• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ శీతోష్ణస్థితి

భారతదేశ శీతోష్ణస్థితిని ఆయనరేఖ (ఉష్ణమండల), ఉప ఆయనరేఖ (ఉష్ణమండల) రుతుపవన మండల శీతోష్ణస్థితిగా పేర్కొనవచ్చు. కర్కాటక రేఖ, ఆయనరేఖ దేశం మధ్యగా తూర్పు పడమరలుగా పోతున్నందువల్ల దేశంలో సగభాగం ఉష్ణమండల ప్రాంతం (దక్షిణ భారతదేశం)లో, మిగిలిన సగభాగం ఉప ఉష్ణమండల ప్రాంతం (ఉత్తర భారతదేశం)లో ఉంది. 
   దక్షిణ భారతదేశం భూమధ్యరేఖ, కర్కాటక రేఖల మధ్య ఉండటంతో ఉష్ణోగ్రతపరంగా ఈ ప్రాంత శీతోష్ణస్థితిని 'ఉష్ణమండల శీతోష్ణస్థితి' అని పిలుస్తారు. 
   ఉత్తర భారతదేశం కర్కాటక రేఖకు ఉత్తర దిశలో ఉండటంతో ఉష్ణోగ్రత పరంగా ఈ ప్రాంత శీతోష్ణస్థితిని 'ఉపఉష్ణమండల లేదా సమశీతోష్ణమండల శీతోష్ణస్థితి' అంటారు. 
   భారతదేశంలో మొత్తం వర్షపాతంలో దాదాపు 80 - 90 శాతం రుతుపవనాల వల్ల సంభవించడంతో దేశ శీతోష్ణస్థితిని వర్షపాతపరంగా 'రుతుపవన శీతోష్ణస్థితి'గా పిలవవచ్చు. 
   దక్షిణ భారతదేశం ద్వీపకల్పంగా, ఉత్తర భూభాగం ఖండాంతర్గతంగా ఉండటం, ఉత్తరాన హిమాలయాలు ఆవరించి ఉండటంతో దేశంలో ఒక విశిష్ట శీతోష్ణస్థితి నెలకొని ఉంది. 

       ఖండాంతర్గత భాగంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వేసవికాలంలో ఎక్కువ వేడిగా, శీతాకాలంలో ఎక్కువ చలిగా ఉంటుంది. వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసం, దైనిక ఉష్ణోగ్రతా వ్యత్యాసం అధికంగా ఉండే ఖండాంతర్గత శీతోష్ణస్థితి ఇక్కడ ఉంది. దీనికి విరుద్ధంగా ద్వీపకల్ప ప్రాంతమైన దక్షిణాది రాష్ట్రాల్లో సంవత్సరం పొడవునా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండి, వేసవి-శీతాకాలాల మధ్య ఉష్ణోగ్రతా వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర ప్రభావమే ఈ తక్కువ వ్యత్యాసానికి కారణం. 
       భారత వాతావరణ అధ్యయన విభాగం (Meteorogical Department) భారతదేశ శీతోష్ణస్థితిని నాలుగు రుతువులుగా విభజించింది. అవి:
  1) శీతాకాలం లేదా చల్లటి వాతావరణ రుతువు (డిసెంబర్-జనవరి-ఫిబ్రవరి)
  2) వేసవికాలం లేదా ఉష్ణవాతావరణ రుతువు (మార్చి-ఏప్రిల్-మే)
  3) నైరుతి రుతుపవన కాలం (జూన్-జులై-ఆగస్టు-సెప్టెంబర్)
  4) తిరోగమన నైరుతి రుతుపవన కాలం (అక్టోబర్-నవంబర్)


భారతదేశ సంప్రదాయ రుతువులు
భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, మధ్యభారత్‌లో కింది ఆరు రుతువులను పాటిస్తారు. కానీ, ఈ రుతువుల విభజనను దక్షిణ భారతదేశంలో ఎక్కువ పాటించరు. దీనికి కారణం, దక్షిణ భారతదేశంలో రుతువుల కాలంలో వ్యత్యాసం ఎక్కువగా ఉండకపోవడమే.

 

శీతాకాల రుతువు:
         శీతాకాలం డిసెంబర్‌లో ప్రారంభమై జనవరి మొదటివారం నాటికి అత్యల్ప ఉష్ణోగ్రతా స్థితికి చేరుకుంటుంది. జనవరి నెలలో ఉష్ణోగ్రత ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి పోయే కొద్దీ పెరుగుతుంది. ఈ రుతువులో వాయువ్య భారతదేశపు శీతల మైదానాల్లో అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ అధికపీడన ప్రదేశం నుంచి భూమధ్య రేఖా అల్పపీడన మండలాలకు వాయువులు వీస్తాయి. గాలి తక్కువ వేగంతో వీచడం. వాతావరణంలో అల్ప ఆర్ద్రత, దైనిక ఉష్ణోగ్రతా వ్యత్యాసం ఎక్కువగా ఉండటం ఈ రుతువు లక్షణాలు. ఈ కాలంలో మధ్యదరా సముద్రంపై ఏర్పడిన వాయుగుండాలు ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌ల మీదుగా పంజాబ్ మైదానాల్లోకి వస్తాయి. ఈ వాయుగుండాలు భారతదేశం వైపు ప్రయాణించడంలో పశ్చిమ జెట్ ప్రవాహాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ అలజడులు ఉత్తర భారతదేశంలో కొద్దిగా వర్షాన్నిస్తాయి. వీటి మూలంగా వచ్చే వర్షపాతం గోధుమ, బార్లీ పంటలకు ఉపయోగపడుతుంది.

వేసవి రుతువు: 
         ఈ రుతువులో మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు పెరిగి అధికంగా ఉంటాయి. ఈ కాలంలో సూర్యకిరణాలు భారతదేశంలో చాలా భాగం నిటారుగా ఉండటంవల్ల అధిక వేడిని కలిగిస్తాయి. ఈ రుతువులో రాత్రి, పగటి ఉష్ణోగ్రతల వ్యత్యాసం అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో ఈ తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. మార్చి నెలలో దక్కన్ పీఠభూమిలో 39oC, ఏప్రిల్‌లో గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో 38oC నుంచి 48oC వరకూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భారతదేశ వాయువ్య ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. వేసవిలో అల్పపీడన ఆకర్షణవల్ల అరేబియా సముద్రం నుంచి వాయువ్య పవనాలు, బెంగాల్‌తీరం నుంచి దక్షిణపు గాలులు ఉత్తర భారతదేశాన్ని చేరడంవల్ల అలజడులతో కూడిన తుపాన్లు సంభవిస్తాయి. ఈ పవనాల్లో తేమ ఉండటంతో వర్షపుజల్లులు విస్తారంగా కురుస్తాయి. వేసవికాలంలో ఉరుములు, తుపాన్లు, వడగళ్లతోకూడిన జల్లులు పడతాయి. 
         ఉత్తరప్రదేశ్‌లో వేసవిలో సంభవించే అలజడులతో కూడిన తుపాన్లను 'ఆంధీలు' అంటారు. పశ్చిమబెంగాల్‌లో కురిసే తుపాన్లను 'కాలభైశాఖీలు' అని పిలుస్తారు. కాలభైశాఖీలనే 'నార్వెస్టర్లు' అని కూడా అంటారు. నార్వెస్టర్లు చోటానాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఆవిర్భవించే పశ్చిమ పవనాల వల్ల తూర్పు దిశగా ప్రయాణిస్తాయి. వీటివల్ల అసోంలో 50 సెం.మీ. పశ్చిమబెంగాల్, ఒరిస్సాల్లో 10 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షపాతం వరి, జనుము పంటలకు ఎంతో తోడ్పడుతుంది. వేసవిలో దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక తీరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురుస్తుంది. ఈ అలజడుల వల్ల ఆ రాష్ట్రాల తీరాల్లో దాదాపు 25 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది. దక్కన్ పీఠభూమి ఖండాంతర్గత ప్రాంతాల్లో ఈ జల్లుల వల్ల వర్షపాతం 10 సెం.మీ. ఉంటుంది. వేసవిలో కురిసే జల్లులను కర్ణాటకలో 'చెర్రీ బ్లాసోమ్స్' అంటారు. కర్ణాటకలోని కాఫీ పంటకు ఈ జల్లులు మేలు చేస్తూ ఉండటంతో వీటికా పేరు వచ్చింది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మామిడి పంటకు ఈ జల్లులు ఉపయుక్తంగా ఉండటంతో వీటిని 'మ్యాంగో షవర్స్' అని కూడా పిలుస్తారు.
        మే, జూన్‌లలో దేశ వాయువ్య, ఉత్తర మైదాన ప్రాంతాల్లో వచ్చే వేడి శుష్క గాలులను 'లూ' అని వ్యవహరిస్తారు. ఈ గాలులు దేశ ఉత్తర ప్రాంతాల్లో జీవనాన్ని దుర్భరం చేస్తాయి. ఈ గాలులు ఉద్భిజ్జ సంపదకు ప్రాణాంతకంగా పరిణమించడమే కాకుండా ఉన్న కొద్దిపాటి తేమను కూడా హరిస్తాయి.


నైరుతి రుతుపవన కాలం:
         జూన్ నెలారంభం నాటికి భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఈ అల్పపీడన ప్రాంతంలోకి హిందూ మహాసముద్రం మీద ఉన్న అధిక పీడన ప్రదేశం నుంచి వాయువులు వీచడం ప్రారంభిస్తాయి. 
         నైరుతి రుతుపవనాలు భారతదేశాన్ని జూన్ మొదటివారంలో చేరుకుంటాయి. మనదేశ వర్షపాతంలో 90 శాతం వీటి వల్లే సంభవిస్తుంది. ఇవి భారతదేశ దక్షిణకొనకు చేరిన తరువాత రెండుగా విభజితమై అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖలుగా ప్రయాణిస్తాయి. మే 20 నాటికి అండమాన్ నికోబార్ దీవులను, జూన్ 1 నాటికి (మొదటివారం) కేరళ తీరాన్ని (మలబార్) రుతుపవనాలు తాకుతాయి. ఈ నైరుతి రుతుపవనాలు ప్రవేశించగానే భారతదేశ పశ్చిమ తీరంలో, పడమటి కనుమల పవనాభిముఖ వాలులో వర్షాలు ఉద్ధృతంగా, పవన పరాన్ముఖ ప్రాంతంలో ఉన్న వర్షాచ్ఛాయ ప్రాంతంలో వర్షం స్వల్పంగా కురుస్తుంది. ఈ అరేబియా శాఖ పశ్చిమ తీర ప్రాంతం వైపు వేగంగా పయనించి జూన్ 10 నాటికి ముంబయి చేరుకుంటుంది. ఈ అరేబియా శాఖ క్రమంగా గుజరాత్ పశ్చిమ ప్రాంతం ద్వారా పశ్చిమ రాజస్థాన్ చేరి స్వల్ప వర్షపాతాన్ని కలిగిస్తుంది. రాజస్థాన్ ప్రాంతంలో ఆరావళీ పర్వాతాలు రుతుపవనాలు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో వర్షపాతం ఉండదు.
       బంగాళాఖాతం శాఖ రుతుపవనాలు బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి భారత్ - మయన్మార్ సరిహద్దులో ఉన్న అరకాన్‌యోమా పర్వతాలు అడ్డం రావడంతో తమ దిశను పశ్చిమం వైపు మార్చుకుని ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్‌ల మీదుగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లలోని గంగా సింధు మైదానాన్ని దాటి పంజాబ్‌కు చేరుకుంటాయి. ఈ శాఖ వల్ల ఈశాన్య రాష్ట్రాల నుంచి పంజాబ్ వరకు వర్షపాతం సంభవిస్తుంది. అయితే వర్షపాతం ఈశాన్య ప్రాంతాల్లో అధికంగా ఉండి, పశ్చిమానికి పోయేకొద్దీ తగ్గిపోతుంది. తమిళనాడు కోస్తాతీరం తప్ప మిగిలిన తూర్పు తీరం అంతా ఈ శాఖ వల్లనే వర్షపాతం సంభవిస్తుంది. క్రమంగా బంగాళాఖాతం శాఖ అరేబియా శాఖలు రెండూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతంలో కలుస్తాయి. ఈ విధంగా జూన్ చివరి నాటికల్లా రుతుపవనాలు భారతదేశంలోని అత్యధిక భాగాన్ని ఆక్రమిస్తాయి. జూలై 15 తేదీకల్లా ఇవి కాశ్మీర్‌సహా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా చేరుకుంటాయి. వీటి కారణంగా పశ్చిమ కోస్తా ప్రాంతంలో, ఈశాన్య రాష్ట్రాల్లో (అసోం, మేఘాలయ, మణిపూర్ ఇతర రాష్ట్రాలు) అధికంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తర మైదాన ప్రాంతాల్లో వర్షపాతం 100-200 సెం.మీ. మధ్యలో ఉంటుంది. ఈ వర్షపాతం తీర ప్రాంతాల నుంచి ఖండాతర్గత ప్రాంతాలవైపు వెళ్లేకొద్దీ తగ్గుతుంది. ఉదాహరణకు కోల్‌కతాలో 119 సెం.మీ. పాట్నాలో 105 సెం.మీ. అలహాబాద్‌లో 76 సెం.మీ. ఢిల్లీలో 56 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది. నైరుతీ రుతుపవనాల వల్ల వచ్చే వర్షపాతం సముద్రాల్లో సంభవించే ఆయనరేఖా చక్రవాతాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.

నైరుతీ రుతుపవనాల తిరోగమన కాలం:
         ఉత్తర భారతదేశంలోని గంగా మైదానంలో ఏర్పడి ఉన్న అల్పపీడన ద్రోణి అక్టోబర్ మధ్యకాలం నాటికి క్రమంగా బంగాళాఖాతం ప్రాంతాలకు పోతుంది. దీని ప్రభావానికి లోనై తిరోగమించే రుతుపవనాలు ఈశాన్య దిశ నుంచి ద్వీపకల్ప ప్రాంతానికి వీస్తూ ఉంటాయి. ఈ పవనాలు చాలా బలహీనంగా ఉండి, కొద్ది వర్షపాతాన్ని తూర్పుతీర ప్రాంతాలకు ఇస్తాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు తూర్పుతీర ప్రాంతాలకు వర్షాన్ని కలిగిస్తాయి.

ఈ కాలంలో సంభవించే తుపాన్లు ఈశాన్య దిశ నుంచి నైరుతీ దిశకు ప్రయాణించి తమిళనాడుకు చేరతాయి. ఈ కారణంగానే తమిళనాడు కోస్తా తీరంలో అధిక వర్షపాతం ఉంటుంది. ఈ పవనాలు కొంత దూరం బంగాళాఖాతం మీదుగా పయనిస్తున్నందువల్ల కొంత తేమను గ్రహిస్తాయి. ఈ తేమతో ఉన్న పవనాల వల్ల తమిళనాడు ఆగ్నేయ ప్రాంతంలో అధిక వర్షాలు కురుస్తున్నాయి.

Posted Date : 13-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌