• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దానశీలము

III. భాషాంశాలు

1. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) పలికి లేదనుట
జ: పలికి లేదనుట మహాపాపంతో సమానం.
ఆ) కుఱుచగుట
జ: సాయి వేసుకుంటున్న నిక్కరు దినదినం కుఱుచవడం గమనించింది వాళ్ల అమ్మ.
ఇ) చేతులొగ్గు
జ: ఎల్లవేళలా కాపాడమని దేవుడికి చేతులొగ్గుతాను.

 

2. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) నీరజభవుడు: విష్ణువు నాభికమలం నుంచి పుట్టినవాడు - బ్రహ్మ
ఆ) త్రివిక్రముడు: మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచినవాడు - విష్ణువు

 

3. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి.
అ) జలములతో నిండిన చెఱువులు మిక్కిలి హాయినీ, ఆనందాన్నీ కలిగిస్తాయి.
జ: జలము = నీళ్లు, సలిలము, పానీయం
ఆ) జీవచ్ఛవం కావడం కంటే యశ:కాయుడు కావడం మిన్న.
జ: యశ: = కీర్తి, పేరు, గొప్ప

 

4. కిందివాటిలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.
   అ) సిరి     ఆ) విద్య     ఇ) విష్ణువు     ఈ) కీరితి     ఉ) ధర్మం     ఊ) బ్రహ్మ
జ:

ప్రకృతి వికృతి
 శ్రీ  సిరి
 విద్య  విద్దె
 విష్ణువు  వెన్నుడు
 కీర్తి  కీరితి
 ధర్మము   దమ్మము
 బ్రహ్మ  బమ్మ

5. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) కులము = వంశం, జాతి, శరీరం
ఆ) క్షేత్రం = చోటు, పుణ్యస్థానం, భూమి
ఇ) తోడు = ఒట్టు, సమానమైన, సోపతి
ఈ) హరి = విష్ణువు, ఇంద్రుడు, గుర్రం
ఉ) చిత్తము = మనసు, ఇష్టం, కరుణ

 

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీసి సంధి పేరు రాయండి.
ఉదా: రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది.
అత్యద్భుతం = అతి + అద్భుతం = యణాదేశసంధి
అ) గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు.
జ: గర్వ + ఉన్నతి = గర్వోన్నతి = గుణసంధి
సూత్రం: 'అ' కారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు క్రమంగా ఆదేశంగా వస్తాయి.
పై పదంలో అ + ఉ - ఓగా వచ్చింది.

 

ఆ) అభ్యాగతులకు దానం చేయడం మంచిది.
జ: అభి + ఆగతులు = అభ్యాగతులు = యణాదేశ సంధి
సూత్రం: ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
పై పదంలో ఇ + అ = య గా వచ్చింది.

 

ఇ) రంతిదేవుడు వదాన్యోత్తముడు.
జ: వదాన్య + ఉత్తముడు = వదాన్యోత్తముడు - గుణసంధి
సూత్రం: 'అ' కారానికి ఇ, ఉ, ఋ పరమైతే ఏ, ఓ, అర్ లు క్రమంగా ఆదేశంగా వస్తాయి.
పై పదంలో అ + ఉ - ఓ ను గమనించవచ్చు.

 

ఈ) అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి.
జ: అణు + ఆయుధాలు - అణ్వాయుధాలు - యణాదేశ సంధి
సూత్రం: ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరమైతే క్రమంగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
పై పదంలో ఉ + ఆ - వ గా గమనించవచ్చు.

 

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలు గుర్తించండి.
అ) జీవధనములు = జీవమును, ధనమును - ద్వంద్వ సమాసం
ఆ) యువతీయువకులు = యువతులును, యువకులును - ద్వంద్వ సమాసం
ఇ) దశదిక్కులు = పది సంఖ్య ఉన్న దిక్కులు - ద్విగు సమాసం
ఈ) భూతప్రేతములు = భూతములును, ప్రేతములును - ద్వంద్వ సమాసం

 

3. కింది పద్య పాదాలను గణవిభజన చేసి, ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. లక్షణాలను రాయండి.


పై పద్యం మత్తేభానికి సంబంధించింది.

 

మత్తేభం లక్షణాలు:
1) నాలుగు పాదాలు ఉంటాయి.
2) ప్రతి పాదంలో వరుసగా 'స భ ర న మ య వ' అనే గణాలు వస్తాయి.
3) యతి స్థానం '14వ' అక్షరం.
4) ప్రాస నియమం ఉంటుంది.
5) మొత్తం అక్షరాలు 20.

పై పద్యం 'చంపకమాల'కు చెందింది.
 

చంపకమాల లక్షణాలు
1) నాలుగు పాదాలు ఉంటాయి.
2) ప్రతి పాదంలో న జ భ జ జ జ ర అనే గణాలు వరసగా వస్తాయి.
3) యతిస్థానం 11వ అక్షరం.
4) ప్రాస నియమం ఉంటుంది.
5) మొత్తం అక్షరాలు 21.

 

త్రిక సంధి
కింది పదాలను గమనించండి
అ) అచ్చోటు - ఆ + చోటు
ఆ) ఇవ్విధము - ఈ + విధము
ఇ) ఎక్కాలము - ఏ + కాలము
* పైన విడదీసిన పూర్వపదాల్లో 'ఆ, ఈ, ఏ'లు ఉన్నాయి. ఇవి సర్వనామాలు
ఆ + చోట - ఆ + చ్చోటు
ఈ + విధము - ఈ + వ్విధము
ఏ + కాలము - ఏ + క్కాలము
త్రికం మీది అసంయుక్త హల్లు ద్విత్వంగా మారింది.
ఆ + చ్చోటు - అచ్చోటు
ఈ + వ్విధము - ఇవ్విధము
ఏ + క్కాలము - ఎక్కాలము
ద్విత్వంపైన ఉన్న దీర్ఘాచ్చులు (ఆ, ఈ, ఏ)లు హ్రస్వాలుగా (అ, ఇ, ఎ) మారతాయి.
* పైన చెప్పిన మూడు విధాలను ఇలా చూపించవచ్చు.
   అచ్చోటు - ఆ + చోటు - ఆ + చ్చోటు - అచ్చోటు
ఇవ్విధము - ఈ + విధము - ఈ + వ్విధము - ఇవ్విధము
ఎక్కాలము - ఏ + కాలము - ఏ + క్కాలము - ఎక్కాలము

 

* త్రికసంధికి సూత్రాలు మూడు
1) ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికాలు.
2) త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళం అవుతుంది.
3) ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు అచ్ఛికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది.

 

త్రిక సంధిలో కొన్ని మాటలకు వివరణలు
* ద్విత్వం అంటే ఒక అక్షరం దాని ఒత్తు దానికే రావడం.
ఉదా: క్క, వ్వ
దీన్నే 'ద్విరుక్తం' అని కూడా అంటారు.
* బహుళం - అంటే ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం, రాకపోవడం, వికల్పంగా రావడం, అన్యకార్యంగా రావడం - ఇలా నాలుగు విధాలుగా జరిగితే 'బహుళం' అంటారు.
అచ్ఛికం అంటే అచ్చ తెలుగు పదం.
* త్రికసంధిని గుర్తించండి ఇలా....
ఆ, ఈ, ఏ అనే అక్షరాలు ముందు ఉండి, వాటి పక్క అక్షరాలకు అవే ఒత్తులుగా ఉంటాయి.
ఉదా: ఎక్కడ, అవ్వాన

 


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌