‣ పరీక్షల ఘట్టంలో తడబడొద్దు!
‣ ఆత్మవిశ్వాసం, సానుకూలత ముఖ్యం
పరీక్షలు దగ్గరవుతుంటే చాలామంది విద్యార్థుల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తుంటుంది. కానీ నిజానికి భయపడాల్సిందేమీ లేదు! అందరికీ అవే ప్రశ్నలు.. ఎంతగానో పరిచయం ఉన్నవే. ఏడాది నుంచీ చదివినవే. ఎన్నోసార్లు రాసినవే. మరోమారు రాయాలి. అంతే! ప్రతిభను ప్రదర్శించబోయే ఈ తరుణంలో తడబడితే ఇంతకాలం కష్టం వృథా అవుతుంది. అందుకే ఇంటర్, టెన్త్ పరీక్షల సమయం సమీపిస్తున్న ఈ సమయంలో పునశ్చరణను విస్మరించకూడదు. హైరానా పడటం మానేసి ప్రశాంతంగా, ధీమాగా ఉంటేనే హాయిగా పరీక్షలు రాసి, ఆనందంగా బయటకు వస్తారు. అందుకు ఏమేం చేయాలో పరిశీలిద్దాం!
ఏడాది పాటు సాగిన కఠోర శ్రమ ఫలితాన్ని నిర్ణయించడానికి రాతపరీక్షలే ప్రామాణికం. ఈ స్వల్ప వ్యవధిని సద్వినియోగం చేసుకున్నవారిదే విజయం. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. సానుకూల దృక్పథమే ప్రేరణగా.. పరీక్ష హాలులోకి అడుగెడితే ప్రతి ప్రశ్నకూ సమాధానం దొరుకుతుంది. అన్ని సబ్జెక్టుల్లోనూ మెరుగైన మార్కులు ఖాయమవుతాయి.
మూల్యాంకనం చేసేవారికి మీ గురించేమీ తెలీదు. మీ తెలివితేటలపై అవగాహన ఉండదు. మీ సమాధానాలే వారికి ఆధారం. మిమ్మల్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లడానికే ఈ ప్రయత్నం. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వరాదు. ‘వచ్చు. కానీ రాయడం మర్చిపోయా’, ‘ఒత్తిడి ఎక్కువై ఈ లెక్కలో చిన్న తప్పు చేశా’, ‘జ్వరం కదా..సరిగా రాయలేకపోయా..’ ఇలాంటివేమీ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ పరీక్షలు మీ విద్యాసంస్థలో జరగడం లేదు. మీ మాస్టార్లు వాటిని మూల్యాంకనం చేయడం లేదు. వీటిని గుర్తుంచుకుని జాగ్రత్తగా రాయడం తప్పనిసరి.
ప్రశ్నలు శ్రద్ధగా చదివి, దానికి తగ్గ జవాబులే రాయాలి. తెలిసిన పాయింట్లన్నీ మర్చిపోకుండా ఒక పద్ధతిగా పేర్చాలి. మీ సమాధానాలు మూల్యాంకనం చేసినవారిని హత్తుకోవాలి. వీటికి అక్షరరూపం సాక్షాత్కారం కావడానికి ఏడాదంతా ఏమి నేర్చుకున్నారో కీలకం కాదు. ఒడిసిపట్టిన విజ్ఞానాన్ని ఎంత ప్రభావవంతంగా ప్రదర్శించారన్నదే ముఖ్యం.
పరీక్ష రోజున...
‣ అవసరమైనవన్నీ (హాల్ టికెట్, రెండు పెన్నులు, పెన్సిల్, రబ్బరు, నీళ్ల సీసా, రుమాలు...) ఉన్నాయో, లేవో పరిశీలించుకుని మీతోపాటు తీసుకువెళ్లండి.
‣ ఆహారం తీసుకోకపోతే నేర్చుకున్న విషయాలు గుర్తుకురావు, వేగంగా రాయడం సాధ్యంకాదు..మెదడు చురుకుగా పనిచేయాలంటే గ్లూకోజ్ అందాలి. అందువల్ల ఏమీ తినకుండా, ఖాళీ కడుపుతో పరీక్ష హాలులోకి వెళ్లవద్దు.
‣ పరీక్షకు బయలుదేరే ముందు, వెళ్తున్న తోవలో ఏమీ చదవకుండా విశ్రాంతిగా ఉండండి.
‣ నిర్దేశిత సమయం కంటే కనీసం పావుగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
‣ ఆత్మవిశ్వాసంతో పరీక్ష కేంద్రంలోకి అడుగెట్టండి. రెండు మూడు సార్లు ఊపిరి బాగా పీల్చుకుని, నెమ్మదిగా వదలండి.
‣ ప్రశ్నలన్నీ ఒకసారి చదవండి. కష్టమైన ప్రశ్నలు, సమాధానం తెలియనివి కనిపిస్తే ఆందోళన చెందకండి. మీకు కష్టంగా అనిపించింది పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ కష్టంగానే ఉంటుందని తెలుసుకోండి.
‣ బాగా తెలిసిన ప్రశ్నతో జవాబు ప్రారంభించండి. ముఖ్యమైన పాయింట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.

‣ మధ్యలో జవాబు మర్చిపోతే ఆలోచనకు కొంత సమయమే కేటాయించండి. అక్కడే ఆగిపోతే మిగిలిన వాటికి సమయం సరిపోదు. అవసరమైనంత ఖాళీ వదిలి మరో ప్రశ్నలోకి వెళ్లండి. పరీక్ష చివరిలో ఇలా వదిలేసినవాటి గురించి ఆలోచించవచ్చు.
సమయ నిర్వహణ...
మార్కులను బట్టి ఆ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించవచ్చో నిర్ణయించుకోండి. నిర్ణీత వ్యవధిలోగా అన్నీ పూర్తయ్యేలా చూసుకోండి. అప్పుడప్పుడు సమయాన్ని గమనించండి. ఎక్కువ ఎడిషన్లు రాస్తేనే అధిక మార్కులు వస్తాయని భావించవద్దు. ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల ప్రకారం సమాధానం ఉండాలి. అందులో ఉపయోగించే పదజాలం (కీ వర్డ్స్) కీలకం. తెలిసిన ప్రతి చిన్న విషయాన్నీ రాయవద్దు. అడగకుండా చేసే జ్ఞానప్రదర్శనతో మార్కులు తగ్గిపోతాయి.
అకడమిక్ పరీక్షల్లో చేతిరాతకు ప్రాధాన్యం ఉంటుంది. దస్తూరి అర్థమయ్యేలా ఉండాలి. ఇరికించి రాయకుండా పదాల, వాక్యాల మధ్య చిన్న ఖాళీ విడిచిపెట్టాలి. వీలైనంతవరకూ కొట్టివేతలు, దిద్దిరాయడం లేకుండా చూసుకోవాలి.
కనీసం పది నిమిషాల ముందే ప్రశ్నపత్రాన్ని పూర్తిచేయండి. అవసరమైన అన్ని ప్రశ్నలకూ జవాబులు రాశారో, లేదో సరిచూసుకోండి. ప్రశ్న సంఖ్య, సెక్షన్ కచ్చితంగా ఉన్నాయా, లేదా గమనించండి. అడిషనల్ పత్రాలు క్రమ పద్ధతిలో పెట్టారో లేదో పరిశీలించండి. హాల్ టికెట్ నంబర్ సరిగా రాశారో లేదో గమనించండి….
ఆందోళన పడొద్దు‣ ఒత్తిడికి గురైనా, మనసు పక్కకు మళ్లినా.. వచ్చిన ప్రశ్నలే ముచ్చెమటలు పట్టిస్తాయి. కలం ముందుకి కదలదు.
‣ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అది సమృద్ధిగా ఉన్నవారినే విజయం వరిస్తుంది.
‣ బాగా చదివాం.. కాబట్టి బాగా రాయగలం..ఆందోళన చెందాల్సిన పనిలేదు.. అనుకుంటే ఒత్తిడి దూరమవుతుంది.
‣ నిరుత్సాహానికి గురైన సందర్భాల్లో ‘నేను పరీక్షలు బాగా రాయగలను. విజయం నాదే’ అని మనసుకు సందేశాన్ని పంపండి. మన ఆలోచనలే ఫలితాలకు ప్రతిరూపాలు.
‣ వేసవి కాలం కాబట్టి సౌకర్యవంతంగా, వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వండి.
‣ పరీక్షలన్నాళ్లూ.. వేగంగా నిద్రకు ఉపక్రమించడం, తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకోండి. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని చదవడం వల్ల మెదడు చురుకుగా పనిచేయదు. మానసికంగానూ అలసట అనిపిస్తుంది. పరీక్ష హాల్లో ఆహ్లాదంగా, తాజాగా ఉండాలంటే కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి.
పరీక్ష రాశాక...‣ పరీక్ష ముగియగానే ప్రశాంతంగా బయటకు వచ్చేయండి. ఎవరితోనూ జవాబుల గురించి చర్చించవద్దు. చేసిన తప్పులు గుర్తుచేసుకుని ‘అయ్యో, ఎందుకలా జరిగిం’దని ఆలోచిస్తూ, దిగులు పడొద్దు. రాసిన జవాబు సరైనదా, కాదా తెలుసుకోవడానికి పుస్తకాలు తిరగేయొద్దు. ఈ వివరాలు సరిచూసుకోవడానికి అన్ని పరీక్షలూ ముగిసిన తర్వాత కావాల్సినంత సమయం ఉంటుంది.
‣ ఇవాళ్టి పరీక్ష ప్రభావం రేపటి దానిపై పడకుండా జాగ్రత్త వహించండి. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగితే వాటిని మర్చిపోండి. మిగిలిన పరీక్షల ద్వారా అదనంగా మార్కులు రాబట్టుకోవడానికి ప్రయత్నించండి.