• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

ఇంటర్‌ అర్హతతో ‘లా’ ప్రవేశం

గడువు తేదీ  ఏప్రిల్‌ 25


 

న్యాయవిద్య విస్తృత ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. మేటి విద్యాసంస్థలెన్నో ‘లా’ కోర్సులు అందిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాసెట్‌ ప్రకటనలు వెలువడ్డాయి. ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు!


దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు సైబర్‌ క్రైమ్‌, ఆన్‌లైన్‌ మోసాలు, కాపీ రైట్‌ ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. సాంకేతికత వృద్ధి లీగల్‌ పట్టభద్రులకు కొత్త అవకాశాలు కల్పిస్తోంది. సివిల్‌ జడ్జ్‌ (జూనియర్‌ డివిజన్‌), లేబర్‌ ఆఫీసర్‌ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టుల్లో సేవలు అందించవచ్చు. ఆర్మీలో జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పోస్టులకూ లా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేటు ప్రాక్టీస్‌ కొనసాగించవచ్చు. లీగల్‌ రిపోర్టర్‌, లీగల్‌ అనలిస్ట్‌గానూ సేవలందించవచ్చు.


ప్రశ్నించే తత్వం, న్యాయం చేయాలనే తపన, సమాజంలో మార్పు దిశగా ప్రయత్నం చేయాలనుకున్నవారు న్యాయవిద్య వైపు అడుగులేయవచ్చు. ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ విధానంలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ రెండూ ఒకేసారి చదువుకోవచ్చు. అలా వీలుకాని వారు డిగ్రీ అనంతరం ఎల్‌ఎల్‌బీలో చేరవచ్చు. ముందే స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులు డిగ్రీతో కలిపి ఎల్‌ఎల్‌బీలో చేరితేనే మెరుగు. దీంతో ఐదేళ్లకే కోర్సు పూర్తవుతుంది. డిగ్రీ తర్వాత మొత్తం ఆరేళ్లు (విడిగా డిగ్రీకి మూడేళ్లు, ఎల్‌ఎల్‌బీకి మరో మూడేళ్లు) పడుతుంది. ఇంటర్‌తో ఏడాది సమయం ఆదాతోపాటు, సబ్జెక్టుపై పట్టు పెంచుకోవచ్చు. అందువల్లే జాతీయ, ప్రాంతీయ సంస్థలు డిగ్రీతో ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.


నచ్చిన డిగ్రీతో..

బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యు...వీటిలో కోరుకున్న కాంబినేషన్‌తో ఎల్‌ఎల్‌బీ చదువుకోవచ్చు. ఎక్కువ సంస్థలు బీఎ ఎల్‌ఎల్‌బీ కోర్సు అందిస్తున్నాయి. డిగ్రీ కోర్సు ఏదైనప్పటికీ లా సిలబస్‌ అన్ని సంస్థల్లోనూ దాదాపు ఒకటే. బీబీఏలో మేనేజ్‌మెంట్‌, బీఏలో సోషల్‌ సైన్సెస్‌, బీఎస్సీలో సైన్స్‌ అంశాలు, బీఎస్‌డబ్ల్యూలో సోషల్‌ వర్కుకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఐదేళ్లలో పది సెమిస్టర్లతో డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ పూర్తవుతుంది. అనంతరం ఉద్యోగం లేదా ఉన్నత విద్య (ఎల్‌ఎల్‌ఎం) దిశగా అడుగులేయవచ్చు.


ఉన్నత విద్య

ఏదైనా అంశంలో ప్రత్యేక ఆసక్తి ఉండి, నైపుణ్యం ఆశించేవారు పీజీకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. బిజినెస్‌, హ్యూమన్‌ రైట్స్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ, కాన్‌స్టిట్యూషనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌, బిజినెస్‌ అండ్‌ క్రిమినల్‌, కార్పొరేట్‌, ఎన్విరాన్‌మెంటల్‌, ఫ్యామిలీ, పాలసీ అండ్‌ గుడ్‌ గవర్నెన్స్‌, కన్స్యూమర్‌ లా...మొదలైనవి ముఖ్యమైనవి. స్పెషలిస్ట్‌గా రాణించడానికి ఉన్నత విద్య (ఎల్‌ఎల్‌ఎం) ఉపయోగపడుతుంది. క్లాట్‌ స్కోరుతో మేటి సంస్థల్లో పీజీ కోర్సులో చేరవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ అందించే ఎల్‌ఎల్‌ఎం కోర్సుకీ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. జాతీయ, ప్రముఖ సంస్థల్లో పీజీ కోర్సు (ఎల్‌ఎల్‌ఎం) ఏడాదికే పూర్తవుతుంది. రాష్ట్రస్థాయి సంస్థల్లో మాత్రం ఈ వ్యవధి రెండేళ్లు. పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీలోనూ చేరవచ్చు. బోధన రంగంలో రాణించాలనుకునేవారికి ఇది కీలకం.  


ఉద్యోగాలు ఎక్కడ?

పేరున్న సంస్థల్లో న్యాయవిద్య కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు పొందుతున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌, బహుళజాతి, ప్రైవేటు ఈక్విటీ, కన్సల్టింగ్‌, అకౌంటింగ్‌ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. దాదాపు సంస్థలన్నీ లీగల్‌ అడ్వైజర్లను నియమించుకుంటున్నాయి. లా గ్రాడ్యుయేట్లను జ్యుడీషియల్‌ క్లర్క్‌లుగానూ తీసుకుంటున్నారు. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యతో బోధన రంగంలోనూ రాణించవచ్చు. ఎన్జీవోలు, చైల్డ్‌ రైట్స్‌, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్లు, కార్పొరేట్‌ లీగల్‌ సెల్స్‌ ..ఇవన్నీ కొలువుల వేదికలే. కంపెనీలకు సేవలు అందించడానికి కార్పొరేట్‌ లీగల్‌ ఫర్మ్‌లు విస్తరిస్తున్నాయి. వీటిలో పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చు.


పీజీ స్పెషలైజేషన్లు

సివిల్‌ లా: సాధారణ గొడవలు, ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, హక్కుల ఉల్లంఘన మొదలైన కేసులను సివిల్‌ లా నిపుణులు చూసుకుంటారు.

క్రిమినల్‌ లా: హత్య వెనుక పరిణామాలు, అందుకు దోహదం చేసిన పరిస్థితులను వీరు గమనిస్తారు. క్లయింట్లు, పోలీసులు, సాక్షులు అందించిన సమాచారంతో కోర్టులో వాదనలు వినిపిస్తారు.

ట్యాక్స్‌ లా: దేశంలో ఉన్న పలు రకాల పన్నులపై అధ్యయనం చేస్తారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ఎస్టేట్‌ ట్యాక్స్‌, సర్వీస్‌ ట్యాక్స్‌...ఇలా అన్ని ట్యాక్స్‌లపైనా వీరికి పట్టు ఉంటుంది. క్లయింట్లు, వారి సంస్థలకు చెందిన ట్యాక్స్‌ కేసులను కోర్టులో వాదిస్తారు.

ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా: మేధా పరమైన హక్కులకు కాపలాదారుగా ఉంటారు. కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మక పనులు, కళాత్మక ఆకృతులు, లోగో, సంస్థ పేరు, ప్రత్యేక చిత్రాలు...సంస్థ లేదా వ్యక్తికి చెందినవి మరొకరు దొంగిలించడం, దాన్నే అనుసరించడం, స్వల్ప మార్పులతో వినియోగించడం...లాంటివి చేస్తే క్లయింట్ల తరఫున వాదనలు వినిపిస్తారు.

కార్పొరేట్‌ లా: సంస్థలకు వర్తించే యాక్ట్‌లు, నియమాలపై అధ్యయనం చేస్తారు. కంపెనీలకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. సంస్థల హక్కులను కాపాడతారు. ఉద్యోగాలు, ఒప్పందాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తారు.

ఎన్విరాన్‌మెంటల్‌ లా: పర్యావరణ అంశాలపై అధ్యయనం చేస్తారు. గాలి, నీరు, నేల కలుషితం చేయడం, అడవుల నరికివేత, అనుమతి లేనిచోట్ల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు నెలకొల్పడం ...మొదలైన సమస్యలపై వీరు దృష్టిసారిస్తారు. సంస్థల తరఫున, అలాగే పర్యావరణ హక్కులపై పోరాటం చేస్తున్నవారి తరఫున వాదనలు వినిపిస్తారు.  


పరీక్షలో..

రెండు తెలుగు రాష్ట్రాల్లో లాసెట్లు విడిగా నిర్వహిస్తున్నారు. ఈ స్కోరుతో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరవచ్చు. అభ్యర్థిలో గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తారు. న్యాయవిద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్‌, స్కిల్స్‌ ఉన్నాయా, లేవా అనేది గమనిస్తారు.

1 టీఎస్‌/ఏపీ లాసెట్‌ 120 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఇందులో మూడు భాగాలున్నాయి. పార్ట్‌-ఎ జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలు, పార్ట్‌-బి కరెంట్‌ అఫైర్స్‌ 30 ప్రశ్నలు, పార్ట్‌-సి లా ఆప్టిట్యూడ్‌లో 60 ప్రశ్నలు వస్తాయి. ఇందులో 10 ప్రశ్నలు లీగల్‌ ఆప్టిట్యూడ్‌పై ప్యాసేజ్‌ రూపంలో ఉంటాయి. పార్ట్‌-సి ప్రశ్నలు లా, భారత రాజ్యాంగంలో ప్రాథమికాంశాలపై వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే అడుగుతారు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో వస్తాయి. వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు అందుబాటులో ఉంచారు.

2 ఐదేళ్ల లా ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ స్థాయిలో, మూడేళ్ల న్యాయవిద్యకు యూజీ స్థాయిలో ఉంటాయి. టీఎస్‌ లాసెట్‌ను ఉస్మానియా, ఏపీ లాసెట్‌ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నాయి. లాసెట్‌లో అర్హతకు 35 శాతం మార్కులు అంటే 42 పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు ఈ నిబంధన లేదు. పరీక్షలో సులువుగానే అర్హత పొందవచ్చు. ప్రశ్నలు తేలికగా ఉండటమే ఇందుకు కారణం. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు, పేరున్న ప్రైవేటు సంస్థల్లో సీటు పొందడానికి అధిక మార్కులు సాధించాలి. వెబ్‌సైట్‌లో సిలబస్‌ వివరాలు ఉంచారు. అందులోని అంశాలనే బాగా చదువుకుంటే సరిపోతుంది. పాత ప్రశ్నపత్రాలను గమనించి, పరీక్షపై పూర్తి అవగాహన పెంచుకోవచ్చు. మాదిరి సన్నద్ధతతోనే మెరుగైన మార్కులు పొందవచ్చు. పరీక్షకు ముందు వెబ్‌సైట్‌లో ఉన్న మాక్‌ టెస్టు రాయడం ప్రయోజనం.  


దరఖాస్తులు

టీఎస్‌ లాసెట్‌: దరఖాస్తులు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్‌ 25 వరకు స్వీకరిస్తారు. పరీక్షను జూన్‌ 3న నిర్వహిస్తారు.

ఏపీ లాసెట్‌: దరఖాస్తులు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్‌ 25 వరకు స్వీకరిస్తారు. జూన్‌ 9న పరీక్ష నిర్వహిస్తారు.

అర్హత: టీఎస్‌, ఏపీ ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీలు 42, ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం ఉన్నా సరిపోతుంది. అన్ని కేటగిరీల్లోనూ కనీస మార్కులకు అర శాతం మార్కులు తగ్గినా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన వారూ అర్హులే. పాలిటెక్నిక్‌ డిప్లొమాతోనూ పోటీ పడవచ్చు. మూడేళ్ల లా కోర్సులకు డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు.


వెబ్‌సైట్లు:

ఏపీ: https://cets.apsche.ap.gov.in/LAWCET

తెలంగాణ: https://lawcet.tsche.ac.in/


ఐఐఎం రోహ్‌తక్‌లో

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), రోహ్‌తక్‌ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు 2021-2022 విద్యా సంవత్సరం నుంచి అందిస్తోంది. పదో తరగతి, ఇంటర్‌లో 60 (ఎస్సీ, ఎస్టీలు 55) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ప్రవేశానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో అవకాశం కల్పిస్తారు. పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, లీగల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్లాట్‌ స్కోరుతో ఏప్రిల్‌ 20లోగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఐపీఎం/క్లాట్‌లో సాధించిన స్కోరుకు 45 శాతం, ఇంటర్వ్యూకి 15, పదోతరగతి, ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. జూన్‌ రెండోవారంలో ఇంటర్వ్యూ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారు. కోర్సు ఫీజు రూ.30.33 లక్షలు. ఐదేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి బీబీఏ-ఎల్‌ఎల్‌బీ డిగ్రీని ప్రదానం చేస్తారు.

వెబ్‌సైట్‌: https://www.iimrohtak.ac.in/ 


కావాల్సిన నైపుణ్యాలు

‣ క్లిష్టమైన, విస్తృతంగా ఉన్న సమాచారాన్ని చదివి అర్థం చేసుకునే సామర్థ్యం

‣ తార్కిక పరిజ్ఞానం  

‣ విశ్లేషణ, రాతలో మెలకువలు

‣ స్పష్టమైన భావ వ్యక్తీకరణ సామర్థ్యం

మరింత సమాచారం... మీ కోసం!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

Posted Date: 18-04-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌