• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

'ఆలోచించండి - చెప్పండి'కి సమాధానాలు

1. ''ఏ ప్రాంతపు వాళ్ల తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది. సమర్థించండి.
జ: అన్నిప్రాంతాల్లో కలగలిసిన భాష తెలుగు. వివిధ ప్రాంతాల్లో ఆ కమ్మని తెలుగు భాషను వివిధ యాసలతో, చమత్కారంతో మాట్లాడతారు. ఏ ప్రాంతంలో అయితే ఆ విధమైన యాస సంతరించి ఉంటుందో ఆ ప్రాంతం వారికి ఆ యాస పదాలే మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఒకే మాటను ఆయా ప్రాంతాన్ని బట్టి పలుకుతారు.
ఉదా: 1) నాకు చాలా దుఃఖం వచ్చింది
    2) నాకు శానా ఏడుపొచ్చింది

 

2. రచయిత కొందరు పండితులను గురుస్థానీయులని చెప్పాడు. గురువులనగానే వాళ్లలో ఏయే ప్రత్యేకతలుండాలని మీరు ఆశిస్తున్నారో తెలపండి.
జ: గురువులో కింది ప్రత్యేకతలు ఉండాలని నేను ఆశిస్తున్నాను.
    1) మంచి 'పలుకుబడి' ఉండాలి
    2) రూపంలో తేజం కనిపించాలి
    3) మంచి విషయాలు ఎప్పుడికప్పుడు చెప్పాలి
    4) ఆదర్శనీయుడై ఉండాలి
    5) ధర్మబద్ధుడై ఉండాలి
    6) అనుమానాలను నివృత్తి చేసేవాడై ఉండాలి
    7) విసుగు, కోపం లేకుండా ఉండాలి
    8) విడమరచి చెప్పే నేర్పు ఉండాలి
    9) సమయస్ఫూర్తి ఉండాలి
    10) స్నేహితుడిలా ఉండాలి

 

3. ''పసందైన ప్రాంతీయ భాష" - దీన్ని ఎలా అర్థం చేసుకున్నారో వివరించండి.
జ: ఒక ప్రాంతంలో మాట్లాడే భాషను ప్రాంతీయ భాష అంటారు. ఆ ప్రాంతంలో పండితుల నుంచి పామరుల వరకు అదే యాసలో మాట్లాడతారు. అది వారికి నచ్చిన భాష. మన పాఠంలో లక్ష్మణశాస్త్రి తన బాల్యమిత్రుడైన తిరుమల రామచంద్రకు తిరుపతి లడ్డు ఇస్తూ 'వారీ రామచంద్ర! ఇగపటు' అని అన్నాడు. అంతటి గొప్ప మహాపండితుడు 'ఇగపటు' అనే పసందైన మాటను పలికి తన ప్రాంతపు యాసను ప్రకటించాడు.

 

4. ''వారి రాతలోను, మాటలోను ప్రాంతీయత కనిపించేది" దీని గురించి చర్చించండి.
జ: మహబూబ్‌నగర్ జిల్లా వాళ్ల భాష తెలుగుదనం కలిగి ఉంటుంది. ఆ జిల్లాకు చెందిన సురవరం ప్రతాపరెడ్డిది ఇటిక్యాలపాడు. ఆయన రచనలు, మాటల్లో 'మహబూబ్‌నగర్ ప్రాంతీయ' కనిపించేది. ప్రాంతీయలో రాయడం అనేది సహజంగా వచ్చిన స్వభావం. అది అక్కడి ప్రాంతపు 'యాస'ను తెలియజేస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి ప్రసంగాల్లో మహబూబ్‌నగర్ ప్రాంత తెలుగు యాస తాండవం చేసేది.

 

5. 'ఏకలవ్య శిష్యుడు' అనే పదంలోని అంతరార్థాన్ని వివరించండి.
జ: 'ఏకలవ్యుడు ద్రోణుడి ద్వారా ప్రత్యక్షంగా ఏ విద్యలను నేర్చుకోలేదు. పరోక్షంగానే అభ్యసించాడు. గురువు అంటే ఎంతో వినయంగా, భక్తిగా ఉండేవాడు. అలా ఏకలవ్యుడిలాగానే సామల సదాశివ కూడా వేలూరి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని' తెలియజేస్తున్నాడు.
   ప్రత్యక్షంగా గురువు లేనప్పటికీ పరోక్షంగా గురువుగా భావించి వివిధ విషయాల్లో నేర్పరిగా అయ్యే వ్యక్తిని ఏకలవ్యుడితో పోలుస్తారు.

 

6. 'పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాల లాంటివి' ఈ అభిప్రాయాన్ని సమర్థించండి.
జ: పలుకుబడి అంటే ఉచ్చారణలో ఉండే విలక్షణత. దీన్నే 'యాస' అంటారు. నుడికారం అంటే 'మాట చమత్కారం' ఏ భాష నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాల నుంచి ఉద్భవిస్తుంది. జాతీయం అంటే జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. జాతీయంలోని పదాలు అర్థాన్ని ఉన్నదున్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు. ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు. ఇవన్నీ ఒక భాషకు అలంకారాలు. ఇవి లేనట్లయితే భాషకు ఇంపు, సొంపు ఉండదు.

 

7. ''మొదలు మీ కళ్లకు నీళ్లు పెట్టుకోండి" అని మరాఠి పురోహితుడు అన్నాడు గదా! మీ నిత్యజీవితంలో ఇలాంటి సంఘటనలను వివరించండి.
జ: నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా అన్న లెక్కలు చెప్పుతూ 'నోట్‌లో రాసుకోండి' అన్నాడు. 'మాకు నోటిలో రాసుకోమ్మంటాడేమిటి నోరు ఎమన్నా రాసుకునే పుస్తకమా' అని ఆశ్చర్యపోయాం.
జాతీయాలను తెలుసుకుని రమ్మని మా తెలుగు మాష్టారు చెప్పగానే నేను ఇంటికి వెళ్లి అందరిని అడిగి తెలుసుకుని వచ్చాను. మా మిత్రుడు యాదల్ 'చెప్పురా!' అన్నాడు నేను కాలి చెప్పులేమో అనుకుని 'ఎక్కడున్నాయిరా?' అని కిందికి చూశాను. వాడు మళ్లీ నాకు అర్థమయ్యేలా చెప్పాడు.
   నేను ఏడో తరగతిలో పబ్లిక్ పరీక్ష రాస్తున్నప్పుడు నా స్నేహితుడు వచ్చి 'ఏడ పడ్డవ్' అన్నాడు. 'ఎక్కడా పడలేదు నేను' అని అన్నాను. అది కాదు ఏ రూములో రాస్తున్నావు అని మళ్లీ అడిగాడు.

8. ''ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం." దీన్ని సమర్థిస్తూ చర్చించండి.
జ: ఆడవాళ్లు ఇంటిదగ్గర ఉండి అందరూ మాట్లాడిన మాటలను వింటూ ఉంటారు. అందరి మాటలను అదే యాసలో మాట్లాడతారు. ఇంట్లో ఎలా మాట్లాడతారో అలాగే బయట కూడా అదే తీరుగా ఉచ్చరిస్తారు. పలుకుబడి, నుడికారం, జాతీయాలు వాడుతూ మాట్లాడతారు. స్వచ్ఛమైన భాషను ఆడవాళ్లు మాత్రమే అంతటా ఒకే విధంగా మాట్లాడతారు. 'యాస' పదాలను ఎక్కువగా వాడుతూ ఇంపైన తెలుగు భాషను అందంగా విన్నవిస్తారు.

 

9. కవి సమ్మేళనం అంటే మీకు తెలుసా? ఎప్పుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా? మీ అనుభవాన్ని తెలపండి.
జ: కవులు అందరూ ఒకే వేదికపై కలిసి తాము రాసిన కవితలు, పద్యాలను తెలియజేయడాన్ని 'కవి సమ్మేళనం' అంటారు. మా పాఠశాలలో ప్రతి మాసానికి ఒకసారి 'సమ్మేళనం' జరుగుతుంది. అందులో మేము రాసిన కవితలను వినిపిస్తాం. అంతేకాకుండా మండలస్థాయి 'బాల కవి సమ్మేళనం' కూడా జరుగుతుంది. దానిలోనూ పాల్గొంటాం. టెలివిజన్‌లో వచ్చే కవుల సమ్మేళనాలను చూసిన అనుభవం ఉంది. మా తెలుగు మాష్టారు కవి సమ్మేళనం గురించి తరుచుగా చెప్పి ప్రోత్సహిస్తుంటారు.

 

10. ''నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే" అని రచయిత అనడంలో ఆంతర్యమేమిటి?
జ: 'మీర్ తఖీమీర్' అనే ఉర్దూ కవి ఒక షేర్ రాశాడు. దాని అర్థం ''నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే" దీని ఆంతర్యం ఏమిటంటే అతడు రాసిన కవిత సామాన్య ప్రజల భాషలో ఉన్నా గొప్ప గొప్ప ప్రత్యేక వ్యక్తులు దాన్ని ఇష్టపడుతున్నారు. అంటే సామాన్య ప్రజల భాషకు ఆదరణాభిమానాలు మెరుగ్గా ఉన్నాయని తెలపడం.

 

11. ''పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు" అనడం నిజమా? కాదా? కారణాలు చర్చిచండి.
జ: పిల్లలు అందరూ తమ ఇంట్లో కచ్చితమైన యాసను స్వేచ్ఛాయుతంగా మాట్లాడతారు. తమ భావాలను వ్యక్తపరుస్తారు. కానీ బడికి వచ్చిన తర్వాత పుస్తకాల్లో ఉండే భాష వేరుగా ఉండేసరికి పుస్తక భాషే అలవాటు అవుతుంది. దాన్ని వారు బడిలో మాట్లాడతారు. అంతే కాకుండా బడిలోని గురువులు మాట్లాడే భాష పుస్తక భాషగా ఉంటుంది. ఇంట్లో మాట్లాడే భాషకు, రాసే భాషకు తేడా ఉంటుంది. అందువల్ల ఏ భాషను పిల్లలు ఇంట్లో ఉపయోగిస్తారో బడిలో కూడా అదే భాష వాడాలి. కొన్ని ప్రాంతాలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల అదే భాష పుస్తకాల్లోకి రావడం జరిగింది. పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు అనడం నిజమే.

 

12. ప్రాంతీయ భాషా భేదాలను ఎట్లా సరిచేసుకోవాలి? మాట్లాడండి.
జ: ప్రాంతీయ భాషా భేదాలు ఆయా ప్రాంతాల్లో మాట్లాడే మాండలికాల వల్ల ఏర్పడతాయి. వాటిని సరిచేసుకోవాలంటే అన్ని ప్రాంతాల్లోని పదాలను అందరికీ తెలిసేలా చేయాలి.
అన్ని ప్రాంతాల భాషల కలయికతో పుస్తకాలు రావాలి. మాట్లాడే భాష నుంచే రాసే భాష ఉద్భవించాలి. భాషా భేదాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరగాలి. అన్ని ప్రాంతాల పలుకుబడులు, నుడికారం, జాతీయాలను అన్ని 'కళల్లో' ఉండేలా చూడాలి. నాటకాలు, సినిమాల్లో వీటి ప్రయోగం అధికం కావాలి. ముఖ్యంగా పత్రికలు ప్రాంతీయ భాషా భేదాలను సరిచేయవచ్చు. ప్రాంతీయ భాషా భేదాలు సరిచేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి.

 

ఇవి చేయండి

I. అవగాహన ప్రతిస్పందన
1. కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.
          గో మేరే షేర్ హై ఖవాస్ పసంద్
          పర్‌మెరీ గుఫ్తగూ అవామ్ సేహై
పైన ఇచ్చిన కవితలో ఖాస్ - ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైంది. దీని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. కవి ఏమంటున్నాడంటే 'నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే.'

 

ప్రశ్నలు

అ) 'ఖాస్' అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి?
   ఎ) కవిత       బి) ప్రత్యేకమైన        సి) సాధారమైన     డి) సామాన్యం
ఆ) సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు?
   ఎ) ఆవామ్       బి) ఆమ్       సి) ఖాస్       డి) ఖవాస్
ఇ) 'నా కవితను ప్ర‌త్యేక‌ వ్యక్తులు పసంద్ చేస్తున్నారు'. గీత గీసిన పదానికి సమానార్థక ఉర్దూ పదం?
   ఎ) సంబంద్       బి) ఆవామ్       సి) ఖాస్       డి) పసంద్
ఈ) పైకవితలో కవి ఏ భాషను ఉపయోగించాడు?
   ఎ) గ్రాంథిక భాష       బి) ఉర్దూ భాష       సి) ప్రజల భాష      డి) ఏదీకాదు
జవాబులు: అ-బి;   ఆ-ఎ;    ఇ-సి;    ఈ-బి.

2. కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఉర్దూ మనదేశీయుల ఉమ్మడి భాష. కానీ ఏదో ఒక కులానికో, మతానికో చెందిన భాష కాదన్నారు ప్రొఫెసర్ రఫియా సుల్తానా. ఆ తరం వాళ్లు అందరూ అట్లాగే అనుకున్నారు. ఇప్పటికీ ఉన్న ఆ తరం వాళ్లు అట్లాగే అనుకుంటున్నారు. అందుకే నా ముచ్చట్లలో ఉర్దూతో మాకు ఉన్న సంబంధాన్ని యాది చేసుకుంటున్నాను.
  మా చదువు ఉర్దూ మీడియంలో జరిగింది. హెడ్మాస్టర్ అన్వరుద్దీన్ సాహెబు. ఉర్దూ చెప్పే మౌల్వీ సాహెబులు ఇద్దరో, ముగ్గురో ఉండేవాళ్లు. అయితే పై తరగతిలో చదివే మాకు రామనాథరావు సార్ ఉర్దూ చెప్పేవారు.
  వారు మంథెన బ్రహ్మణులు. ఎఫ్.ఎ. (ఇంటర్మీడియట్) చదివిన ఆ సారుకు తెలుగు, సంస్కృతం, మరాఠీ, ఇంగ్లిషు భాషల్లో మంచి పాండిత్యం ఉందనేవాళ్లు. ఉర్దూలో ఏదో పెద్ద పరీక్ష పాసయినారు. వారు పెద్ద తరగతికి ఉర్దూ చెప్తుంటే ఉర్దూ డిగ్రీలున్న మౌల్వీలు అభ్యంతరం లేవదీయలేదు. పైగా తమకు సరిగా అర్థం కుదరని ఉర్దూ షేర్ల తాత్పర్యం మా ముందరే రామనాథరావు సారుతో చెప్పించుకునేవాళ్లు.

 

ప్రశ్నలు

అ) ''ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష" ఈ మాటలన్నది ఎవరు?
జ: ప్రొఫెసర్ రఫియా సుల్తానా
ఆ) రచయిత తన ముచ్చట్లలో ఏ భాషా సంబంధాన్ని యాది చేసుకున్నాడు?
జ: రచయిత తన ముచ్చట్లలో ఉర్దూ భాష సంబంధాన్ని యాది చేసుకున్నాడు.
ఇ) రామనాథరావు సార్ ఎక్కడివారు? ఏ విషయాన్ని బోధించేవారు?
జ: రామనాథరావు సార్ మంథెన బ్రాహ్మణులు. ఉర్దూ బోధించేవారు.
ఈ) ఉర్దూ డిగ్రీలున్న మౌల్వీలు రామనాథరావు సార్‌ను ఏ విషయమై సంప్రదించేవాళ్లు?
జ: ఉర్దూ డిగ్రీలున్న మౌల్వీలు రామనాథరావు సార్‌ను ఉర్దూ షేర్ల తాత్పర్యాల కోసం సంప్రదించేవాళ్లు.

 

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత


1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు?
జ: సామల సదాశివకు ఇద్దరు మనుమరాళ్లు. వారు హైదరాబాద్‌లో ఉంటారు. పెద్ద మనుమరాలు కావ్య, చిన్న మనుమరాలు లావణ్య. వీరిద్దరికీ తెలుగురాదు. హిందీ మాట్లాడతారు. కొన్ని మాటలను హిందీలోంచి అనువదించుకుని మాట్లాడతారు కాని తెలుగువాళ్ల పలుకుబడి, నుడికారం వాళ్లకు తెలియదు. సామల సదాశివకు అవసరమైన వస్తువులన్నీ చిన్న మనుమరాలు లావణ్య తెచ్చి ఇచ్చేది. నాలుగు సంవత్సరాలు పూర్తిగా నిండని ఆ పాప ''తాతా! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ" అని వాటిని చేతికి ఇచ్చింది. లావణ్య 'ఇగపటు' అనగానే ఈ ప్రాంతపు తెలుగు ఆమెకు పట్టువడ్డందుకు తాత అయిన సామల సదాశివ అబ్బురపట్డాడు.

 

ఆ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి.
జ: రచయిత సామల సదాశివ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిని గురుస్థానీయులుగా భావించారు.
   కప్పగంతుల లక్ష్మణశాస్త్రి సంస్కృతాంధ్ర భాషలో, కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సంస్థానానికి చెందినవారు. సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్రను తెలుగులోకి అనువదించాడు. ఇతడికి ఆంధ్రబిల్హణ అనే బిరుదు ఉంది. లక్ష్మణశాస్త్రి దగ్గర సదాశివ శిష్యరికం చేయలేదు. కానీ ఒక్కొక్కప్పుడు లక్ష్మణశాస్త్రి సన్నిధానంలో కూర్చుండేవారు. తరచుగా జాబులు రాస్తూ సదాశివ లక్ష్మణశాస్త్రి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకునేవారు. అందువల్ల గురుస్థానీయులుగా భావించారు.

ఇ) ''అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి?" అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది?
జ: వరంగల్‌లో కాళోజీ వర్ధంతి సభలో సామల సదాశివ పాల్గొన్నారు. కవి సమ్మేళనం, ప్రసంగాలు, గజల్స్ వినిపించారు. సదాశివ వెళ్లేటప్పటికి సాహితీ మిత్రమండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఆ సభకు రిటైర్డ్ రెవెన్యూ అధికారి అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ అందరు తెలుగు విద్వాంసులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు ఉన్నారు. వారందరు కాకుండా ఆయన అధ్యక్షత వహించాడేమిటి అని సామల అనుకున్నారు. ఆయన అలా అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుందంటే అక్కడ ఉన్నవారికంటే అధ్యక్షులు అంత గొప్పవాడా అని అనుకోవచ్చు. తీరా అధ్యక్షులు అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలనంతగా ఆశ్రయించకుండా, ఇంగ్లిష్, ఉర్దూ పదాల జోలికి అంతగా వెళ్లక కల్తీలేని తెలుగును ఉపయోగించేసరికి సామల సదాశివకు అతడి గొప్పదనం అర్థమైంది.

 

ఈ) రచయిత రచనాశైలిని ప్రశంసిస్తూ రాయండి.
జ: 'ఎవరి భాష వాళ్లకు వినసొంపు' అనే ఈ పాఠ్యభాగ రచయిత సామల సదాశివ. ఈయన అనేక భాషల్లోని సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. అందువల్ల ఈయన రచనల్లోని భాష సహజసుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేలా ఉంటుంది. సామల ఈ వ్యాసాన్ని స్వీయ అనుభూతులతో రాశారు. గొప్ప వ్యక్తులతో తనకు ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు. ఆశ్చర్యకరమైన సంఘటనలను తెలియజేశారు. తెలంగాణ ప్రాంతంలోని పలుకుబడులు, నుడికారాలు, జాతీయాలు సందర్భోచితంగా ఉపయోగించారు. ప్రత్యక్షంగా సాన్నిహిత్యంగా ఉన్నవారిని గురుస్థానీయులుగా భావించడం రచయిత గొప్పదనానికి నిదర్శనం.
ప్రాంతీయ భాషల పసందును తెలియజేసిన విధానం కమనీయంగా ఉంది. తెలుగుభాష అన్ని ప్రాంతాల పలుకుబళ్లను కలుపుకోవాలనడం ఆయన భాషా మమకారానికి గీటురాయి. సామాన్య ప్రజల భాషను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంగా సాగిందీ వ్యాసం. ఇది తెలుగు భాష గొప్పదనాన్ని ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలపడమే కాకుండా సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యేవిధంగా ఉంది.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేం అర్థమైందో రాయండి.
జ: ఈ పాఠం ద్వారా సామల సదాశివ వ్యాసంలో నిర్దిష్ట నిజస్వరూపం గోచరిస్తుంది. తన మనుమరాలు లావణ్య ''తాతా! ఇగపటు నీ పాను జర్దా డబ్బీ" అన్నప్పుడు ఆయన అబ్బురపడి ఆనందించారు. తను అనేక రకాల పత్రికలు చదివేవారని తెలుస్తోంది. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి దగ్గర కూర్చొని, జాబులు రాసి అనేక విషయాలు తెలుసుకునేవారు. కప్పగంతులను సదాశివ గురుస్థానీయులుగా భావించారు. ఆయనకు ప్రాంతీయ భాషల పట్ల మంచి అవగాహన ఉంది. సురవరం ప్రతాపరెడ్డి, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుకు కారకులైన గడియారం రామకృష్ణశర్మ సదాశివకు గురుస్థానీయులు. వేలూరికి ఏకలవ్య శిష్యుడు. ప్రాంతీయ భాష పలుకుబడి గురించి తెలియజేశారు. సదాశివ రచనలో ప్రాంతీయత కనిపిస్తుంది. వరంగల్‌లో కూరగాయలమ్మే స్త్రీలు, ముస్లిం మహిళల భాషను తెలియజేశారు. కవి సమ్మేళనాలు, ప్రసంగాల్లో పాలు పంచుకునేవారు. ఉర్దూలోనూ భావ వ్యక్తీకరణ చేయగలరు. ఆయన వ్యాసాలు అందరినీ ఆకట్టుకునేవి. ప్రాంతీయ పలుకుబళ్లను ఇప్పుడున్న తెలుగుభాషలో కలిపేయాలన్న ఉబలాటం ఉన్న వ్యక్తి. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన తెలుగుభాష ఆడవాళ్ల నోటనే వినగలమని అని సామల తెలిపారు.
 అందరివాడు, అందరితో అనుబంధం ఉన్నవాడు. స్వీయ అనుభవాలను వ్యక్తపరిచే తత్వం ఉన్న వ్యక్తి ఆయన సాంస్కృతిక వారధి. ఆయన భాష సహజ సుందరంగా, సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
   'యాది' వ్యాసాల ద్వారా అనేక పలుకుబడులను అందించిన సాహిత్యమూర్తి, తెలుగుభాష గొప్పదనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేశారు. అనుబంధాలను అల్లిన ఆత్మీయుడు. ఏ ప్రాంతపు వాళ్లకు ఆ ప్రాంతపు తెలుగు ఇంకా మంచిగా ఉంటుందని తెలిపిన మహనీయుడు.

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి.
జ: నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మా గ్రామం ఎల్లాపూర్‌లోనే పూర్తయింది. అది కేంద్ర ప్రాథమిక పాఠశాల. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధించేవారు. మా పాఠశాలలో అటెండర్ ఉండేవాడు కాదు. మా గురువు నారాయణగారు బడి గుడితో సమానమని, దీన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పేవారు. అప్పటినుంచి నేను అందరికంటే ముందుగానే వెళ్లి తరగతి గదిని శుభ్రపరిచేవాడిని. ఇంకో గురువు ఎలా మాట్లాడాలో ఉపన్యాసం ఎలా ఇవ్వాలో టేబుల్‌పైన నిలబెట్టి నేర్పి మాట్లాడించేవారు. సుశీల టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఎన్నో పాటలు నేర్పేవారు. నృత్యాలు చేయించేవారు. ఆ టీచర్ నాకు పాట పాడినందుకు బహుమతిగా 'విజయ రహస్యం' అనే పుస్తకాన్ని ఇచ్చారు.
   మేము మా పాఠశాలలో విచిత్రమైన కళారూపాలను ప్రదర్శించేవాళ్లం. గొల్లసుద్దులు, ఒగ్గుకథ, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం చేసేవాళ్లం. మా పాఠశాలలో అనేక రకాలైన ఆటలు ఆడేవాళ్లం. అందులో కబడ్డీ, చాట్‌పత్రి, తుడుంగ, లింగోస్ లాంటివి ఉండేవి.
   మా ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు మాత్రమే ఉండేది. అయిదో తరగతిలో ఉండగా మేమందరం సర్పంచ్‌ని కలిసి ఇక్కడే 6, 7 తరగతులు చేయాలని కోరడంతో ఆయన చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయించారు. మేము అక్కడే 6, 7వ తరగతులను కూడా చదివాం.

ఆ) మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా రాయండి.
జ:
అజయ్: ఎమ్రా విజయ్ ఎందుకేడుస్తున్నావ్?
విజయ్: ఏం లేద్రా నిన్నటి పరీక్షలో మార్కులు రావని బయమైతుందిరా!
అజయ్: ఎందుకురా?
విజయ్: బాగా రాయలేద్రా
అజయ్: ఎందుకలా
విజయ్: మొన్న రాత్రంతా మేల్కొని చదివిన్రా నాకు పానమంతా తిప్పినట్టయి కక్కు వచ్చి సుదురాయించలేదురా
అజయ్: మరెందుకు అంతగనం మేల్కొన్నవ్! పోయేదేముందిరా
విజయ్: మార్కులురా
అజయ్: అయితే గంతగానం మేల్కొంటావా!
(ఇంతలో టీచర్ వచ్చింది)
టీచర్: ఏం అజయ్, విజయ్ ఏం సంగతి అలా ఉన్నారు?
అజయ్: ఏం లేదు టీచర్. విజయ నిన్నటి పరీక్ష బాగా రాయలేదని ఏడ్సుతుండు.
టీచర్: ఎందుకు ఏడ్వడం?
అజయ్: మొన్న రాత్రి నిద్రవోకుండా సదివి నిన్న ఆగం చేసుకుండు.
టీచర్: చూడు విజయ్ ముందునుండే చదవాలి. పరీక్ష రేపనంగ మేల్కొంటే అలాంటివే ఎదురయితాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదవాలి.
విజయ్: అలాగే టీచర్. ఇకముందు గట్లనే జేస్త.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌