• facebook
  • whatsapp
  • telegram

అగ్నిపర్వతాలు

అగ్నిపర్వత ప్రక్రియ (Volcanic Process)

*భూమి లోపలి పొరల్లో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి శిలలు కరిగి, ద్రవరూపంలోకి మారతాయి. ఆ ద్రవం అధిక పీడనం, ఉష్ణోగ్రతల వల్ల భూమి ఉపరితలం పైకి ప్రవహిస్తుంది.

*ఈ మొత్తం ప్రక్రియను అగ్నిపర్వత ప్రక్రియ అంటారు.

*ఇందులో భాగంగా అగ్నిపర్వతాలు, లావా పీఠభూములు ఏర్పడతాయి.

* అగ్నిపర్వత శిలాద్రవాన్ని రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:

1) మాగ్మా    2) లావా

మాగ్మా (Magma)

భూమి లోపలి ఉష్ణోగ్రతల వల్ల కరిగిన రూపంలో ఉండే శిలాద్రవాన్ని మాగ్మా అంటారు. 

*మాగ్మా ఉండే ప్రదేశాన్ని మాగ్మా ఛాంబర్‌ అంటారు.

* సాధారణంగా మాగ్మా ఉష్ణోగ్రత 700°C నుంచి 1300°C మధ్య ఉంటుంది.

మాగ్మాలో సిలికా, ఆక్సిజన్, అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియంతో పాటు నీటి ఆవిరి, వాయువులు ఉంటాయి.

లావా(Lava)

భూమి లోపలి శిలాద్రవం (మాగ్మా) ఉపరితలానికి రాగానే నీటి ఆవిరి, వాయువులను కోల్పోతుంది. దీన్నే లావా అంటారు.

అగ్నిపర్వత ఉద్భేదనం - రకాలు

కేంద్రీయ ఉద్భేదనం (Central Eruption): మాగ్మా పదార్థం ఒకే అగ్నిపర్వత గొట్టం ద్వారా భూఉపరితలానికి చేరితే దాన్ని కేంద్రీయ ఉద్భేదనం అంటారు.

కేంద్రీయ ఉద్భేదనం వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి.

భ్రంశోద్భేదనం (Fissure Eruption): మాగ్మా అనేక గొట్టాలు లేదా మార్గాల ద్వారా భూఉపరితలానికి చేరే ప్రక్రియను భ్రంశోద్భేదనం అంటారు.

*ఈ ప్రకియ వల్ల లావా పీఠభూములు ఏర్పడతాయి.

గీజర్స్‌ (Geysers)

నిర్ణీత వ్యవధిలో భూ అంతర్భాగ పొరల నుంచి వేడి నీరు బలంగా ఎగజిమ్ముకుంటూ పైకి వస్తుంది. వీటినే గీజర్స్‌ అంటారు. వీటిని ఉష్ణ ద్రవ నిర్ఘారాలు అని కూడా అంటారు.

* ఐలాండ్‌లోని ఎల్లోస్టోన్‌ నేషనల్‌పార్క్‌లో ఇలాంటి గీజర్స్‌ ఉన్నాయి.


విస్ఫోటన తీవ్రత ఆధారంగా అగ్నిపర్వత రకాలు

విస్ఫోటన తీవ్రత ఆధారంగా అగ్నిపర్వతాలను నాలుగు రకాలుగా విభజించారు. అవి:

1) హవాయిన్‌ రీతి అగ్నిపర్వతాలు: ఇందులో తీవ్రమైన పేలుడు ఉండదు. శిలాద్రవం నెమ్మదిగా, నిరంతరం ప్రవహిస్తుంది.

2) స్ట్రంబోలియన్‌ రీతి అగ్నిపర్వత విస్ఫోటన: మధ్యధరా సముద్రంలోని స్ట్రంబోలి అగ్నిపర్వత విస్ఫోటనంలో చిక్కటి లావా ప్రవహిస్తుంది. దీంతో పాటు రాతి ముక్కలు కూడా వస్తాయి. ఈ రకమైన విస్ఫోటనం కలిగిన అగ్నిపర్వతాలను స్ట్రంబోలియన్‌ విస్ఫోటనం అంటారు.

3) వల్కానియన్‌ రీతి విస్ఫోటనం: ఈ రకమైన విస్ఫోటనంలో అత్యధిక చిక్కదనం ఉన్న లావా ప్రవహిస్తుంది. దీంతో పాటు అత్యధికంగా అగ్నిపర్వత బూడిద వెలువడుతుంది. ఈ ధూళి వల్ల దట్టమైన నల్లటి గుమ్మటపు ఆకారాలు ఏర్పడతాయి.

4) పీలియన్‌ రీతి విస్ఫోటనం: ఇందులో అత్యధిక తీవ్రమైన పేలుడు సంభవింస్తుంది. అత్యధిక చిక్కదనం కలిగిన లావా బయటకి వస్తుంది.


అగ్నిపర్వతాల ప్రపంచ విస్తరణ (World Distribution of Volcanics)

1) పసిఫిక్‌ పరివేష్టిత ప్రాంతం (CricumPacific Belt): అగ్నిపర్వతాల్లో ఎక్కువ శాతం (80%) పసిఫిక్‌ సముద్రం చుట్టూ మేఖలుగా విస్తరించి ఉన్నాయి. వీటిని ‘పసిఫిక్‌ పరివేష్టిత మేఖల’ లేదా ‘పసిఫిక్‌ అగ్ని వలయం’ అని అంటారు.

*ఈ వలయంలో ప్యూజియామా, కోటాపాక్సి; ఫిలిప్పీన్స్‌ దీవుల్లోని మోయోన్‌; ఇండోనేసియాలోని క్రాకటోవా అగ్నిపర్వతాలు ఉన్నాయి.

2) ప్రపంచ మధ్య పర్వత ప్రాంతం (Mid Mountain Belt):

* పైరనీస్‌ పర్వతాల నుంచి అరకన్‌ యోమా వరకు ఉన్న విశాల ప్రాంతాన్ని ప్రపంచ మధ్య పర్వత ప్రాంతం అంటారు.

*ఇటలీలోని వెసువియస్, మధ్యధరా సముద్రంలోని స్ట్రంబోలి అగ్నిపర్వతాలు ఈ వలయంలో ఉన్నాయి.

* స్ట్రంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యధరా సముద్రపు దీపపు స్తంభం (Light House Of Mediterranean sea) అని పిలుస్తారు.


3. అట్లాంటిక్‌ మధ్య ప్రాంతం(Mid Atlantic Ocean Ridge)

*అట్లాంటిక్‌ మహా సముద్రంలో S ఆకారంలోని మిడ్‌ ఓషియానిక్‌ రిడ్జ్‌ వెంట ఉండే అగ్నిపర్వతాలు ఈ ప్రాంతంలోకి వస్తాయి.

* ఇక్కడ ఉండే అగ్నిపర్వతాలు భ్రంశోద్భేదానికి చెందినవి.

*అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఉండే ఐలాండ్, అజోర్స్, కోప్‌వర్టీ, సెయింట్‌ హెలీనా, కెనరీ మొదలైన ద్వీపాలు అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి.

ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు  

కోటాపాక్స్‌: ఈక్వెడార్‌ దేశంలో ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం.

మౌన లోవ: హవాయి దీవుల్లో ఉంది. ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో అతి పెద్దది.

ప్యూజియామా: జపాన్‌లో ఉంది. క్రీ.పూ. 79లో పొంటే పట్టణాన్ని ధ్వంసం చేసింది.

స్ట్రంబోలి: మధ్యధరా సముద్రంలో లిపారి దీవుల్లో ఉంది.

క్రాకటోవ: ఇండోనేసియాలో ఉంది.

బారెన్, నార్కొండమ్‌: భారతదేశంలోని అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉన్నాయి.

ప్రపంచంలో అగ్నిపర్వతాలు లేని దేశం/ ఖండం ఆస్ట్రేలియా.


అగ్నిపర్వతాలు - రకాలు 

ఉద్భేదనం, తరచుదనం ప్రాతిపదికగా అగ్నిపర్వతాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1) క్రియాశీల అగ్నిపర్వతాలు (Active Volcanoes)

2) నిద్రాణ అగ్నిపర్వతాలు (Dormant Volcanoes)

3. విలుప్త అగ్నిపర్వతాలు(Extinct Volcanoes)

క్రియాశీల అగ్నిపర్వతాలు: తరచుగా లేదా నిరంతరం విస్ఫోటనం చెందే అగ్నిపర్వతాలను క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి.

ఉదా: స్ట్రంబోలి, ఎట్నా, బారెన్‌ మొదలైనవి.

* ప్రపంచంలో అతిపెద్ద క్రియాశీలక అగ్నిపర్వతం మౌన లోవ. ఇది పసిఫిక్‌ మహాసముద్రంలోని హవాయి దీవుల్లో ఉంది.

నిద్రాణ అగ్నిపర్వతాలు: గతంలో విస్ఫోటనం జరిగి, ప్రస్తుతం క్రియాశీలకంగా లేని అగ్నిపర్వతాలను నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు.

ఇవి భవిష్యత్తులో విస్ఫోటనం చెందొచ్చు.

ఉదా: ఇటలీలోని వెసూవియస్, జపాన్‌లోని ప్యూజియామా.

విలుప్త అగ్నిపర్వతాలు: ఇవి వర్తమానంలో లేదా భవిష్యత్తులో విస్ఫోటనం చెందలేవు. 

వీటినే మృత అగ్నిపర్వతాలు (Dead Volcanoes) అంటారు.

ఉదా: నార్కొండం (భారతదేశం), కిలిమంజారో (టాంజానియా).

అగ్నిపర్వత భూస్వరూపాలు(Volcanic Landforms)

అగ్నిపర్వత భూస్వరూపాలను రెండు రకాలుగా విభజించారు. అవి: 

1) ఉద్గమ స్వరూపాలు(Extrusive forms)

2) అంతర్గమ స్వరూపాలు(Intrusive forms)


ఉద్గమ స్వరూపాలు 

లావా భూఉపరితలానికి చేరాక ఏర్పడే స్వరూపాలను ఉద్గమ స్వరూపాలు అంటారు. వీటిలో కింది రకాలు ఉన్నాయి.

ఎ) స్కోరియా(Scoria): నురగతో ఉన్న లావా ఘనీభవించాక ఏర్పడిన అగ్నిపర్వత శిల.

బి)  ప్యూమిస్‌(Pumice): ఇది స్కోరియాను పోలి ఉంటుంది. వీటిలో గాలి బుడగలు ఉంటాయి. అందుకే ఇవి తేలిగ్గా ఉంటాయి.

సి) లాపిలి(Lapilli): అగ్నిపర్వత విస్ఫోటనం జరిగే సమయంలో ఎగజిమ్మిన చిన్న చిన్న రాతిముక్కలను లాపిలి అంటారు.

డి)   అగ్లోమరేట్‌ శిల (AgglomerateRock): అగ్నిపర్వత బూడిద, ప్యూమిస్, స్కోరియా కలిసి ఏర్పడిన శిలను అగ్లోమరేట్‌ అంటారు.

ఇ) అగ్నిపర్వత బాంబులు(Volcanic Bombs):- పరిమాణంలో పెద్దవిగా ఉన్న అగ్నిపర్వత శిలలను అగ్నిపర్వత బాంబు అంటారు.

ఎఫ్) బ్రేసియా (Breccia): భూ ఉపరితలం పైకి వచ్చిన లావా పైభాగం త్వరగా చల్లారి, ఘనీభవించి; కింద ఇంకా ద్రవస్థితిలో ఉన్న లావా ముక్కలుగా విరిగి ఏర్పడే శిలా స్వరూపాన్ని బ్రేసియా అంటారు.

జి)  క్రేటర్‌ (Crater): అగ్నిపర్వత ముఖద్వారాన్ని క్రేటర్‌ అంటారు. వీటిలో కొన్ని పెద్ద పరిమాణంలో ఉంటాయి. వీటిని కాల్టెర అంటారు. 

* వీటిలో నీరు చేరడంవల్ల ఏర్పడే సరస్సులను క్రేటర్‌ సరస్సులు లేదా కాల్టెర సరస్సులు అంటారు. 

ఉదా: మహారాష్ట్రలోని లూనార్‌ సరస్సు.

అంతర్గమ స్వరూపాలు 

శిలాద్రవం లేదా మాగ్మా భూఉపరితలానికి చేరే క్రమంలో ఏర్పడే స్వరూపాలను అంతర్గమ స్వరూపాలు అంటారు.

ఎ) బాతోలిత్‌(Batholith):- అగ్నిపర్వత శిలాద్రవం మాగ్మా ఛాంబర్‌ వద్దే ఘనీభవిస్తే, ఆ స్వరూపాన్ని బాలోలిత్‌ అంటారు. ఈ స్వరూపం గుమ్మటం ఆకారంలో ఉంటుంది.

బి)  లాకోలిత్‌(Laccolith):- శిలాద్రవం ఉపరితలంపైకి ప్రవహించే సమయంలో గుట్టగా ఏర్పడితే, ఆ స్వరూపాన్ని లాకోలిత్‌ అంటారు. ఇవి బాతోలిత్‌ల కంటే చిన్నవిగా ఉంటాయి.

సి)  సిల్‌ (SilI): అగ్నిపర్వత శిలాద్రవం రెండు సమాంతర భూస్వరూపాల మధ్య ఘనీభవించి, ఏర్పడిన స్వరూపాన్ని సిల్‌ అటారు.

డి) డైక్‌ (Dyke): స్తంభంలా ఏర్పడిన అగ్నిపర్వత శిలా స్వరూపాన్ని డైక్‌ అంటారు.

Posted Date : 20-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌