• facebook
  • whatsapp
  • telegram

రివిజన్‌ మళ్లీ మళ్లీ!

రాజేష్‌ తెలివైన విద్యార్థి. ఎప్పటి పాఠాలు అప్పుడు బాగా చదువుకుంటాడు. స్లిప్‌ టెస్ట్‌లు, మంత్లీ టెస్ట్‌ల్లో మార్కులు బాగా వస్తాయి. కానీ ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫైనల్‌ పరీక్షల్లో అనుకున్న పర్సంటేజ్‌ రాలేదు. టెన్త్‌లో కూడా అలాగే జరిగింది. దీంతో ఆందోళన పెరిగిపోతోంది. నిరాశతో డిప్రెషన్‌కు గురయ్యాడు. నిపుణులను సంప్రదిస్తే చదివింది మళ్లీ సరిగా రివిజన్‌ చేయకపోవడంతో సమస్య తలెత్తిందని గుర్తించారు. అంతా చదివేశాం... వచ్చేసింది అయినా సరిగా రాయలేకపోయాం అని బాధపడే విద్యార్థులు రివిజన్‌ ప్రాధాన్యాన్ని గ్రహించడం లేదు. చదవడం అంతా ఒక ఎత్తయితే దాన్ని పునశ్చరణ చేయడం మరో ఎత్తు. సరిగా రివిజన్‌ చేస్తే కావాలనుకున్న మార్కులు కచ్చితంగా సొంతమవుతాయి.

        చదువుకు సంబంధించి SQ3R (Survey, Question, Read, Repeat, Revise) పద్ధతి శాస్త్రీయమైంది. సర్వే అంటే సిలబస్‌లో, పాఠంలో అసలు ఏముందో స్థూలమైన అవగాహన ఏర్పరచుకోవడం. క్వశ్చన్‌ అంటే అవగాహనను ప్రశ్నలు, జవాబుల రూపంలోకి మార్చుకోవడం. రీడ్‌- మనకు వచ్చే దాకా చదవడం. రిపీట్‌, రివైజ్‌లను కలిపి స్థూలంగా రివిజన్‌ అని వ్యవహరిస్తారు.

       జ్ఞాపకాలు తాత్కాలికం, శాశ్వతం అని రెండు రకాలు. చదువును శాశ్వత జ్ఞాపకాల్లోకి చేర్చాలి. అందుకు తగిన ప్రాక్టీస్‌ చేయాలి. ఒక పాఠాన్ని ఎంత బాగా చదివినా క్రమం తప్పకుండా రివిజన్‌ చేస్తేనే అది శాశ్వత జ్ఞాపకాల్లోకి చేరుతుంది. అలా చేరితేనే పరీక్షల్లో బాగా రాయగలుగుతారు.

ఒకసారి వచ్చే దాకా చదివితే అది 24 గంటలు గుర్తుంటుంది. 24 గంటల తర్వాత చదివితే వారం రోజుల వరకు గుర్తుంటుంది. వారం లోపు మళ్లీ చదివితే నెల జ్ఞాపకం ఉంచుకోవచ్చు. నెలలోపు నాలుగోసారి చదివితే 3 నెలల వరకు ఢోకా ఉండదు అనేది శాస్త్రీయంగా రుజువైంది. అంటే ప్రతి 3 నెలలకూ ఇంతకు ముందు చదివిందంతా రివిజన్‌ చేసుకోవాలి.

 

వారాల పద్ధతి

ఈ పద్ధతిలో ఫార్ములాలు, సంవత్సరాలు, వ్యతిరేక పదాలు, పర్యాయపదాలు, గ్రంథాలు-రచయితలు లాంటివి రోజూ చదవాల్సిన జాబితాలో చేర్చాలి (ఆదివారం మినహా). నిర్వచనాలు, కంఠస్థ పద్యాలు, కొటేషన్లు కనీసం వారానికి మూడుసార్లు చదవాలి (మంగళ, గురు, శని). 2-5 వాక్యాలలోపు ఉండి కొద్దో గొప్పో మార్చి రాయడానికి అవకాశం ఉన్న జవాబులను వారానికి రెండుసార్లు (సోమ, శుక్ర), వ్యాసరూప సమాధానాలను వారానికి ఒకసారి (ఆదివారం) రివిజన్‌ చేస్తే ఉత్తమం.
పరీక్షల నెలల్లో రోజూ రివిజన్‌కి ముందు 3 గంటలు కేటాయించాలి. పై 4 రకాల రివిజన్లు ఒకేరోజు రాకుండా వేర్వేరు రోజుల్లో వచ్చే విధంగా ప్లాన్‌ చేయాలి.

 

సమయం వృథా కాకుండా..!

కావాల్సిన పుస్తకాన్ని వెతుక్కోవడంలో, ఏది రివిజన్‌ చేయాలో నిర్ణయించుకోవడం లేదా గుర్తుచేసుకోవడంలో రోజుకి కనీసం 15 నిమిషాలు వృథా అయినా 200 రోజులకు 3000 నిమిషాలు అంటే 50 గంటలు కోల్పోతారు. అందుకే సబ్జెక్టుకు ఒక రంగు కేటాయించుకొని అట్టలు వేసుకోవాలి. అట్టలు వేయడం కుదరకపోతే అన్ని వైపుల నుంచి స్పష్టంగా కనిపించే విధంగా కాగితం లేదా స్టిక్కర్‌ అంటించాలి. దీని వల్ల ఏ పుస్తకం ఏదో పేజీలు చూడకుండానే గుర్తించగలుగుతారు.

 

ఆసక్తికరంగా..!

రివిజన్‌ ఆసక్తికరంగా సాగడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. స్టడీ టేబుల్‌ మీద మూడు లేదా నాలుగు రంగుల బాక్సులు పెట్టుకోవాలి. లేదా మీ బుక్‌ కేసును వేర్వేరు రంగులతో భాగాలుగా విడదీయాలి. ఉదయం నిద్ర లేవగానే కొత్తగా చదవాల్సినవి ఎరుపు రంగు ప్రదేశంలో ఉంచాలి. రివిజన్‌ చేయాల్సినవి పసుపు, చూడకుండా రాయాల్సినవి, అప్పజెప్పాల్సినవి ఆకుపచ్చ రంగు ప్రదేశాల్లో ఉంచుకోవాలి.

     మనం 4 రకాల రివిజన్‌ల గురించి అనుకున్నాం. వాటిలో వారానికి 6 రోజులు చదవాల్సిన నోట్సులకు ఎరుపు, వారానికి మూడు రోజులు చదవాల్సిన పుస్తకాలకు ఆకుపచ్చ, వారానికి రెండు రోజులు చదవాల్సిన వాటికి నీలం, వారానికోసారి చదివే దానికి పసుపు రంగు అట్టలు వేయాలి. వారాలకు కూడా వరుస అంకెలు కేటాయించి వాటిని ఆ పుస్తకాలపై కనిపించేలా వేసుకోవాలి. అప్పుడు ఏ రోజు ఏ పుస్తకం చదవాల్లో తేలిగ్గా గుర్తించవచ్చు. సరైన ప్రణాళిక రూపొందించుకొని, జాగ్రత్తలు పాటిస్తే రివిజన్‌ విజయవంతంగా పూర్తిచేయవచ్చు.

 

కొన్ని సూత్రాలు

* కొత్తవి నేర్చుకునే క్రమంలో పాత పాఠాలు మరచిపోకుండా చూసుకోవాలి.

* ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోడానికి క్రమం తప్పకుండా రివిజన్‌ చేయాలి.

* పాత పాఠాలు ఎంత బాగా గుర్తుంటే కొత్తవి అంత త్వరగా వస్తాయని గుర్తించాలి.

* రివిజన్‌ అంటే అప్పజెప్పడం కాదు. అది జ్ఞాపకాలను తాజాగా ఉంచుకోడానికి అవలబించే పద్ధతని గ్రహించాలి.

* మొదట ఏ పుస్తకంలో చదివామో చివరి వరకూ అదే పుస్తకంలో చదవాలి. పుస్తకాలు మారిస్తే రివిజన్‌ ప్రయోజనం తక్కువ.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం