• facebook
  • whatsapp
  • telegram

అనేక అవ‌కాశాలు అందిస్తుంది 'లా'!

యూజీ క్లాట్ - 2023 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

విద్యార్థులకు లా చదవడం ఎప్పుడూ మంచి అవకాశాలనే అందిస్తుంది. భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించిన వారిలో మహాత్మా గాంధీ, పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి మహనీయులంతా లాయర్లే! ప్రస్తుతం నేషనల్‌ లా స్కూల్స్‌ ఆవిర్భావం, ప్రపంచస్థాయి ప్రమాణాలతో జరుగుతున్న తరగతులు, మెరుగైన ఉద్యోగావకాశాలు... 

వెరసి లా చదివేందుకు లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఇందుకు రాయాల్సిన యూజీ క్లాట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో పూర్తి వివరాలు మీకోసం...


లా  చదివితే అడ్వకేట్‌గా మాత్రమే అవకాశం ఉంటుంది అనేది ఒకప్పటి మాట.  ఇప్పుడు లా గ్రాడ్యుయేట్లు కోర్టు రూమ్‌ దాటి ఇంకా చాలా చోట్ల రాణించే అవకాశం ఉంది. అవి... 

1. భారత, విదేశీ లా ఫర్మ్స్‌

2. కన్సల్టింగ్, అడ్వైజరీ కంపెనీలు

3. ఎంఎన్‌సీలు, కార్పొరేట్‌ లీగల్‌ విభాగాలు

4. లీగల్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (ఎల్‌పీవోలు)... ఇలా లా చదివిన వారికి విభిన్న మార్గాల్లో అవకాశాలు ఉన్నాయి.


    విద్యార్థుల లా కెరియర్‌కు క్లాట్‌ పరీక్ష రాచబాట వేస్తుంది. నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్నాయి. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) అందిస్తున్నాయి. ప్రస్తుతం యూజీ క్లాట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశవ్యాప్తంగా 22 ప్రధాన లా యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటున్నాయి.

అర్హత: ఇంటర్‌ విద్యార్హతతో ఈ పరీక్ష రాసి ఐదేళ్ల లా కోర్సులో చేరవచ్చు. చివరి సంవత్సరం పరీక్షలు రాసేవారూ అర్హులే. గరిష్ఠ వయఃపరిమితి లేదు.

    పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. దరఖాస్తులు మాత్రం ఆన్‌లైన్‌ ద్వారా పంపాలి.

    పరీక్ష తేదీ: డిసెంబర్‌ 18 (మధ్యాహ్నం 2గం. నుంచి 4 గం. వరకు) 

   దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 13

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌:  consortiumofnlus.ac.in


 

ఏం పరీక్షిస్తారు..

క్లాట్‌ పరీక్షలో ముఖ్యంగా అభ్యర్థి కాంప్రహెన్షన్‌ స్కిల్స్, రీజనింగ్‌ సామర్థ్యాలను పరిశీలిస్తారు. లీగల్‌ ఎడ్యుకేషన్‌లో ఇవి చాలా ముఖ్యమైన నైపుణ్యాలు కావడం వల్ల అభ్యర్థికి ఇవి ఎంతవరకూ ఉన్నాయనేది చూస్తారు. లా గురించి అంతగా అవగాహన లేకపోయినా, నేర్చుకునే ఆసక్తి, త్వరగా చదివి అర్థం చేసుకోగల సామర్థ్యం ఉన్నవారు ఈ పరీక్షలో బాగా రాణించగలరు.


 

పరీక్ష విధానం..

మొత్తం పరీక్షా సమయం 2 గంటలు. ఇందులో 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. తప్పు జవాబుకు 0.25 మార్కు కోత విధిస్తారు.


ఈ కింది సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి.  


1. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 2. కరెంట్‌ అఫైర్స్‌ - జనరల్‌ నాలెడ్జ్, 

3. లీగల్‌ రీజనింగ్‌  4. లాజికల్‌ రీజనింగ్‌ 

5. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌


ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌


ఇందులో ఒక్కో పేరా 450 పదాలతో ఉంటుంది. ఈ పేరాలను ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నుంచి కానీ, గతంలో జరిగిన వాటి నుంచి కానీ ఫిక్షన్‌ - నాన్‌ ఫిక్షన్‌ కేటగిరీలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్‌ స్థాయిలో ఉంటూ 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలో చదవగలిగేలా వీటిని ఇస్తారు. ప్రతి పేరా నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేరాలో చర్చించిన ప్రధానమైన అంశం ఏమిటనేదాన్ని గుర్తించడం, కన్‌క్లూజన్స్‌ తీసుకురావడం, విభిన్నమైన వాదనలు, భిన్నకోణాలను అర్థం చేసుకోవడం, వివిధ పదాలు, వాక్యాల అర్థాలపై ప్రశ్నలు అడుగుతారు.


    ఈ విభాగంలో నెగ్గాలంటే వీలైనంత వేగంగా చదవడం సాధన చేయాలి. లా కోర్సులో ఎక్కువగా పఠనం అవసరం అవుతుంది. అందుకే ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.

కరెంట్‌ అఫైర్స్‌

జనరల్‌ నాలెడ్జ్‌ 

ఇందులోనూ 450 పదాలతో కూడిన పేరాలుంటాయి. వార్తల్లో వచ్చిన అంశాల ఆధారంగా దీన్ని ఇస్తారు. ప్రస్తుతం దేశంలోనూ, ప్రపంచంలోనూ జరుగుతున్న పరిణామాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన అంశాలపై ప్రశ్నలుంటాయి. 

    జీకే సెక్షన్‌లో కూడా అభ్యర్థి పఠన సామర్థ్యాలను పరిశీలించే పరీక్ష బహుశా దేశంలో ఇదేనేమో. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ భారీ పేరాలుగా ఉంటాయి. వేగంగా చదవకపోతే సమాధానం తెలిసినా రాయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే అభ్యర్థి వర్తమాన వ్యవహారాలపై అవగాహన పెంచుకోవడంతోపాటు ఎక్కువగా దినపత్రికల కథనాలు చదవాలి. వాటి నుంచి షార్ట్‌ నోట్స్‌ తయారుచేసుకోవాలి. కేవలం శీర్షికలు చదివి వదిలేయకుండా ముఖ్యమైన కథనాలు (ఎడిటోరియల్స్‌ లాంటివి), న్యాయపరమైన ప్రాముఖ్యం ఉన్నవాటిని అర్థం చేసుకోవాలి.

లీగల్‌ రీజనింగ్‌

ఇందులో న్యాయపరమైన అంశాలతో సంబంధం ఉన్న విషయాలపై 450 పదాలతో కూడిన పేరాలు ఇస్తారు. పబ్లిక్‌ పాలసీ, విలువలపైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. లీగల్‌గా ఎటువంటి జ్ఞానం అవసరం లేదుకానీ, పేరాలో చర్చిస్తున్న అంశాన్ని అర్థం చేసుకుని అందులో చెప్పిన సూత్రాలకు అనుగుణంగా సమాధానం ఇవ్వగలగాలి. ప్రిన్సిపల్స్‌లో మార్పు సంభవిస్తే వాటి అప్లికేషన్‌ ఎలా మారుతుందో చెప్పడం సాధన చేయాలి. 

   చాలా మందికి ఇది కొత్త సబ్జెక్ట్‌ కావడంచేత పాత ప్రశ్నపత్రాలు చూశాకే సన్నద్ధత మొదలుపెట్టాలి.

లాజికల్‌ రీజనింగ్‌

ఇందులో 300 పదాలతో కూడిన పేరాలుంటాయి. ప్రశ్నలో వాదనను గుర్తించడం, ముగింపు తీసుకురావడం, అప్లికేషన్‌ తెలియజెప్పడం, అనుబంధాన్ని తెలుసుకోవడం, వ్యతిరేక భావనలు గమనించడం వంటివి అవసరం. 

   త్వరగా చదవడం అలవాటు చేసుకున్నాక అభ్యర్థులు పేరాలో ఇచ్చిన వాస్తవాలను (ఫ్యాక్ట్స్‌) గుర్తించడం అవసరం. ప్రశ్నకు తార్కికంగా ఆలోచించి సమాధానాలు ఇవ్వడం సాధన చేయాలి.

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌: ఇందులో గ్రాఫ్స్, డయాగ్రమ్స్‌తోపాటు ఇతర జనరల్‌ ప్రశ్నలుంటాయి. పదోతరగతి స్థాయిలో అడుగుతారు. నిష్పత్తులు, కొలతలు, బీజగణితం (ఆల్జీబ్రా) టాపిక్స్‌ బాగా చదువుకోవాలి. పదోతరగతిలో చెప్పే మ్యాథమెటిక్స్‌పై గట్టి పట్టు సంపాదించాక డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ బాగా అధ్యయనం చేయాలి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date: 17-08-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌