• facebook
  • whatsapp
  • telegram

న‌దీవ్య‌వ‌స్థ‌

 దేశంలో విస్తరించి ఉన్న నదులను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు.
అవి: హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, ఇతర నదులు.
ద్వీపకల్ప నదులు: దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్న నదులను ద్వీపకల్ప నదులు అంటారు. వీటినే వర్షాధార నదులు అని కూడా పిలుస్తారు. వీటిలో కొన్ని వర్షాకాలంలో ఉద్ధృతంగా ప్రవహించి, వేసవి వచ్చేసరికి ఎండిపోతుంటాయి లేదా నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ప్రవహించే దిశను బట్టి తిరిగి ఈ నదులను రెండు రకాలుగా విభజించవచ్చు.
అవి: 1) తూర్పువైపు ప్రవహించే నదులు.
ఉదా: గోదావరి, కృష్ణా, మహానది,పెన్నా, కావేరి, వాటి ఉపనదులు.
2) పశ్చిమానికి ప్రవహించే నదులు.
ఉదా: నర్మదా, తాపి, పశ్చిమ కనుమలకు పశ్చిమాన జన్మించి, పశ్చిమం వైపు ప్రవహించే నదులు.

గోదావరి
     దేశంలో రెండో పెద్ద నది. ద్వీపకల్ప నదుల్లో పెద్దది. గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ సమీపంలో ఉన్న 'త్రయంబకం' ప్రాంతంలో జన్మిస్తుంది. అక్కడి నుంచి తూర్పు దిశగా పీఠభూమి మీదుగా ప్రవహిస్తూ, పాపికొండలను దాటి ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం వద్ద మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. తర్వాత రాజమండ్రిని దాటి వశిష్ట, వైనతేయ, గౌతమి అనే పాయలుగా చీలి, బంగాళాఖాతం వైపు ప్రవహిస్తుంది.
మరి కొంత దూరం ప్రవహించాక తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ అనే పాయలుగా చీలుతుంది. గోదావరి ప్రధాన పాయ అయిన 'వశిష్ట' అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో కలిసే ముందు ఏడు పాయలుగా చీలుతుంది. కాబట్టి అక్కడ దీన్ని 'సప్త గోదావరి' అని కూడా పిలుస్తారు. దీని మొత్తం పొడవు 1465 కి.మీ. గోదావరికి ఉన్న ఇతర పేర్లు: వృద్ధ గంగ, దక్షిణ గంగ, ఇండియన్ రైన్.
ప్రధాన ఉపనదులు: పెన్ గంగా, వైన్ గంగా, వార్థా, మంజీరా, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని, ప్రవర, మూల, సీలేరు, మానేరు, మాచ్‌ఖండ్, కడెం.
      ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 770 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఇది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీదేవి పుణ్యక్షేత్రం గోదావరి సమీపాన వెలసింది. అక్కడి నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా ప్రవహిస్తూ పాపికొండల వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సరిహద్దుగా ప్రవహిస్తూ చివరికి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. రెండు రాష్ట్రాల్లో గోదావరిపై ఉన్న ప్రధాన ఆనకట్టలు: శ్రీరాంసాగర్, నిజాంసాగర్ (మంజీర), ధవళేశ్వరం, పోలవరం (ఇది నిర్మాణంలో ఉంది).

 

కృష్ణా
     ద్వీపకల్ప నదుల్లో రెండో పెద్దది. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. అక్కడి నుంచి (తూర్పు దిశగా) మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని తంగడి ప్రాంతం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. దీని మొత్తం పొడవు 1400 కి.మీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది సుమారు 720 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. కృష్ణానది విజయవాడకు దిగువన 64 కి.మీ. దూరంలో రెండు పాయలుగా చీలి తర్వాత మళ్లీ కలిసి 'హంసల దీవి' వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ రెండు పాయల మధ్య ఉన్న ప్రాంతాన్ని 'దివిసీమ' అంటారు. దీని ప్రధాన ఉపనదులు: తుంగభద్ర, భీమ, ఘటప్రభ, మలప్రభ, దూద్‌గంగా, పంచ్‌గంగా, దిండి, కోయనా, మూసీ, మున్నేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న ప్రధాన ఆనకట్టలు: జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్, పులిచింతల.

మహానది
    ఇది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో సిహవా వద్ద జన్మిస్తుంది. అక్కడి నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తూ సుమారు 857 కి.మీ. ప్రయాణించి ఒడిశాలోని కటక్ సమీపాన బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదీ ప్రవాహం వల్ల ఒడిశా రాష్ట్రంలో టీ కప్పు ఆకృతిలో ఉండే మైదానం ఏర్పడింది.
ప్రధాన ఉపనదులు: ఇబ్, మాండ్, డాంగ్, హస్‌డో, ఓంగ్, జాంక్, టెల్, మాడ్. ప్రపంచంలోనే పొడవైన 'హీరాకుడ్' ఆనకట్ట ఈ నదిపైనే ఉంది.
కావేరి: ఇది కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి కొండల్లో ఉన్న 'తలైకావేరి' అనే ప్రదేశం వద్ద జన్మిస్తుంది. అక్కడి నుంచి తూర్పు వైపు ప్రవహిస్తూ తమిళనాడులోని శ్రీరంగం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 800 కి.మీ. ప్రసిద్ధి చెందిన 'శివసముద్రం' జలపాతం ఈ నదిపైనే ఉంది. ఈ నదికి ఉన్న ప్రధాన ఉపనదులు: హేరంగి, హేమవతి, లోకపావని, లక్ష్మణ తీర్థ, భవాని, కుందా, అమరావతి, అర్కావటి మొదలైనవి.

పెన్నా: ఇది కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఉన్న నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది. తూర్పు వైపు ప్రవహిస్తూ అనంతపురం జిల్లాలోని హిందూపూర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి కడప, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహిస్తూ చివరికి నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 600 కి.మీ. దీన్ని 'పినాకిని' అని కూడా పిలుస్తారు. దీన్ని రాయలసీమ జీవనాడిగా అభివర్ణిస్తారు. ప్రధాన ఉపనదులు: చిత్రావతి, జయమంగళ, కుందేరు, చెయ్యేరు, పాపాఘ్ని, సగిలేరు. ఈ నదిపై నెల్లూరు జిల్లాలో సోమశిల ఆనకట్ట నిర్మించారు.

తుంగ-భద్ర: ఇది తుంగ, భద్ర అనే రెండు చిన్న నదుల కలయికతో ఏర్పడుతుంది. ఇది పశ్చిమ కనుమల్లోని వరాహ కొండల్లో ఉన్న గంగముల్లా ప్రాంతంలో జన్మించి సుమారు 531 కి.మీ. ప్రవహించి చివరికి కృష్ణానదిలో (మహబూబ్‌నగర్‌లోని ఆలంపూర్ వద్ద) కలుస్తుంది. కృష్ణానది ఉపనదుల్లో ఇదే అతిపెద్దది. ప్రసిద్ధి చెందిన 'మంత్రాలయం' పుణ్యక్షేత్రం ఈ నది ఒడ్డునే ఉంది.

మూసీ: ఇది రంగారెడ్డి జిల్లా శివారెడ్డిపేటలోని అనంతగిరి కొండల్లో పుట్టి, హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తూ చివరికి నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నది ఒడ్డునే హైదరాబాద్ నగరం ఉంది. ఈ నది మొత్తం పొడవు సుమారు 250 కి.మీ. ప్రాచీన కాలంలో దీన్ని 'ముచికుంద' అని పిలిచేవారు. ఈ నదిపై హైదరాబాద్ సమీపంలో ఉస్మాన్‌సాగర్ జలాశయాన్ని (గండిపేట చెరువు) తవ్వారు. మూసీ నదికి ఉన్న ఉపనది 'ఆలేరు'. ఇది చిత్తలూరు వద్ద మూసీనదిలో కలుస్తుంది.

దిండి: ఇది కృష్ణానది ఉపనదుల్లో ఒకటి. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టల్లో జన్మిస్తుంది. అమరాబాద్, నందికొండ, దేవరకొండ ప్రాంతాల మీదుగా ప్రవహించి ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీన్ని మీనాంబరం, దుందుభి అని కూడా పిలుస్తారు. దీని మొత్తం పొడవు 153 కి.మీ.

మంజీర: మహారాష్ట్రలోని బాడ్ జిల్లాలో ఉన్న బాలాఘాట్ కొండల్లో జన్మిస్తుంది. మెదక్ జిల్లాలోని కందకుర్తి గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశించి అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా మీదుగా ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. దీనిపై నిజామాబాద్ జిల్లాలో 'నిజాంసాగర్' ఆనకట్టను నిర్మించారు. ఈ నది మొత్తం పొడవు 644 కి.మీ.

ప్రాణహిత: గోదావరి ఉపనదులైన పెన్ గంగా, వైన్‌గంగా, వార్థా అనే మూడు నదుల కలయికతో ప్రాణహిత నది ఏర్పడుతుంది (ఇవి మధ్యప్రదేశ్‌లోని సాత్పురా పర్వతాల్లో జన్మిస్తాయి). ప్రాణహిత నది ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు పొడవునా ప్రవహించి చెన్నూరు వద్ద గోదావరిలో కలుస్తుంది.
తూర్పు కనుమల్లో పుట్టి, తూర్పు వైపు ప్రవహించేవి

వంశధార: తూర్పు కనుమల్లో పుట్టి తూర్పు వైపు ప్రవహించే నదుల్లో అతిపెద్దది. ఇది ఒడిశా రాష్ట్రంలోని జయపూర్ కొండల్లో జన్మిస్తుంది. దాదాపు 226 కి.మీ. దూరం ప్రయాణించి, శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. చివరికి అదే జిల్లాలోని కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది ప్రవహించే దూరం సుమారు 130 కి.మీ.

నాగావళి: ఇది ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌గఢ్ కొండల్లో జన్మిస్తుంది. దాదాపు 208 కి.మీ. ప్రయాణించి శ్రీకాకుళం జిల్లాలోని మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీన్ని 'లాంగుల్య' అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది సుమారు 112 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. దీని ఉప నదుల్లో ప్రధానమైనవి: స్వర్ణముఖి, వేగవతి, జంఝావతి, ఒట్టిగడ్డ.

బ్రహ్మణి: ఒడిశా రాష్ట్రంలో కోయల్, శాంకా అనే రెండు నదుల కలయికతో ఏర్పడుతుంది. రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారానికి నీటి సరఫరా ఈ నది నుంచే జరుగుతోంది.

వైతరిణి: ఒడిశాలోని కియోంజర్ పీఠభూమి వద్ద జన్మించి 'వాన్సు' వద్ద బ్రహ్మణి నదిని కలుపుకుని, బంగాళాఖాతంలో కలుస్తుంది.

స్వర్ణముఖి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కొండల్లో జన్మించి, శ్రీకాళహస్తి మీదుగా ప్రవహించి చివరికి నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఇతర నదులు
లూని: రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతాల సమీపాన ఉన్న అన్నాసాగర్‌లో జన్మించి పుష్కర సరస్సు మీదుగా ప్రవహిస్తూ చివరికి గుజరాత్ రాష్ట్రంలోని రాణా ఆఫ్ కచ్ ప్రాంతంలో అంతర్థానమవుతుంది. దేశంలో భూభాగంలో అంతర్థానమయ్యే (ఎక్సోటిక్) ఏకైక నది ఇదే. ఈ నదికి 'సాగర్‌మతి' అనే పేరు ఉంది. దీని ఉపనది సరౌసుతి.

మహి: ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో జన్మించి రాజస్థాన్‌లోని ఉదయపూర్ మీదుగా ప్రవహిస్తూ గుజరాత్‌లోని 'గల్ఫ్ ఆఫ్ కంబాట్' వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 533 కి.మీ. దీని ప్రధాన ఉపనదులు సోమ్, అనాస్, పనమ్.

సబర్మతి: ఇది ఆరావళి పర్వతాల దక్షిణ భాగంలోని మేవార్ కొండల్లో సాబర్, హత్‌మతి నదుల కలయికతో ఏర్పడుతుంది. అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రవహిస్తూ, గల్ఫ్ ఆఫ్ కంబాట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 320 కి.మీ.

ప్రధాన ఉపనదులు: వాకుల్, సేథీ, మెష్‌వా, వట్‌రక్.

బానీ: ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని జై సముద్ర అనే ప్రాంతంలో జన్మించి థార్ ఎడారి మీదుగా ప్రవహిస్తూ చివరికి సాంబార్ సరస్సులో కలుస్తుంది.

మాచ్‌ఖండ్: ఇది విశాఖ జిల్లాలోని గూడెం సమీపంలో ఉన్న మాడుగుల కొండల్లో జన్మిస్తుంది. అక్కడి నుంచి ఉత్తర దిశగా ప్రవహించి ఒడిశా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత దక్షిణానికి మరలి తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ నదిపై ప్రసిద్ధి చెందిన 'డుడుమా' జలపాతం ఉంది.

పశ్చిమానికి ప్రవహించే నదులు
నర్మద: పశ్చిమానికి ప్రవహించే నదుల్లో అతి పెద్దది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమరకంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది. పగులులోయ మీదుగా ప్రవహించి గుజరాత్ రాష్ట్రంలోని గల్ఫ్ ఆఫ్ కంబాట్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1310 కి.మీ. ఈ నదిపై ఉన్న ప్రసిద్ధ జలపాతాలు: ధువాందర్, కపిలధార. ఈ నదికి ప్రధాన ఉపనదులు: తావా, బంజార్, షారే, షక్కర్, కుండి, ధూది. వివాదాస్పద 'సర్దార్ సరోవర్' ఆనకట్ట ఈ నదిపైనే ఉంది.

తపతి: పశ్చిమ దిశగా ప్రవహించే నదుల్లో రెండో పెద్దనది తపతి. ఇది సాత్పురా పర్వతాల్లోని ముల్తాయ్ కొండల్లో జన్మిస్తుంది. నర్మదా నదికి సమాంతరంగా ప్రవహిస్తూ గుజరాత్‌లో అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 730 కి.మీ. దీన్ని నర్మదా నది 'చెలికత్తె', 'నర్మదా నది కవల' అని కూడా పిలుస్తారు. ఈ నదికి ప్రధాన ఉపనదులు: పూర్ణా, గిర్ణా, బొరి, కీప్రా, సిప్రా, గంజాల్, అరుణావతి.

పశ్చిమ కనుమల్లో జన్మించే నదులు

    పశ్చిమ కనుమల పశ్చిమ దిశగా జన్మించి, పశ్చిమానికి ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసే నదులు కొన్ని ఉన్నాయి. రాష్ట్రాలవారీగా వాటి వివరాలు...
గోవా: మాండవి, జువారి, రాచల్ మొదలైనవి.

కర్ణాటక: కలినది, గంగవల్లి, భైటి, శరావతి, తాడ్రి, నేత్రావతి మొదలైనవి.

కేరళ: బెయ్‌పోర్, పన్నమ్, భరత్‌పూజి, పెరియార్, పంబ మొదలైనవి.
* కర్ణాటక రాష్ట్రంలోని శరావతి నదిపై దేశంలో ప్రసిద్ధి చెందిన జోగ్ లేదా జెరసొప్ప జలపాతం ఉంది.
* పశ్చిమ కనుమల్లో పుట్టి పశ్చిమ దిశగా ప్రవహించే నదులు అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి ప్రయాణించే దూరం తక్కువ కాబట్టి సాధారణంగా వీటికి మైదానాలు ఏర్పాటు చేసే వీలు ఉండదు.

Posted Date : 13-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌