• facebook
  • whatsapp
  • telegram

న్యాయవిద్యలో మేటి!

జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో న్యాయవిద్య ముఖ్యమైనది. ఇంజినీరింగ్‌ నిమిత్తం ఐఐటీలు, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఐఐఎంలు ఉన్నట్లుగానే నేషనల్‌ లా స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. వీటిలో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ ప్రసిద్ధమైంది. తాజాగా న్యాయవిద్య అందించే సంస్థలకు ప్రకటించిన ర్యాంకుల్లో ఈ సంస్థే ముందుంది. ఇక్కడ అందిస్తోన్న కోర్సులు, ప్రవేశ మార్గాలు..

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2018 నుంచి లా విభాగంలో ర్యాంకులు ప్రకటిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 2018, 2019, 2020, 2021 వరుసగా నాలుగేళ్లూ ప్రథమ స్థానంలో ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ, బెంగళూరు నిలిచింది. న్యాయవిద్యలో ట్రేడ్‌ మార్క్‌ సంస్థగా ఇది గుర్తింపు పొందింది. అందువల్ల విద్యార్థులు ఇక్కడ చదవడానికి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. నియామక సంస్థలు వీరిని ఆకర్షణీయ వేతనాలతో కొలువుల్లోకి తీసుకుంటున్నాయి. ఈ సంస్థ  బోధన ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ, పరిశోధనల్లో ముందడుగు, కోర్సుల్లో వైవిధ్యం, సృజనాత్మకతలతో ప్రథమస్థానం పొందింది. దేశంలో ఏర్పడిన తొలి న్యాయ విశ్వవిద్యాలయం ఇదే. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సులు తొలిసారిగా ప్రారంభించిన సంస్థల్లో బెంగళూరు నేషనల్‌ లా స్కూల్‌ ఒకటి.

కోర్సులు: ఇక్కడ అయిదేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ బీఏఎల్‌ఎల్‌బీ కోర్సును అందిస్తున్నారు. ఇందులో ప్రవేశం కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌)తో లభిస్తుంది. ఈ కోర్సుకి ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ పోటీపడవచ్చు. ఏడాది వ్యవధితో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో భాగంగా బిజినెస్‌ లాస్, హ్యూమన్‌ రైట్స్‌ లాస్‌ను ఈ సంస్థ అందిస్తోంది. క్లాట్‌తో ప్రవేశం పొందవచ్చు. 

పబ్లిక్‌ పాలసీలో మాస్టర్, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులను ఈ సంస్థకు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. వీటిలో ప్రవేశం ఆప్టిట్యూడ్‌ టెస్టు, ఇంటర్వ్యూలతో లభిస్తుంది. మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (ఎంఫిల్‌), డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పీహెచ్‌డీ), డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌ (ఎల్‌ఎల్‌డీ) రిసెర్చ్‌ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. 

దూరవిద్యలో మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ లా, పీజీ డిప్లొమాలో భాగంగా చైల్డ్‌ రైట్స్, హ్యూమన్‌ రైట్స్, సైబర్‌ లా అండ్‌ సైబర్‌ ఫోరెన్సిక్స్, కన్జూమర్‌ లా అండ్‌ ప్రాక్టీస్, ఎన్విరాన్‌మెంటల్‌ లా, మెడికల్‌ లా అండ్‌ ఎథిక్స్, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ లా కోర్సులను అందిస్తోంది. 

దేశవ్యాప్తంగా 30 సంస్థలకే ర్యాంకులు ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి నల్సార్‌ హైదరాబాద్‌ మూడో స్థానంతోపాటు దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ, విశాఖపట్నం 28వ స్థానం, ఇక్ఫాయ్‌ హైదరాబాద్‌ 29వ ర్యాంకు పొందాయి. 

టాప్‌ సంస్థల్లో ప్రవేశానికి క్లాట్‌ స్కోర్‌ ఉపయోగపడుతుంది. అయితే నేషనల్‌ లా యూనివర్సిటీ, న్యూదిల్లీ మాత్రం ప్రత్యేకంగా నిర్వహించుకునే ఆల్‌ ఇండియా లా టెస్టుతో అవకాశం కల్పిస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు అందిస్తోంది. ఇందులో చేరడానికి ప్రథమ శ్రేణితో ఇంజినీరింగ్‌/మెడిసిన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఫార్మసీ/మేనేజ్‌మెంట్‌లో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఆ సంస్థ నిర్వహించే పరీక్షతో అవకాశం కల్పిస్తారు.

టాప్‌ టెన్‌ సంస్థలు

1. నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు 

2. నేషనల్‌ లా యూనివర్సిటీ, న్యూదిల్లీ 

3. నల్సార్‌ వర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌

4. ది వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ లా వర్సిటీ ఆఫ్‌ జ్యుడీషియల్‌ సైన్సెస్, కోల్‌కతా

5. ఐఐటీ, ఖరగ్‌పూర్‌

6. గుజరాత్‌ నేషనల్‌ లావర్సిటీ, గాంధీనగర్‌ 

7. జామియా మిల్లియా ఇస్లామియా న్యూదిల్లీ 

8. నేషనల్‌ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్‌ 

9. సింబయాసిస్‌ లా స్కూల్, పుణే 

10. కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ, భువనేశ్వర్‌
 

Posted Date: 22-09-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌