• facebook
  • whatsapp
  • telegram

మగధ సామ్రాజ్యం

మగధ రాజ్యాన్ని బలమైన రాజవంశాలు పాలించాయి. ఇతిహాసయుగం (రామాయణ, మహాభారతం)లో మగధను పాలించిన తొలి పాలకుడు ‘బృహద్రధుడు’. ఈ వంశానికి చెందిన రాజుల్లో ‘జరాసంధుడు’ గొప్పవాడు. ఇతడు ‘గిరివ్రజం’ను రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇతడి వంశం క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి అంతమైంది. ఈ వంశంలో చివరి పాలకుడు ‘రిపుంజయుడు’.   

పురాణాల ప్రకారం- రిపుంజయుడ్ని చంపిన అతడి మంత్రి పులికుడు ‘ప్రద్యోత’ వంశాన్ని స్థాపించాడు. ప్రద్యోత వంశస్థులు సుమారు 138 సంవత్సరాలు పాలించగా, తర్వాత శిశునాగుల వంశ పాలన ప్రారంభమైంది. ఈ వంశంలోని 5వ పాలకుడు బింబిసారుడని పురాణాలు పేర్కొన్నాయి. 

వివిధ సాహిత్య గ్రంథాల్లో వేర్వేరు సమాచారం ఉండటం వల్ల వంశ కాలనిర్ణయంలో తేడాలున్నాయి. బౌద్ధ గ్రంథాల్లో మాత్రం రిపుంజయుడ్ని బింబిసారుడు చంపి హర్యాంక వంశాన్ని స్థాపించినట్లు ఉంది.

హర్యాంక వంశం

బింబిసారుడు (క్రీ.పూ.544-493): హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు. ఇతడు బుద్ధుడి సమకాలికుడు. గిరివ్రజాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. గొప్పయోధుడు, రాజనీతిజ్ఞుడు, సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఉన్నవాడు. 

 బింబిసారుడు వివాహ సంబంధాల ద్వారా రాజ్యవిస్తరణ చేశాడు. కోసల, వజ్జి, ముద్ర, విదేహ రాజ్యాలకు చెందిన రాజ కుటుంబీకులను పెళ్లిళ్లు చేసుకున్నాడు. 

 బింబిసారుడి మొదటి భార్య కోసల మహాదేవి. ఈమె కోసల రాజైన ప్రసేనజిత్తు సోదరి. ఈమెను వివాహం చేసుకోవడం ద్వారా లక్ష నాణేల ఆదాయం వచ్చే ‘కాశీ’ రాజ్యాన్ని వరకట్నంగా తీసుకున్నాడు.

 బింబిసారుడి రెండో భార్య చెల్లన. ఈమె వజ్జి రాజు చేటకుడి కుమార్తె. ఇతడు లిచ్చవి తెగకు చెందినవాడు. మూడో భార్య విదేహ రాకుమార్తె ‘వాసవి’; నాలుగో భార్య ముద్రరాజు కుమార్తె ‘ఖీమ’. మహావగ్గ అనే బౌద్ధ గ్రంథం బింబిసారుడికి 500 మంది భార్యలు ఉన్నట్లు పేర్కొంటోంది.

 బింబిసారుడు అంగ రాజ్యాన్ని జయించి, దానికి తన కుమారుడైన అజాతశత్రువును రాజప్రతినిధిగా నియమించాడు. 

 అవంతి పాలకుడు ‘చండప్రద్యోతనుడు (ప్రద్యోత)’ మొదట్లో బింబిసారుడికి శత్రువుగా ఉండి, చివరకు స్నేహితుడిగా మారాడు. 

 బింబిసారుడు అవంతి, గాంధార రాజ్యాలతో దౌత్య సంబంధాల ద్వారా మైత్రి చేసుకున్నాడు. ఈ విధంగా 80 వేల గ్రామాలతో ‘గిరివ్రజం’ (రాజ్‌గిర్‌) సామ్రాజ్యాన్ని పటిష్ఠం చేశాడు. 

 గిరివ్రజం చుట్టూ అయిదు కొండలు ఉన్నాయి. వాటి మధ్య ఉన్న దారులను రాతిగోడలతో మూయించాడు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. 

 క్రీ.పూ.493లో బింబిసారుడ్ని బంధించిన అతడి కుమారుడు అజాతశత్రువు సింహాసనాన్ని అధిష్టించాడు.

అజాతశత్రువు (క్రీ.పూ.492-460): ఇతడు గొప్ప విజేత, యుద్ధవీరుడు. వివాహ సంబంధాలు, యుద్ధాల ద్వారా రాజ్యవిస్తరణ చేశాడు. 

 కోసల మహాదేవి మరణించాక, ప్రసేనజిత్తు కాశీ రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని సాధించడానికి అజాతశత్రువు కోసలపై దండెత్తి, ఓడిపోయి బందీ అయ్యాడు. ఇద్దరి మధ్య కుదిరిన సంధి ద్వారా ప్రసేనజిత్తు తన కుమార్తె అయిన ‘వజీరా’ను అజాత శత్రువుకు ఇచ్చి వివాహం చేసి, కాశీని తిరిగి ఇచ్చాడు. 

 ఇతడు తూర్పు ప్రాంతంలోని 36 గణ రాజ్యాల కూటమిని (9 మల్ల గణాలు, 9 లిచ్ఛవి గణాలు, 18 కాశీ, కోసల గణాలు) జయించినట్లు జైనగ్రంథాల ద్వారా తెలుస్తోంది. 

 అజాతశత్రువు తన మంత్రయిన ‘వత్సకార’ సాయంతో ఈ రాజ్యాలన్నింటినీ జయించాడు. 

 ఆయా రాజ్యాలతో జరిగిన యుద్ధాల్లో మహాశీల కంటక (బరువైన రాళ్లను విసిరే యంత్రం), రథముసలం (రథానికి అమర్చిన బలమైన ఇనుప ఇరుసుకు, చుట్టూ కత్తులు ఉంటాయి) లాంటి ఆయుధాలు ఉపయోగించాడు. బాహుబలి సినిమాలో ఉపయోగించినవి ఈ తరహా పనిముట్లే.

 సింధు, అవంతి, వత్స, సైవీర రాకుమార్తెలను వివాహం చేసుకుని వైశాలి, కాశీ, కోసల రాజ్యాలను ఆక్రమించాడు. 

 జైన, బౌద్ధ మతాలను ఆదరించాడు. 

 రాజగృహంలో ‘దాతుచైత్య’మనే స్తూపాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో జరిగింది. 

 గంగా-సోన్‌ నదుల మధ్య ‘పాటలీపుత్రం’ అనే నగరాన్ని నిర్మించాడు. 

 ఇతడి తర్వాత ఉదయనుడు రాజయ్యాడు. 

చివరి రాజులు

 ఉదయనుడు క్రీ.పూ.460-444 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి  మార్చాడు. 

 ఉదయనుడు బౌద్ధ మతాభిమాని. ఇతడి తర్వాత వరుసగా అనిరుద్ధుడు, ముండరాజు, నాగదాసకుడు మగధను పాలించారు. 

 హర్యాంక వంశ చివరి రాజు ‘నాగదాసకుడు’. ఇతడు రాజ్యపాలనను సక్రమంగా నిర్వహించలేదు. దీంతో ప్రజల్లో ఇతడిపై వ్యతిరేకత ఏర్పడింది. ఆ సమయంలో నాగదాసకుడి మంత్రయిన ‘శిశునాగుడు’ తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. 

 హర్యాంక వంశస్థులంతా పితృహంతకులని బౌద్ధగ్రంథాలు పేర్కొన్నాయి.

మగధరాజ్య విజయానికి కారణాలు

 మగధను పాలించిన బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు మొదలైన రాజులందరికీ రాజ్యవిస్తరణ కాంక్ష ఉండేది. వీరు తమ రాజ్యాన్ని బలోపేతం చేయడానికి అన్నిరకాల పద్ధతులను అవలంబించారు.

 మగధ తొలి రాజధాని రాజగృహం (రాజ్‌గిర్‌) సమీపంలో ఇనుప నిక్షేపాలు ఉన్నాయి. దీంతో వీరు మెరుగైన ఆయుధాలు తయారు చేసి శత్రువులను అణచివేశారు.

వ్యవసాయానికి ఇనుప పనిముట్లను వాడారు. దీంతో అధిక ఉత్పత్తి పొంది, ఆర్థికంగా బలోపేతమయ్యారు.

 మగధ రాజధానులైన రాజగృహం, పాటలీపుత్రం భౌగోళికంగా కీలక ప్రాంతంలో ఉన్నాయి. రాజ్‌గిర్‌ అయిదు కొండల మధ్యలో ఉండగా, పాటలీపుత్రం గంగ, గండకి, సోన్‌ నదుల సంగమ స్థానంలో ఉంది. ఇది నిజమైన జలదుర్గం. వీటిని ఆక్రమించడం శత్రురాజ్యాలకు అసాధ్యంగా ఉండేది.

 మగధ రాజ్యం నదీ పరివాహక ప్రాంతంలో ఉండటం వల్ల జల రవాణా, వార్తా సౌకర్యాలకు అనుకూలంగా ఉండేది.

 పాటలీపుత్రం మధ్యగంగా మైదానంలో ఉంది. అక్కడి సారవంతమైన నేలలు, ఒండ్రుమట్టి, అధిక వర్షపాతం వల్ల ఆ ప్రాంతం అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలంగా ఉండేది. దీంతో రైతులు అధిక ఉత్పత్తి సాధించి, రాజుకు పన్నులు సక్రమంగా చెల్లించేవారు. అందువల్ల మగధ ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా మారింది.

 పట్టణాలు అభివృద్ధి చెందాయి. లోహ నాణేలు చలామణిలో ఉండేవి. వ్యాపార వృద్ధి జరిగింది. దీంతో మగధ రాజులు అధిక పన్నులు వసూలు చేసి, సైన్యాన్ని పోషించారు.

 మగధ సైనిక వ్యవస్థలో ఏనుగులు, గుర్రాలు, రథబలం పెద్దఎత్తున ఉండేవి. తూర్పు భారతదేశం నుంచి ఏనుగులను దిగుమతి చేసుకునేవారు. కోటలు పగలగొట్టడానికి, రవాణాకు, యుద్ధానికి ఇవి బాగా ఉపయోగపడ్డాయి. గ్రీకు చరిత్రకారుల అంచనా ప్రకారం నందరాజుల దగ్గర 6000 ఏనుగులు ఉండేవి.

 మగధ రాజరిక విధానంలో రాజే సర్వాధికారి. స్వయంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేయించడం వల్ల అభివృద్ధి వేగంగా జరిగింది.

 దక్షిణ బిహార్‌ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. అక్కడి నుంచి భవన నిర్మాణానికి అవసరమైన కలపను సేకరించేవారు.

 వేదకాలంలో ఇతర రాజ్యాల వారు మగధలోని ప్రజలను తక్కువ స్థాయిలో చూసేవారు. క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి వైదిక ప్రజలు మగధ వారితో కలిశారు. దీంతో ఆర్యేకరణ జరిగి, వైదిక మతం ప్రభావం తగ్గి కొత్తగా వచ్చిన రాజరిక వంశీయుల చేతుల్లోకి అధికారం వెళ్లింది. వీరు సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నారు.

 ఈ కారణాల వల్ల ఉత్తర భారతదేశంలోని చిన్న రాజ్యాలు, గణతంత్య్ర రాజ్యాలు క్రమంగా మగధ సామ్రాజ్యంలో కలిసిపోయాయి. పశ్చిమోత్తర భారతదేశంలో ఉన్న గాంధార, కాంభోజ, ముద్ర రాజ్యాలు ఆధిపత్యం కోసం తరచూ ఘర్షణలు పడేవి. హిందూకుష్‌ పర్వతాల్లోని కైబర్, బోలన్‌ కనుమల ద్వారా ఈ రాజ్యాలకు విదేశీయులు వచ్చేవారు. ఈ విధంగానే పర్షియా రాజైన మొదటి డేరియస్, గ్రీకు రాజైన అలెగ్జాండర్‌ మొదలైనవారు భారతదేశంపై దండెత్తి అనేక ప్రాంతాలను ఆక్రమించారు. అయితే ‘మగధ’కు ఈ పరిస్థితి లేదు.

నంద వంశం (క్రీ.పూ.362 - 322)

 ఈ వంశానికి మూల పురుషుడు ‘మహాపద్మనందుడు’. ఇతడు శూద్రుడని గ్రీకు రచయితలు పేర్కొనగా, అజ్ఞాత కులస్థుడని పురాణాల్లో ఉంది.

 అనేక గ్రంథాలు, రచనలు మహాపద్మనందుడ్ని శూద్రుడిగా వర్ణించాయి. బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాల నుంచి రాజ్యాధికారం  మొదటిసారిగా శూద్రులకు దక్కింది.

 ఇతడికి ‘సర్వక్షత్రియాంతక’, ‘అభినవ పరశురాముడు’, ‘ఏక్‌రాట్‌’ అనే బిరుదులు ఉన్నాయి.

 ఇక్ష్వాక, పాంచాల, కాశీ, కళింగ, అస్మక, కురు, మైథిలి, శూరసేన రాజ్యాలను ఆక్రమించి, గొప్పవిజేతగా పేరొందాడు.

 ఖారవేలుడు వేయించిన ‘హతిగుంఫా శాసనంలో’ ఇతడి విజయాలు, పాలనా విధానాల గురించి ఉంది.

 ఇతడి తర్వాత పాలించిన రాజుల గురించి సరైన ఆధారాలు లేవు. గ్రీకు రచనల్లో ‘అగ్రమెస్‌’ చివరి నందరాజు అని ఉంది.

 మహాపద్మనందుడు తన రాజ్యాన్ని బెంగాల్‌ వరకు విస్తరింపజేసి, విశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.

 ఇతడికి ధనంపై అమితమైన ఆశ ఉండేది. అందుకే ధననందుడిగా పేరొందాడు. అతిలోభం, ప్రజల నుంచి బలవంతంగా పన్ను వసూళ్లు చేయడం మొదలైన కారణాల వల్ల ప్రజాభిమానం కోల్పోయాడు.

 ఇతడి కోశాగారంలో కోటానుకోట్ల బంగారు నాణేలు ఉన్నాయని ‘కథాసరిత్సాగరం’ గ్రంథం పేర్కొంది.

 గంగానది తీరంలోని ఒక గుహలో 80 కోట్ల ధనాన్ని దాచినట్లు బౌద్ధ గ్రంథాలు పేర్కొనగా, మామూలనర్‌ అనే తమిళ రచయిత ఇదే విషయాన్ని తన కావ్యంలో రాశాడు.

 చంద్రగుప్తుడు కౌటిల్యుడి సాయంతో ధననందుడ్ని ఓడించి, మగధ రాజ్యాన్ని ఆక్రమించి, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

శిశునాగ వంశం (క్రీ.పూ. 444 - 362)

 ఈ వంశ స్థాపకుడు ‘శిశునాగుడు’. ఇతడు రాజధానిని పాటలీపుత్రం నుంచి గిరివ్రజానికి మార్చాడు.

 అవంతి, వత్స రాజ్యాలను జయించాడు. ఇతడి కుమారుడు కాలఅశోకుడు.

 కాలాఅశోకుడి కాలంలోనే రెండో బౌద్ధసంగీతి ‘వైశాలి’లో జరిగింది. పురాణాల్లో ఇతడి పేరును ‘కాకవర్ణుడి’గా పేర్కొన్నారు.

 ఇతడికి పదిమంది కుమారులున్నారు. ‘మహాపద్మనందుడు’ వీరందరినీ చంపి నందవంశాన్ని స్థాపించాడు.

రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 
 

Posted Date : 27-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌