• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆత్మన్యూనతతో అనర్థాలే!

* ఆత్మవిశ్వాసంతో విజయం తథ్యం


ప్రవేశ పరీక్ష రాశారు. కానీ తక్కువ మార్కులు రావడంతో అంచనాలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. కోరుకున్న ప్రముఖ కళాశాలలో సీటు సంపాదించ లేకపోయారు. అయిష్టంగానే ఓ చిన్న కాలేజీలో చేరాల్సివచ్చింది. దీంతో ఇక ఎందుకూ పనికిరామనే నిర్ణయానికి వచ్చేసి... మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకూ సమంజసమో ఆలోచించారా?

వాస్తవాలు ఎప్పుడూ ఊహలూ, అంచనాలకు భిన్నంగానే ఉంటాయి. నిజానికి ఏం జరిగింది అనేదాని కంటే.. దానికి మీ ప్రతిస్పందన ఎలా ఉన్నదనేదే ముఖ్యం. ఒక్కసారి వ్యతిరేక ఫలితాలు రాగానే.. ఫలితాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని ప్రతికూలంగా ఆలోచించడం సరికాదు. 

ఒక్కోసారి మీ శక్తిసామర్థ్యాలను అంచనా వేయడంలోనూ పొరపాటు జరగొచ్చు. దాంతో అనుకున్న విధంగా ఫలితాలూ రాకపోవచ్చు. వెంటనే ప్రతిసారీ అలాగే జరుగుతుందనే నిర్ణయానికి వచ్చేయకూడదు. 

మీ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. కాబట్టి మీ బలాలూ, బలహీనతల గురించి వాస్తవికమైన అవగాహనకు రావాలి. మీ సామర్థ్యాన్ని అతిగా ఊహించుకోవటమో, మరీ తక్కువగా అంచనా వేసుకోవటమో సరికాదు.

ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకుంటే.. వాటి మీద పట్టు సాధించడానికి మరింతగా కృషిచేయాలి. అందుకోసం వాటి మీద ఎక్కువ సమయాన్నీ కేటాయించాలి. 

మీకు అంతగా ఆసక్తిలేని సబ్జెక్టులు ఒక పట్టాన అర్థంకావడం లేదనుకుందాం. అప్పుడు వాటిని ఇష్టంగా చదివే స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. ఆయా అంశాలను ఒకసారి అర్థమయ్యేలా వివరించమని అడగొచ్చు. కొందరు విద్యార్థులు తరగతిలో అందరిముందూ లెక్చరర్లను సందేహాలు అడగడానికి సంకోచిస్తారు. ఇలాంటివాళ్లు సీనియర్లు, స్నేహితుల సహకారం తీసుకోవచ్చు. 

మీకు బాగా ఆసక్తి ఉన్న సబ్జెక్టులకు తక్కువ సమయం కేటాయించినా వాటిలో మంచి మార్కులు ఎటూ వచ్చేస్తాయి. అలా మిగిలిన సమయాన్ని క్లిష్టంగా ఉండే సబ్జెక్టులకు కేటాయించొచ్చు.


ప్రయత్నాలే గెలిపిస్తాయి...

జరిగినదాన్ని ఎలాగూ మార్చలేరు. దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే.. ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న విలువైన కాలమూ వృథా అవుతుంది.  ఆ తర్వాత ఎంత విచారించినా లాభం ఉండదు. 

మన చేతుల్లోలేని ఫలితాల గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. అందుకే మన దృష్టి ఎప్పుడూ ప్రయత్నాల మీదే ఉండాలి. అవి గతంలో కంటే మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు అదనంగా ఇంకెంత శ్రమపడగలరో చూడాలి. 

విఫలం అవుతామేమోననే భయం స్థిమితంగా ఉండనీయదు. పదేపదే ఇలాంటి ఆలోచనలే వస్తుంటే విజయానికి అవకాశమే ఉండదు. వాస్తవానికి మీ మీద మీకున్న నమ్మకం, చేసే ప్రయత్నాలే మిమ్మల్ని గెలిపిస్తాయి. 

ప్రతికూల ఆలోచనలను ఎంత నిరోధిస్తే అంత మంచిది. అలాగే చేసే కృషిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. అనుకున్నది సాధించేవరకూ సహనంతో, పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండాలి. 

ప్రయత్నాలను ముమ్మరం చేయడంతోపాటు.. ఆలోచనా విధానం, ఆచరణలోనూ మార్పు రావాలి. దాంతో అనుకున్నది సాధించగలుగుతారు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు

‣ పీఓ కొలువుల ప్రిపరేషన్‌ ప్లాన్‌

Posted Date : 20-09-2023 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం