• facebook
  • whatsapp
  • telegram

చదవడానికేం కావాలి?

వెలుతురు:

చదువుకునే గదిలో తగినంత వెలుతురు ఉండాలి. మరీ ఎక్కువ వెలుగు కానీ మరీ తక్కువ వెలుగు కానీ పనికిరాదు. వెలుగు ఎక్కువైనా తక్కువైనా కంటికి శ్రమ పెరిగి చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. క్రీనీడలో పుస్తకం చదవడం మంచిది కాదు. వెలుతురు పుస్తకం మీద పడాలి. కంటి మీద, ముఖం మీద పడకూడదు. టేబుల్ లైట్ మంచిదే కానీ దీనివల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. టేబుల్ మీద కరెంట్ వైర్లు ఉంటాయి. బల్బు వేడి ప్రభావం చదివేవారిపై ఉంటుంది. వొంటిమీద పురుగులు పడుతూ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. టేబుల్ లైటు వల్ల పుస్తకం మీద ఎక్కువ వెలుతురు పడుతుంది. మన గదిలో మిగిలిన ప్రదేశం చీకటిగా మారుతుంది. తలెత్తి చూసినప్పుడల్లా ఈ రెంటి మధ్యా తేడాలను సర్దుబాటు చేసుకోవడానికి కంటికి కొంత సమయం, కొంత శ్రమా అవసరం అవుతాయి. అందుచేత సాధ్యమైనంత వరకు టేబుల్ లైట్లకంటే ట్యూబ్‌లైట్లను వాడటం మంచిది.

గాలి:

చదువుకునే గదిలో వెలుతురుతో పాటు గాలి ధారాళంగా ఉండటం కూడా అవసరం. విపరీతమైన వేగంతో శబ్దం చేస్తూ తిరిగే ఫ్యాన్ శరీరానికి సౌకర్యం కన్నా అసౌకర్యమే ఎక్కువ కలిగిస్తుంది. గాలికీ చల్లదనానికీ మధ్య ఉన్న సంబంధం కూడా ముఖ్యమైనదే. గది మరీ వేడిగా కానీ మరీ చల్లగా కానీ ఉండకూడదు. శరీర ఉష్ణోగ్రత కన్నా నాలుగయిదు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఫ్యాన్, ఎయిర్ కండిషన్ వంటి వాటికి అలవాటు పడితే కరెంటు కోతలవల్లో మరో కారణం వల్లో అవి అందుబాటులో లేని పరిస్థితి వచ్చినప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకూ వాడకపోవడం మంచిది.

      చదవడానికి కూర్చునే ప్రదేశంతో పాటు కూర్చునే పద్ధతి కూడా అంతే ముఖ్యమైనది. వెన్నుపూస నిటారుగా ఉంచుకోవడం మంచి చదువరుల లక్షణం. మంచంపైన, వాలుకుర్చీలో పడుకుని చదవడం మంచిది కాదు. అలా చదవడం వల్ల విశ్రాంతి ఎక్కువై త్వరగా నిద్ర వస్తుంది. ఎక్కువసేపు చదివేవారిలో జీర్ణశక్తి మందగించకుండా ఉండాలంటే నిటారుగా కూర్చుని చదవాలని వైద్యులు సూచిస్తున్నారు. మెడ సహజంగా నిలబెట్టి ఉంచినప్పుడు చదివే పుస్తకం చక్కగా కనబడేలా మన చదివే స్థితి ఉండాలి. చేతులమీద గానీ, మెడమీద గానీ, అసహజమైన వత్తిడి ఉండకూడదనేది నియమం.

     స్టడీ టేబుల్‌ని ఉపయోగిస్తున్నట్త్లెతే దానితో పాటుగా ఒక అట్టను కూడా వాడాలి. సమతలంగా ఉన్న టేబుల్ మీద పుస్తకం పెట్టి చదవడం సరైన కోణం లభించక కళ్లకి శ్రమ కలిగిస్తుంది. అలా మరీ సమతలంగా ఉన్న బల్ల మీద పుస్తకం పెట్టి రాయడం చేతి కండరాలకు, నడుముకూ మంచిది కాదు.

      చదువుకునే ప్రదేశంతో ఉండే పెద్ద సమస్య దానిలో ఉన్న వస్తువులను కదలకుండా ఉంచడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎక్కువగా ఉండేవి పుస్తకాలూ, పెన్నులూ, కాగితాలే కదా. ఇవి మనం చదువుతున్నప్పుడు కదిలిపోవడం సహజం. కనుక చదువుల బల్లను సర్దుకోవడంతో ప్రతిరోజూ చదువును ప్రారంభించాలి. అంటే చదవడానికి కూర్చునే ముందుగా పుస్తకాలు, ఇతర స్టేషనరీ వాటి వాటి స్థానంలో ఉన్నాయా, లేదా అని చూసుకొని అలా ఉండేలా సర్దుకోవాలి. చదువు పూర్తిచేసి టేబుల్ ముందునుంచి లేచేటప్పుడు కూడా ఈ పని తప్పనిసరిగా చేయండి. టేబుల్‌ని చిందరవందరగా ఉంచుకోవడం వల్ల కావలసిన పుస్తకం లేదా కాయితం సమయానికి దొరకక ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనివల్ల సమయం వృథా కావడంతో పాటు చదివే మూడ్ చెడిపోతుంది.

      ఈ సమస్య నుంచి బయటపడాలంటే సులభమైన ఉపాయం ఏమిటంటే సబ్జెక్టుకి ఒక రంగు చొప్పున పుస్తకాలన్నింటికీ వేరువేరుగా అట్టలు వేయాలి. చాలా మంది విద్యార్థులు పుస్తకాలకు అట్టలు వేయడానికి బద్దకిస్తారు. అది మంచిది కాదు. అట్టలు వేయడం ద్వారా ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నా వాటిపై మనకు ప్రేమ పెరుగుతుంది. దానికోసమైనా అట్టలు వేయడానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి.

అన్నీ అందుబాటులో...

పుస్తకాలు ఉంచిన అరలకు దగ్గరగా టేబుల్‌ను ఉంచుకోవాలి. వీలైతే కుర్చీలో లేచే పనిలేకుండానే కావాల్సిన పుస్తకాన్ని అందుకోగలిగి ఉండాలి. రాయడానికి అవసరమయ్యే స్టేషనరీని కూడా దగ్గరలో ఉంచుకోవాలి.

      అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అవసరంలేని వస్తువులను, మన ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులను (టీవీ, సెల్‌ఫోన్ వంటివాటిని) దూరంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. అదేపనిగా కబుర్లు చెప్పేవాళ్లకి మీ గదిలోకి 'నో ఎంట్రీ చెప్పగలిగితే ఇంకా మంచిది. ఇవన్నీ మీరు చదివే సమయాన్ని దాదాపుగా హరిస్తాయి.

      గదికి వాడే రంగులు మీ మానసిక స్థితిని సమతూకంలో ఉంచుకునేందుకు ఉపయోగిస్తాయి. ఆకుపచ్చ, పసుపు, గులాబి లాంటి ఆహ్లాదకరమైన లేతరంగులు చదువుకొనే ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. అయితే విద్యార్థుల గదులకు రంగుల కంటే పోస్టర్లే అందం. మీ లక్ష్యాలు, ప్రణాళికలు, మిమ్మల్ని నడిపించే మీకు నచ్చిన సూక్తులు, తప్పక చేయవలసిన పనులు వంటివన్నీ రంగురంగుల పెన్నులతో రాసి మీ గది గోడలకు అతికించుకోండి.

     ఒంటరిగా కూర్చుని చదువుకోవడం మంచిదా? బృంద అధ్యయానాల వల్ల ఫలితాలుంటాయా? అనే చర్చ ఇక్కడ అనవసరం. అవకాశాన్ని, అవసరాన్ని బట్టి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. 'నలుగురు ఉంటే చదవడం నాకు ఇబ్బంది అనడం ఎంత తప్పో, 'నలుగురు లేకుండా ఒంటరిగా పుస్తకం తీయడం నాకు బద్ధకం అనుకోవడం కూడా అంత తప్పు.

గదిలో ఒక చెత్తబుట్టను ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు మనం మరిచిపోయి వదిలేసిన కాగితం తెల్లవారి ఊడ్చేసిన చెత్తలో ఏరుకోవాల్సి వస్తే ఎంత కష్టం! చెత్తబుట్టలో చేరని కాగితాన్ని మీ గదిదాటి బయటకు తీసుకెళ్లే అవకాశం ఎవరికీ ఇవ్వకండి.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం