• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దానశీలము

'ఆలోచించండి - చెప్పండి' 


1. శుక్రుడు బలిచక్రవర్తితో ''వలదీ దానము గీనమున్" అని ఎందుకు హెచ్చరించాడో ఊహించండి.
జ: శుక్రుడు బలిచక్రవర్తితో 'వలదీ దానము గీనమున్' అని ఎందుకు హెచ్చరించాడంటే శుక్రుడు రాక్షసుల గురువు. తన శిష్యుడు బలి చక్రవర్తి దగ్గరకు వచ్చిన వ్యక్తి విష్ణుమూర్తి అని, అతడికి మూడు అడుగుల నేలను ఇస్తే తన శిష్యుడికి మరణం తప్పదని తెలుసుకున్నాడు. తన రాక్షస కులాన్ని కంటికిరెప్పలా చూసేవాడు. వారిని కాపాడుకోవాలని తహతహలాడే స్వభావం ఉన్నవాడు. తన శిష్యుడు బలిచక్రవర్తి మరణిస్తే తన రాక్షస కులానికి పెద్ద దిక్కు కోల్పోవాల్సి వస్తుందని 'దానము వద్దు' అని హెచ్చరించాడు.

 

2. 'మాన ధనులు' ఎట్లా ఉంటారని మీరు భావిస్తారు?
జ: 'మానధనులు' అంటే అభిమానాన్నే ధనంగా గలవారు. వారు ఆడినమాట తప్పరు. పలికి బొంకరు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. సత్యంతో బతుకుతారు. అసత్యం అసలే పలకరు. ఎందులోనైనా వెనుదిరగకుండా ఉంటారు. అహంకారం ఉండదు. అడిగినవారికి దానం చేస్తారు.
   ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి, ధనానికి చేటు వచ్చినా చివరకు మరణం సంభవించినా 'మానధనులు' మాట తప్పరు.

 

3. 'కీర్తిని సంపాదించడమే గొప్ప' అని చెప్పిన బలిచక్రవర్తి మాటలను మీరు ఏవిధంగా సమర్థిస్తారు?
జ: కీర్తిని సంపాదించడమే గొప్ప అని చెప్పిన బలిచక్రవర్తి మాటలను నేను సమర్థిస్తాను. ఎందుకంటే ప్రతి మనిషికి మరణం తప్పదు. ఎంతకాలం బతికినా స్వార్థంతో తన ప్రయోజనాల కోసం ఆశించే వారిని లోకం గుర్తుంచుకోదు. మనం అనుభవించే ఏ రకమైన విలాసమైనా అశాశ్వతమైందే.
   చేసే మంచి పనులు పేరును తెచ్చిపెడతాయి. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. ఎంతోమంది పుడతారు, మరణిస్తారు. కానీ, తాము చేసిన మంచి పనులతో, అందరితో మమేకమై త్యాగ భావనతో సేవ చేసిన వారే ప్రజల మనస్సుల్లో నిలిచిపోతారు. అందుకే 'కీర్తిని సంపాదించడమే గొప్పది' అని నేను భావిస్తాను.

4. ''తిరుగన్ నేరదు నాదు జిహ్వ"! అన్నాడు కవి. దీన్ని బట్టి మీకేం తెలిసింది?
జ: బలిచక్రవర్తి వామనుడికి మూడు అడుగుల నేల ఇస్తానని చెప్పిన సందర్భంలో శుక్రాచార్యుడు వద్దని అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి 'నా నాలుక వెనుదిరగదు' అనే మాటలను శుక్రాచార్యుడితో అన్నాడు. ఆ మాటను బట్టి బలిచక్రవర్తి మరణం సంభవించినా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వాడని తెలుస్తుంది. మాట గొప్పదనం ఇంతటి ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుందని మనకు అర్థమవుతుంది. బలిచక్రవర్తి రాక్షస నాయకుడైనా 'సత్యవాక్కు' పట్ల నిబద్దత ఉన్నవాడని దీన్ని బట్టి తెలుస్తుంది.

 

5. 'శిబి గొప్పదాత' - ఎందుకు?
జ: శిబి చక్రవర్తి గొప్పదాత. ఎందుకంటే ఇంద్రుడు, అగ్నిదేవుడు అంతటివారు ఆయనను పరీక్షిద్దామని ఇంద్రుడు డేగగా, అగ్ని దేవుడు పావురంగా మారి డేగ పావురాన్ని తరుముతున్నట్లుగా శిబి చెంతకు చేరారు.  పావురం రక్షించమనగా 'శిబి' తాను కాపాడతానని మాట ఇచ్చాడు. డేగ తనకు సహజ సిద్ధంగా దొరికిన పావురాన్ని వదలమంది. శిబి చక్రవర్తి పావురం తూగేంత తన మాంసాన్ని డేగకు ఇస్తానన్నాడు. తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇస్తానని చెప్పి తూకంగా అందించాడు. అయినా ఎంతకూ తూగకపోయేసరికి తానే తక్కెడలో కూర్చున్నాడు. శిబి చక్రవర్తి దాతృత్వానికి ఇంద్రుడు, అగ్నిదేవుడు మెచ్చుకున్నారు. శిబి ప్రాణత్యాగం చేసైనా దానం చేయాలనుకున్నాడు.

 

6. ఎదుటివారు అడిగిన దాన్ని ఇవ్వడంలో ఎలాంటి తృప్తి ఉంటుంది? మీ అనుభవాలు చెప్పండి.
జ: ఎదుటివారు అడిగిన దాన్ని ఇవ్వడంలో తాను దానం చేసేవాడినేనని, తనలో గొప్పగుణాలూ ఉన్నాయన్న తృప్తి ఉంటుంది. ఎదుటివారికి ఇచ్చినప్పుడు 'నా వల్ల వారు సంతోషపడ్డారు' అన్న భావన కొండంత సంతృప్తిని ఇస్తుంది. వార్షిక పరీక్షల సమయంలో నా పక్క స్నేహితుడి కలం సరిగా రాయడం లేదు. అతడు భయంతో దిక్కులు చూస్తూ నన్ను కలం అడిగాడు. ఇచ్చాన్నేను. నాకెంతో సంతోషమనిపించింది. నాతోపాటు హాస్టల్‌లో ఉండే నాగరాజుకు జ్వరం వచ్చింది. ఇంటికి వెళతానని డబ్బులు అడిగాడు. నా దగ్గర ఉన్న యాభై రూపాయలు ఇచ్చాను. ఇంటికి పంపించాను. అప్పుడు కూడా నా మనసుకు ఆనందం వేసింది.

 

7. 'పొడవు పొడవున గుఱుచై' అని కవి ఎవరిని ఉద్దేశించి, ఎందుకట్లా అని ఉంటాడు?
జ: 'పొడవు పొడవున గుఱుచై' అని కవి విష్ణువును ఉద్దేశించి అన్నాడు. ఎందుకలా అని ఉంటాడంటే అతిపెద్ద రూపంతో ఉన్న విష్ణువును అదే రూపంలో చూడటం కష్టం. అందులో బలిచక్రవర్తిని చంపడం కోసం విష్ణువు వామనుడిగా మారాడు. అంతటి గొప్పవాడు కార్యం నిమిత్తం చిన్నవాడిగా మారడం అంటే తనను తాను తక్కువ స్థితికి చేరుకుని అడగడంగా గమనించవచ్చు. దేవుడైన విష్ణువు దేవతల కోసం ఎంతటి పనికైనా వెనుకాడలేదు. ఎంత ఎదిగినా కొన్ని పనులు ఒదిగి చేసుకోవాలి అని, పొడవైన విష్ణువు చిన్నవాడిగా మారాడు.

 

8. ''మాట దిరుగలేరు మానధనులు" అనే మాటను మీరు సమర్థిస్తారా? ఎందుకు?
జ: 'మాట దిరుగలేరు మానధనులు' అనే మాటను నేను సమర్థిస్తాను. ఎందుకంటే మానధనులు పేదరికం వచ్చినా, ప్రాణాలకు, ధనానికి చేటు వచ్చినా చివరకు మరణమే సంభవించినా మాట తప్పరు. ఎందుకంటే బలిచక్రవర్తి మానధనుడు. విష్ణువు వామనుడిగా మారి బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను అడిగాడు. దానికి బలిచక్రవర్తి అంగీకరించాడు. ఇది తెలుసుకున్న బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు మూడు అడుగుల నేల ఇవ్వవద్దని చెప్పినా, తనకు ప్రాణభయం ఉందని తెలిసినా మాట తప్పక మూడు అడుగుల నేలను ఇచ్చాడు. అభిమానధనులు ఎల్లప్పుడూ తాము ఎన్ని కష్టాలు పడినా 'సత్యవాక్కు'తో జీవిస్తారు. ఇచ్చిన మాటపై ఉంటారు.

 

9. బలిచేసిన దానాన్ని దిక్కులు పొగిడినవని కవి చెప్పిన దాన్ని బట్టి మీరేం గ్రహించారు?
జ: బలి చక్రవర్తి చేసిన దానానికి దిక్కులు పొగిడినవని కవి చెప్పిన దాన్నిబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే బలిచక్రవర్తి దానం చేస్తున్నప్పుడు వామనుడిగా ఉన్న విష్ణువు పెద్దగా పెరిగి దిక్కులు ప్రకాశించేలా దానాన్ని స్వీకరించాడు. అన్ని దిక్కుల్లోని ప్రజలంతా బలిచక్రవర్తి దాన గుణాన్ని గొప్పగా పొగిడారు. అంటే దశదిక్కులు అంతా బలి చేసిన దానాన్నే పొగుడుతూ ఆనందమయులయ్యారు అని తెలుస్తోంది. దీనిద్వారా బలిచక్రవర్తి వామనుడికి చేసిన దానం విఖ్యాతమైందని గ్రహించాను.

 

ఇవి చేయండి
I. అవగాహన - ప్రతిస్పందన

 

1. దానాలన్నీ వేటికవే గొప్పవి. అయితే నేటి కాలంలో రక్తదానం, మరణానంతరం అవయవదానం లాంటివి చేస్తున్నారు కదా! వాటి ప్రాధాన్యాన్ని చర్చించండి.
జ: దానాలన్నీ వేటికవే గొప్పవి. సమాజంలో అనేక రకాలైన దానాలు ఉన్నాయి. కొన్ని దానాలు మానవుడిని తాత్కలికంగా (ఆ సమయానికే) సంతోషపెట్టేవి. మరికొన్ని కొంతకాలం వరకు ఆనందింపజేసేవి. ఇంకొన్ని దానాలు జీవితాంతం చిరస్థాయిగా గుర్తుండిపోయేవి. అయితే మనకు తెలిసిన అన్నదానం, భూదానం, గోదానం, విద్యాదానం, ధనదానం, వస్తుదానం లాంటివి ఆ కాలం నుంచి ఉన్న దానాలే. నేటి కాలంలో రక్తదానం, మరణానంతరం అవయవదానం లాంటివి ఎక్కువయ్యాయి.
   ప్రమాదాల బారిన పడినవారికి రక్తం చాలా అవసరమవుతుంది. ఈ సమయంలో అదే గ్రూపునకు చెందిన రక్తదాత వారికి సహాయపడి, ప్రాణాలు కాపాడుతున్నాడు. వివిధ ప్రయివేటు ఆస్పత్రులు, స్వచ్చంద సంస్థలు బ్లడ్ బ్యాంకులను ఏర్పాటుచేసి రక్తాన్ని సేకరించి నిల్వ ఉంచుతున్నాయి. ఆపద సమయంలో ఆపన్నహస్తంగా రక్తాన్ని అందిస్తున్నాయి. 'చనిపోయాక తమ అవయవాలను పరిశోధనల కోసం ఆస్పత్రులకు; అవసరార్ధులకు ఉపయోగించుకోమని మరికొందరు బతికి ఉండగానే రాసిస్తున్నారు. ఇలా ఎందరో తాము చనిపోయాక కూడా తమ కళ్లు, కిడ్నీలు, కాలేయం లాంటి అవయవాల దానం చేసి చిరంజీవులవుతున్నారు. కొందరైతే బతికి ఉండగానే కిడ్నీ, కాలేయాన్ని దానం చేస్తున్నారు. అధునాతన వైద్యశాస్త్ర పరిజ్ఞానంతో 'గుండె'ను అమరుస్తున్నారు.
క్తదానం, అవయవదానాలతో రోగుల ప్రాణాలను నిలబెట్టిన వారమవుతాం. రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించాలి. అవయవదాతలైతే ఒక వ్యక్తికి లేదా వ్యక్తులకు పునర్జన్మను ప్రసాదించిన వారే. చనిపోయిన తర్వాత మట్టిలో కలపాల్సిన ఈ దేహం నలుగురికి ఉపయోగడపడుతున్నప్పుడు ఆ మహాదానం ఎంతగొప్పదో అర్థం చేసుకోవాలి.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత
 

1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) 'ఈ కుబ్జుండు అలతింబోడు' అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్పడంలో అతడి ఉద్దేశం ఏమై ఉంటుంది? దాంతో మీరు ఏకీభవిస్తారా?
జ: 'ఈ కుబ్జుండు అలతింబోడు' అని బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు చెప్పడంలో అతడి ఉద్దేశమేమిటి అంటే వామనుడిలా వచ్చిన విష్ణువు బలిచక్రవర్తి దగ్గర కొంచెం మాత్రమే తీసుకుని వెళ్లేవాడు కాదు. మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపుడిగా కనిపిస్తాడు. 'నీకు మరణం తప్పదు, ఇచ్చిన మాటను వెనకకు తీసుకో' అని శుక్రాచార్యుడు శిష్యుడైన బలిచక్రవర్తిని హెచ్చరించాడు. ఆయన ప్రధాన ఉద్దేశం 'నీవు ఆపదలో ఉన్నావు వచ్చిన వామనుడి నుంచి నిన్ను నీవు కాపాడుకో' అని.
   పైన చెప్పిన 'ఈ కుబ్జుండు అలతింబోడు' అనే వాక్యాన్ని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు. ఈ వాక్యంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆపదలో ఉన్న శిష్యుడిని గురువు మేల్కొల్పడం ఉత్తముడైన గురువు చేసే మంచిపని. దాన్ని అనుసరించి శిష్యుడు నడుచుకోవడం మంచిది.

ఆ) హాలికునికి కావాల్సిన వసతి సౌకర్యాలు ఏవిధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు?
జ: హాలికుడు అంటే హాలం (నాగలి)తో పనిచేసి జీవనం కొనసాగించే వ్యవసాయదారుడు. అతడికి కింది వసతి సౌకర్యాలు ఉంటే అతడు తృప్తి చెందుతాడు.
* జీవనానికి సరిపడా పంటపొలం
* మంచిధార ఉండే బోరు లేదా నీళ్లున్న బాయి
* బోరు/బాయి నుంచి నీరు తీయడానికి సరిపోయే విద్యుత్తు
* మేలైన విత్తనాలు
* ఏపుగా దిగుబడినిచ్చే రసాయన ఎరువులు/సేంద్రియ ఎరువులు
* కావాల్సినంత పనివాళ్లు
* అమ్మకానికి గిట్టుబాటు ధర
* ప్రభుత్వం ఇచ్చే రుణాలు
* రుణమాఫీ పథకం

ఇ) ''సిరి మూట గట్టుకొని పోవం జాలిరే"? అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది?
జ: పూర్వకాలంలో ఎందరో రాజులు తమ రాజ్యాల్లో సరిసంపదలతో తులతూగారు. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. ఎంతో సంపాదించారు. కానీ వాళ్లెవరూ సంపదను మూటగట్టుకుని మరణించాక తమతోపాటు తీసుకువెళ్లలేదు అని బలిచక్రవర్తి తన గురువు శుక్రాచార్యుడితో అనడంలో ఆంతర్యం ఏమిటంటే ఎవరైనా తమ మరణాంతరం ఏమీ తమతో తీసుకువెళ్లరని, ధనం శాశ్వతమైంది కాదని మనం బతికి ఉన్నప్పుడు చేసిన మంచిపనులే మిగిలి ఉంటాయని, కీర్తి గొప్పదని దాని కోసమే జీవించి ఉండాలని తెలియజేశాడు.

 

ఈ) ఈ పాఠాన్ని బట్టి పోతన కవిత్వం ఎట్లా ఉందని భావిస్తున్నారు?
జ: 'దానశీలము' అనే ఈ పాఠంలో 'పోతన' కవిత్వం పండిత పామర జనరంజకంగా సాగింది. రమణీయశైలిలో అద్భుతమైన పలుకులతో సన్నివేశాలను రక్తి కట్టించాడు.
పోతన కవిత్వం శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా కొనసాగింది. గురుశిష్యుల సంభాషణను గుర్తుంచుకునే పద్యాలతో తెలియజేశాడు. 'తిరుగన్ నేరదునాదు జిహ్వ' అని, మాట దిరుగలేరు మానధనులు అనే నీతి పదాల పొంతనతో పెనవేయించాడు కవి.
''నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన" అనే అంత్యానుప్రాసలతో ఆనందింపజేశాడు. పోతన కవిత్వం వినసొంపైంది.

 

ఉ) ''ఆడినమాట తప్పగూడదు" ఎందుకు?
జ: 'ఆడినమాట తప్పగూడదు' ఎందుకంటే ఎదుటివారికి మనపై నమ్మకం పోతుంది. అలా చేస్తే మాట తప్పడంలో మహనీయుడని ప్రచారం చేస్తారు. సమాజంలో విలువ దక్కదు. 'ఎలాంటి చెడ్డపని చేసిన వాడినైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పినవాడిని మాత్రం మోయలేను' అని భూదేవి బ్రహ్మతో చెప్పిందంటే 'మాట తప్పవద్దు' అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతుంది.
ఆడినమాట తప్పితే చులకనగా చూస్తారు. కీర్తిప్రతిష్ఠలు దెబ్బతింటాయి. సమాజం గౌరవించదు. ఎన్నికష్టాలు వచ్చినా, పేదరికం వెంటాడినా, ప్రాణానికి, ధనానికి చేటు చేకూరినా, చివరకు మరణం సంభవించినా ఆడిన మాట తప్పకూడదు.

 

2. కింది ప్రశ్నలకు పదివాక్యాల్లో జవాబులు రాయండి.
అ) నేటి సమాజానికి దాతృత్వం ఉన్న వ్యక్తుల ఆవశ్యకతను తెలపండి.
జ: నేటి సమాజానికి దాతృత్వం ఉన్న వ్యక్తులు చాలా అవసరం. ఎందుకంటే ఈ సమాజంలో అత్యధికులు పేదవారే. ధనవంతులు తరతరాలు జీవించేటంత సంపాదించి పెట్టుకున్నారు. ఆ ధనంతో విలాసవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
అత్యధికులు పేదవారు. వీరికి కనీసం ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారం కూడా లేదు. పూరి గుడిసెల్లో, ఫుట్‌పాత్‌లపై జీవనం వెళ్లదీస్తున్నారు. సుఖసంతోషాలనే పదాలకు అర్థాలు తెలియకుండానే తనువు చాలిస్తున్నారు. పేదవారి పిల్లలు సరస్వతీ పుత్రులైనా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక చదువులకు స్వస్తి పలుకుతున్నారు. కాబట్టి సేవ చేయాలన్న గుణాన్ని ఉన్నవారు ఈ సమాజానికి అవసరం. ముఖ్యంగా ధనికుల్లో మార్పు రావాలి. ఈ భూమిపై పుట్టినవాళ్లంతా ఏదో ఒకరోజు మరణిస్తారని, వెంట ఏమీ తీసుకువెళ్లమని గ్రహించాలి. సాటి మనిషి కష్టాల కోరల్లో కొట్టుమిట్టాడుతుంటే చేతనైన సహాయం అందించాలి.
నేటి కాలంలో దాతృత్వంపై మరింత ప్రచారం జరగాలి. ధనవంతులు పేదవారికి దానధర్మాలు చేయాలి. తద్వారా కీర్తిప్రతిష్టలు పొందాలి. దానంతో ధనానికి ఉన్న విలువ మరింత పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ధనికుల్లో మార్పువస్తే పేదల జీవితాల్లో వెలుగొస్తుంది.

 

ఆ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.
జ: బలిచక్రవర్తి దగ్గరకు వచ్చిన వామనుడి గురించి తెలుసుకున్న శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ''వచ్చిన పొట్టివాడు విష్ణువు. నీవు ఇచ్చే కొంచెం దానం మాత్రమే తీసుకుని వెళ్లేవాడు కాదు. మూడు అడుగుల నేలతో మూడు లోకాలను ఆవరించి గొప్ప రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్ని నిలుపుకో, దానం గీనం ఏమీవద్దు ఈ వామనుడిని పంపించు" అన్నాడు.
ఆ మాటలు విని గురువైన శుక్రాచార్యుడితో ''మీరు చెప్పింది నిజమే ఇది లోకంలో గృహస్థుల ధర్మం. ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు. ఆచార్యా! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ సంపదను మూటగట్టుకుని పోలేదు. వారి పేర్లు కూడా మిగల్లేదు. విష్ణువు అంతటివాడు చిన్నవాడిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దాన్ని ఇవ్వడం కంటే నాలాంటి వాడికి ఇంకేం కావాలి" అన్నాడు.
'అంతేకాదు మరణం వచ్చినా, నరకం వచ్చినా, నా వంశం నశించినా ఏమైనాకానీ ఆడిన మాట మాత్రం తప్పను' అని పలుకుతున్న సందర్భంలో బలిచక్రవర్తి తన భార్యయైన వింధ్యావళికి నీళ్లు తెమ్మని సైగ చేశాడు. ఆమె శ్రేష్ఠమైన బంగారు కలశంతో కాళ్లు కడిగేందుకు నీళ్లు తెచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి వామనుడితో 'ఓ ఉత్తమ బ్రహ్మచారీ! ఇటురా నీవు అడిగింది లేదనకుండా ఇస్తాను నీ పాదాలు ఇటు పెట్టు' అని అడిగి కాళ్లు కడిగి ఆ పవిత్ర జలాన్ని నెత్తిపై చల్లుకున్నాడు.
బలిచక్రవర్తి చేతులు చాచి వామనుడిని పూజించాడు. 'బ్రాహ్మణుడవూ ప్రసిద్ధమైన వ్రతము గలవాడవు. విష్ణు స్వరూపుడవైన నీకు మూడు అడుగుల నేలను దానం చేస్తున్నాను'. అని బలిచక్రవర్తి వామనుడితో పలికి ''పరమాత్మనకు ప్రీతి కలుగుగాక" అంటూ వామనుడి చేతిలో నీటిని ధారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది.
బలిచక్రవర్తి దానం ఇవ్వగానే పది దిక్కులు, పంచభూతాలు ''బళి బళి" అని పొగిడాయి.

 

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండటం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెలుపుతూ నినాదాలు, సూక్తులు రాయండి.
జ:
నినాదాలు
   1) ఉండాలి ఉండాలి - దానగుణం ఉండాలి
   2) ఆడినమాట తప్పద్దూ - పలికిమాత్రం బొంకొద్దు
   3) సత్యగుణము - పెంచును తేజము
   4) ధర్మాన్ని మించిన ధ్యేయంలేదు - దానాన్ని మించిన సేవ లేదు
   5) పరులకు చేయాలి ఉపకారం - అది పెంచును మనపై మమకారం
   6) పై చేయిగా ఉండాలంటే - ఇచ్చేవాడిగా ఉండాలి
   7) ఇతరుల కోసం జీవించు - కీర్తితో మరణించు
   8) ఇతరుల కష్టాన్ని పంచుకో - ఇలలో గౌరవం పెంచుకో
   9) దయా, జాలి దండిగ ఉంటే - దరిద్రమంతా జారును చూడు
సూక్తులు
   1) ఆయువు పోయేదాకా ఆడినమాట తప్పవద్దు
   2) ధనానికి విలువ దానంతో వస్తుంది
   3) ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది
   4) మాట తప్పడం - మరణంతో సమానం
   5) మరణించినా మిగిలేది కీర్తి
   6) సత్యం, ధర్మం, అహింస మంచి మనసుకు ఆభరణాలు
   7) ఆప్యాయత, అనురాగాలే జీవన సౌఖ్యానికి సోపానాలు
   8) మనం చేసే పాపాలు - తరతరాలకు శాపాలు


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌