• facebook
  • whatsapp
  • telegram

చదివింది గుర్తు పెట్టుకోవాలంటే..?

 

ఏరోజు పాఠం ఆరోజు చదువుకున్న విద్యార్థికి పరీక్ష తేదీనాటికి ఎలాంటి భయాలూ ఉండవు. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. కొన్ని అంశాలు తరగతి గదిలో నేర్చుకోనివి కూడా ఉంటాయి. పత్రికల్లో చదివినవి, లైబ్రరీ పుస్తకంలో చదివినవి ఉంటాయి.

 

పుస్తకంలో చదివిన ప్రతి అంశానికీ నోట్సు రాసుకోవడం మంచి లక్షణం. పత్రికల క్లిప్పింగులను నోట్సులో అతికించుకోవచ్చు. విద్యాసంవత్సరం మొదలైన నాటి నుంచి, పరీక్ష తేదీ సమీపించే వరకూ విస్తృతమైన సమాచారం మన వద్ద ఉంటుంది. అదంతా మొదటినుంచీ క్రమపద్ధతిలో నోట్సు రూపంలో భద్రపరచుకున్నవారికి పరవాలేదు. అప్పుడప్పుడూ పునశ్చరణ చేసినవారికి పరవాలేదు. పరీక్షల ముందు హడావుడిగా పుస్తకాలు దులిపేవారికే వస్తుంది తంటా.

 

మానవ మేధస్సులో లక్షలకొద్దీ పదాలతో కూడిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అయితే అదంతా ఒక క్రమపద్ధతిలో ఉండాలని లేదు. దాన్ని మనకు కావలసిన సమయంలో కావలసిన రూపంలో బయటకు తీసుకురాలేం. అందుకే పునశ్చరణ అవసరం.

 

పునశ్చరణ మొదటిసారి చేయడానికీ, రెండోసారి చేయడానికీ మధ్య తేడా ఉంటుంది. పాఠం అంతా కూలంకషంగా చదివిన కొద్దిరోజుల తర్వాత మొదటిసారి పునశ్చరణ చేస్తాం. రెండోసారి నుంచి పాఠం అంతటినీ చదవాల్సిన పనిలేదు. ముఖ్యమైన, సాంకేతికమైన పదాలను మాత్రమే వల్లెవేసుకుంటే సరిపోతుంది. పక్కాగా రాసుకోవడం ద్వారా వేగంగా పునశ్చరణ చేయవచ్చు.

 

ప్రతి పాఠ్యాంశాన్నీ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చొప్పున పునశ్చరణ చేయడానికి ప్రయత్నించండి.ప్రతిరోజూ చదువుకునే సమయంలో మొదటి లేదా చివరి పావుగంటను పునశ్చరణకు కేటాయించండి.

 

కొండలా కోర్సులు పెరిగిపోయి, ఎంతకీ తరగకపోవడం ఎంతటివారికైనా ఎప్పుడో ఒకసారి అనుభవమే. అయితే మూలకారణాన్ని కనుగొనండి. కారణాలు బహుశా ఇలా ఉంటాయి. తొందరగా చదవడం మొదలు పెట్టకపోవడం వల్ల.. ఫలానా సబ్జెక్టులో మనకు అభిరుచి లేకపోవడం వల్ల.. అనవసరమైన విషయలపై సమయాన్ని వృథా చేసుకోవడం వల్ల. ఇది కాకుండా మిమ్మల్ని చదువు జోలికి పోనివ్వకుండా ఆపుతున్న బలమైన కారణం.

 

వీటిలో మూలకారణమేదో గ్రహించండి. అక్కడినుంచి నరుక్కురండి. మీ ప్రస్తుత సమస్యకు కారణమైన అంశాన్నీ మీరు ఎలా అధిగమించగలరో మీ దగ్గర ఉపాయాలన్నింటినీ ఆలోచించండి. పాత సిలబస్ అంతటినీ మీరు ఎన్నిరోజుల్లో, ఏవిధంగా చదివి పూర్తి చేయాలనుకుంటున్నారో ఒకకాగితంపై రాయండి. మంచి పరిష్కార మార్గాన్ని ఎంపిక చేసుకోండి. ఆ మార్గాన్ని ఒక ప్లకార్డుపై రాసి మీ చదువుల బల్లపై ఉంచుకోండి. దాన్ని నిజాయతీగా పాటించండి.

 

చదవకుండా, పునశ్చరణ చేయకుండా విడిచిపెట్టిన పాత సిలబస్‌కు సరైన సమయాన్ని కేటాయించండి. ఈ క్రమంలో ప్రస్తుత సెమిస్టర్‌లోని సిలబస్‌ను మిస్ కాకుండా చూసుకోండి.

 

వేగవంతమైన పునశ్చరణకు మ్యాపింగ్ విధానాన్ని పాటించండి. గుర్తుంచుకోవాల్సిన సాంకేతిక పదాలను అధ్యాయాల వారీగా ఒక్కో కాగితంపై రాసుకుని మననం చేయండి. సాగుతున్నన్ని రోజులూ ఆ కాగితాన్ని మీ జేబులో ఉంచుకోండి.

 

కఠినంగా అనిపించే అధ్యాయాలను గట్టిగా చదవండి. ఆడియో ఫైల్‌గా భద్రపరచండి. కళ్లు మూసుకుని చక్కగా వినండి.

 

వేసవి సెలవుల్లో కొన్ని శిక్షణాలయాలు పునశ్చరణ తరగతులను నిర్వహిస్తాయి. పై తరగతుల్లో మీరు చదవబోయే వాటికి ఇక్కడ నేర్చుకునే కోర్సులు దోహదం చేస్తాయి.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం