• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ చరిత్ర

గుప్తయుగం

* క్రీ.శ.4 నుంచి 5వ శతాబ్దం వరకు గుప్తులు భారతదేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. వీరు హిందూమతాభిమానులు.

* వీరి పాలనా విధానాన్ని చరిత్రకారులు రోమ్‌ పాలకుడైన ‘అగస్టన్‌’, గ్రీక్‌ రాజు ‘పెరిక్లిజ్‌’, ఇంగ్లండ్‌ రాణి ‘ఎలిజబెత్‌’తో పోల్చారు.  

చారిత్రక ఆధారాలు

గుప్తుల చరిత్రకు సంబంధించిన అనేక పురావస్తు, సాహిత్య ఆధారాలు, శాసనాలు చరిత్రకారులకు లభించాయి. సముద్రగుప్తుడి ‘అలహాబాద్‌ శాసనం’; రెండో చంద్రగుప్తుడి ఉదయగిరి, మధుర, సాంచి, గద్వా శాసనాలు; మొదటి కుమారగుప్తుడి దామోదరవూరు రాగిశాసనం, భిస్లా, మాండసోర్‌ శాసనాలు; స్కంధగుప్తుడి శాసనాలు; బుధగుప్తుడి శాసనాలు వీరి చరిత్రకు ఆధారాలు.

* గుప్తరాజులు బంగారు, వెండి, రాగి నాణేలను జారీ చేశారు. ఇవి ఆనాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితులు తెలుపుతున్నాయి. 

ఉదా: మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవుడు విడుదల చేసిన నాణేలు; కచుడి పేరుపై జారీ చేసిన నాణేలు; సముద్రగుప్తుడు నాణేలపై విల్లంబులు, గొడ్డలి, అశ్వమేధ, పులివేట, వీణవాయిస్తున్న బొమ్మలను చెక్కించాడు. ఇవి వారి ఆర్థిక విజయాలు, సాంకేతిక విజ్ఞానాన్ని తెలుపుతున్నాయి. 

* గుప్తుల కాలంలో నిర్మించిన దేవాలయాలు, వారు ఉపయోగించిన ముద్రికలు, అజంతా - ఎల్లోరా గుహల్లోని చిత్రాలు అప్పటి వాస్తు శిల్పం, చిత్రలేఖనం మొదలైన విషయాలను వివరిస్తున్నాయి.

మత్స్య, వాయు, విష్ణు పురాణాలు గుప్తుల వంశావళిని, పాలనను తెలుపుతున్నాయి. కామాందకుడి నీతిసారం; శూద్రకుడి మృచ్ఛకటికం; విశాఖదత్తుడి ముద్రారాక్షసం, దేవిచంద్రగుప్తం; కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, రుతుసంహారం, రఘువంశం మొదలైన గ్రంథాలు గుప్తుల చరిత్రకు సాక్ష్యాలు. 

* చైనా యాత్రికుడు ఫాహియాన్‌ రచించిన ‘బౌద్ధ రాజ్యాల చరిత్ర’, బాణుడి ‘హర్షచరితం’గుప్తుల చరిత్రకు ప్రధాన ఆధారాలు.

తొలిపాలకులు 

* గుప్తవంశ స్థాపకుడు ‘శ్రీగుప్తుడు’. ఇతడు ప్రయాగ సమీపంలోని చిన్న రాజ్యానికి పాలకుడని కొందరు పేర్కొంటే, పాటలీపుత్ర పాలకుడని మరికొందరు చరిత్రకారుల వాదన.

* ఇతడి అధికారం మగధ (బిహార్‌), బెంగాల్‌ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. 

* ఇతడు క్రీ.శ. 4వ శతాబ్దంలో రాజ్యపాలన చేసినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది.

* శ్రీగుప్తుడికి ‘మహారాజ’ అనే బిరుదు ఉంది. 

* ఇతడు చైనా యాత్రికుల కోసం ఒక ఆలయాన్ని నిర్మించి, దాని ఖర్చుల కోసం 24 గ్రామాలు దానం చేసినట్లు ‘ఇత్సింగ్‌’ తన రచనల్లో పేర్కొన్నాడు. 

* ఇతడి కుమారుడు ‘ఘటోత్కచ గుప్తుడు’. ఇతడికీ ‘మహారాజ’ అనే బిరుదు ఉంది. ఇతడి కుమారుడు మొదటి చంద్రగుప్తుడు.


సముద్రగుప్తుడు (క్రీ.శ. 335- 380)

మొదటి చంద్రగుప్తుడు మరణించాక సింహాసనం కోసం వారసుల మధ్య పోరాటాలు జరిగాయి. వీటిలో సముద్రగుప్తుడు తన అన్న ‘కచ’ని ఓడించి రాజయ్యాడు. 

* ‘అలహాబాద్‌’ శాసనంలో చంద్రగుప్తుడే సముద్రగుప్తుడ్ని రాజుగా ప్రకటించినట్లు ఉంది. కొందరు చరిత్రకారులు కచ అనేది రాజు పేరు, ‘సముద్రగుప్తుడు’ అతడి బిరుదు అని పేర్కొన్నారు.

* సముద్రగుప్తుడి సేనాని ‘హరిసేనుడు’. ఇతడు అలహాబాద్‌ ప్రశస్తి (అలహాబాద్‌ శాసనం) శాసనాన్ని వేయించాడు. అందులో సముద్రగుప్తుడి సైనిక విజయాలు, సమకాలీన పరిస్థితుల గురించి ఉన్నాయి. 

* అలహాబాద్‌ శాసనంలో సముద్రగుప్తుడి విజయాలను నాలుగు భాగాలుగా పేర్కొన్నారు. మొదటి భాగంలో 12 మంది దక్షిణాపథ రాజులను ఓడించి వారికి స్వేచ్ఛనిచ్చినట్లు ఉంది. రెండో భాగంలో ఆర్యావర్తానికి చెందిన 8 మంది రాజులను వధించినట్లు; మూడో భాగంలో 9 గిరిజన గణతంత్ర రాజ్యాలను ఓడించినట్లు; నాలుగో భాగంలో దైవపుత్ర షహానుషాలు, శాకామురుందలు, సింహళ, ఇతర ద్వీపాల రాజులను ఓడించినట్లు ఉంది.

* బ్రిటిష్‌ చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్‌ సముద్రగుప్తుడ్ని ‘ఇండియన్‌ నెపోలియన్‌’గా పేర్కొన్నాడు.


సముద్రగుప్తుడి దండయాత్రలు

మొదటి ఆర్యావర్త దండయాత్ర: 

* సముద్రగుప్తుడు రాజయ్యాక తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఉత్తరభారతదేశంలోని రాజ్యాలపై దండెత్తి, వాటిని ఆక్రమించుకున్నాడు. ఓడిపోయిన రాజులను తన సామంతులుగా చేసుకున్నాడు. 

మొదటి ఆర్యావర్త దండయాత్రలో అహిచ్ఛత్రాన్ని (రామ్‌నగర్‌) పాలించిన అచ్యుతను, పద్మావతిపుర రాజైన నాగసేనుడ్ని, మధుర పాలకుడు గణపతి నాగుడ్ని ఓడించాడు.

* అతడి సరిహద్దు రాజ్యాలైన సమతట (తూర్పు బెంగాల్‌), కామరూప (అసోం), నేపాల్, దావకం (అసోంలోని నవగార్‌), కర్తపురం (జలంధర్‌) మొదలైనవన్నీ సముద్రగుప్తుడి అధీనంలోకి వెళ్లాయి.


దక్షిణ భారతదేశ దండయాత్రలు: 

* సముద్రగుప్తుడు తన దక్షిణ భారతదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించాడు. వారు: కోసల (మధ్యప్రదేశ్‌) రాజైన మహేంద్రరాజు, మహాకాంతార (సంబల్‌పూర్, గోండ్వానా) పాలకుడు వ్యాఘ్రరాజు, ఎరండపల్లి (ఆముదాలవలస) రాజైన స్వామిదత్తుడు, విష్టపుర (పిఠాపురం) అధిపతి మహేంద్ర, కొత్తూరు (విశాఖపట్నం) పాలకుడు హస్తివర్మ, ఎలక్కడ (పులికాట్, నెల్లూరు) రాజు ఉగ్రసేనుడు, కేరాల (చందాజిల్లా - మధ్యప్రదేశ్‌) పాలకుడు ముంతరాజు, కుశస్థల (ఉత్తర ఆర్కాటు - తమిళనాడు) పాలకుడు ధనుంజయుడు, అవముక్తి  (వేంగి-కంచి మధ్యరాజ్యం) అధిపతి నీలరాజు, కంచి పాలకుడు విష్ణుగోపుడు.

ఫ్లీట్, స్మిత్‌ మొదలైన చరిత్రకారులు తమ రచనల్లో సముద్రగుప్తుడి దక్షిణభారతదేశ దండయాత్రల గురించి  వివరించారు. వీరి ప్రకారం, సముద్రగుప్తుడు తన రాజధాని పాటలీపుత్రం నుంచి తూర్పుతీరం మీదుగా కంచివరకు దండయాత్ర సాగించి, పశ్చిమతీరం వెంట తిరిగి  పాటలీపుత్రం చేరాడు. 

* డూబ్రెల్‌ అనే చరిత్రకారుడు తూర్పుతీరం నుంచి కంచివరకు దండయాత్ర చేసి తిరిగి అదే మార్గంలో పాటలీపుత్రం చేరినట్లు పేర్కొన్నాడు. 

* దక్షిణ భారతదేశ దండయాత్రలో ఇతడు సుమారు 3000 మైళ్లు ప్రయాణించాడని చరిత్రకారులు వ్యాఖ్యానించారు. ఈ యుద్ధాల ఫలితంగా సముద్రగుప్తుడు సాటిలేని యోధాను యోధుడిగా పేరొందాడు.

సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశ దండయాత్రల్లో ఉండగా, ఉత్తర భారతదేశంలోని మతిల, నాగదత్త, చంద్రవర్మ, గణపతినాగ, నాగసేన, అచ్యుత, నంది, బలవర్మ మొదలైన 9 మంది రాజులు, వాకాటకరాజు ‘రుద్రమదేవుడి’ (రుద్రసేన) నాయకత్వంలో కూటమిగా ఏర్పడి సముద్రగుప్తుడిపై దండెత్తారు. అతడు వారిని కౌశాంబి వద్ద ఓడించాడు. దీన్నే రెండో ఆర్యావర్త దండయాత్ర అంటారు. 

* దీంతో అతడి సామ్రాజ్యం ఉత్తర భారతంలోని గాంధార వరకు విస్తరించింది.


ఆటవిక రాజ్యాలతో దౌత్యం

* సముద్రగుప్తుడికి ఆటవిక రాజ్యాలు స్వయంగా విధేయత ప్రకటించాయి. అవి: సమతట (బెంగాల్‌), కామరూప, దావక (అసోం), నేపాల్, కీర్తి (హిమాలయ ప్రాంతం), పశ్చిమ పంజాబ్, శకులు. ఈ రాజ్యాలు సముద్రగుప్తుడితో దౌత్య సంబంధాలు పెంచుకుని, స్నేహం చేశాయి. 

* అతడు తన ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సుమారు 18 ఆటవిక రాజ్యాలను ఓడించి, ఆక్రమించాడు.

గణరాజ్యాలపై దండయాత్ర: ఆ సమయంలో వాయవ్య భారతదేశంలో అనేక గణతంత్ర రాజ్యాలు, నగర రాజ్యాలు ఉండేవి. అర్జునాయనులు, యౌధేయులు, మాద్రకులు, కాకులు మొదలైన గణరాజ్య పాలకులు సముద్రగుప్తుడికి కప్పం చెల్లిస్తూ, అతడి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు.

విదేశీ దండయాత్రలు

* ఉత్తర, దక్షిణ భారతదేశాలు తన అధీనంలోకి వచ్చాక సముద్రగుప్తుడు విదేశీ దండయాత్రలపై తన దృష్టి సారించాడు. ఆఫ్గనిస్థాన్, సిలోన్‌ పాలకులతో సముద్రగుప్తుడు స్నేహం చేశాడు.

*సింహళ రాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయను దర్శించడానికి వచ్చే శ్రీలంక యాత్రికుల కోసం ఒక విహారాన్ని నిర్మించాడు.

* వి.ఎ.స్మిత్‌ అభిప్రాయం ప్రకారం ఇతడి సామ్రాజ్యం ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నర్మద, పశ్చిమాన చంబల్‌ - యమున నదులు, తూర్పున బ్రహ్మపుత్ర నదుల మధ్య  విస్తరించింది.


మొదటి చంద్రగప్తుడు (క్రీ.శ.319  335) 

* మొదటి చంద్రగుప్తుడ్ని గుప్తసామ్రాజ్య నిర్మాతగా పేర్కొంటారు. ఇతడు లిచ్ఛవి రాకుమారి ‘కుమారదేవిని’ వివాహం చేసుకుని, ఆ రాజ్యంలో చాలా భాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.

* ఇతడు ‘బంగారు’ నాణేలు ముద్రించాడు. వాటిపై తనతో పాటు తన భార్య బొమ్మను, లిచ్ఛవుల పేర్లు ముద్రించాడు. 

* పురాణాల ప్రకారం చంద్రగుప్తుడి రాజ్యంలో సాకేత (అయోధ్య), ప్రయాగ, మగధ ఉండేవి. ఇతడికి ‘మహారాజాధిరాజా’ అనే బిరుదు ఉంది. 

* చంద్రగుప్తుడు క్రీ.శ.320 ఫిబ్రవరి 26న గుప్తశకాన్ని ప్రారంభించాడు. (కొందరు చరిత్రకారుల ప్రకారం క్రీ.శ.319 డిసెంబరులో గుప్తశకం ప్రారంభమైంది.)  

* వజ్జిక రచించిన ‘కౌముది మహోత్సవం’లో మగధ రాజ్యాన్ని ‘సుందరవర్మ’ పాలించినట్లు ఉంది. అందులో అతడు ‘చంద్రసేనుడనే’ వ్యక్తిని దత్తత తీసుకోగా, అతడు సుందర వర్మను వధించి రాజయ్యాడని; అతడే మొదటి చంద్రగుప్తుడని ఉంది.

రాజకీయ చరిత్ర - పుట్టుక

* గుప్తుల పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. 


కొంతమంది అభిప్రాయం ప్రకారం..

* ‘‘శుంగ, శాతవాహనుల శాసనాల్లో గుప్తుల ప్రస్తావన ఉంది. గుప్తులు ధరణి గోత్రికులు. శుంగ వంశస్తుడైన అగ్నిమిత్రుడి రాణి ధరణితో గుప్తులకు బంధుత్వం ఉంది. వారు బ్రాహ్మణ కులస్థులు’’ - హెచ్‌.సి.రాయ్‌ చౌదరి

‘‘గుప్తులు పంజాబ్‌లోని ‘జాట్‌’ తెగకు చెందినవారు. చంద్రగోమిన్‌ రచనల్లో ఈ ప్రస్తావన ఉంది.’’ - కె.పి.జైశ్వాల్‌ 

* ‘‘పంజాబ్‌లో లభించిన రాగి రేకుల శాసనాల్లో గుప్త అనేది రాజు ఇంటి పేరుగా ఉంది. వీరు క్షత్రియులు.’’ - డాక్టర్‌ ఎస్‌.ఛటోపాధ్యాయ

* ‘‘గుప్తులు రాజులు కాదు. వీరు తొలుత సంపన్న భూస్వాములుగా ఉండి, మగధ ప్రాంతంలో రాజకీయ ఆధిక్యత పొందారు.’’ - రోమిల్లా థాపర్‌

* ‘‘గుప్తులు ఉత్తర్‌ ప్రదేశ్‌లో కుషాణులకు సామంత రాజులుగా ఉన్నారు. వీరి పతనం తర్వాత గుప్తులు అధికారానికి వచ్చారు’’ - ఆర్‌.ఎస్‌. శర్మ

* గుప్తుల జన్మస్థలం బెంగాల్‌లోని ‘వరేంద్రి’ ప్రాంతం అని ఛటోపాధ్యాయ, ఆర్‌.సి.మజుందార్‌ అభిప్రాయపడగా, బెంగాల్‌లోని ‘ముర్షిదాబాద్‌’ జిల్లా అని డాక్టర్‌ గంగూలి పేర్కొన్నారు.

* గుప్తుల జన్మస్థలం మగధ ప్రాంతంలోని పాటలీపుత్ర పరిసరాలని జె.అలనీ తెలపగా, వీరు పూర్వీకులది ప్రయాగ సమీప ప్రాంతమని - కె.పి.జైశ్వాల్‌ అభిప్రాయపడ్డారు. 

* చాలామంది చరిత్రకారులు గుప్తులను వైశ్యులుగా పేర్కొన్నారు. 

* గుప్తులు అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో రాజకీయ అనైక్యత ఉంది. విదేశీ దండయా త్రలు జరిగేవి. స్వతంత్ర రాజ్యాలు, గణరాజ్యాలుగా పాలకులు విడిపోయారు. అనతికాలం లోనే గుప్తులు ఉత్తరాది రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. మధ్యభారతదేశంలో దొరికే ‘ఇనుము’ ద్వారా పటిష్టమై గంగా-సింధూ మైదానంపై అధికారం చలాయించారు.

Posted Date : 27-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌