• facebook
  • whatsapp
  • telegram

పుస్తక పఠనం ఆస్వాదిస్తున్నారా

మీ ఆసక్తిని బట్టి పుస్తకం ఎంచుకోండి





పుస్తక పఠనం అనేది.. ఎంతోమందికి ఇష్టమైన అభిరుచి. రోజూ ఏదో ఒకటి చదివితేనేగానీ నిద్రపట్టనివాళ్లు ఎందరో ఉంటారు. అలాగే ‘తరగతి పుస్తకాలు చదవడానికే సమయం సరిపోవడం లేదు... మళ్లీ ఇతర రచనలు కూడానా?’ అని నిట్టూర్చేవాళ్లూ ఉంటారు. పఠనం.. విజ్ఞానం, సమగ్ర వికాసం, పోటీ పరీక్షలను ఎదుర్కోవడానికీ దోహదపడుతుంది. పుస్తక పఠన ప్రాధాన్యాన్ని గుర్తించి.. చదవాలని ఆశించేవారు ఏం చేయొచ్చో తెలుసుకుందామా? 



మొదట్లోనే పెద్ద పుస్తకాన్ని తీసుకుని అది ఎప్పటికి పూర్తవుతుందోనని కంగారుపడకూడదు. అలాగే దాన్ని తొందరగా ముగించి పక్కన పెట్టేయాలనీ ఆరాటపడకూదు. ఒకేసారి ఉద్గ్రంధాలు కాకుండా.. ముందుగా దిన పత్రికలు, మ్యాగజీన్లతో మొదలుపెట్టొచ్చు. ఆ తర్వాత ఆసక్తికి అద్దంపట్టేవి ఎంచుకుని చదివితే బాగుంటుంది. 

ఏది చదవాలనేది వ్యక్తిగత అభిప్రాయాలూ, ఆసక్తుల మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అందరి అభిప్రాయాలూ, అభిరుచులు ఒకే విధంగా ఉండవు. కాబట్టి ఎవరి ఆసక్తిని బట్టి వాళ్లు ఎంచుకోవడం మంచిది. ప్రముఖుల జీవితకథలు, కల్పితగాధలు, యదార్థ సంఘటనల ఆధారంగా చేసిన రచనలు, చారిత్రక, భయానక, వ్యక్తిత్వ వికాస.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వీటిలో నుంచి మీ ఆసక్తికి అనుగుణంగా నచ్చినవాటిని ఎంచుకోవచ్చు. 

ఎలాంటి రచనలు చదవాలనే విషయంలో మీకో అభిప్రాయమంటూ లేకపోతే.. కుటుంబ సభ్యులు, స్నేహితులను అడిగి.. వారికి నచ్చిన పుస్తకాల వివరాలను కనుక్కోవచ్చు. ముందుగా వారి సలహాల ప్రకారం చదవడానికి అలవాటు పడితే.. ఆ తర్వాత అవి మీక్కూడా నచ్చేయొచ్చు. లేదా మీ ఆసక్తిని బట్టి ఇతర రచనలనూ ఎంచుకోవచ్చు.

మొదట్లో ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవి చదవడానికి అలవాటు పడకూడదు. దీనివల్ల త్వరగా విసుగు అనిపించవచ్చు. ఒకసారి కాల్పనిక పుస్తకం చదివితే.. మరోసారి ఆత్మకథ చదవొచ్చు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల రచనా శైలులను ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. 

ఆన్‌లైన్‌లో బ్రౌజింగ్‌ చేసి ఎంచుకోవడం కంటే స్వయంగా దుకాణానికి వెళ్లడమే మంచిది. పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని.. దాన్నుంచి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఎంచుకోవడంలోని ఆ ఆనందమే వేరు. దుకాణానికి స్వయంగా వెళ్లినట్లయితే.. మీకు ఆసక్తిగా ఉండే అంశంలోని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో లేదో.. అలాగే అదే అంశంలో రాబోయే రచనల వివరాలనూ కనుక్కోవచ్చు. అభిమాన రచయిత రాసినవి అక్కడ అందుబాటులో ఉన్నా కొనుక్కోవచ్చు. 

తరగతి పాఠ్య పుస్తకాలను ఇష్టమున్నా.. లేకపోయినా పరీక్షలో పాస్‌ మార్కుల కోసం తప్పనిసరిగా చదవాల్సిందే. అభిరుచితో సంబంధమున్న పఠనం విషయంలో అలాంటి ఇబ్బందేమీ ఉండదు. పద ప్రయోగ చమత్కారాన్ని ఆస్వాదిస్తూ చదవొచ్చు. మీరు కూడా పాత్రలతో కలిసి ప్రయాణం చేయొచ్చు. 

ఆడియో బుక్స్‌ వినడాన్ని కూడా అలవాటు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో.. భావయుక్తంగా చదవడం వల్ల మీరూ కథలో లీనమవుతారు. ఒకవేళ చదివే తీరు నచ్చకపోతే మరో పుస్తకంలోకి వెళ్లిపోతారు. కొన్ని పబ్లిక్‌ లైబ్రరీల్లోనూ ఆడియో బుక్‌ సదుపాయం ఉంటుంది. వినడం వల్ల కూడా చక్కని అనుభూతిని పొందొచ్చు. దీంతో పుస్తక పఠనానికీ మార్గం సులువవుతుంది.

చకచకా చదివి త్వరగా ముగించెయ్యాలనుకోకూడదు. నిదానంగా, అనుభూతి చెందుతూ చదవాలి. కొన్ని రోజుల తర్వాత కూడా అందులోని పాత్రలు, సంభాషణలు గుర్తొస్తూ ఉంటే.. ఆస్వాదిస్తూ చదివారని అర్థం. ఉదాహరణకు ఒకరోజు 20 పేజీలు చదవాలని నిర్ణయించుకున్నారు అనుకుందాం. చదవాలనే ఆసక్తిలేకుండా బలవంతంగా మాత్రం పేజీలు తిప్పేయకూడదు. 

నిద్రలేమి సమస్యతో ఎంతోమంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటివాళ్లు ప్రతి రాత్రీ పడుకోవడానికి ముందు పుస్తకం చదవడాన్ని అలవాటు చేసుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. మంచానికి దగ్గరగా పుస్తకాల స్టాండ్‌ను పెట్టుకోవాలి. పడుకోబోయే ముందు ఇష్టమైన రచన ఎంచుకుని చదువుకోవచ్చు. కొంతకాలానికి ఇదే పద్ధతి అలవాటుగా మారుతుంది. నిద్రలేమి వల్ల వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యల బారి నుంచి బయటపడొచ్చు కూడా. 

ఏదో సమయం చిక్కినప్పుడు పుస్తకాలు చదవడం.. ఆ తర్వాత పక్కన పెట్టేయడమే కాదు. ఈ అలవాటును కొనసాగించడం వల్ల ఇతర నైపుణ్యాలూ అలవడతాయి. ఎక్కువగా చదవడం వల్ల పద సంపద పెరుగుతుంది. అర్థవంతంగా మాట్లాడగలుగుతారు.. అంతేకాదు ఆలోచింపజేసేలా రాయగలుగుతారు కూడా. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Posted Date: 23-04-2024


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం