• facebook
  • whatsapp
  • telegram

సర్వే.. బడ్జెట్‌  చదివేదెలా?

 

 

ఆర్థిక నిపుణులే కాదు; పోటీ పరీక్షల ప్రశ్నపత్ర రూపకర్తలు కూడా కరెంట్‌ ఎకానమీ అవగాహన కోసం ఆర్థిక సర్వే, బడ్జెట్‌లను బలమైన ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో ఉండేది ప్రభుత్వ అధికారిక సమాచారం. న్యాయస్థానం పరిధిలో కూడా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సర్వే, బడ్జెట్‌ గణాంకాలను పోటీ పరీక్షల్లో  ఉపయోగిస్తారు! 

 

ప్రిలిమినరీ పరీక్షల్లో 3 నుంచి 5 ప్రశ్నల వరకు ఏదో ఒక రూపంలో సర్వే, బడ్జెట్‌ అంశాలు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్‌ 2 ఎకానమి పేపర్లో, గ్రూప్‌-1 మెయిన్స్‌లో మార్కులు సాధించేందుకు సర్వే, బడ్జెట్‌లలోని భావనలు, గణాంకాలు వివరణలు విస్తృతంగా ఉపయోగపడతాయి. ఈ ప్రాధాన్యం గుర్తించి బహుళ ప్రయోజనాల కోసం వీటిపై పట్టు సాధించాలి.

 

ఆర్థిక సర్వేలో గత సంవత్సర వివిధ ఆర్థిక పరిణామాలను వివరిస్తారు.

 

స్థూల ఆర్థిక గణాంకాలు అనే విభాగంలో వివిధ రంగాల్లో వృద్ధిరేటు గణాంకాలు, స్థూల జాతీయ ఉత్పత్తి, పన్నుల వసూలు-ఖర్చులు, అప్పులు, ధరల ఊగిసలాట, తలసరి ఆదాయంలో మార్పులు మొదలైనవాటికి సంబంధించిన గణాంకాలను పరిగణిస్తారు. ఎక్కువ సందర్భాల్లో ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో ప్రశ్నలు ఈ విభాగం నుంచే అడిగారు. అందువల్ల అభ్యర్థులు ఈ విభాగంలోని గణాంకాలను బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి.

 

ప్రాథమిక రంగమైన వ్యవసాయ గణాంకాలు కూడా ప్రశ్నల రూపంలో వస్తాయి. ఆ సంవత్సరంలో అదనంగా కలిసిన వ్యవసాయ ఉత్పత్తుల విలువ, స్థూల జీడీపీలో వ్యవసాయం వాటా, ఆహారధాన్యాల ఉత్పత్తి- విస్తీర్ణం, ప్రధాన పంటల గణాంకాలు, వ్యవసాయ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం అంగీకరించిన రుణ వితరణ- వాస్తవాలు, వివిధ పంటలకు ఇచ్చిన మద్దతు ధరలు, పంటల ఉత్పత్తిలో వివిధ రాష్ట్రాల మధ్య పోలిక మొదలైనవి దృష్టిలో పెట్టుకొని సర్వేలోని వ్యవసాయ విభాగాన్ని అధ్యయనం చేయాలి.

 

ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం గత సంవత్సరంలో ఎటువంటి ధోరణులతో కొనసాగిందనే అవగాహన సర్వే ద్వారా ఏర్పరచుకోవచ్చు. స్థూల జీడీపీలో పారిశ్రామిక వాటా, అందులోని ఉప రంగాల వాటా, వృద్ధి రేట్లు, పారిశ్రామిక ఉత్పత్తి సూచి ద్వారా లభిస్తున్న గణాంకాలు, పారిశ్రామిక రంగంలో గత సంవత్సరంలో సాధించిన ప్రత్యేకాంశాలు అనే కోణంలో పట్టు సాధించాలి.

 

స్థూల దేశీయ ఉత్పత్తిలో ప్రధాన వాటాదారైన సేవారంగంపై పూర్తి అవగాహనకు ఆర్థిక సర్వే ఉపకరిస్తుంది. సేవారంగపు ఉప రంగాల్లో అదనపు విలువల జోడింపు, వాటి వృద్ధి రేట్లు, సేవా రంగపు జీవీఏలో వివిధ రాష్ట్రాల వాటాలు వృద్ధి, సేవారంగంలో స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బ్యాంకింగ్‌ రంగ ప్రగతి, పర్యాటక రంగం- ఇతర రంగాల ప్రగతి ప్రధానాంశాలుగా అధ్యయనం చేయాలి.

 

ఉపాధి కల్పన, మానవ వనరుల అభివృద్ధి గురించి సర్వేలో ఇచ్చిన భావనలు, గణాంకాలు చాలా కీలకమైనవి. 

 

తాజా ఆర్థిక సర్వేలో ఆంధ్ర, తెలంగాణలకు సంబంధించిన గణాంకాలనూ ప్రస్తావించారు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో వీటిని ఉదాహరించాల్సి ఉంటుంది.

 

బడ్జెట్‌ అవగాహన ఇలా

చిన్న స్థాయి పరీక్షల్లోనూ ఆర్థిక వ్యవస్థ సంబంధిత ప్రశ్నలు అడగాలనుకుంటే ఎగ్జామినర్‌ దృష్టి ఆ సంవత్సరం బడ్జెట్‌ మీద పడుతుంది. అందువల్ల బడ్జెట్‌ను కింది రూపాల్లో అధ్యయనం చేయాలి.

బడ్జెట్‌ స్థూల అవగాహన అనే కోణంలో రెవెన్యూ మూలధన వసూళ్లు, రెవెన్యూ మూలధనం వ్యయం, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు, రూపాయి రాక- పోక, ముఖ్యమైన కేంద్ర పథకాలకు కేటాయింపులు, వివిధ రంగాలకు కేటాయింపులు, ఆశిస్తున్న రుణాలు మొదలైనవాటిపై స్థూల అవగాహన ఏర్పరుచుకోవాలి.  

పన్నుల వ్యవస్థ విభాగం కింద వివిధ ప్రత్యక్ష పరోక్ష పన్నుల వాటాలు, ఈ బడ్జెట్‌లో వచ్చిన తాజా మార్పుల గణాంకాలు ప్రశ్నలుగా వస్తాయి. వివిధ ప్రత్యక్ష పరోక్ష పన్నుల మొత్తం విలువలు, వసూళ్ల ధోరణులు, ప్రధానంగా జీఎస్టీ సంబంధిత విషయాలు ముఖ్యమైనవి.

2022-23 బడ్జెట్లో ఇండియా జీ 100 విజన్‌ను ప్రస్తావించారు. స్వతంత్ర భారతదేశం వందేళ్లు చేరుకునే నేపథ్యంలో ఏర్పరుచుకున్న లక్ష్యాలు, వాటిని సాధించేందుకు ఎంచుకున్న 3 మార్గాలు, 4 ప్రాధాన్యాలు తప్పనిసరిగా ఎగ్జామినర్‌ని ఆకర్షిస్తాయి. వాటిపై పట్టు సాధించాలి.

మొదటి ప్రాధాన్యం అయిన పి.ఎం. గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. స్వర్ణ చతుర్భుజి తరహాలో పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాలు కల్పించి ఆర్థిక వ్యవస్థను దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలనే వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. గతి శక్తి గమనానికి ఎంచుకున్న ఏడు ఇంజిన్లపై పట్టు ఉండాలి. బడ్జె ట్‌లో ప్రస్తావించిన సమ్మిళిత వృద్ధి వ్యూహాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఈ అవగాహనతో కేంద్రం అనుసరిస్తున్న ప్రణాళిక అభివృద్ధి వ్యూహం అర్థమైపోతుంది. ప్రణాళికలు తొలగించిన తర్వాత ఈ తరహా వ్యూహానికి ప్రాధాన్యం పెరిగినందువల్ల దీన్ని అర్థం చేసుకోవాలి.

రైల్వే బడ్జెట్‌పై కనీసం అవగాహన అవసరం. స్థూల గణాంకాలను గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై ఆయా రాష్ట్ర అభ్యర్థులు అవగాహనతో ఉండాలి.

కొన్ని సందర్భాల్లో అంతకుముందు సంవత్సరం ఆర్థిక సర్వే, బడ్జెట్‌లపై ప్రశ్నలు వచ్చాయి. అందుకే వాటిపై కూడా అవగాహనతో తులనాత్మక పరిశీలన చేయాలి.

బడ్జెట్, సర్వేలు కొన్ని వందల పేజీల్లో ఉంటాయి.  అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. సూక్ష్మీకరించిన సమాచారంతో ఉన్న పుస్తకాలు ఉపయోగించుకోండి. 

వెబ్‌సైట్లు https://www.pib.gov.in/, https://vikaspedia.in/ ఉపయోగకరం. 

 

********************************************************

స్టడీమెటీరియల్
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10. తెలంగాణ రాష్ట్ర విధానాలు
11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12 .సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు
13 .లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్

Posted Date : 24-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌