టు తీర్పులు

కె. ఆనందన్ నంబియార్ vs చీఫ్ సెక్రటరీ, మద్రాస్
   ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దేశరక్షణకు సంబంధించిన నిబంధనలకు భంగం కలిగించిన సందర్భంలో సరైన కారణాలున్నప్పుడు పార్లమెంటు సమావేశాలు జరిగే సందర్భంలో పార్లమెంటు సభ్యులను అరెస్ట్ చేయడం సమంజసమేనని పేర్కొంది.
జయాబచ్చన్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2006)
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గౌరవ వేతనం కూడా లాభాదాయక పదవి కిందకు వస్తుందని, వేతనం తీసుకోకపోయినా ఆ పదవిలో ఉండే అధికారం, హోదా, గుర్తింపు కూడా లాభంగానే పరిగణించాలని, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చని పేర్కొంది.
లిల్లీథామస్ vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు (2014)
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రెండు ఏళ్ల కంటే ఎక్కువ కాలం శిక్షపడిన వారు అనర్హులని పేర్కొంది.
పి.వి. నరసింహారావు vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను ప్రజా సేవకులుగానే భావించాలని పేర్కొంది.
డి.కె. తరవేది సిద్ధాంత vs విజయ్ మాల్యా కేసు (2009)
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశంలో నివాసం ఉండని భారతీయులు (ఎన్ఆర్ఐ) భారత్‌లో ఓటుహక్కులను కలిగి ఉన్నప్పుడు వారు దేశంలో స్థిరనివాసులు కానప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపింది.


లోక్‌సభ స్పీకర్‌లు

1. ప్రొటెం స్పీకర్
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు సభ్యుల్లో సీనియర్‌ను 'ప్రొటెం స్పీకర్‌'గా రాష్ట్రపతి నియమిస్తారు.
* ప్రొటెం స్పీకర్ పదవిని ఫ్రాన్సు నుంచి గ్రహించారు.
* లోక్‌సభకు నూతన స్పీకర్‌ను ఎన్నుకునే వరకు వీరే సభకు అధ్యక్షత వహిస్తారు.
* 1952లో ఏర్పడిన మొదటి లోక్‌సభకు ప్రొటెం స్పీకర్ జి.వి. మౌలాంకర్.
* 2014లో ఏర్పడిన 16వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్.
* అత్యధికసార్లు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినది బి.డి. దాస్ (4 సార్లు), ఇంద్రజిత్ గుప్తా (4 సార్లు).
* ప్రొటెం స్పీకర్‌గా పనిచేసే వ్యక్తి స్పీకర్ పదవికి పోటీ చేయాలంటే తన ప్రొటెం స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి.

2. డిప్యూటీ స్పీకర్
* డిప్యూటీ స్పీకర్‌ను లోక్‌సభ సభ్యులు ఎన్నుకుంటారు. లోక్‌సభ స్పీకర్ సమావేశాలకు హాజరుకాని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు.
* మొదటి లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్.
* ప్రస్తుత 16వ లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ తంబిదొరై. ఈయన 1985లో కూడా డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు.
* 1967 నుంచి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీలకు కేటాయించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.

3. స్పీకర్
* ఆర్టికల్, 93లో స్పీకర్ పదవిని ప్రస్తావించారు. మన దేశంలో మొదటిసారిగా 1921లో సభాధిపతి పదవిని ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ పదవిని అధ్యక్షుడిగా పిలిచేవారు.
* 1935లో అధ్యక్షుడనే పదాన్ని స్పీకర్ పదవిగా మార్చారు.
* మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు మొదటి స్పీకర్ ఫ్రెడరిక్‌వైట్.
* స్వాతంత్య్రం అనంతరం ఎన్నికైన మొదటి స్పీకర్ విఠల్‌భాయ్ పటేల్.
* లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
* స్పీకర్ పదవిని బ్రిటన్ నుంచి గ్రహించారు.
* బ్రిటన్‌లో స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
* మనదేశంలో స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ నీలం సంజీవరెడ్డి స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
* లోక్‌సభ రద్దైనప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాకుండా, నూతన లోక్‌సభ ఏర్పాటయ్యేవరకు కొనసాగుతుంది.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు లోక్‌సభ సభ్యులుగా, ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా ప్రత్యేక ప్రమాణ స్వీకారం ఉండదు.


స్పీకర్ అధికారాలు - విధులు
* స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహించి, సభాకార్యకలపాలను నిర్వహిస్తారు.
* సభలో జరిగే చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ వంటి అంశాలను నియంత్రిస్తారు.
* లోక్‌సభలో ఏ బిల్లు ప్రవేశ పెట్టాలన్నా స్పీకర్ అనుమతి అవసరం.
* లోక్‌సభలో గెలుపొందిన రాజకీయ పక్షాలకు గుర్తింపునిస్తారు.
* స్పీకర్ అనుమతి లేకుండా అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు లోక్‌సభలో ప్రసంగించరు.
* లోక్‌సభ సచివాలయానికి అధిపతిగా వ్యవహరించి, సిబ్బందిపై పరిపాలనా నియంత్రణ కలిగి ఉంటారు.
* సభ్యులకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు వంటి అంశాల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
* క్రమశిక్షణను ఉల్లంఘించి, సభా మర్యాదలకు భంగం కల్గించే సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తారు.
* సభా రికార్డుల్లో చోటు కల్పించే అంశం లేదా తొలగించే అంశం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
* ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని ధ్రువీకరిస్తారు.
* లోక్‌సభలో ఏదైనా బిల్లు విషయమై ఓటింగ్‌లో బలాబలాలు సమానమైనప్పుడు స్పీకర్ తన 'నిర్ణాయక ఓటు' (Casting vote) ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్దేశిస్తారు.
* ఆర్టికల్, 108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, దానికి అధ్యక్షత వహిస్తారు.
* లోక్‌సభ సమావేశాలను తేదీ, సమయం చెప్పి తాత్కాలికంగా వాయిదా వేస్తారు.
* లోక్‌సభ సమావేశాలను తేదీ, సమయం చెప్పకుండా అర్ధంతరంగా వాయిదా వేస్తారు (సైనిడై).
* ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్‌కి హోదారీత్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* అఖిలభారత స్పీకర్ల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
* రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారు.
* పార్లమెంటు, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.
* పార్లమెంటు నుంచి ఏర్పడే 24 స్టాండింగ్ కమిటీల్లో 16 కమిటీల ఛైర్మన్‌లను నియమిస్తారు.
* పార్టీ ఫిరాయింపులకు పాల్పడే లోక్‌సభ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు.
* పార్లమెంటు నుంచి ఏర్పడే సభావ్యవహారాల కమిటీ, నియమనిబంధనల కమిటీ, సాధారణ అవసరాల కమిటీలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు
* సభలో జరిగే చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ఆక్షేపణలు, సభలో కోరం నిర్ణయం లాంటి అంశాలపై నియంత్రణ కలిగి ఉంటారు.
* భారత అధికార హోదాలో 7వ స్థానం ఉండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా గౌరవ హోదాను పొందుతారు.


స్పీకర్ పదవిపై వ్యాఖ్యానాలు
* 'స్పీకర్ లోక్‌సభకు ప్రతినిధి, జాతి స్వేచ్ఛకు చిహ్నం ఆయన గౌరవ ప్రతిపత్తి గొప్పది'. - జవహర్‌లాల్ నెహ్రూ
* 'స్పీకర్ స్థానం అసమానమైంది. దేశపరిపాలన, విదేశాంగ విధానంలో ప్రత్యక్షంగా అధికారాన్ని వినియోగిస్తున్నట్లు కన్పించకపోయినా, పరోక్షంగా కొంత ప్రభావాన్ని ఆ రెండింటి మీద చూపుతారు'. - జి.వి. మౌలాంకర్


సభాధ్యక్షుల వేతనాలు
* ఆర్టికల్, 97లో సభాధ్యక్షుల వేతనాలు నిర్దేశించారు.
రాజ్యసభ ఛైర్మన్                   -   రూ.1,25,000
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్      -   రూ.90,000
లోక్‌సభ స్పీకర్                     -   రూ.1,25,000
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్        -   రూ.90,000

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల రాజీనామా, తొలగింపు
* ఆర్టికల్, 94 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల తొలగింపు విధానాన్ని తెలియజేస్తుంది.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల లోక్‌సభ సభ్యత్యం రద్దు అయితే వారు తమ పదవులను కోల్పోతారు.
* లోక్‌సభ సభ్యులు ఒక సాధారణ తీర్మానం ద్వారా 14 రోజుల ముందస్తు నోటీసుతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించవచ్చు.
* స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.
* ఆర్టికల్, 95 ప్రకారం స్పీకర్ పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆ విధులను డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే లోక్‌సభ నియమాల ప్రకారం లోక్‌సభ సభ్యుల్లో ఆర్హుడైన వ్యక్తిని స్పీకర్ విధులను నిర్వహించేందుకు రాష్ట్రపతి నియమిస్తారు.
* ఆర్టికల్, 96 ప్రకారం స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌ని తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపడతారో వారు సభకు అధ్యక్షత వహించరాదు.
* స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో వారు చర్చలో పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు. కానీ తీర్మానంపై మొదటి దఫాలోనే అంటే సాధారణ సభ్యులుగానే ఓటు హక్కు వినియోగించుకోవాలి.
* డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్‌లో అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చిప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ తన కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు.
* స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్‌లో అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉండే డిప్యూటీ స్పీకర్ తన కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు.
* ఆర్టికల్, 98 లోక్‌సభ, రాజ్యసభల సచివాలయం గురించి తెలియజేస్తుంది.


4. ప్యానల్ స్పీకర్స్
* ప్యానల్ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు సమావేశాలకు హాజరు కానప్పుడు అధ్యక్షుడిగా ఉండేందుకు నియమించే తాత్కాలిక స్పీకర్లనే 'ప్యానల్ స్పీకర్లు' అంటారు.
* సమావేశం తొలి రోజునే స్పీకర్ 1 - 6 మందిని ప్యానల్ స్పీకర్లుగా నియమిస్తారు.


స్పీకర్ పదవి- కీలకాంశాలు
* అత్యధిక కాలం స్పీకర్‌గా వ్యహరించింది - బలరాం జక్కర్ (1980 - 1989)
* పోటీ ద్వారా ఎన్నికై అతి తక్కువ కాలం స్పీకర్‌గా వ్యవహరించింది - బలిరాం భగత్ (1976 - 77)
* పదవిలో ఉండగా మరణించిన స్పీకర్లు - జి.వి. మౌలాంకర్, జి.ఎం.సి. బాలయోగి
* లోక్‌సభకు మొదటి మహిళా స్పీకర్ మీరాకుమార్ (15వ లోక్‌సభ).
* లోక్‌సభకు మొదటి దళిత స్పీకర్ - జి.ఎం.సి బాలయోగి.
* ప్రస్తుత 16వ లోక్‌సభ స్పీకర్ - సుమిత్రా మహాజన్ (మధ్యప్రదేశ్‌లోని - ఇండోర్ లోక్‌సభ స్థానం)

 

శాసన నిర్మాణ ప్రక్రియ
    మనదేశ శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటన్ నుంచి గ్రహించారు. ఒక బిల్లు చట్టంగా మారాలంటే మన దేశంలో 7 దశలను అధిగమించాల్సి ఉంటుంది. బిల్లు అంటే చట్టం చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన లేదా ముసాయిదా. ఇది చట్టం మొదటి దశ.
1. ప్రవేశదశ
* ఈ దశలో బిల్లును ప్రవేశపెట్టే వ్యక్తి/మంత్రి సభాధిపతి అనుమతితో బిల్లు శీర్షికా ప్రకటన చేస్తూ బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ అనుమతి కోరతారు.
* అవసరమైతే ఈ దశలో బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో బిల్లు నెగ్గితే బిల్లు ప్రతిని ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురిస్తారు.
* ఈ దశలో బిల్లు ఓడిపోతే కేవలం బిల్లు మాత్రమే రద్దు అవుతుంది. ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ప్రమాదం లేదు.
2. మొదటి పఠనం
* ఈ దశలో సంబంధిత శాఖా మంత్రి బిల్లు ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు చట్టంగా మారితే దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తారు.
3. ద్వితీయ పఠనం
* ఈ దశలో సంబంధిత మంత్రి బిల్లుకు సంబంధించిన ముఖ్య అంశాలను సవివరంగా సభకు వివరిస్తారు.
* బిల్లును సభ మొత్తంగా చర్చించాలా లేక కమిటీకి అప్పగించాలా అనే అంశంపై చర్చ జరుగుతుంది. సాధారణంగా ఏ బిల్లునైనా పార్లమెంటరీ కమిటీలకు అప్పగిస్తారు.
4. కమిటీ దశ
* ఆధునిక కాలంలో పార్లమెంటు చేసే చట్టాల తయారీలో కమిటీలదే కీలకపాత్ర. సంబంధిత రంగాలకు చెందిన నిపుణుల సలహాలను, రాజ్యాంగ న్యాయనిపుణుల సలహాలను, ప్రజాభిప్రాయాన్ని ఈ కమిటీ సేకరిస్తుంది. ఈ విధంగా సేకరించిన అంశాలతో కూడిన 'నోట్‌'ను బిల్లుకు జతచేసి సభాధిపతికి సమర్పిస్తారు.
5. నివేదిక దశ
* వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల ఆధారంగా బిల్లులో చేసే సవరణలు, అవసరమైన సూచనలు, మేధావుల సలహాలను చేర్చి ఒక నివేదికను రూపొందించి ఆ 'నివేదిక'ను సభ ముందు ఉంచుతారు.
6. తృతీయ పఠనం
* పార్లమెంటరీ కమిటీ సమర్పించిన బిల్లులోని అంశాలపై చర్చిస్తూ, ఒక్కో క్లాజుపై లేదా మొత్తం బిల్లుపై సమగ్ర చర్చ జరిపి, సభ్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్‌కు పెట్టవచ్చు. ఈ దశలో లోక్‌సభలో జరిగే ఓటింగ్‌లో బిల్లు వీగిపోయినట్లయితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.
7. రాష్ట్రపతి ఆమోదం
* పైన పేర్కొన్న దశలు రెండో సభలోనూ పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. వారి ఆమోదంతో బిల్లు శాసనంగా మారుతుంది.
* పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న రోజుల్లో బిల్లు శాసనంగా రూపొందేందుకు కనీసం 19 రోజుల సమయం పడుతుంది.


బిల్లులు - రకాలు

  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్, 107 నుంచి 122 మధ్య శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, బిల్లుల వివరాలను పొందుపరిచారు.
సాధారణ బిల్లులు
* ఆర్టికల్, 107 ప్రకారం ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు కాని వాటిని 'సాధారణ బిల్లులు'గా పరిగణించాలి. సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ బిల్లులను ఉభయసభలు వేర్వేరుగా లేదా సంయుక్తంగా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు శాసనంగా మారుతుంది.
* సాధారణ బిల్లులను ఆమోదించే సందర్భంలో పార్లమెంటు ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్, 108 ప్రకారం రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఇంత వరకు మనదేశంలో కేవలం 3 సార్లు మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగాయి. అవి:
1. 1961 మే, 6న వరకట్న నిషేధ బిల్లు విషయమై రాజ్యసభ ప్రతిపాదించిన సవరణను లోక్‌సభ తిరస్కరించడం.
2. 1978 మే, 17న బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్లును లోక్‌సభ ప్రతిపాదించగా రాజ్యసభ తిరస్కరించడం.
3. 2002 మార్చి, 26న 'ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్' బిల్లును లోక్‌సభ తిరస్కరించడం.


ద్రవ్య బిల్లులు (Money Bills)
రాజ్యాంగంలోని ఆర్టికల్, 109లో ద్రవ్యబిల్లు ఆమోద ప్రక్రియ, ఆర్టికల్, 110లో ద్రవ్య బిల్లుల నిర్వచనం గురించి వివరించారు. అవి:
* భారత సంఘటిత నిధి, ఆగంతుక నిధి నుంచి నగదు తీసుకోవడం, జమ చేయడం.
* పన్నులు విధించడం, తగ్గించడం, క్రమబద్దీకరించడం.
* ప్రభుత్వ రుణాలను క్రమబద్దీకరించటం, ఆర్థిక లావాదేవీలు.
* ఆర్టికల్, 110 (3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అనేది లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోను సవాల్ చేయకూడదు.
* ద్రవ్య బిల్లును రాష్ట్రపతి అనుమతితో లోక్‌సభలోనే ప్రవేశ పెట్టాలి. లోక్‌సభ ఆమోదం పొందిన ద్రవ్య బిల్లు స్పీకర్ ధ్రువ పత్రంతో రాజ్యసభకు పంపుతారు.
* ద్రవ్య బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా తన ఆమోదాన్ని తెలియజేయాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.

 

ఆర్థిక బిల్లులు (Financial Bills)
  ఆర్టికల్, 117లో ఆర్థిక బిల్లుల గురించి ప్రస్తావించారు. ఆర్థిక బిల్లులను కింది విధంగా వర్గీకరించారు. అవి:
A. ద్రవ్య బిల్లులు - ఆర్టికల్, 110
B. మొదటి రకం ఆర్థిక బిల్లులు - ఆర్టికల్, 117(1)
C. రెండో రకం ఆర్థిక బిల్లులు - ఆర్టికల్, 117(3)
 ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులో అంతర్భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు.
* స్పీకర్ ధ్రువీకరించిన ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు అవుతాయి. అంటే ద్రవ్య బిల్లులకు, ఆర్థిక బిల్లులకు తేడా స్పీకర్ ధ్రువీకరణ మాత్రమే.
మొదటి రకం ఆర్థిక బిల్లు
* కేంద్ర ప్రభుత్వం రుణాలను సేకరించే అంశాలపై చట్టాలను చేయాలనుకున్నప్పుడు, రుణాలను సేకరించే నియమాలతో పాటు సాధారణ నియమాలు కూడా ఉంటాయి. ఈ రకమైన బిల్లు ద్రవ్య బిల్లుతో సమానమైంది. ఈ బిల్లును రాష్ట్రపతి అనుమతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి.
రెండో రకం ఆర్థిక బిల్లు
* ఈ రకమైన ఆర్థిక బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలుంటాయి. ఆర్టికల్, 110లో పేర్కొన్న అంశాలు దీనిలో ఉండవు కాబట్టి దీన్ని సాధారణ బిల్లుగానే పరిగణించవచ్చు. ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
* రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ బిల్లుపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు.
ఫైనాన్స్ బిల్లు: బడ్జెట్‌లో పన్నుల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లు.
ఫైనాన్షియల్ బిల్లు: ఆర్టికల్, 117లో పేర్కొన్న అంశాలు ఉన్న 'ఆర్థిక బిల్లు'.


పార్లమెంటు అధికారాలు - విధులు 

శాసనాధికారాలు
* భారత దేశానికి అవసరమైన సమగ్ర శాసనాలు రూపొందించేది పార్లమెంటు మాత్రమే.
* కేంద్ర జాబితాలోని 100 అంశాలు, ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.

పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే సందర్భాలు..
* ఆర్టికల్, 249 - జాతీయ ప్రాధాన్యత రీత్యా రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని చేసినప్పుడు
* ఆర్టికల్, 352 - జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో (ఆర్టికల్, 250 ప్రకారం).
* ఆర్టికల్, 252 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభీష్టం మేరకు.
* ఆర్టికల్, 253 - అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం.
* ఆర్టికల్, 356 - రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు.
కింద పేర్కొన్న అంశాలపైన కూడా పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది
* ఆర్టికల్, 2 - కొత్త రాష్ట్రాల ఏర్పాటు
* ఆర్టికల్, 3 - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
* ఆర్టికల్, 11 - పౌరసత్వ సంబంధ విషయాలు
* ఆర్టికల్, 16(3) - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొన్ని తరగతుల ఉద్యోగాల్లో నివాస, అర్హత విషయాలు
* ఆర్టికల్, 33 - సైనికుల, శాంతిభద్రతల ఉద్యోగుల ప్రాథమిక హక్కులపై
* ఆర్టికల్, 71 - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారాలు
* ఆర్టికల్, 248 - అవశిష్టాంశాలపై
* ఆర్టికల్, 169(1) - రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్ ఏర్పాటు/ రద్దు
* ఆర్టికల్, 312 - రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే అఖిల భారత సర్వీసుల ఏర్పాటు
* ఆర్టికల్, 83(2) - లోక్‌సభ కాలపరిమితి పెంపు.
* ఆర్టికల్, 123 - రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్సులను ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించడం.
* ఆర్టికల్, 280(1) - ఆర్థిక సంఘం విధి విధానాలపై


కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే పద్ధతులు
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి ఆర్టికల్, 75(3) ప్రకారం లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
* సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే వాయిదా తీర్మానం, అవిశ్వాస తీర్మానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
* లోక్‌సభ ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నియంత్రణను కలిగి ఉంటుంది. అవి:
A. ద్రవ్య బిల్లులను, బడ్జెట్‌ను తిరస్కరించడం.
B. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని తిరస్కరించడం ద్వారా
C. కోత తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా
D. అభిశంసన తీర్మానాన్ని, వాయిదా తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా
E. విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా
F. ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా
G. ప్రశ్నలు, అనుబంధపు ప్రశ్నలు, జీరో అవర్ (శూన్య సమయం) ద్వారా


ఆర్థిక అధికారాలు
* పార్లమెంటు అనుమతి లేనిదే పన్నులు విధించకూడదు. ఆర్టికల్, 265 ప్రకారం చట్టబద్ధంగా తప్ప మరే విధంగా పన్నులు విధించరాదు.
* బడ్జెట్, ఆర్థిక విధానాలను కూడా పార్లమెంటు ఆమోదిస్తుంది.
* ఆర్టికల్, 266 ప్రకారం కేంద్ర సంఘటిత నిధిపై పార్లమెంటు అధికారాన్ని కలిగి ఉంటుంది.
* పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల నివేదికలను పరిశీలించడం.
* ఆర్టికల్, 292 ప్రకారం విదేశాల నుంచి ప్రభుత్వం పొందే రుణాలకు అనుమతివ్వడం.
* ఆర్టికల్, 267 ప్రకారం కేంద్ర ఆగంతుక నిధి ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండటం.


అర్ధ న్యాయాధికారాలు: మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించడం
* ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌లను తొలగించే తీర్మానాలను విచారించి ఆమోదించడం.
* సభాహక్కులకు భంగం కల్గించినా లేదా పార్లమెంటు ధిక్కారానికి పాల్పడిన సభ్యులను, ఇతర వ్యక్తులను శిక్షించడం.

ఎన్నికల అధికారాలు
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియలో పార్లమెంటు పాల్గొంటుంది.
రాజ్యాంగ సవరణ అధికారాలు
* ఆర్టికల్, 368 ద్వారా భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. 3 రకాల పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరిస్తుంది.
నివేదికలపై చర్చ, ఆమోదం
* జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, మైనార్టీ కమిషన్, కాగ్, జాతీయ బీసీ కమిషన్; ఎస్సీ, ఎస్టీ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు సమర్పించిన నివేదికలను చర్చించి, ఆమోదిస్తుంది.
* వివిధ పార్లమెంటరీ స్థాయి సంఘాలు సమర్పించిన నివేదికల ఆధారంగా నూతన చట్టాలను రూపొందిస్తుంది.


జీతభత్యాలను నిర్ణయించడం
  పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు; లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, గవర్నర్లు, కేంద్ర ఎన్నికల కమిషనర్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జీతభత్యాలను పార్లమెంటు నిర్దేశిస్తుంది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ
* డీలిమిటేషన్ కమిటీ సూచనలను అనుసరించి లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గాల సంఖ్యను, వివిధ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 1950, 1951 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో కూడా సవరణలు చేస్తుంది.


లోక్‌సభ, రాజ్యసభల మధ్య వ్యత్యాసాలు

లోక్‌సభ రాజ్యసభ
* లోక్‌సభ ప్రజల సభ. సభ్యులను నేరుగా ఓటర్లే ఎన్నుకుంటారు. * రాజ్యసభ పరోక్షసభ. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
* లోక్‌సభ స్పీకర్ ద్రవ్య బిల్లులను నిర్ధారిస్తారు. ఇతని నిర్ణయమే అంతిమం. * రాజ్యసభ ఛైర్మన్‌కు ద్రవ్య బిల్లులపై ఎలాంటి అధికారం లేదు.
* అవిశ్వాస తీర్మానాన్ని, విశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. * ఈ తీర్మానాలు రాజ్యసభలో ప్రవేశపెట్టే వీల్లేదు.
* లోక్‌సభ పదవీకాలం అనిశ్చితం. * రాజ్యసభ పదవీ కాలం శాశ్వతం.

లోక్‌సభ, రాజ్యసభల మధ్య వ్యత్యాసాలు

లోక్‌సభ రాజ్యసభ
* రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. * ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. * కేంద్ర ప్రభుత్వ మనుగడ రాజ్యసభపై ఆధారపడదు.
* పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. * ఆర్టికల్, 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందించాలంటే రాజ్యసభ ప్రత్యేక తీర్మానం అవసరం.
  * ఆర్టికల్, 312 ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ప్రత్యేక తీర్మానం అవసరం.

పబ్లిక్ బిల్లు, ప్రైవేటు బిల్లుల మధ్య వ్యత్యాసాలు

పబ్లిక్ బిల్లులు ప్రైవేటు బిల్లులు
* కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినవే పబ్లిక్ బిల్లులు. * మంత్రులు కాని సభ్యులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు ప్రతిపాదించే బిల్లులనే ప్రైవేటు బిల్లులు అంటారు.
* పబ్లిక్ బిల్లుల విషయంలో మంత్రి మండలికి సమష్టి బాధ్యతా సూత్రాన్ని అన్వయిస్తారు. * ప్రైవేటు బిల్లుల విషయంలో మంత్రిమండలికి సమష్టి బాధ్యతా సూత్రం వర్తించదు.
* పబ్లిక్ బిల్లులు ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపడి ఉంటాయి. * ప్రైవేటు బిల్లుల విషయంలో అదేమీ ఉండదు.
* పబ్లిక్ బిల్లులను మంత్రులు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. * ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టే సభ్యుడు ఏ సభకు చెందుతాడో ఆ సభలోనే బిల్లును ప్రవేశపెట్టాలి.
* పబ్లిక్ బిల్లులకు సాధారణంగా సభలో అత్యధిక సభ్యుల మద్దతు లభిస్తుంది. * ప్రైవేటు బిల్లులకు సభలో అధిక సంఖ్యాక సభ్యుల మద్దతు లభించవచ్చు లేదా లభించకపోవచ్చు.
* పబ్లిక్ బిల్లులను ప్రవేశపెట్టే సంబంధిత మంత్రి 7 రోజుల ముందు సభాధిపతికి నోటీసు ఇవ్వాలి. * ప్రైవేటు బిల్లును ప్రతిపాదించే సభ్యులు నెల రోజులు ముందే నోటీసును సభాపతికి ఇవ్వాలి.

పార్లమెంటరీ కమిటీలు
* రోజు రోజుకూ శాసనాల సంఖ్య పెరగడం, శాసనాల రూపకల్పనలో సాంకేతికత పెరగడం, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిమాణం లాంటి అంశాలన్నీ పార్లమెంటుకున్న విలువైన కాలంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆధునిక కాలంలో శాసనాల రూపకల్పనలో ఈ కమిటీల పాత్ర కీలకమైంది.
* పార్లమెంటు తరఫున నిపుణులు, సమర్థులైన కొంత మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా పరిపాలనపై నిరంతర నియంత్రణ కొనసాగిస్తారు.
* భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఏర్పరచలేదు. కానీ ఆర్టికల్ 88, 105లలో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది.


వ్యాఖ్యానాలు
* 'ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్లు, చేతులు, చెవులుగా; కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తున్నాయి' - థామస్ రీడ్
* 'శాసనాల సామర్థ్యం, విలువలు పార్లమెంటరీ కమిటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి'. - మారిస్ జోన్స్
* 'ఆధునిక కాలంలో శాసన కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయి' - ఉడ్రో విల్సన్.

కమిటీల లక్షణాలు
* పార్లమెంటరీ కమిటీలకు పుట్టినిల్లు బ్రిటన్.
* మంత్రులు కమిటీల్లో సభ్యులుగా ఉండకూడదు.
* కమిటీ తన నివేదికను స్పీకర్ లేదా ఛైర్మన్‌కు సమర్పిస్తుంది.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఏ కమిటీలో సభ్యులుగా ఉంటారో వారే ఆ కమిటీలకు ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు.
* కమిటీ సమావేశాల నిర్వహణకు కావల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరం) 1/3వ వంతు.
* సంయుక్త పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్లను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు.
* కమిటీల్లోని సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం.
* సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లోని సభ్యుల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభల నుంచి 2 : 1 పద్ధతిలో ఉంటుంది.
* 1997లో రాజ్యసభ నుంచి, 2004లో లోక్‌సభ నుంచి నైతిక విలువల కమిటీలు ఏర్పడి పని చేస్తున్నాయి.
కమిటీలు 2 రకాలు
1. స్థాయి కమిటీలు (Standing Committees)
2. తాత్కాలిక కమిటీలు (Adhoc Committees)

స్థాయి కమిటీలు
* ఇవి ప్రతి సంవత్సరం లేదా సమయానుకూలంగా ఆయా సభల ద్వారా ఎన్నికై నిరంతరంగా పని చేస్తుంటాయి. ఈ కమిటీల్లో సభ్యులు మాత్రం మారుతూ ఉంటారు.
తాత్కాలిక కమిటీలు
* అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా సభల తీర్మానాల ద్వారా వీటిని సభాధ్యక్షులు ఏర్పాటు చేస్తారు. ఇవి తమ నివేదికలను సమర్పించగానే రద్దు అవుతాయి.


కీలకమైన పార్లమెంటరీ కమిటీలు 
ప్రభుత్వ ఖాతాల సంఘం (Public Accounts Committee) 
* ఇది పార్లమెంటరీ కమిటీల్లో ప్రాచీనమైంది.
* దీన్ని 1919 మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం సిఫారసుల మేరకు 1921లో ఏర్పాటు చేశారు.
* దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 22. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* ఈ కమిటీ ఛైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు. కమిటీ తన నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుంది.
* 1967 నుంచి ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపక్షాలకు చెందినవారిని నియమించడం ఒక సంప్రదాయంగా మారింది.


విధులు
* కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించడం.
* పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉందో, లేదో పరిశీలించడం.
* ఖాతాల్లో చూపిన వ్యయం చట్టబద్ధంగా ఉద్దేశించిన అంశాల కోసం ఖర్చుపెట్టారా లేదా అని పరిశీలించడం.
* కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రభుత్వ ఖాతాల సంఘంకు మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగాను పనిచేస్తుంది.
* కాగ్ నివేదికను ప్రభుత్వ ఖాతాల సంఘం పరిశీలించి అవకతవకలుంటే బాధ్యులపై చర్యలకోసం సిఫారసు చేస్తుంది.
* ప్రభుత్వ ఖాతాల సంఘంను ముఖ్యమైన ఆర్థిక కమిటీగా పేర్కొంటారు.


అంచనాల సంఘం (Estimates Committee)
* జాన్ ముత్తాయ్ కమిటీ సిఫారసుల మేరకు 1950లో అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ఈ కమిటీలోని మొత్తం 30 మంది సభ్యులను లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు.
* ఈ కమిటీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు పాటించే పద్ధతులను సూచిస్తుంది.
* దీన్ని నిరంతర పొదుపు కమిటీ అంటారు.
* పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
* ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘాలను పార్లమెంటు కవలలుగా పేర్కొంటారు.

 

ప్రభుత్వరంగ సంస్థల సంఘం (Committee on Public Undertakings)
* ప్రభుత్వరంగ సంస్థలపై పార్లమెంటులో లంకా సుందరం అనే సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కృష్ణమీనన్ కమిటీని ఏర్పాటు చేసింది.
* కృష్ణమీనన్ కమిటీ సిఫారసుల మేరకు 1964లో 'ప్రభుత్వరంగ సంస్థల సంఘాన్ని' ఏర్పాటు చేశారు.
* 1974 వరకు ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉండేవారు.
* 1974 నుంచి దీనిలోని సభ్యుల సంఖ్యను 22కు పెంచారు. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థలైన BHEL, BALCO, IOC, LIC లాంటివి సమర్థంగా పనిచేయడానికి అవసరమైన సూచనలు చేస్తుంది.
* ప్రభుత్వరంగ సంస్థల నివేదికను, ఖాతాలను పరిశీలిస్తుంది.
* ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి 'కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్' (CAG) నివేదికను పరిశీలిస్తుంది.
* ఇది కూడా కీలకమైన ఆర్థిక కమిటీ.

 

సాధారణ కమిటీలు

సభా వ్యవహారాల కమిటీ (Business Advisory Committee)
* లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఈ కమిటీలు ఉంటాయి.
* ఈ కమిటీలకు ఆయా సభాధ్యక్షులే అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
* లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీలో 15, రాజ్యసభ సభావ్యవహారాల కమిటీలో 11 మంది సభ్యులుంటారు.
* ఈ కమిటీల్లో సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులను సభ్యులుగా ఎంపిక చేస్తారు.
* సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తూ అందుకు అవసరమైన చర్యలను చేపడుతుంది. ఇది ఎజెండాను తయారు చేస్తుంది.


ప్రభుత్వ హామీల కమిటీ (Committee on Government Assurance)
* లోక్‌సభ, రాజ్యసభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీలు ఏర్పాటవుతాయి.
* లోక్‌సభ కమిటీలో 15, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులుంటారు.
* ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లుల, తీర్మానాల మీద చర్చలు జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాల హామీలు ఇస్తుంటారు. ఈ హామీల అమలు లాంటి విషయాలను కమిటీ పరిశీలిస్తుంది.


ప్రైవేట్ అర్జీల బిల్లుల కమిటీ
* ఇది లోక్‌సభకే ఉద్దేశించిన కమిటీ. ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 15. దీనికి డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లులకు సంబంధించిన అంశాలను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడం ఈ కమిటీ ప్రధాన విధి.
దత్త శాసనాల కమిటీ (Committee on Delegated Legislation)
* దీన్నే నియోజిత శాసనాల కమిటీ అంటారు.
* ఈ కమిటీ ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు.
* ఈ కమిటీని 'పార్లమెంటు విధుల రక్షణ కర్త'గా జి.వి.మౌలాంకర్ పేర్కొన్నారు.
* పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్దతను పరిశీలించడం, గతంలో రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేలా చూడటం ఈ కమిటీ ప్రధాన విధి.
సభాహక్కుల కమిటీ (Committee on Privilege of Members)
* ఈ కమిటీలు లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఉంటాయి.
* లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు.
* ఈ కమిటీ పార్లమెంటు సభ్యుల హక్కులు, హోదాలను పరిరక్షిస్తుంది.
* దీనికి అర్ధన్యాయ సంబంధమైన (Quasi Judicial) విధులు ఉంటాయి.
షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిటీ
* ఈ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తుంది.
* జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల నివేదికలను పరిశీలిస్తుంది.
మహిళా సాధికారతా కమిటీ (Committee on Empowerment of Women)
* దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* మహిళలకు రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరును పర్యవేక్షించి, తన నివేదికను రూపొందిస్తుంది.
* మహిళల సమగ్ర ప్రగతి కోసం జాతీయ మహిళా కమిషన్ సమర్పించిన నివేదికలను పరిశీలించి, సిఫారసులు చేస్తుంది.
* మహిళా సాధికారిత, సమానత్వం కోసం చేపట్టే కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
* ఈ కమిటీని 1997లో ఏర్పాటు చేశారు.
ఎథిక్స్ కమిటీ (Committee on Ethics)
* ఎథిక్స్ కమిటీ రాజ్యసభలో 1997, లోక్‌సభలో 2004లో ఏర్పడింది.
* సభలో సభ్యుల ప్రవర్తన, పనితీరు, సభా విలువలు లాంటి అంశాలపై సూచనలు ఇస్తుంది.
జీతభత్యాల కమిటీ
* దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 15. వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* పార్లమెంటు సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తుంది.
లైబ్రరీ కమిటీ
* ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 9. వీరిలో లోక్‌సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తారు.
* పార్లమెంటు సభ్యులకు లైబ్రరీ సదుపాయాల కల్పనపై సిఫారసు చేస్తుంది.

సాధారణ అవసరాల కమిటీ
* దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15 మంది. స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* పార్లమెంటు సభ్యులకు సమావేశాల సందర్భంగా కల్పించాల్సిన వసతుల గురించి ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.
లాభదాయక పదవుల కమిటీ (Committee on Office of Profit)
* దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15, వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
* లాభదాయక పదవులు, సభ్యుల అనర్హతలు లాంటి అంశాలను పరిశీలిస్తుంది.
డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలు
* లోక్‌సభ రూల్స్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు 1993లో 17 డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. 2004లో వీటి సంఖ్యను 24కు పెంచారు. ప్రతి కమిటీలోనూ 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 20 మంది లోక్‌సభ, మిగిలిన 11 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.
* ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు. ఈ కమిటీల సభ్యులను ఆయా సభాధ్యక్షులు నామినేట్ చేస్తారు. ఈ కమిటీల పదవీ కాలం ఒక సంవత్సరం.
* 16 కమిటీలు లోక్‌సభ, 8 కమిటీలు రాజ్యసభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
జాయింట్ పార్లమెంటరీ కమిటీలు (JPC)
* సమకాలీన సమస్యలు, ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను విచారించేందుకు పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన సంయుక్త కమిటీలను ఏర్పాటు చేస్తారు.
* ఉభయసభల తీర్మానాల ద్వారా లేదా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ల పరస్పర అవగాహన ద్వారా జేపీసీలను ఏర్పాటు చేయవచ్చు.
* సుమారు 15 నుంచి 30 మందిని సభ్యులుగా తీసుకోవచ్చు. అధికార పక్ష సభ్యుడికి అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం ఆనవాయితీగా ఉంది.
ఇప్పటి వరకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీలు
1. బోఫోర్స్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు 1987, ఆగస్టు 6న శంకరానంద్ (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ, తన నివేదికను 1998, ఏప్రిల్ 26న ఇచ్చింది. ఈ నివేదికను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి.
2. స్టాక్ మార్కెట్ కుంభకోణం (హర్షద్ మెహతా కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 1992, ఆగస్టు 6న రాంనివాస్ మిర్థా (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 1993, డిసెంబరు 21న సమర్పించింది.
3. స్టాక్ మార్కెట్ కుంభకోణం (కేతన్ పరేఖ్ కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 2001, ఏప్రిల్ 26న ప్రకాష్‌మణి త్రిపాఠీ (బీజేపీ) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2002 డిసెంబరు 19న సమర్పించింది.
4. శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలపై అధ్యయనం చేసేందుకు శరద్ పవార్ (ఎన్‌సీపీ) అధ్యక్షతన 2003, ఆగస్టు 8న ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2004, ఫిబ్రవరి 4న సమర్పించింది.
* శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు ఉండటం నిజమేనని పేర్కొంది. దీని సిఫారసుల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఏర్పడింది.
5. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు పి.సి. చాకో (కాంగ్రెస్) అధ్యక్షతన 2011, మార్చి 1న ఏర్పడిన ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 30 మంది.


పార్లమెంటరీ పారిభాషిక పదాలు
     పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో వివిధ చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ లాంటి పద్ధతులు ఉంటాయి. పార్లమెంటులో ప్రయోగించే ఈ పదాలకు ప్రత్యేక అర్థం ఉంటుంది. వీటిని మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. అవి:
కోరం
* పార్లమెంటు సమావేశాలు జరగడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. లోక్‌సభ, రాజ్యసభల్లో సభాధ్యక్షులతో కలిపి కోరం 1/10వ వంతు. ప్రస్తుతం లోక్‌సభలో కోరం 55 మంది సభ్యులుకాగా, రాజ్యసభలో 25 మంది.

క్రాసింగ్
* ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడు మరొక ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని 'క్రాసింగ్' అంటారు.
కార్పెట్ క్రాసింగ్
* అధికార పార్టీకి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని 'కార్పెట్ క్రాసింగ్' అంటారు.
ఫ్లోర్ క్రాసింగ్
* ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికారపక్ష పార్టీలోకి మారడాన్ని 'ఫ్లోర్ క్రాసింగ్' అంటారు.
కార్పెట్ బెగ్గర్
* ఒక స్థానికేతర అభ్యర్థి, స్థానిక అభ్యర్థిపై ఎన్నికల్లో పోటీచేసి ఎన్నిక కావాలని కోరుకోవడాన్ని 'కార్పెట్‌బెగ్గర్' అంటారు.
ఎజెండా
* సభలో చర్చించాల్సిన కార్యక్రమాల పట్టికను 'ఎజెండా' అంటారు. సభా వ్యవహారాల సలహా కమిటీ ఎజెండాను నిర్ణయిస్తుంది. సభా కార్యక్రమాలను ఎజెండా ప్రకారమే నిర్వహిస్తారు.
ఎగ్జిట్ పోల్
* సాధరణ ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్ల మనోభావాలను, అభిప్రాయాలు తెలుసుకుని ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడాన్ని 'ఎగ్జిట్‌పోల్‌'గా పేర్కొంటారు.
గ్యాలప్ పోల్:
* సాధారణ ఎన్నికల కంటే ముందే ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రాధాన్యత వహిస్తాయో పరిశీలించి, ఆయా అంశాల పట్ల ప్రజల మనోభావాలను ముఖాముఖి ద్వారా తెలుసుకుని ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడాన్ని 'గ్యాలప్ పోల్' అంటారు. అమెరికాకు చెందిన గ్యాలప్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.
రెఫరెండం
* ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడమే 'రెఫరెండం'. ఫ్రాన్స్‌లో తొలిసారిగా నెపోలియన్ రెఫరెండం నిర్వహించారు. ప్రస్తుతం దీన్ని స్విట్జర్లాండ్‌లో ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ప్లెబిసైట్ (ప్రజానిర్ణయ సేకరణ)
* ప్రభుత్య చట్టాల్లో లేదా రాజ్యాంగంలో సవరణలు చేసే సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించే ప్రక్రియనే 'ప్లెబిసైట్‌'గా పేర్కొంటారు. ఈ విధానం స్విట్జర్లాండ్‌లో ఉంది.
రీకాల్ (పునరాయనం)
* అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు అసమర్థులుగా లేదా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా, వారి పదవీ కాలం ముగియడానికి ముందే పదవి నుంచి తొలగించడానికి వారిని వెనుక్కు పిలుస్తారు. ఆ స్థానంలో నూతన ప్రతినిధులను ఎన్నుకుంటారు.
* ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న స్విట్జర్లాండ్‌లో రీకాల్ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తారు.
జీరో అవర్ (శూన్యకాలం)
* ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, ఎజెండా కార్యక్రమాల కంటే ముందు ఉండే సమయమే 'జీరో అవర్'. ఇది భారత పార్లమెంటరీ సంప్రదాయంలో నూతనంగా అవతరించిన ఒరవడి. 'జీరో అవర్‌'కు నిర్దిష్ట సమయం ఉండదు.
* 1962లో 'జీరో అవర్‌'ను సృష్టించారు. దీన్ని 1964 నుంచి క్రియాశీలకంగా వినియోగిస్తున్నారు. ఏ విధమైన ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ప్రశ్నలు అడగవచ్చు.
సంకీర్ణ ప్రభుత్వం: (Coalition Govenment)
* రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్నే 'సంకీర్ణ ప్రభుత్వం' అంటారు.


జాతీయ ప్రభుత్వం
* 1991, మే 21న రాజీవ్ గాంధీ హత్యానంతరం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఆనాటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ప్రతిపాదించారు.
* దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి, తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననే 'జాతీయ ప్రభుత్వం'గా పేర్కొంటారు.


ప్రశ్నోత్తరాల సమయం (Question Hour)
* పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిరోజు మొదటి గంటను ప్రశ్నోత్తరాలకు కేటాయిస్తారు. సభాధ్యక్షులకు సభ్యులు నోటీసు ఇచ్చి వివిధ అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. సంబంధిత మంత్రులు వీటికి సమాధానం చెబుతారు. ఈ ప్రశ్నలు 3 రకాలు అవి:
1. నక్షత్రపు గుర్తున్న ప్రశ్నలు (Stared Questions)
* నక్షత్రపు గుర్తున్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు మౌఖిక సమాధానాలు ఇస్తారు. ప్రశ్నల ప్రాధాన్యాన్ని బట్టి సభాధ్యక్షులు నక్షత్రపు గుర్తులు ఇస్తారు. నక్షత్రపు గుర్తున్న ప్రశ్నల సమయంలో సభ్యులు అనుబంధపు ప్రశ్నలను కూడా అడగవచ్చు.
2. నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలు (Un-stared Questions)
* నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలకు సంబంధిత మంత్రులు లిఖిత పూర్వక (Written) సమాధానాలు ఇస్తారు. ఈ ప్రశ్నల సమయంలో సభ్యులు అనుబంధపు ప్రశ్నలను అడిగే వీల్లేదు.
3. స్వల్ప వ్యవధి ప్రశ్నలు (Short Duration Questions)
* అత్యవసర ప్రజాప్రాముఖ్యం ఉన్న విషయమై సభ్యులు అడిగే మౌఖిక ప్రశ్నలను స్వల్పవ్యవధి ప్రశ్నలు అంటారు.


విశ్వాస తీర్మానం (Motion of Confidence)
* లోక్‌సభలో విశ్వాసం ఉన్నంత మేరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో రాష్ట్రపతి నియమించే ప్రధాని, మంత్రిమండలి నిర్ణీత గడువులోగా లోక్‌సభలో తమ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి.
* ఈ తీర్మానం వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
* ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన తొలి ప్రధాని చరణ్‌సింగ్.
* ఈ తీర్మానం ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని వి.పి. సింగ్. కాగా, రెండో ప్రధాని హెచ్.డి. దేవెగౌడ.

 

అవిశ్వాస తీర్మానం (No confidence motion)
* ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం.
* ఈ తీర్మానాన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణాన్ని చూపాల్సిన అవసరం లేదు.
* కనీసం 50 మంది సభ్యులు తీర్మాన నోటీసుపై సంతకాలు చేయాలి. మరో 50 మంది సభ్యులు తీర్మానానికి మద్దతును ప్రకటించాలి.
* అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. 2 అవిశ్వాస తీర్మానాల మధ్య వ్యత్యాసం 6 నెలలు.
* 'రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ - 1950' చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.
* మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.
* అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ.
* అత్యధికంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధాని ఇందిరా గాంధీ.


అభిశంసన తీర్మానం (Censure Motion)
* ప్రభుత్వంలోని ఒక మంత్రి లేదా కొందరు మంత్రులు లేదా మొత్తం ప్రభుత్వంపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు.
* ఈ తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
* ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తప్పనిసరిగా కారణం చూపాలి. 10 మంది సభ్యుల మద్దతు ఉండాలి.
* సభాహక్కుల్ని ఉల్లంఘించినప్పుడు, సభకు తప్పుడు సమాచారం అందించినప్పుడు, సంబంధింత మంత్రుల శాఖల్లో అవకతవకలు జరిగినప్పుడు ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి.
* ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం లేదా మంత్రులు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అది వారి నైతికతపైనే ఆధాపరడి ఉంటుంది.

 

ఆర్డినెన్స్
* కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్, 123 ప్రకారం; రాష్ట్రాల శాసన సభలు సమావేశంలో లేనప్పుడు గవర్నర్ ఆర్టికల్, 213 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు.
* ఈ ఆర్డినెన్స్‌కు సాధారణ శాసనాలకు ఉన్నంత విలువ ఉంటుంది.
* ఈ ఆర్డినెన్స్ గరిష్ఠ జీవిత కాలం 7నెలలు.


ఆపద్ధర్మ ప్రభుత్వం (Care Taker Government) 

గెర్రీ మాండరింగ్
* అధికార పార్టీ సభ్యులు తమ విజయావకాశాలను మెరుగు పరచుకునేందుకు నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌పై ఒత్తిడి తీసుకువచ్చి నియోజక వర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియను 'గెర్రీ మాండరింగ్' అంటారు.
విప్ (Whip)
     విప్ అంటే ఆదేశం అని అర్థం. ఒక రాజకీయ పార్టీ పార్లమెంటు లేదా శాసనసభలో తమ సభ్యులు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ జారీచేసే ఆదేశాన్నే 'విప్' అంటారు.
* 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రూపొందించిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అన్వయింపు అంశమే విప్.
* 'విప్‌'ను ధిక్కరించిన సభ్యులపై 15 రోజుల్లోగా సభాధిపతికి ఫిర్యాదు చేయాలి. 'విప్‌'ను ధిక్కరించిన వారి సభ్యత్వాలను సభాధిపతులు రద్దు చేయగలరు.
* లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌లకు 'విప్' మినహాయింపు ఉంటుంది.
* అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు పరిపాలనా బాధ్యతలను కొనసాగించడానికి అదే ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే వరకు అధికారంలో కొనసాగమని రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరడం.
* ఆపద్ధర్మ ప్రభుత్వం విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకోరాదు.
హంగ్ పార్లమెంట్
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ లభించని పక్షంలో ఏర్పడే పరిస్థితిని 'హంగ్ పార్లమెంట్' లేదా 'త్రిశంకు సభ' అంటారు.
* శాసనసభ ఎన్నికల్లో ఈ పరిస్థితి వచ్చినప్పుడు 'హంగ్ అసెంబ్లీ' అంటారు.


ఇంత వరకు మనదేశంలో ఏర్పడిన హంగ్ పార్లమెంట్‌లు

1 9వ లోక్‌సభ/ పార్లమెంట్ 1989
2 10వ లోక్‌సభ/ పార్లమెంట్ 1991
3 11వ లోక్‌సభ/ పార్లమెంట్ 1996
4 12వ లోక్‌సభ/ పార్లమెంట్ 1998
5 13వ లోక్‌సభ/ పార్లమెంట్ 1999
6 14వ లోక్‌సభ/ పార్లమెంట్ 2004
7 15వ లోక్‌సభ/ పార్లమెంట్ 2009


వాయిదా తీర్మానం:
* ప్రజాప్రాముఖ్యం ఉన్న ఏదైనా అంశంపై చర్చించేందుకు 'ఎజెండా'లోని కార్యక్రమాలను వాయిదా కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే 'వాయిదా తీర్మానం'.
* వాయిదా తీర్మాన నోటీసుపై కనీసం 10 మంది సభ్యులు సంతకాలు చేయాలి. దీన్ని అనుమతించాలా? లేదా? అనేది సభాధ్యక్షుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
వాయిదా (అడ్జర్న్) (తాత్కాలిక వాయిదా)
* పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయడాన్నే 'అడ్జర్న్' అంటారు.
* సభాధిపతి సభను వాయిదా వేసినప్పుడు తిరిగి సమావేశాలు ఏ తేదీ, ఏ సమయంలో జరుగుతాయనేది ముందుగానే తెలియజేస్తూ సభను వాయిదా వేస్తారు.
అర్ధంతర వాయిదా (సైనిడై)
* జరుగుతున్న సమావేశాల తర్వాత తేదీని లేదా సమయాన్ని ప్రకటించకుండా అర్ధంతరంగా వాయిదా వేయడాన్నే 'సైనిడై' అంటారు.
రద్దు (డిసాల్వ్)
   లోక్‌సభ పదవీకాలం పూర్తయినా లేదా రాజకీయ అనిశ్చిత పరిస్థితి ఉన్న సమయంలో ఆర్టికల్, 85 ప్రకారం రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయడాన్ని 'రద్దు' అంటారు.
దీర్ఘకాలిక వాయిదా (ప్రోరోగ్)
   పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి పార్లమెంటును, గవర్నర్ శాసనసభను దీర్ఘకాలిక వాయిదా వేయడాన్ని 'దీర్ఘకాలిక వాయిదా' అంటారు.
సమావేశాల ప్రారంభం (సమ్మన్స్)
    రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని, గవర్నర్ శాసనసభ సమావేశాలను ప్రారంభించడాన్ని 'సమ్మన్స్' అంటారు.
మెయిడ్ ఇన్ స్పీచ్
* పార్లమెంటుకు లేదా శాసనసభకు మొదటిసారి ఎన్నికైన సభ్యుడు సభలో చేసిన తొలి ప్రసంగాన్ని 'మెయిడ్ ఇన్ స్పీచ్' అంటారు.
అర్ధగంట చర్చ
* పార్లమెంటు సమావేశం ముగింపు దశలో అంటే ఆ రోజు సమావేశాన్ని ముగించడానికి 'చివరి అర్ధగంటను' అర్ధగంట చర్చకు కేటాయిస్తారు.
* ప్రశ్నోత్తరాల సమయంలో తగిన ప్రాధాన్యం లేని అంశాలను చర్చించేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
* లోక్‌సభలో సోమ, బుధ, శుక్ర వారాల్లో; రాజ్యసభలో ప్రతిరోజు అర్ధగంట చర్చ ఉంటుంది.


గిలెటిన్ ఓటింగ్ (ముజువాణి ఓటు)
   పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాల ముగింపు దశలో వివిధ బిల్లులపై సమగ్రమైన చర్చ జరిపేందుకు తగిన సమయం లేని సందర్భంలో ఎలాంటి చర్చ లేకుండానే తక్కువ సమయంలో ఎక్కువ బిల్లులను మూకుమ్మడిగా ఆమోదించడాన్ని 'గిలెటిన్' (ముజువాణి ఓటు) అంటారు.
ఓట్ ఆన్ అకౌంట్ (ఆర్టికల్, 116)
* ఎన్నికల సమయంలో లేదా దేశం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వీలులేనప్పుడు రెండు నెలల కాలపరిమితితో ప్రభుత్వం ప్రవేశపెట్టే తాత్కాతిక బడ్జెట్‌నే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు.
* సాధారణ బడ్జెట్ మొత్తం అంచనా వ్యయంలో 1/6వ వంతుకు సమానంగా అంటే రెండు నెలలకు సరిపడే గ్రాంటుగా ఓట్ ఆన్ అకౌంట్‌లో ఇస్తారు. తర్వాత దీన్ని పూర్తిస్థాయి బడ్జెట్‌లో విలీనం చేస్తారు.


ఇతర ముఖ్యాంశాలు
* 162 దేశాలు సభ్యత్వం ఉన్న 'ఇంటర్ పార్లమెంటరీ యూనియన్' 1889లో ఏర్పాటైంది. దీని 57వ సమావేశం 1969లో న్యూదిల్లీలో జరిగింది. దీనికి అప్పటి లోక్‌సభ స్పీకర్ జి.ఎస్. థిల్లాన్ అధ్యక్షత వహించారు.
* 1993లో న్యూదిల్లీలో జరిగిన 89వ సమావేశానికి స్పీకర్ శివరాజ్‌పాటిల్, 1997లో న్యూదిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశానికి స్పీకర్ పి.ఎ. సంగ్మా అధ్యక్షత వహించారు.
* 3వ లోక్‌సభ కాలంలో సర్దార్ హుకుంసింగ్ స్పీకర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కాలంలో 1963లో తొలిసారిగా నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈయన కాలంలోనే అత్యధికంగా 6 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
* తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అనంతశయనం అయ్యంగార్ రెండు సార్లు స్పీకర్‌గా వ్యవహరించారు.
* రాజ్యసభ సభ్యురాలిగా ఉండి, ఒక్కసారి కూడా రాజ్యసభకు హాజరు కాని మహిళ లతామంగేష్కర్.
* 14వ లోక్‌సభ కాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ మరణించిన మాజీప్రధాని చంద్రశేఖర్.
14వ లోక్‌సభ కాలంలో మరణించిన మాజీ రాష్ట్రపతులు: 1. కె.ఆర్. నారాయణన్
                                               2. ఆర్. వెంకట్రామన్
14వ లోక్‌సభ కాలంలో మరణించిన మాజీ ప్రధానులు  1. పి.వి. నరసింహారావు
                                              2. వి.పి. సింగ్
                                              3. చంద్రశేఖర్
* మనదేశంలో ఒకే పేరుతో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాలు
1. హమీర్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్)
2. హమీర్‌పూర్ (ఉత్తర్‌ప్రదేశ్)

ఉత్తమ పార్లమెంటేరియన్లు
* 1993 నుంచి ప్రతి సంవత్సరం ఒక పార్లమెంటు సభ్యుడికి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారాల కమిటీకి 'లోక్‌సభ స్పీకర్' అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* 1993లో మొదటి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 'ఇంద్రజిత్ గుప్తా' అందుకున్నారు.
* ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న ఏకైక భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (1997).
* ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న ఏకైక లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ (1996).
* ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న ఏకైక మహిళ సుష్మా స్వరాజ్ (2004).
* 1952 - 1957 నాటి మొదటి లోక్‌సభ కాలంలో 333 బిల్లులు ఆమోదించారు, 2009 - 2014 మధ్య 15వ లోక్‌సభ కాలంలో కేవలం 165 బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి.
* మనదేశ పార్లమెంటరీ చరిత్రలో 15వ లోక్‌సభ కాలంలో అధికారపక్ష సభ్యులే 2014, మార్చి 4న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
* లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 10 సార్లు లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తి పి.ఎం. సయీద్.
* మొదటి లోక్‌సభలో కేవలం 5% (22 మంది) మహిళలు ఎన్నికయ్యారు. 16వ లోక్‌సభలో 11.42% (63 మంది) మహిళలు ఎన్నికయ్యారు.

Posted Date : 12-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌