• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ చరిత్ర

మౌర్యానంతర భారతదేశం

కుషాణులు

పార్థియన్ల అనంతరం వాయవ్య భారతదేశాన్ని కుషాణులు ఆక్రమించారు. మౌర్యులు, గుప్తుల మధ్యకాలంలో వీరు ఉత్తర భారతదేశంలో పెద్ద రాజ్యాన్ని నిర్మించారు. వీరిని యూచీ, తోచారియన్లు అని పిలుస్తారు.

వీరు మధ్యాసియా, చైనాకు దగ్గరగా ఉన్న గడ్డిమైదానాలకు చెందిన సంచార జాతివారు. కానీ వీరు ఏ జాతికి చెందినవారనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. 

ఎఫ్‌.డబ్ల్యూ.థామస్, స్టేన్‌కోనో అనే చరిత్రకారుల ప్రకారం కుషాణులు ఇరానీయులు, కల్హణుడు వీరిని తురుష్కులని పేర్కొన్నాడు. చైనీస్‌ ఆధారాలను బట్టి యూచీ తెగకు చెందినవారు. శరీర నిర్మాణం ఆధారంగా వారి జన్మస్థానం ‘టర్కిస్థాన్‌’ అని  మరికొందరు భావించారు. 

పాన్‌-కు రాసిన ‘మొదటి హాన్‌ రాజ వంశ చరిత్ర’, పాన్‌-ఎ రాసిన ‘తదనంతర హాన్‌ వంశ చరిత్ర’ ఆధారంగా కుషాణులు మంగోల్‌ జాతికి చెందిన వారని పేర్కొన్నారు. వీరి స్వస్థలం బాక్ట్రియాలోని తాషియా ప్రాంతం.

వీరు మొదట బాక్ట్రియాను ఆక్రమించారు. అనంతరం కాబూల్, గాంధారల్లోనూ తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. 

వీరి సామ్రాజ్యం ఆక్సాస్‌ నది నుంచి గంగా నది వరకు, మధ్య ఆసియాలోని ఖోరాసాన్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి వరకు విస్తరించింది. ఆసియాలోని రష్యా, ఇరాన్, ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ల్లో కొంతభాగాన్ని పాలించారు. దీంతో ఆ ప్రాంతాల్లో కొత్త సంస్కృతి వర్ధిల్లింది. విడిపోయిన రాజ్యాలను ఏకంచేసి పాలించిన రాజు కుజలాఖాడ్‌ పైసిస్‌ లేదా మొదటి కాడ్‌ పైసిస్‌. వీరి గురించి పాన్‌-ఇ రాసిన రచనలు తెలియజేస్తున్నాయి.

కనిష్కుడు 

కనిష్కుడి పాలనాకాలం విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇతడు క్రీ.పూ.58లో విక్రమ శకం ప్రారంభించాడని కన్నింగ్‌హాం అభిప్రాయపడ్డాడు. ఈ వాదనను ఫీట్, కెనడీలు బలపరిచారు. మార్షల్, స్టెన్‌కోనో, వి.ఎ.స్మిత్‌ల ప్రకారం ఇతడి పరిపాలన కాలం క్రీ.శ.125-128 మధ్య జరిగిందని భావించారు. వీరికి భిన్నంగా ఆర్‌.డి.బెనర్జీ, ఫెర్గూసన్, రాప్సన్, రాయ్‌చౌదరి లాంటి చరిత్రకారులు కనిష్కుడు క్రీ.శ.78లో పాలన మొదలుపెట్టి, క్రీ.శ.102 వరకు పరిపాలించాడని వాదించారు. ఇతడి శాసనాలు, నాణేల ఆధారంగా ఈ వాదనను చరిత్రకారులు అమోదించారు. 

దండయాత్రలు: కనిష్కుడు గొప్ప విజేత, పాలనాధ్యక్షుడు, బౌద్ధమతాభిమాని. ఇతడిలో చంద్రగుప్తుడి పరాక్రమం, అశోకుడి మతావేశం ఉండేదని ఆచార్య ఘోష్‌ పేర్కొన్నాడు. పుట్టుకతోనే విదేశీయుడైనా, ఆచార వ్యవహారాల్లో భారతీయుడని, ఈ దేశాన్ని తల్లిలా భావించాడని అభిప్రాయపడ్డాడు.

ఇతడి రాజధాని పురుషపురం లేదా పెషావర్‌. దీన్ని రాజ్యానికి వచ్చిన మొదట్లో జయించాడు. కల్హణుడి రాజతరంగిణి ప్రకారం కనిష్కుడు కశ్మీర్‌ను జయించాడు. 

దీనికి గుర్తుగా కనిష్కపురం అనే నగరాన్ని నిర్మించాడు. అనంతరం మగధపై దండెత్తి, పాటలీపుత్రాన్ని ఆక్రమించాడు. అక్కడి నుంచి అశ్వఘోషుడనే బౌద్ధ ఆచార్యుడిని తన ఆస్థానానికి తీసుకువచ్చాడని పలు గ్రంథాల వల్ల తెలుస్తోంది.

చైనా సేనాధిపతి పాంచావోను ఓడించి వారి నుండి కాష్‌గర్, యార్ఖండ్, ఖోటాన్‌ ప్రాంతాలను ఆక్రమించాడు. చైనాకు చెల్లించే కప్పం నిలిపివేశారు. తమకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా పాంచావో పామీర్‌ పీఠభూమి వద్ద కనిష్కుడిని ఓడించాడు.

కనిష్కుడు శకుల పాలనలో ఉన్న ఉజ్జయినిపై దాడిచేసి దాని పాలకుడైన చెష్టనుడిని ఓడించి మాళ్వా ప్రాంతాన్ని ఆక్రమించాడు అని టాలెమీ పేర్కొన్నాడు. ఇతడు బెంగాల్‌లోని రాజ్‌మహల్‌ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడని బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. 

ఇతడి సామ్రాజ్యంలో ఆఫ్గానిస్థాన్, ఖోటాన్, కాస్గర్, యార్ఖండ్‌లతో పాటు భారతదేశంలో గాంధార, పంజాబ్, సింధు, మాళ్వా, కశ్మీర్, మగధలో కొంత భాగం ఉండేది. 

ఖోటాన్‌ నుంచి దక్షిణాన ఉన్న వింధ్య పర్వతాల వరకు, వాయవ్యంలో ఉన్న బాక్ట్రియా నుంచి తూర్పున ఉన్న మగధ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. 

ఈ విజయాల వల్లే ఇతడు దేవపుత్ర, సీజర్‌ అనే బిరుదులు పొందాడు.

పాలన: కనిష్కుడి శాసనాలు అలహాబాద్, సారనాథ్, మధుర, భగత్‌పూర్, రావల్పిండిలో లభించాయి.

ఈ శాసనాలు, నాణేలు, పాళీ భాషలో రాసిన మిలిందపన్హా, బౌద్ధ సాహిత్యం కనిష్కుడి పాలన గురించి తెలుపుతున్నాయి. 

సారనాథ్‌ శాసనం ద్వారా ఇతడు తన పరిపాలనలో శకులు అనుసరించిన క్షాత్రపి విధానాన్ని పాటించాడని తెలుస్తుంది. 

కుషాణుల కాలంలో పెషావర్‌ రాజధాని కాగా, తక్షశిల కూడా ఒక ప్రధాన పాలనా కేంద్రంగా ఉండేది.

కుషాణ రాజులు నిరంకుశులు. బౌద్ధసాహిత్యం ద్వారా ‘సభ’ అనేది రాజుకు సహాయపడేది. సభ సభ్యుడిని తులక అని అనేవారు. రాజామాత్య అనే సహాయకుడు కూడా ఉండేవాడు.

వీరికి మహారాజాధిరాజ, రాజాధిరాజ అనే బిరుదులు ఉండేవి. గ్రీకు, ఇరాన్‌ భాషల్లో షహన్‌షా అనే అర్థం వచ్చే బిరుదులు పొందారు. విమలాఖాడ్‌ పైసిస్‌ సర్వలోకేశ్వర, మహేశ్వర అనే బిరుదులు పొందగా, కనిష్కుడు దేవపుత్ర, సీజర్‌ అనే బిరుదులు పొందాడు. వీరి కాలంలో రాజు దైవాంశ సంభూతుడనే సిద్ధాంతం ఉండేదని తెలుస్తుంది.

కనిష్కుడు పాలనను వికేంద్రీకరించి పరిపాలించాడు. సాత్రపీలు, అమాత్యులు, సేనాపతులు పాలనలో సహాయం అందించేవారు. రాధాకమల్‌ ముఖర్జీ ప్రకారం క్షాత్రపులు గవర్నర్లుగా, మహాక్షాత్రపులు స్వతంత్ర పాలకులుగా వ్యవహరించారు. వీరికి నాణేలు ముద్రించే అధికారం ఉండేది. మంత్రిమండలి లేదు కానీ సందర్భానుసారం అధికారుల సలహాలు తీసుకునేవారు. 

రాజ్యాన్ని రాష్ట్రాలు, ఆహారాలు, జనపదాలు, విషయాలుగా విభజించారు. విషయాలను దేశం అని కూడా పిలిచేవారు.

* సరిహద్దు ప్రాంతాలను సైనికాధికారులు పాలించగా, దండనాయకుడు పోలీసు విధులను నిర్వహించేవారు. కింది స్థాయిలో పరిపాలన గ్రామిక లేదా పద్రపాల అనే స్థానికులు చేపట్టారు.

బౌద్ధమతం-సేవ: పాటలీపుత్రానికి చెందిన అశ్వఘోషుడనే బౌద్ధపండితుడి బºధనలతో కనిష్కుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. 

* మొదట్లో హిందూ మతాభిమాని. శివుడిని, సూర్యుడిని, అగ్నిని ఆరాధించేవాడు. అనంతరం బౌద్ధమతం స్వీకరించి రెండో అశోకుడిగా పేరు పొందాడు. మతవ్యాప్తికి కృషి చేశాడు. 

* తన రాజ్యంలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు నిర్మించాడు. 

* బౌద్ధ మత వ్యాప్తికి కశ్యప, మాతంగులను టిబెట్, చైనా, జపాన్, మధ్య ఆసియా దేశాలకు పంపించాడు. 

* బౌద్ధం గొప్పతనాన్ని తెలపడానికి, మత ప్రచారాన్ని క్రమపరిచేందుకు నాలుగో బౌద్ధ సంగీతిని నిర్వహించాడు.

* ఇది కశ్మీర్‌లోని కుందనవనంలో జరిగింది. కానీ మరికొందరు చరిత్రకారులు పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిందని వాదించారు.

విమలాఖాడ్‌ పైసిస్‌

* ఆర్‌కే ముఖర్జీ, రాయ్‌చౌదరి అభిప్రాయం ప్రకారం ఇతడు క్రీ.శ. 65-75 మధ్య రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు రెండో కుషాణ రాజు, గొప్పయోధుడు. పంజాబ్, మధుర ప్రాంతాలతో పాటు బెనారస్‌ను జయించాడు. రాగి, కంచు నాణేలను ముద్రించి ఒకవైపు శివుడి ప్రతిమ, మరోవైపు తన బిరుదులను ముద్రించాడు. ఈయన శైవమతాన్ని స్వీకరించాడు. చైనా చక్రవర్తి పాంచావోతో జరిగిన యుద్ధంలో ఓడి, అతడితో సంధి చేసుకున్నాడు.

* వి.ఎ. స్మిత్‌ అనే చరిత్రకారుడి ప్రకారం విమలాఖాడ్‌ పాంచావో ఖోటాన్, కాష్నర్‌ రాజులను ఓడించి రోమ్‌ సామ్రాజ్య సరిహద్దు వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇతడు రోమ్‌ చక్రవర్తి ఆస్థానానికి తన రాయబారిని పంపించి వాణిజ్య సంబంధాలను నెలకొ ల్పాడు. భారత్‌లోని సుగంధ ద్రవ్యాలు, పట్టువస్త్రాలు, వజ్రాలకు రోమ్‌లో మంచి డిమాండ్‌ ఉండేది. వీటిని అక్కడికి తరలించి రోమన్ల బంగారు నాణేలు ఇక్కడికి తెచ్చేవారని ప్లినీ అనే చరిత్రకారుడు రాశాడు.

కుజలఖాడ్‌ పైసిస్‌

కుజలఖాడ్‌ పైసిస్‌ బాక్ట్రియా ప్రాంతంలోని పార్థియ, ఖహాసు, పుటా తెగలను అణచివేసి కాబూల్‌ను జయించాడు. క్రీ.శ. 45 నాటికి స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు. రాగి నాణేలు ముద్రించి, హిందూకుష్‌ పర్వతాలకు దక్షిణంగా ఉన్న ప్రాంతాల్లో విడుదల చేశాడు. దీంతో గ్రీకుపాలకుడైన హెర్మానస్‌తో ఇతడికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఇతడికి మొదట్లో కుమార అనే బిరుదు ఉండేది. తక్షశిలను జయించిన తరువాత మహారాజా, రాజాధిరాజ, దేవపుత్ర అనే బిరుదులు పొందాడు. గాంధారను జయించి కుషాణ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. కొన్ని నాణేలపై ఆసీనుడైన బుద్ధుడి ప్రతిమ, ‘ధర్మతిద, సచ్ఛ ధర్మతధ’, అనే నామాలున్నాయి. వీటి ఆధారంగా ఇతడు బౌద్ధ మతస్థుడని చరిత్రకారుల భావన. కానీ పలువురు అది బుద్ధుడి ప్రతిమ కాదని శివుడిదని పేర్కొన్నారు.

మాదిరి ప్రశ్నలు

1. శుంగవంశ స్థాపకుడు ఎవరు? 

1) పుష్యమిత్ర శుంగుడు    

2) అగ్నిమిత్రుడు    

3) బృహద్రధుడు

4) ఖారవేలుడు

2. మాళవికాగ్నిమిత్రం గ్రంథ రచయిత ఎవరు?

1) వసుమిత్రుడు     2) కాళిదాసు    

3) బాణుడు              4) జైమిని

3. హాథిగుంఫా శాసనాన్ని వేయించినవారు?    

1) అశోకుడు        2) కనిష్కుడు        

3) ఖారవేలుడు     4) పుష్యమిత్రుడు

4. మహావిభాష్యం గ్రంథ రచయిత ఎవరు?    

1) పుష్యమిత్రుడు  

2) అగ్నిమిత్రుడు 

3) పతంజలి

4) వజ్రమిత్రుడు

5. నాలుగో బౌద్ధసంగీతికి అధ్యక్షత వహించిన వారెవరు? 

1) అగ్రిమిత్రుడు       2) దేవభూతి

3) కనిష్కుడు           4) వసుమిత్రుడు

6. మిలిందపన్హా గ్రంథం ఏ మతానికి చెందింది?

1) జైన          2) హిందూ

3) బౌద్ధ         4) అజీవక

7. సెయింట్‌ థామస్‌ భారత్‌కు ఎవరి కాలంలో వచ్చాడు?

1) గండోఫెర్నిస్‌       2) కనిష్కుడు    

3) రుద్రదాముడు    4) అశోకుడు

8. కుషాణులు ఏ తెగకు చెందినవారు?

1) బుంచి     2) యూచీ 

3) కోయ       4) ఇరాయిన్‌

9. కనిష్కుడి బిరుదు ఏమిటి?

1) కాలాశోక            2) రెండో అశోక

3) మూడో అశోక    4) భారత అశోక


10. రాజతరంగిణి గ్రంథ రచయిత ఎవరు?

1) బిల్హణుడు           2) కాళిదాసు     

3) వసుమిత్రుడు    4) కల్హణుడు


11. దేవపుత్ర, సీజర్‌ అనే బిరుదులు పొందిన రాజు ఎవరు?

1) అశోకుడు     2) కనిష్కుడు    

3 హర్షుడు     4) చంద్రగుప్తుడు


12. కనిష్కుడు ఎవరి బోధనలతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు?

1) నాగసేన            2) అశ్వఘోషుడు    

3) ఉపగుప్తుడు       4) కశ్యప


13. నాలుగో బౌద్ధసంగీతి ఎక్కడ నిర్వహించారు?

1) పాటలీపుత్రం        2) బిహార్‌    

3) వైశాలి                   4) కశ్మీర్‌


14. రఘువంశం, మేఘ సందేశం గ్రంథాల రచయిత ఎవరు?

1) భవభూతి          2) వాసుదేవుడు    

3) కౌటిల్యుడు       4) కాళిదాసు


15. మహావంశం, దీప వంశం అనే గ్రంథాలు ఏ మతానికి చెందినవి?

1) హిందూ        2) జైన     

3) బౌద్ధ             4) అజీవక


16. నాణేలపై ‘ధర్మతిద, సచ్ఛ ధర్మతధ’ అనే నామాలను వేయించిన వారెవరు?

1) కనిష్కుడు                      2) కుజలఖాడ్‌ పైసిస్‌     

3) విమలాఖాడ్‌ పైసిస్‌       4) ఖారవేలుడు

Posted Date : 24-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌