• facebook
  • whatsapp
  • telegram

మౌర్యానంతర భారతదేశం - 1

కనిష్కుడి కాలంలో బౌద్ధమతం ఉన్నత స్థానంలో ఉండేది. ఈయన కాలంలోనే ఈ మతం హీనయానం, మహాయానంగా  చీలిపోయింది. 


హీనయానం

బుద్ధుడిని చిన్నరూపంలో ఆరాధిస్తూ, సత్కర్మకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని హీనయానం అంటారు. ఎవరైతే ప్రాపంచిక సుఖాలను త్యజించి నిర్వాణం చెందుతారో వారే మోక్షాన్ని పొందుతారని వీరు భావించేవారు.

* హీనయానులకు వ్యక్తిగత మోక్షసాధనే లక్ష్యం. వీరు బుద్ధుడిని దేవుడిగా ఆరాధించారు.

* హేతుబద్ధమైన సిద్ధాంతాలు, సూత్రాలపై హీనయానం ఆధారపడి ఉంటుంది.

* బుద్ధుడి బోధనలు, మంచి పనులు చేయడం ద్వారా మోక్షం పొందాలని భావిస్తారు. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. వీరు పాళీ అనే భాషను ఉపయోగించారు.


మహాయానం 

* బుద్ధుడిని దేవుడిగా భావించి విగ్రహాల రూపంలో ఆరాధిస్తారు. సంసారులు, సన్యాసులు అందరూ బుద్ధుడిని పూజించి బోధిస త్వం పొందుతారని మహాయానులు విశ్వసిస్తారు. 

* మూడు మార్గాల ద్వారా మోక్షం పొందవచ్చని మహాయానుల నమ్మకం. 

మొదటిది వ్యక్తిగత నిగ్రహం పాటిస్తూ,  ప్రాపంచిక సుఖాలను త్యజించడం - దీన్ని ‘అర్హత యానం’ అంటారు. 

 రెండోది వ్యక్తిగత నిగ్రహంతో పాటు మంచి పనులు చేయడం - దీన్ని ‘బుద్ధయానం’ అంటారు. 

* మూడోది వ్యక్తిగత మోక్ష సాధనను వ్యతిరేకించి తమ జీవితాన్ని ఇతరులకి అంకితం చేసి ప్రజాసేవ చేయాలి. 

* బుద్ధుడిని పూజించడంతో కర్మకాండలు, సంప్రదాయాలు ఏర్పడ్డాయి. మహాయానం భక్తి, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. తమ సిద్ధాంతాలను సంస్కృతంలో వ్యాప్తి చేశారు. 

* కనిష్కుడు మహాయాన బౌద్ధమతం స్వీకరించి దేశవిదేశాలకు వ్యాప్తి చేశాడు. పరమత సహనం పాటించి అన్ని మతాలను ఆదరించాడు. 

* ఈయన కాలంలోనే నాణేలపై గ్రీకు, సుమేరియా, పర్షియా, హిందూ దేవతల ప్రతిమలు ముద్రించారు. 

* కనిష్కుడు బౌద్ధమతం స్వీకరించినా యుద్ధాలను కొనసాగించాడు. 

* క్రీ.శ.102లో చైనాలో తిరుగుబాట్లను అణచివేయడానికి పామీర్‌ కొండలను దాటి సైనిక చర్య నిర్వహిస్తుండగా తన సైన్యంలోని ఒక అధికారి చేతిలో హత్యకు గురయ్యాడు.


కనిష్కుడి ఆస్థానం - సాహిత్యం 

* ఇతడి ఆస్థానంలోని అశ్వఘోషుడు ‘బుద్ధచరితం, శారిపుత్ర ప్రకరణం, సౌందర్య నందనం, సూత్రాలంకారం’ అనే గ్రంథాలు రాశాడు.

* బుద్ధచరితాన్ని వాల్మీకి రామాయణంతో పోలుస్తారు.

*ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ రాసి మాధ్యమికవాదం బోధించాడు. దీనిలో సాపేక్ష సంబంధాలను చర్చించారు. అందుకే ఇతడిని ‘ఇండియన్‌ ఐన్‌స్టీన్‌’ అంటారు. 

* ఇతడు మహాయాన బౌద్ధమతాన్ని ప్రచారం చేశాడు.

* వసుమిత్రుడు నాలుగో బౌద్ధసంగీతికి అధ్యక్షత వహించాడు. ఇతడు ‘మహావిభాష శాస్త్రం’ అనే గ్రంథం రాశాడు.

* ఈయన ఆస్థానంలో ‘చరకుడు’ అనే ఆయుర్వేద వైద్యపండితుడు ఉండేవాడు. ఈయన ‘చరక సంహిత’ అనే గ్రంథం రచించాడు.

* కనిష్కుడి ప్రధాని ‘మాధర’ గొప్ప పండితుడు. ఈ కాలంలో సంస్కృతం మంచి ఆదరణ పొందింది.

వాస్తు శిల్పం 

* కనిష్కుడి కాలంలో వాస్తుశిల్ప కళాభివృద్ధి ఉండేది. అశోకుడిలా ఈయన అనేక బౌద్ధ స్తూపాలను నిర్మించాడు. 

*పెషావర్‌ విహారాన్ని కనిష్కుడే నిర్మించాడని అల్‌బెరూని పేర్కొన్నాడు. ఇక్కడే కనక చైత్యాన్ని కూడా నిర్మించాడు. దీన్నే ‘కనిష్క చైత్యంగా’ పిలిచేవారు.  

* కశ్మీర్‌లో కనిష్కపురాన్ని నిర్మించాడని కల్హణుడి రాజతరంగణి ద్వారా తెలుస్తోంది. 

* కనిష్కుడి రాజధాని పురుషపురంలో 13 అంతస్తులు, 400 అడుగుల ఎత్తయిన కొయ్య గోపురాన్ని నిర్మించి అందులో బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. 

పెషావర్‌లో కంచు గోపురాన్ని నిర్మించి, అందులో బుద్ధుడి అవశేషాలు భద్రపరిచారు.


గాంధార శిల్పకళ - లక్షణాలు

* కనిష్కుడి కాలంలో గాంధార శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. ఇది ప్రధానంగా ‘గాంధార’ ప్రాంతంలో అభివృద్ధి చెందడంతో దీన్ని ‘గాంధార శిల్పకళ’ అంటారు. 

* ఈ శిల్పకళకు మరో కేంద్రం ‘మధుర’. చైనా యాత్రికుడు ‘హుయాన్‌త్సాంగ్‌’ మొదట తన రచనల్లో ఈ ప్రాంతానికి ఆ పేరు వాడాడు. 

*పెషావర్‌ లోయ నుంచి సింధూనది తూర్పున విస్తరించిన భూభాగాన్ని ‘గాంధార’ అంటారు. 

* క్రీ.పూ. 6వ శతాబ్దంలో ‘గాంధార’ ఒక మహాజనపదంగా ఉండేది. దీని ప్రధాన పట్టణం ‘తక్షశిల’. 

* ఈ కాలంలో ఇరానియన్లు, ఇండో-గ్రీకులు, మౌర్యులు, శకులు, పహ్లవులు చివరగా కుషాణులు పరిపాలించడంతో ఇక్కడ మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. 

* గ్రీకు, రోమన్, భారతీయ శిల్పకళ కలయికతో ఏర్పడిందే ‘గాంధార శిల్పకళ’. 

* ఈ శిల్పకళ ప్రధాన కేంద్రాలు ‘లోరియా-టౌగాయ్‌’(Loriya-Taugai), జమాల్‌ గార్లట్‌ (Jamal garlt), షఫజ్‌ గార్లట్‌ (Shafhaz garlt),, షాహిజి-కే-ధేరి (Shahji-ke-dheri).

* గాంధార శిల్పకళ ఏ కాలంలో అభివృద్ధి చెందిందనే విషయంలో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. 

క్రీ.శ.1వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు కొనసాగిందని ఫెర్గూసన్‌ అభిప్రాయపడ్డాడు. కనిష్కుడు, ఆ తర్వాత వచ్చిన రాజుల కాలంలో గాంధార శిల్పకళ బాగా అభివృద్ధి చెందిందని కన్నింగ్‌హామ్‌ పేర్కొన్నాడు. 

* గాంధార శిల్పకళ మొదట్లో గ్రీకు ప్రభావం, రెండో దశలో రోమన్ల ప్రభావంతో ఏర్పడింది. 

* గాంధార శిల్పకళలో గ్రీకుల పల్చటి వస్త్రధారణ, రోమన్ల ఉంగరాల జుట్టు, బలిష్టమైన అంగసౌష్ఠవం బుద్ధుడి విగ్రహంలో కన్పిస్తాయి.

* బుద్ధుడి శిల్పంలో సిగముడి, బరువైన కనురెప్పలు, త్రిముఖ భంగిమలు, నైష్పత్తిక కొలతలు, దరహాస వదనం ఈ శిల్పకళ ముఖ్య లక్షణాలు.

* బోధిసత్వుడి విగ్రహాల్లో రాజు ధరించే దుస్తులు, ఆభరణాలు చూడవచ్చు.

* బుద్ధుడు మొదటిసారి గాంధార శిల్పంలోనే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. ఇందులో గ్రీకు, రోమన్‌ సంప్రదాయాలు ఉండటంతో ‘ఇండో-గ్రీకు’ కళగా పేర్కొంటారు.

* ఈ కళ మధుర, సారనాథ్, అమరావతిలో అభివృద్ధి చెందింది. బుద్ధుడి జీవితంలోని ప్రధాన సంఘటనలు ఈ కళలో చిత్రించారు.

* గాంధార శిల్పకళలో తీగలు, పూలు, జంతువులను కూడా చిత్రించారు. వారు నిర్మించిన స్తూపాలు, విహారాల్లో అలంకరణలు ఎక్కువగా కనిపిస్తాయి.

బోధిసత్వమైత్రేయ, అవలోక్తేశ్వర, పద్మపాణి ముద్రల్లో బుద్ధుడి విగ్రహాలను మలిచారు.

* భీమారన్‌ దగ్గర లభించిన బుద్ధ విగ్రహం గాంధార శిల్పకళలో మొదటిది. పెషావర్‌ దగ్గర ‘షాహిజికేధేరి’లో లభించిన ‘కనిష్క’ విగ్రహానికి శరీర నిర్మాణంలో పోలికలు ఉన్నాయి. 

* బోధిసత్వమైత్రేయ విగ్రహం ‘తక్త-ఇ-బహయి’ దగ్గర లభించింది. ‘సిక్రీ’లోని బుద్ధవిగ్రహంలో తపస్సు చేస్తూ ఎముకల గూడుగా మారిన బుద్ధుడిని చూడవచ్చు. 

* బౌద్ధమతానికి చెందిన పాంచిక, కుబేర, హరితి’ లాంటి దేవతలను కూడా విగ్రహాలుగా మలిచారు. 

* పెషావర్‌ దగ్గర నిర్మించిన స్తూపం 13 అంతస్థులతో 700 అడుగులు ఉండేదని హుయాన్‌త్సాంగ్‌ పేర్కొన్నాడు. 

* హూణుల దండయాత్ర కారణంగా ఈ శిల్పకళ ప్రాబల్యం కూడా తగ్గింది. 

* టర్కీస్థాన్, మంగోలియా, చైనా, కొరియా, జపాన్‌ల్లో అక్కడక్కడ గాంధార శిల్పకళ ఇప్పటికీ కనిపిస్తుంది. భారత్‌లో అమరావతి, నాగార్జునకొండ, బర్హూత్, సాంచీ, అజంతా ఎల్లోరా గుహల్లో ఈ శిల్పకళ ఉంది.


మధుర శిల్పకళ - లక్షణాలు

కుషాణుల కాలంలో మధుర ఒక గొప్ప కళాకేంద్రంగా అభివృద్ధి చెందింది. స్థానిక మత విశ్వాసాలు, సంప్రదాయాలు ప్రధాన వస్తువుగా చేసుకుని ఈ శిల్పాలను చెక్కారు. ఈ పద్ధతి క్రీ.శ. మొదటి శతాబ్దంలో అభివృద్ధి చెందింది.

* ఈ శిల్పకళలో యక్షి, యక్షిణి, కుబేర విగ్రహాలు చెక్కారు. బౌద్ధ విగ్రహాలను బోధిసత్వుడి ఆకారంలో మలిచారు.

* హిందూ విగ్రహాలైన శివుడు, విష్ణువు, సూర్యుడు, ఇంద్రుడు, జైన తీర్థంకరులను ఈ శిల్పంలో చెక్కారు. మధుర శిల్పకళలో బుద్ధుడి తల కేశాలు లేకుండా ఉంటుంది.

* కుషాణ రాజుల విగ్రహాలు కూడా మధుర శిల్పకళలో చెక్కారు. ఉదాహరణకు కనిష్కుడి విగ్రహం మధురకు దగ్గర్లోని ‘మాట్‌’ అనే గ్రామంలో తోక్రితిల దగ్గర లభించింది.

*పార్థియన్ల శిల్పకళకు కొద్దిగా మార్పులు చేసి మధుర శిల్పులు విగ్రహాలు చెక్కారు.

* మధుర, సారనాథ్, శ్రావస్తి మధుర శిల్పకళకు ప్రధాన కేంద్రాలు.

మధుర శిల్పంతో జైన తీర్థంకరులు వృషభనాథ (ఆదినాద), నేమినాథ విగ్రహాలు కూర్చున్నట్లు, నిలబడినట్లు వివిధ ముద్రల్లో మలిచారు.

* మధుర శిల్పంలో శివుడిని సతీసమేతంగా, శివలింగంగా, అర్ధనారీశ్వరుడిగా చెక్కారు. వీటితోపాటు నాగిని, నాగ ప్రతిమలు కూడా ఉన్నాయి.

* స్త్రీమూర్తి విగ్రహాలు, సాలభంజికలు, తల్లీబిడ్డ, రామచిలుకలు, శివలింగాలు, ఎర్రమట్టి బొమ్మలు, గణేశ, స్కంద విగ్రహాలు చెక్కారు.

* మధుర శిల్పకళ పూర్తిగా స్వదేశీ సంబంధమైంది. కుషాణుల కాలంలో ఈ శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది.


మాదిరి ప్రశ్నలు

1. భారత్‌లో తొలిసారిగా వారి నాణేలపై తమ పేర్లు, రూపాలను చిత్రించిన రాజులు ఎవరు?

1) ఇండోగ్రీకులు   2) శకులు     3) పార్థియన్లు   4) కుషాణలు


2. బంగారు నాణేలను మొదటిసారి ప్రవేశపెట్టినవారెవరు?

1) కుషాణులు   2) శాతవాహనులు    3) శుంగులు    4) ఇండోగ్రీకులు


3. కనిష్కుడు క్రీ.శ.78లో ఏ శకాన్ని ప్రారంభించాడు?

1) పార్థియన్‌ శకం    2) శక శకం    3) యవ శకం    4) ఇండోగ్రీకు శకం


4. కనిష్కుడి రాజధాని ఏది?

1) పెషావర్‌    2) పూర్ణియ    3) పురుషపురం   4) శకల్‌


5. కనిష్కుడు ఏ మతానికి చెందినవాడు?

1)  హిందూ   2)  జైన     3) బౌద్ధ   4) పైవేవీకావు


సమాధానాలు

1-1  2-4  3-2  4-3  5-3.  

Posted Date : 17-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌