• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొత్తబాట

'ఆలోచించండి - చెప్పండి'కి సమాధానాలు

1. 'సెవ్వు మీద పేను వార్తెనా?' అంటే మీకేం అర్థమైంది?
జ: అక్కా, తమ్ముడు ఎద్దుల బండిపై ఇంటికి బయలుదేరారు.
ఆ బాట గురించి అక్క అనేక విషయాలు చెబుతుంది. కానీ తమ్ముడు వినిపించుకోవడంలేదు. దాంతో అక్క సెవ్వు మీద పేను వార్తెనా? అని అంది. దీనర్థం ఏమిటంటే చెవ్వు మీద తలలో పేను పారుకుంటూ వస్తే వెంటనే గుర్తిస్తాం, గ్రహిస్తాం, స్పందిస్తాం. కానీ తమ్ముడు తన మాటలను వినడం లేదనే అర్థంలో అక్క సెవ్వు మీద పేను వార్తెనా? అని అంది.

 

2. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి.
జ: బస్సు సౌకర్యం లేని మా అక్కవాళ్ల ఊరికి నేను అప్పుడప్పుడూ నడుచుకుంటూ పోతాను. పోయేటప్పుడు రోడ్డు పరిస్థితిని ముందు గమనిస్తాను. ఎక్కడ గుంతలు ఉన్నాయి. రోడ్డు సరిగా ఎందుకు లేదు అని ఆలోచిస్తాను. అంతేకాదు. రోడ్డుకు రెండు వైపులా ఉండే రకాల చెట్లు ఎలా ఉన్నాయో గమనిస్తాను. తినేందుకు అనుకూలమైన తోటలను చూస్తాను. పక్షుల అరుపులు వింటాను. ప్రకృతిలోని అందాన్ని ఆస్వాదిస్తాను.

 

3. మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి.
జ: మా ఊరి పొలిమేరల్లో పచ్చని పొలాలు, నిండుకుండ లాంటి చెరువు, ఎప్పుడూ పారే కాలువలు, వంతెన కింది నుంచి పారే మంజీర నది పరవళ్లు అందంగా ఉంటాయి. మామిడి చెట్లు, చెరకు తోటలు విరివిగా ఉంటాయి. పంట పొలాల కింద ఇసుకు దిబ్బలు ఆహ్లాదాన్ని ఇస్తాయి. మా ఊరి పొలిమేరలో ఎల్లమ్మ దేవాలయం ఉంది. పూలమొక్కలతో ఆ గుడి అద్భుతంగా కనిపిస్తుంది. ఊరు చివరన గుట్ట కూడా ఉంది. ఆ గుట్టపై పెద్ద ఆకారంతో ఉన్న బండరాయి మనిషి నిలబడ్డట్లుగా నిలువుగా ఉండి కనువిందు చేస్తుంది. మా ఊరి పొలిమేరల్లో క్రీడా మైదానం చాలా విశాలంగా ఉంటుంది. అందరం ఆ చల్లని ప్రకృతిలో వివిధ రకాల ఆటలను ఆడుతూ ఆస్వాదిస్తాం.

 

4. ''తన కాళ్ల మీద తను నిలబడటం" అంటే ఏమిటి? చర్చించండి.
జ: తన కాళ్ల మీద తను నిలబడటం అంటే సొంతంగా పనిచేసుకుంటూ ఇతరులపై ఆధారపడకుండా జీవించడం. సోమరిగా ఉంటూ ఒకరిపై ఆధారపడి జీవిస్తూ ఉంటే సమాజంలో గౌరవం తగ్గుతుంది. తానే సొంతంగా పని చేస్తూ సంపాదిస్తూ జీవిస్తే గౌరవం పెరుగుతుంది. ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులపై ఆధారపడాలి. సంపాదించే వయసులోకూడా పని చేయకుండా వారిని బాధపెట్టకూడదు. కొంతమంది తన కాళ్ల మీద తను నిలబడటం మంచిది అనేసరికి వేరే అర్థంలో ఆలోచిస్తారు. పరిహాసాలాడతారు. అది చాలా తప్పని గ్రహించాలి.

 

5. నాటి మేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా? ఏమిటవి?
జ: నాడు నేడులను గమనిస్తే ఆచార వ్యవహారాల్లో చాలా తేడాలు ఉన్నాయి. నాటి కాలంలో శ్రమ దోపిడీ ఎక్కువగా ఉండేది. మూఢ నమ్మకాలు కూడా ఎక్కువే. దొరల పాలన ఉండేది. వారు చెప్పిందే వేదంగా భావించేవారు.
నేడు ప్రజాస్వామ్యంలో అందరికీ సమప్రాధాన్యం ఉంటుంది. అప్పట్లో కులమతాల ప్రాధాన్యం ఎక్కువ. పట్టింపులూ ఎక్కువే. నేడు అలాంటివి లేవు. నాడు కులవృత్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు అందరూ అన్ని రకాల వృత్తులను చేపడుతున్నారు. అలంకరణలోనూ తేడాలు కనిపిస్తాయి.

 

6. మీ ఊర్లో రచ్చబండ/ గ్రామ సచివాలయం ఉందా? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడతారు?
జ: మా ఊరిలో గ్రామ సచివాలయం ఉంది. అక్కడ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు గ్రామ అభివృద్ధి కోసం చర్చిస్తారు. గ్రామంలో ఎవరి మధ్య అయినా తగాదాలు జరిగినప్పుడు గ్రామంలోని పెద్ద మనుషులు అందరూ కలిసి తప్పు ఎవరి పక్షాన ఉందో రాబట్టి తగిన విధంగా బుద్ధి చెబుతారు. ఏవైనా భూ తగాదాలు ఏర్పడినప్పుడు సామరస్యంగా వివాదాలను పరిష్కరిస్తారు. కొన్ని సందర్భాల్లో జరిమానాలు విధిస్తారు. ఎక్కువమంది ఏది నిర్ణయిస్తారో దాన్నే అమలు చేస్తారు. గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి పన్నుల విధింపుపై సమాలోచన చేసి నిర్ణయం చేస్తారు.

 

7. 'కడ్పుల ఇసం నాల్కెన తీపి' అంటే మీరేం అర్థం చేసుకున్నారు?
జ: కడ్పుల ఇసం నాల్కెన తీపి అంటే లోపల కుట్రలు పన్నుతూ, అసూయగా ఉంటూ, నాశనాన్ని కాంక్షిస్తూ బయటికి మాత్రం ప్రేమగా మనకేదో సహాయం చేస్తున్నట్లుగా, సానుభూతి చూపుతున్నట్లుగా మాట్లాడటం అని అర్థం. అలా ఉన్నవారు దురాలోచనలతో ఉంటారు. లోపలి ఆలోచనలకు, బయటి మాటలకు పొంతన ఉండదు.

 

8. పంచాయతీలు చెప్పడం అంటే ఏమిటి? పంచాయతీలను ఎట్లా జరుపుతారు?
జ: రెండు వర్గాల మధ్య గొడవలు, విభేదాలు వచ్చినప్పుడు సామరస్యంగా విడమరిచి న్యాయం చెప్పడాన్ని పంచాయతీలు చెప్పడం అంటారు. వీటిని గ్రామపెద్దలు నిర్వహిస్తారు. ముందుగా ఇరు వర్గాల మాటలను వింటారు.
తప్పు ఎవరి పక్షం ఉంటుందో వారికి సమస్య తీవ్రతను బట్టి మందలింపు ఉంటుంది. అప్పుడప్పుడూ జరిమానా కూడా విధిస్తారు. వాడి వేడిగా చర్చలు జరిపి ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం పంచాయతీలకున్న ప్రత్యేకత.

 

9. 'కళ దప్పిన ఇల్లు' ఎట్లా ఉంటుంది?
జ: ఇంట్లో ఎవరూ ఉండని పరిస్థితి తలెత్తినప్పుడు ఇంటి కళ తప్పుతుంది. ఆ ఇల్లు దుమ్మూ, బూజు పట్టి ఉంటుంది. మన ఇంటిని మన సొంత బిడ్డలా చూసుకోవాలి. లేదంటే పాడుబడి పనికిరాని స్థితికి చేరుతుంది. కళ దప్పిన ఇల్లు కన్నెత్తి కూడా చూడకుండా ఉండేలా తయారవుతుంది. రంగులు చెదిరిపోయి, చీమలు, కీటకాలకు నిలయంగా మారుతుంది. గాలి, వెలుతురు లేకపోవడంతో దుర్వాసనతో నిండిపోతుంది.

 

10. రాత్రిబడి అంటే ఏమిటి? రాత్రిబడులను ఎందుకు నడుపుతారు?
జ: పగటి సమయం కాకుండా రాత్రి వేళల్లో చదువు చెప్పే బడిని రాత్రిబడి అంటారు. పగటిపూట పనిచేసుకునేవారి కోసం రాత్రి బడులు నడుపుతారు. చాలామందికి పరిస్థితులు అనుకూలించక చదువును మానేస్తారు. వారికి చదువంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాంటి వారికోసం రాత్రిబడి పనిచేస్తుంది. నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు అందరికీ విద్యలో భాగంగా రాత్రి బడులు నడుస్తాయి.

 

11. 'నల్గురు నడిసిందే బాట' లోని అంతరార్థం ఏమిటి? చర్చించండి.
జ: నలుగురు నడిస్తే ఎంత బాగాలేదని అనుకున్న బాటయినా మంచి బాటగా మారుతుంది. నలుగురు చేసే పనినే మిగతా ఒకరిద్దరూ అనుసరిస్తారు. అలాగే అందరూ అదే మార్గంలో పయనిస్తారు. అందరూ ఎలా నడుచుకుంటారో వారిలాగే మిగతావారు ఉంటారు. నలుగురు నడిచే బాట, చేసే పనిని అందరూ అనుసరిస్తారు.
పెద్దలు (మార్గదర్శకులు) ఏ పద్ధతులు పాటిస్తారో ఆ పద్ధతులే బాటగా మారతాయి. సంప్రదాయాలు, ఆచారాలు నల్గురు నడిసిందె బాట అనే తత్వంపై ఆధారపడతాయి. దాని పరమార్థం ఏమిటంటే చాలామంది చేసే తీరుగానే మనం కూడా చేయాలి. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.

 

12. మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల రూపురేఖలు, వేషధారణ ఎట్లా ఉంటాయి?
జ: మా పరిసర ప్రాంతంలోని పిల్లలు ఉతికిన దుస్తులతో చూడటానికి అందంగా కనిపిస్తారు. తెల్లగా ఉంటారు. తల దువ్వుకుని బొట్టుపెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఉంటారు. కాళ్లకు చెప్పులు లేదా బూట్లు ధరిస్తారు. అంగవైకల్యం లేకుండా ఉంటారు. సన్నగా, పీలగా ఉండరు. ముద్దుగా బొద్దుగా ఉంటారు. వయసుకు తగిన ఎత్తు ఉంటారు. కొంత మంది నలుపుగా ఉన్నా ముఖంలో కళ బాగుంటుంది. బద్దకస్తుల్లా ఎవరూ ఉండరు.

ఇవి చేయండి

I. అవగాహన - ప్రతిస్పందన
1. ఈ కథకు 'కొత్తబాట' అనే పేరు తగిందని మీరు భావిస్తున్నారా? ఎందుకు? చర్చించండి.
జ: ఈ కథకు కొత్తబాట అనే పేరు తగినదనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాటి ఆచార వ్యవహారాలు ఏవీ లేకుండా కొత్తదైన జీవితాన్ని ప్రజలు గడపడం గమనించవచ్చు. ఈ కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా తెలివైనవారు. నేడు సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోయాయి. పిల్లల రూపురేఖలు, వేషధారణల్లో మార్పులు వచ్చాయి. స్త్రీలు అన్నిరంగాల్లో ముందుకు రావడం గమనించవచ్చు. దొంగతనాలు, దోపిడీలు తగ్గిపోయాయి. రాత్రి బడులు చక్కగా నడుస్తున్నాయి. అందువల్ల ఈ కథకు కొత్తబాట అనే పేరు చక్కగా సరిపోయింది.

 

2. పాఠం చదవండి. కింది పేరాల ఆధారంగా పట్టిక నింపండి.
            

3. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
పల్లెసీమకు పట్టుకొమ్మలాగా, గిరిజన మారుమూల గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉంది. దట్టమైన అడవి మధ్యన ఉన్న అటవీ గ్రామమిది. ఇక్కడ 1945లో ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పడింది. 2007 డిసెంబరు 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గ్రామ సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు లోడిసంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో మేడివాగుపై పక్కా రోడ్డు నిర్మించాయి. అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. వందశాతం అక్షరాస్యత సాధించారు. గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు. పిల్లలందరినీ బళ్లలో చేర్చారు. గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పురస్కారానికి ఎంపిక చేసింది.

 

ప్రశ్నలు:
అ. కొండాపూర్ ఎక్కడ ఉంది?
జ: కొండాపూర్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

ఆ. గ్రామపంచాయతీ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1945లో గ్రామపంచాయతీ ఏర్పడింది.

 

ఇ. గ్రామ సర్పంచ్ ఎవరు?
జ: గ్రామ సర్పంచ్ వాసం కన్నయ్య.

 

ఈ. పక్కా రోడ్డు ఎవరి సహకారంతో, ఎవరు నిర్మించారు?
జ: పక్కా రోడ్డును లోడి సంస్థ సహకారంతో, గ్రామస్థులు శ్రమదానంతో నిర్మించారు.

 

ఉ. గ్రామ ప్రజలు సాధించిన విజయాలేవి?
జ: మద్యపాన నిషేధం, వందశాతం అక్షరాస్యత, మినరల్ ప్లాంట్, బాలకార్మికులు లేకుండా చేయడం ఆ గ్రామప్రజలు సాధించిన విజయాలు.

 

ఊ. ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు? ఎందుకు?
జ: ఈ పేరాకు 'కొత్త వెలుగుల కొండాపూర్' అని శీర్షిక పెట్టవచ్చు. ఎందుకంటే గ్రామస్థులందరూ కలిసి ఊరును అభివృద్ధి చేసుకున్నారు.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. 'ఎంత చెడ్డ గని, ఎంత బాగా బతికిన గని ఇంకోని ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితె సాలు' అనే అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జ: ఎంత చెడ్డగా అయినా, ఎంత ఉన్నతంగా అయినా బతికేటప్పుడు వేరే వారి సహాయంతో జీవితం సాగిచడం మంచిది కాదని అక్క అంది. అలా ఎందుకు అన్నదంటే ఇతరులపై ఆసరాతో జీవితం కొనసాగితే తగిన గౌరవం దక్కదు. చేతకానివాడు అని తక్కువ అంచనా వేస్తారు. ఏది మాట్లాడినా 'వాడు ఇతరులపై ఆధారపడతాడు' అనే భావన వెంటాడుతుంది. అక్క మాటల్లో ఆంతర్యం గమనిస్తే జీవితం హాయిగా గడవాలని అర్థమవుతుంది.

 

ఆ. ''అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తున్నవి" అంటే మీకేం అర్థమైంది?
జ: నక్కలు చాలా తెలివైనవి. అవి ఉచితంగా ఎక్కడ ఆహారం దొరుకుతుందోనని కనిపెడుతుంటాయి. పెద్ద జంతువులు తినగా మిగిలిన వాటిని తింటాయి. రెండు జంతువులు పోరాడుతున్నప్పుడు నక్కలు చెట్లపొదల్లో దాక్కుని ఆ రెండూ ఎప్పుడు చనిపోతాయా, వాటి ఆహారం నేనే తినాలి అని ఆలోచనకు పోయి అదును కాస్తుంటాయి.నక్క బుద్ధి ఉండే మనుషులు కూడా జిత్తులు వేసి సమయం ఎప్పుడు వస్తుందోనని చూసి, అక్రమార్జనకు పాల్పడతారు. నక్కకు మోసం వెన్నతో పెట్టిన విద్య. అది జిత్తులు వేస్తూ అదునుగాసినట్లే మనుషుల్లో కొందరు దాని తీరుగానే ప్రవర్తిస్తారు.

 

ఇ. మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జ: మా గ్రామంలోని ప్రకృతి
మా గ్రామంలో ప్రకృతి అందమైన హరివిల్లుగా ఉంటుంది. ప్రతి ఇంటిముందు పచ్చని చెట్లు పలకరిస్తాయి. పూల గుబాళింపు మనల్ని మైమరపిస్తుంది. పక్షుల కిలకిలరావాలు, అంబా అని అరిచే లేగదూడల విన్యాసాలు నిత్యం ప్రకృతితో సయ్యాటలాడుతాయి. పచ్చని పొలాల నుంచి వీచే పైరగాలి మా గ్రామానికి పరవశాన్ని అందిస్తుంది. మా గ్రామంలో ప్రకృతి మంచి మనుషుల మనసులా కళకళలాడుతుంది.
మా ఊరి ప్రత్యేకత
మా ఊరిలో ప్రతి ఇంటికి తప్పకుండా చెట్లు ఉంటాయి. ఊరి మధ్యలో హనుమాన్ ఆలయం ఉంటుంది. ప్రతి నిత్యం ఎందరో దర్శనం చేసుకుంటారు. మా ఊరి రైతన్నలు ఖరీఫ్, రబీ రెండు పంటలను ఎంత కరవు వచ్చినా పండిస్తారు. ఒకరికి ఆపద వస్తే అందరూ కలిసి సహాయం చేస్తారు. ఏ ఊరిలో లేనివిధంగా యువకులు ఒక కమిటీగా ఏర్పడి చదువుకునే విద్యార్థులకు 'సహాయ బృందం'గా ఏర్పడ్డారు. వారంతా తగిన సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తారు. పాము కరిచినా, కుక్క కరిచినా ఆయుర్వేద మందు ఇవ్వడం మా ఊరి ప్రత్యేకత. ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందుతుంది.

 

ఈ. చెరువుల ప్రత్యేకత ఏమిటి?
జ: చెరువు ప్రతి గ్రామానికి ఆదెరువు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేది చెరువు. వర్షం పడినప్పుడు కాలువల ద్వారా నీరంతా ప్రవహించి చెరువుకు చేరుతుంది. ఆ నిల్వ ఉన్న నీరు పంటపొలాలకు పనికొస్తుంది. పశువుల దాహార్తి తీరుస్తుంది. చెరువులు చేపలకు నిలయాలు. ఆ చేపల వేటలో జాలర్లు నిమగ్నులై జీవనోపాధికి మార్గం వేసుకుంటారు. ఎండాకాలంలో చెరువు నీరు వివిధ రకాలుగా పనిచేస్తుంది. చెరువులో నీళ్లుంటే బోర్లలోని నీరు అడుగంటదు. భూగర్భజలాలు అడుగంటవు. చెరువు సకల జీవరాశులకు ఆశ్రయం కల్పిస్తుంది. చెరువులో తామరపూలు పూస్తాయి. కలువలు వికసిస్తాయి. ఈతను నేర్పించేది, రైతన్నల పాలిట కల్పవృక్షం చెరువు. గ్రామానికి గుండెకాయ చెరువు.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ. పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.
జ: పల్లెల్లో ఆనాడు దారులన్నీ వర్షంవస్తే బురదమయంగా మారేవి. ఇప్పుడు ప్రతి పల్లెకు మంచిదారి ఏర్పాటయ్యింది. అప్పట్లో ఆడవారు ఇంట్లోనే ఉండేవారు. పర్దా పద్ధతి ఉండేది. ఇప్పుడు అన్ని రంగాల్లో పల్లెల్లోని మహిళలు సైతం ముందుంటున్నారు. నాడు భూస్వాములు అధికంగా పనిచేయించుకునేవారు. శ్రమకు తగిన డబ్బు ఇచ్చేవారు కాదు. అమాయకులను మోసం చేసేవారు. మిత్తీలకు (వడ్డీలకు)డబ్బులిచ్చి అధికంగా వసూలు చేసేవారు. కానీ ఈనాడు చిన్నా, పెద్ద అందరూ అలాంటి మోసాలను ఎండగడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు, బండబర్వులు లాంటివి ఇప్పుడు లేవు. పిల్లలంతా సభ్యత, సంస్కారంతో పరిశుభ్రంగా ఉంటున్నారు.
పచ్చని చెట్లు, పక్షుల సందడి ఆనాటితో పోలిస్తే ఈనాడు సమానస్థాయిలో ఉంది. ఆనాడు భూస్వాములు చేసిన అరాచకాలను ప్రజలు కలగలిసి ప్రశ్నించి ఎదురునిలిచి గెలిచారు. కులమత భేదాలు సమసిపోయాయి. పట్టణాలలో ఉండే టెక్నాలజీని నేడు పల్లెల్లో వినియోగిస్తున్నారు. కష్టపడి పనిచేయడం అలవాటైంది. తమ కాళ్లమీద తామే బతకడం కోసం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యారు. పల్లెల్లో పలకరింపుల సందడి అమితంగా ఉంటుంది. పటేల్‌తనం, దొరపాలన ఆనాడు ఉండేది. వారికి, సామాన్య ప్రజలకు మధ్య అంతరం బాగా ఉండేది. నేడు రచ్చబండ, రాగిచెట్టు కలగలిసినట్టు ఊరిపెద్ద, సామాన్యులు కలిసిపోయారు. రాత్రిబడులు మొదలై నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చివేశాయి.

 

3. కింది ప్రశ్నకు, సృజనాత్మకంగా సమాధానం రాయండి.
అ. పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.
జ: అందమైన చెట్లు - అలరించే పాటలు
వెలతిలేని అనుబంధాలు - వెనక్కి తగ్గని ధైర్యాలు
చిగురు పూసిన ప్రేమలు - చిందులు వేసే యువకులు
సుకుమార కోవెలలు - సుమధుర దీవెనలు
పలకరింపుల సౌధాలు - అందమైన నా పల్లెలు
అనురాగపు లోగిళ్లు - ఆత్మీయత జాడలు
అందనంత ఎత్తులో - అలరించే హాయిలో
నా పల్లె సింగారం - అవనికి బంగారం
ఆకాశంలో సింగడి - నాపల్లె అంగడి
పశువుల అరుపులు - పిల్లల గోలలు
పక్షుల కిలకిలలు - పలికించును సంగీతమ్ములు
నా పల్లె తల్లి - సకల కళల కల్పవల్లి
తియ్యని నిజనేస్తం - ఓదార్చే అపురూపహస్తం
నాపల్లె సౌందర్యం - అందాల మకరందం


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం