• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-2 విజయానికి కీలకాంశాలు!

నవంబర్‌ 2, 3 తేదీల్లో పరీక్షలునవంబర్‌ 2, 3 తేదీల్లో టీఎస్‌ గ్రూప్‌-2 పరీక్ష జరగనుంది. అంటే అభ్యర్థులకు 40 రోజులకు పైగా ప్రిపరేషన్‌కు అవకాశం ఉంది. గ్రూప్‌-1 పరీక్షపై అనిశ్చితి వల్ల చాలామంది సీరియస్‌ అభ్యర్థులు గ్రూప్‌-2 పరీక్ష రాసేందుకు సంసిద్ధం అవ్వడంతో ఈసారి గ్రూప్‌-2 పరీక్ష పోటీ భారీగా ఉండబోతోంది. అలాగే గ్రూప్‌-2 పరీక్ష పైనే ఆశ పెట్టుకుని తీవ్ర ప్రయత్నం చేస్తున్నవారు కూడా తమ సర్వశక్తుల్ని ఒడ్డుతున్నారు. గ్రూప్‌-3 పరీక్ష రాస్తున్నవారూ గ్రూప్‌-2ని అదృష్టం పరీక్షించుకునే సాధనంగా వాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందో పరిశీలిద్దాం! 


గ్రూప్‌-2 రాస్తున్న గ్రూప్‌-1 అభ్యర్థులు

గ్రూప్‌-1లో నేర్చుకున్న విశ్లేషణాత్మక అధ్యయనం తప్పనిసరిగా గ్రూప్‌ 2లో ఉపయోగపడుతుంది. అదే ప్రధానమైన బలమని గుర్తించండి. ఇటీవలికాలంలో సమాచార విశ్లేషణపై అడిగే ప్రశ్నల సంఖ్య బాగా పెరిగింది. అందువల్ల ఆ సౌకర్యాన్ని మార్కులుగా మార్చుకునే ఆలోచనతో గ్రూప్‌-2 సిలబస్‌ కూడా చదవండి.


గ్రూప్‌-2 పరీక్షలో ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు గతంలో మాదిరిగానే ఎక్కువగా ఉంటాయి. అవి మారుమూల ప్రశ్నలూ కావచ్చు. సాధారణంగా గ్రూప్‌-1 అభ్యర్థుల్లో విస్తృత డేటాను గుర్తుంచుకునే ప్రయత్నం ఉండదు. గ్రూపు-1లో అనుసరించే ఆ ధోరణి ఇక్కడ కొనసాగిస్తే ప్రమాదం. అందువల్ల సిలబస్‌ను ఆధారం చేసుకుని వీలైనంత విస్తృతంగా, లోతుగా గణాంకాలు, ఫ్యాక్ట్స్, ఇతర ముఖ్యాంశాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే విజయం దక్కే అవకాశాలుంటాయి.


గ్రూప్‌-1 పరీక్షలో సాధారణంగా ఛాయిస్‌ విధానాన్ని అనుసరించి చదువుతూ ఉంటారు. గ్రూప్‌ 2 పరీక్షలో అటువంటి ఛాయిస్‌ విధానం పనికిరాదు. సిలబస్‌లోని అంశాల్ని సంపూర్ణంగా 360 డిగ్రీల కోణంలో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు అలా వదిలేసిన విషయాలు ఏవైనా ఉంటే తప్పనిసరిగా వాటి మీద దృష్టి పెట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


గ్రూపు-1లో స్క్రీనింగ్‌ పరీక్ష పెద్ద కష్టమైంది కాకపోవటం, తర్వాత రాసే మెయిన్స్‌ పరీక్షలో బేసిక్స్‌పై తక్కువ దృష్టి పెట్టడం అనే ధోరణితో ఉంటారు. అందుకే బేసిక్స్‌ను తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ 40 రోజుల సమయంలో సిలబస్‌ ఆధారంగా బేసిక్స్‌పై దృష్టిపెట్టి పరిశీలించుకోవడం అవసరం.


గ్రూప్‌-2 పరీక్షే ప్రధానమని భావిస్తుంటే..   

గ్రూప్‌-1 అభ్యర్థుల బలమేమిటో గుర్తించి వాటిని మీ ప్రిపరేషన్లో అంతర్భాగంగా చేసుకునే వ్యూహాన్ని అనుసరించాలి. లభిస్తున్న ఈ సమయాన్ని ఆయా విషయాల్లో బలపడేందుకు వినియోగించుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు.


ఇటీవలి కాలంలో యూపీఎస్‌సీ మార్గదర్శకత్వంలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల ధోరణిలో బాగా మార్పు వచ్చింది. అందులో భాగంగా జతపరిచే ప్రశ్నలు, ఎసర్షన్‌- రీజనింగ్‌ ప్రశ్నలు, చదవడానికి ఎక్కువ సమయం బట్టే ప్రశ్నలు మొదలైనవి పరీక్ష పత్రం తయారీదారులు అనుసరిస్తున్న నేపథ్యంలో అటువంటి ప్రశ్నలను తప్పకుండా సాధన చేయాలి. 


‣ అభ్యర్థుల విశ్లేషణాత్మక శక్తిని పరిశీలించేలా, సంపూర్ణ అవగాహన పరిశీలించేలా ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో సిలబస్‌లోని ప్రతి అంశాన్నీ సంపూర్ణంగా చదివే తత్వం అలవర్చుకోవాలి. అప్పుడే గ్రూప్‌-1 అభ్యర్థుల నుంచి వచ్చే పోటీని తట్టుకోగలుగుతారు.


రివిజన్‌లో కీలకం ఇవే

1. బేసిక్స్‌ను మరొక్కసారి అధ్యయనం చేయండి. ఇవి కనీసం 20 నుంచి 30 శాతం ప్రశ్నల సాధనలో ఉపకరిస్తాయి. అందువల్ల బేసిక్స్‌లో ఎంత బలంగా ఉన్నారో సరిగా పరిశీలించుకుని అందుకనుగుణంగా రివిజన్‌ చేయండి. 


2. ప్రాంతీయ పరిజ్ఞానం ఇటీవల బాగా ప్రాధాన్యం పొందింది. యూపీఎస్‌సీ మార్గదర్శకాల కారణంగా ప్రతి పరీక్షలోనూ ప్రాంతీయ విషయాలపై  కనీసం 25 శాతం ప్రశ్నలు ఉంటున్నాయి. ఆ నేపథ్యంలో తెలంగాణ జాగ్రఫీ, చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, సామాజిక సంబంధిత అంశాలు, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం స్పష్టం. ఆయా అంశాల్లో ఏదైనా బలహీనత ఉందేమో గుర్తించి రివిజన్‌లో అంతర్భాగంగా సరిచేసుకునేందుకు ఇదో మంచి అవకాశం.


3. ఇప్పుడు టెస్టులు రాస్తే మీ ప్రిపరేషన్‌ సామర్ధ్యం మీకు అర్థమైపోతుంది. ఫలితంగా మీ బలాల- బలహీనతల అంచనా సులభం అవుతుంది. చాలామందికి ఇది తెలియక పరీక్ష తేదీకి వారం ముందు పరీక్షలు రాస్తారు. అది సరికాదు. ఎందుకంటే నమూనా పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే తీవ్ర ఒత్తిడి గురై తద్వారా అసలు పరీక్షను చెడగొట్టుకుంటారు. అందుకని పరీక్షలను రాసి లోపాల్ని పరిష్కరించుకునే పద్ధతిని ఈ రివిజన్‌ సమయంలోనే అనుసరించండి.


4. కరెంట్‌ అఫైర్స్‌ కనెక్టివిటీకి ఇదే తరుణం. ఈ సంవత్సరం జనవరి నుంచి జరిగిన వివిధ రకాల వర్తమాన అంశాలపై దృష్టి పెట్టి ఒక్కసారి రివిజన్‌ చేయండి. గత పరీక్షల్లో పరీక్ష తేదీకి ఆరు నెలల వెనుక వరకు ప్రశ్నలు అడిగేవారు. ఇటీవలికాలంలో 12 నెలల వరకు కూడా అడుగుతున్నారు. అందువల్ల ఇప్పటికి సిద్ధమైవున్న కరెంట్‌ అఫైర్స్‌లో కాల పరిధి ఎంతవరకు ఉన్నదో పరిశీలించుకుని లోపముంటే ఈ రివిజన్‌లో సవరించుకోండి. కేవలం జనరల్‌ నాలెడ్జ్‌ సంబంధిత కరెంట్‌ అఫైర్స్‌కే పరిమితం కాకుండా రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, భౌగోళిక కోణాల్లో అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ నేపథ్యాలతో రివిజన్‌ చేయండి.


5. ఇప్పటివరకూ చదివిన పుస్తకాలకే ప్రస్తుతం పరిమితం కœండి. కొత్త పుస్తకాలు తీసుకుని అధ్యయనం చేయటం ఈ దశలో సరైన నిర్ణయం కాదు.


6. సామూహిక అధ్యయనాలు, టెలిగ్రామ్‌ గ్రూపులు మొదలైనవాటిని పక్కనపెట్టి వీలైనంత ఒంటరిగా ఏకాగ్రతతో అధ్యయనం చేయటం మెరుగైన ఫలితాలను ఇస్తుంది. సమయాన్ని పొదుపు చేస్తుంది. 


7. ఈ సమయంలో అనేక శారీరక, మానసిక, ఆర్థిక అవరోధాలు ఎదురవ్వొచ్చు. వాటిని సానుకూల ఆలోచనలతో పరిష్కరించుకుని ముందుకెళ్తేనే సత్ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. దీన్ని కూడా రివిజన్‌లో అంతర్భాగంగానే గుర్తించాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, 2 గెలుపు వ్యూహం

‣ క్లాసులో నలుగురితో కలిసేలా!

‣ ఆత్మన్యూనతతో అనర్థాలే!

‣ బ్యాంకులో కోర్సు.. ఆపై కొలువు!

Posted Date : 22-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌