• facebook
  • whatsapp
  • telegram

పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

పరీక్షార్థులకు సూచనలుకొన్ని అత్యవసర సందర్భాల్లో.. తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్జెక్టులు చదవాల్సివస్తుంది. అలాంటప్పుడు టైమ్‌టేబుల్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా అమలుచేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే అదేం చిత్రమోగానీ.. ఇలా పుస్తకం ముందువేసుకుని పేజీలు తిప్పగానే.. అలా నిద్ర ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. విద్యార్థుల్లో ఎంతోమంది సాధారణంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ ఇబ్బంది నుంచి బయటపడటానికి ఏ ప్రయత్నాలు చేయొచ్చో చూద్దామా? 


పఠనానికి కూర్చునే విధానమూ ముఖ్యమైందే. విద్యార్థుల్లో చాలామంది టేబుల్‌ పైన పుస్తకాలు పెట్టుకుని.. కుర్చీలో కూర్చుని చదువుతుంటారు. నిజానికి ఇది చాలా అనువైన పద్ధతి కూడా. అయితే కొందరు మాత్రం మంచం మీద కూర్చునీ లేదా పడుకునీ చదువుతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం విశ్రాంతిని కోరుకుని.. త్వరగా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. 


కొంతమంది రాత్రి సమయంలో బెడ్‌ లైటు వెలుగులో చదువుకుంటారు. దీంతో వెలుతురు తక్కువగా ఉండటం వల్ల చురుగ్గా ఉండలేరు. మగతగా ఉండి త్వరగా నిద్ర ముంచుకొచ్చే అవకాశమే ఎక్కువ. 


ఒకేసారి కడుపు నిండుగా తిని కూర్చుంటే.. ఎక్కువసేపు కదలకుండా కూర్చుని చదువుకోవచ్చనుకుంటే పొరపాటే. అతిగా తినడం వల్ల మగతగా ఉండి కళ్లు మూతలు పడతాయి. చదవడానికి ముందు.. అవసరమైన దానికంటే కాస్త తక్కువగా తినడమే మంచిది. దీంతో మత్తు ఆవరించకుండా చురుగ్గా ఉండగలుగుతారు. 


పగటిపూట కళ్లు మూతలు పడుతున్నాయంటే అర్థం.. రాత్రి సరిగా నిద్రపోలేదనే. రాత్రుళ్లు తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇలా త్వరగా నిద్రపోయి వేకువజామునే లేవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. అప్పుడు మెదడు చురుగ్గా ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వాతావరణమూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. దాంతో ఎలాంటి అవరోధాలూ లేకుండా హాయిగా చదువుకోవచ్చు. 


‣ పరీక్షల ముందో లేదా కొన్ని అత్యవసర సందర్భాల్లోనో వేకువజాము నుంచీ చదవడం అవసరమవుతుంది. అలాంటప్పుడు మధ్నాహ్నం పూట నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. అప్పుడు కాసేపు కునుకుతీస్తే ప్రయోజనం. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పఠనం కొనసాగించొచ్చు. 


ఒకే విధంగా కూర్చుని ఎక్కువసేపు చదవడం వల్ల కూడా బద్ధకంగా, మగతగా ఉంటుంది. అలాంటప్పుడూ నిద్ర ముంచుకొస్తుంది. కుర్చీలోంచి లేచి.. కాస్త అటూఇటూ తిరగడం, కాళ్లూచేతులను కదిలించడం లాంటివి చేయడం వల్ల చలాకీగా ఉండగలుగుతారు. 


ప్రశాంతంగా ఉండే వాతావరణంలో కూర్చుని చదువుకోవడం మంచిదే. అయితే చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలూ లేకపోతే కూడా ఒక్కోసారి నిద్ర ముంచుకొస్తుంది. ఇలాంటప్పుడు పైకి చదవడం మంచి చిట్కా. దీంతో మీ గొంతు మీకు స్పష్టంగా వినిపిస్తుంది. నిద్ర మత్తు వదిలి చురుగ్గా చదవగలుగుతారు. 


‣ నిరవధికంగా అలా చదువుతూ కూర్చోవడం.. కాసేపటికి విసుగ్గా అనిపించొచ్చు. నిద్రా ముంచుకు రావొచ్చు. ఇలాంటప్పుడు చదివినదాన్ని ఒకసారి చూడకుండా రాయడానికి ప్రయత్నించాలి. ఇలా రాయాలంటే.. అప్పటివరకూ చదివినదాన్ని గుర్తుకుతెచ్చుకోవాలి. ఈ క్రమంలో బద్ధకం వదిలి మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. 


రాత్రుళ్లు ఆసక్తిగా, కాస్త తేలిగ్గా ఉండే సబ్జెక్టులను ఎంచుకుని చదవడం మంచిది. ఆసక్తిలేని వాటిని చదివితే విసుగు, ఆపై నిద్రా ముంచుకొస్తాయి. సాధారణంగా వేకువజామున మెదడు చురుగ్గా ఉంటుంది. అప్పుడే నిద్ర నుంచి లేవడం వల్ల శారీరకంగానూ ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో క్లిష్టంగా ఉండే అంశాలను చదివితే సులువుగా అర్థమవుతాయి.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు

‣ పీఓ కొలువుల ప్రిపరేషన్‌ ప్లాన్‌

‣ లెఫ్టినెంట్‌ హోదాలో మహిళామణులు

‣ అకడమిక్‌ యాంగ్జైటీని అధిగమిద్దాం!

‣ కేంద్రంలో 307 ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

Posted Date: 13-09-2023


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం