• facebook
  • whatsapp
  • telegram

మౌర్యానంతర భారతదేశం - 2

చివరి కుషాణ రాజులు - పతనం

వశిష్కుడు: కనిష్కుడి అనంతరం వశిష్కుడు క్రీ.శ.102-106 వరకు పాలించాడు. ఇతడిని వైజష్కుడు, జష్కుడు అని కూడా అంటారు. 

* ఇతడి కాలంలో మధుర, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, భోపాల్‌ ప్రాంతాలు రాజ్యంలో భాగమయ్యాయి.


హువిష్కుడు: ఈ హువిష్కుడే రాజతరంగిణిలోని హుష్కుడు. ఇతడు ఆఫ్గనిస్థాన్‌ను ఆక్రమించాడు. పరిపాలన కాలం క్రీ.శ.106-128.

కనిష్కుడిలాగే బౌద్ధమతాన్ని స్వీకరించి ఆ మత వ్యాప్తికి కృషి చేశాడు. 

* ఇతడు మహారాజ, రాజాధిరాజ, దేవపుత్ర, అనే బిరుదులు పొందాడు. 

* ఇతడు నాణేెలపై గ్రీకు, హైందవ ప్రతిమలు ముద్రించాడు.

* హువిష్కుడి పేరుమీద ‘మధుర’లో అన్నదానం, పుణ్యశాల నిర్మించడానికి మధ్యాసియాలోని ఆయన ప్రతినిధి  11000 వేల వెండి నాణేలు ఇచ్చాడు.

కుషాణుల చరిత్రలో ఈయన పరిపాలనను ‘స్వర్ణయుగంగా’ పేర్కొంటారు.

* ఇతడి అనంతరం రెండో కనిష్కుడు ‘కైజర్‌’బిరుదుతో రాజ్యానికి వచ్చాడు. కానీ ఇతడి గురించి పూర్తి సమాచారం లభ్యం కాలేదు. అనంతరం వసుదేవుడు రాజయ్యాడు.


వసుదేవుడు: ఇతడు కనిష్క వంశంలో చివరి రాజు. పేరునుబట్టి ఇతడు పూర్తిగా భారతీయతకు లోనయ్యాడని తెలుస్తుంది. 

ఇతడి పరిపాలన  కాలం క్రీ.శ. 145-176. 

* అన్ని ప్రాంతాల్లో నాణేలు విరివిగా లభించడంవల్ల వారసత్వంగా వచ్చిన సామ్రాజ్యాన్ని కాపాడాడు. 

 చైనా చక్రవర్తికి రాయబారం పంపి ‘యూచీల రాజు’ అనే బిరుదుతో సన్మానం పొందాడు. 

* వసుదేవుడి మరణానంతరం క్రమంగా కుషాణుల రాజ్యం బలహీనపడింది. 

* రాష్ట్ర పాలకులు స్వతంత్రత ప్రకటించుకున్నారు. మధురలో నాగవంశం, రాజస్థాన్‌ ప్రాంతాల్లో అర్జునాయనులు, ఉద్దేహికులు, మాళవులు, యౌధేయులు, శివులు గణరాజ్యాలు స్థాపించారు. 

* ముద్రలు (పంజాబ్‌), అభీరులు (రాజస్థాన్‌), నాగులు (పద్మావతి) మధ్య, పశ్చిమ భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. 

* మధురను శకులు తిరిగి ఆక్రమించారు. రాజకీయ అనైక్యతతో గుప్తులు విజృంభించి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు.


సామాజిక పరిస్థితులు

మిలిందపన్హా అనే బౌద్ధ గ్రంథం ప్రకారం సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది.

* మహావస్తు అనే బౌద్ధ గ్రంథం ప్రకారం బ్రాహ్మణులకు సమాజంలో సముచిత స్థానం ఉండేది. 

* మధురలోని బ్రహ్మశాసనం ప్రకారం వీరికి సొంత వృత్తులుండేవి. వీరికి కావాల్సిన సాయాన్ని వర్తక శ్రేణులు అందించేవారు.

* పితృస్వామిక వ్యవస్థతో కూడిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. వంశపారంపర్య హక్కులుండేవి. 

* ఎక్కువమంది సభ్యులున్న కుటుంబాలను ‘మహాపరివార్‌’ అని అంటారు. 

* ధనికుల ఇళ్లలో ఇంటి పనులు చేసేవారిని ‘కర్మకారులు’ అని, కూలి పనిచేసేవారిని ‘పౌరుసేయులని’, వ్యక్తిగత సేవకుడిని ‘పురోజవయని’, స్త్రీలకు సాయపడేవారిని ‘గృహదాసీలు’ అని పిలిచేవారు. 

* పసిపిల్లలను పెంచేవారిని ‘దాత్రి’ (నర్సులు) అని దివ్య వదన పేర్కొంటోంది.

* వివాహ వ్యవస్థ, బహుభార్యత్వం అమల్లో ఉండేది. కత్తిసాము, ధనుర్విద్య, మల్లయుద్ధంలో నిపుణులను వరుడిగా ఎంచుకునేవారు. 

* మహావస్తు అనే బౌద్ధ గ్రంథం చక్కని సుత్తిని తయారుచేసిన కమ్మరి యువకుడికి అదే కులానికి చెందిన అమ్మాయికి వివాహం చేశారని పేర్కొంది. 

* మిలిందపన్హా, బుద్ధచరితంలో ‘కన్యాశుల్కం’ ఉండేదని పేర్కొన్నారు. స్త్రీ, పురుషులు వస్త్రాలు, ఆభరణాలు ధరించేవారు. 

* గాంధార, మధుర శిల్పాల్లో పలు రకాల వస్త్రధారణ, ఆభరణాలు, అలంకరణలు కనిపిస్తాయి. 

సంగీతం, వేట, నటన, చదరంగం, మల్లయుద్ధాలు ప్రధాన వినోదాలు.

* విలాసవంతమైన గృహాలు ఉండేవి. జూదం, వ్యభిచారం, నేరాలు సమాజంలో అధికం.

* వేశ్యలను గణికులు, వేశవద్వాలు, పశ్యపరినేత, ధారిక అనే పేర్లతో పిలిచేవారు. వేశ్యల్లో ముఖ్యురాలిని వారముఖ్య అని, వారు నివసించే వీధిని ‘గణికవీధి’ అని అంటారు. 

సోమరిగా ఉండేవారిని గాడిదలతో పోల్చారని ‘దివ్యవదన’ పేర్కొంటోంది. 

* బీదల కోసం ప్రత్యేకంగా ‘సత్రాలు’ ఉండేవి. వర్ణ, వర్గ, ఆర్థిక వ్యత్యాసాలుండేవి.


ఆర్థిక పరిస్థితులు

* కనిష్కుడి పాలనలో ప్రజల జీవన స్థితి మెరుగ్గా ఉండేది. వీరి ప్రధానవృత్తి వ్యవసాయం. 

ప్రజలు వివిధ రకాల వృత్తులను నిర్వహించేవారు. ఆర్థిక వ్యవస్థలో వృత్తి, వర్తక శ్రేణి ప్రముఖ పాత్ర పోషించాయి. 

* భారతదేశం వాయవ్య ప్రాంతం ద్వారా చైనా, రోమ్‌ల మధ్య జరుగుతున్న సిల్కు వ్యాపారంలో పాలుపంచుకునేది.

విదేశీ వర్తకులు తక్షశిల ద్వారా వారణాసికి చేరేవారు. రోమ్‌ బంగారు నాణేలకు సమానంగా భారతదేశంలో దీనార్‌లు, పూర్ణాలు, కర్షపణాలనే బంగారు నాణేలు ముద్రించారు. 

* ‘పెరిప్లస్‌-ఆఫ్‌-ది-ఎరిత్రియన్‌-సి’ గ్రంథం ప్రకారం భారతదేశ వస్తువులు ఎక్కువగా కొనడంతో రోమన్లు నష్టపోయేవారని పేర్కొంది.

* బౌద్ధజాతక కథల ప్రకారం సమాజంలో సుమారు 18 శ్రేణులుండగా, కుషాణ శాసనాల్లో రెండే శ్రేణులుండేవని పేర్కొన్నారు. 

* సంస్కృతం, బౌద్ధసాహిత్యంలో హిరణికులు (బంగారుపని), మణిప్రస్తారకులు (సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు), గంథీకులు (నూనె తీసేవారు), శైలకులు (దుస్తులు నేసేవారు), కోలికనికాయలు (కుండలు చేసేవారు) లాంటి పలు శ్రేణులుండేవి. 

* శ్రేణి పెద్దను శ్రేష్ఠి అని పిలిచేవారు. ఈ శ్రేణులు బ్యాంకులుగా పనిచేశాయి. వర్తకులు ఒకేచోట దుకాణాలు నడిపేవారు. శ్రేష్ఠి వడ్డీకి అప్పు ఇచ్చేవాడు. దీన్ని ప్రయోగ అనేవారు.

* పలు ప్రాంతాల్లో ముడిసరకులు అమ్మేవారిని ‘సార్థవాహకులు’ అని, సముద్రంపై వ్యాపారం చేసేవారిని ‘సార్థవాహ మహాసముద్ర వతరాణి’ అని అంటారు. 

* మహావస్తు గ్రంథం సముద్ర వ్యాపారం గురించి తెలుపుతుంది. అశ్వఘోషుడు సముద్ర ప్రయాణంలో గాలుల వల్ల ఓడలు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావించారు.  

* సౌరాష్ట్ర నుంచి తూర్పు భారత్‌లో వ్యాపారం సాగించేవారు. మధుర శాసనం ద్వారా ప్రస్తఘటక తూనికలు ఉండేవని తెలుస్తోంది.

* శ్రావస్తి, సోపారాలను కలుపుతూ భూమార్గం, తక్షశిల-కాశీని కలుపుతూ రాజమార్గం ఉండేవి. 

అమధాన శతక గ్రంథం ప్రకారం మధ్య, దక్షిణ దేశానికి వర్తకమార్గం ఉండేది.

రత్నాలు, వజ్రాలు, విలాస వస్తువులు ప్రధాన ఎగుమతులు. ఇవేగాక సుగంధ ద్రవ్యాలు, సిల్కు, మస్లిన్‌ వస్త్రాలూ ఎగుమతి అయ్యేవి. 

* గాజు వస్తువులు, వెండి, బంగారం, రాగి, సీసం, మద్యం ప్రధాన దిగుమతులు. 

* రోమ్,  చైనా, పశ్చిమ, మధ్య ఆసియా దేశాలతో వ్యాపారం చేయడానికి కుషాణులు తోడ్పడ్డారు.

* తొలిసారిగా బంగారు నాణేలను విరివిగా జారీచేసింది కుషాణులే. 

* బరుకచ్చా లేదా బ్రోచ్‌ ప్రధాన రేవు పట్టణం.


మత పరిస్థితులు

కుషాణ రాజులు వివిధ మతాలను అవలంబించినప్పటికీ అన్ని మతాలను సమానంగా ఆదరించారు. 

కుజలఖాడ్‌ పైసిస్‌ నాణేలపై బుద్ధుడి ప్రతిమను ముద్రించాడు. ఒకవైపు శివుడు మరోవైపు నంది ప్రతిమలను విమలఖాడ్‌ పైసిస్‌ ముద్రించాడు. 

కనిష్కుడు గ్రీకు, పారశీక, హిందూ దేవతల ప్రతిమలను నాణేెలపై ముద్రించాడు. 

* హువిష్కుడు కార్తికేయుడి ప్రతిమను ముద్రించాడు. కానీ వసుదేవుడు విష్ణుభక్తుడిగా చెప్పుకుని శివ, ఉమేశ, అంబ ప్రతిమలను ముద్రించాడు. 

* కుశాలుడు కూడా హిందూ మత దేవుళ్ల ప్రతిమలను నాణేలపై ముద్రించాడు. 

కనిష్కుడు బౌద్ధం స్వీకరించి నాలుగో బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. ఇతడి ఆస్థానంలో వసుమిత్రుడు, అశ్వఘోషుడు, నాగార్జునుడు, చరకుడు ఉండేవారు. 

 జైన, బౌద్ధమతాలు పలు శాఖలుగా విడిపోయాయి. వివిధ మతాలకు ఇచ్చిన దానాల గురించి మధుర శాసనం, సాహిత్య గ్రంథాలు పేర్కొన్నాయి.

యజ్ఞకర్మలు, పూజా విధానాలు, విగ్రహ ప్రతిష్ఠ ఉండేవి. 

గాంధార, మధుర శిల్పకళల్లో అనేక విగ్రహాలను వివిధ రూపాల్లో, భంగిమల్లో తయారు చేశారు. 

* జైన, బౌద్ధ, హిందూ, చర్వాక, లోకాయుతులు ఉండేవారు. 

* సాంచీ, గయ, బర్హూత్, మధురల్లో పలు మతాలకు చెందిన శిల్పకళను చూడవచ్చు.


మాదిరి ప్రశ్నలు

1. కుషాణుల కాలంలో ఏ కళాశైలి అభివృద్ధి చెందింది?

1) గాంధార  2) మధుర    3) అమరావతి    4) సారనాథ్‌


2. ప్రాచీన బౌద్ధ సంప్రదాయాన్ని అనుసరించిన శాఖ ఏది?

1) హీనయానం    2) మహాయానం   3) 1, 2   4) పైవేవీకావు


3. బౌద్ధం, ఏ బౌద్ధ సంగీతిలో మహాయాన, హీనయాన శాఖలుగా విడిపోయింది?

1) మొదటి    2) రెండు     3) మూడు    4) నాలుగు


4. నాలుగో బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగింది?

1) వశిష్కుడి కాలం   2) హువిష్కుడు     3) కనిష్కుడు కాలం     4) ఎవరూ కాదు


5. కశ్మీర్‌లో నిర్వహించిన నాలుగో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వారెవరు?

1) నాగార్జునుడు, మీనాండర్‌    2) నాగార్జునుడు, అశ్వఘోషుడు

3) వసుమిత్రుడు, అశ్వఘోషుడు   4) ఎవరూ కాదు


6. కింది వారిలో ఇండియన్‌ ఐన్‌స్టీన్‌ అని ఎవరిని పిలుస్తారు?

1)  అశ్వఘోషుడు    2) ఆచార్య నాగార్జునుడు    3) వసుమిత్రుడు    4) ఆర్యభట్ట


7. సుహృల్లేఖ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?

1) కనిష్కుడు    2) అశోకుడు    3) వసుమిత్రుడు  4)ఆచార్య నాగార్జునుడు


8. చరక సంహిత గ్రంథ రచయిత?

1) కనిష్కుడు    2) అశ్వఘోషుడు   3) చరకుడు    4) వసుమిత్రుడు


9. కుషాణుల కాలంలో ప్రధాన ఓడరేవు?

1) తామ్రలిప్తి   2) వేటుపల్లి    3) లోథాల్‌    4) బరుకచ్చా


10. కుషాణుల కాలంలో గణికులు అని ఎవరిని పిలిచేవారు?

1) వర్తకులు    2) వేశ్యలు    3) వైశ్యులు     4) క్షత్రియులు


11. భిక్షురాజుగా పేరొందినవారు ఎవరు?

1) కనిష్కుడు      2) అశోకుడు   3) రుద్రదాముడు    4) ఖారవేలుడు


సమాధానాలు

1-1    2-1    3-4   4-3   5-3   6-2   7-4   8-3   9-4   10-2  11-4.

Posted Date : 17-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌