‣ ‘తెర’గతుల్లోనూ ప్రత్యక్ష బోధన ప్రయోజనాలకు ఆస్కారం
విద్యాభ్యాసం కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ తెరలపై కొనసాగుతోంది. పోటీ పరీక్షల శిక్షణ కూడా వర్చువల్ బాటే పట్టింది. అయితే ఆన్‌లైన్ అభ్యాసానికి పరిమితులున్నాయి. సహాధ్యాయులతో కలిసి ప్రత్యక్ష తరగతుల్లో సందేహాలను తీర్చుకుంటూ, మెరుగ్గా నేర్చుకోవటం; విద్యేతర కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనటం లాంటివి కరోనా పరిణామాల కారణంగా విద్యార్థులు కోల్పోవాల్సివచ్చింది. అయితే నిరాశ పడనక్కర్లేదంటున్నారు నిపుణులు. ప్రత్యక్ష బోధనలో లభించే ప్రయోజనాలను ఆన్‌లైన్‌లోనూ కొంతమేరకు సాధించే మార్గాలను వారు సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా?
విద్యాభ్యాస సమయంలో సహ విద్యార్థులు, ప్రొఫెసర్లూ, మార్గదర్శకులతో పెంపొందించుకునే సంబంధాలు కెరియర్‌ను అద్భుతంగా నిర్మించుకోవడానికీ, వ్యక్తిగా ఎదగడానికీ సహాయపడతాయి. విద్యార్థులు స్వదేశంలో.. విదేశాల్లో- ఎక్కడ చదువుకున్నారన్నదానితో నిమిత్తం లేకుండా ఇది వాస్తవం. కొవిడ్-19 కారణంగా ఆన్‌లైన్‌లో చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు ప్రత్యక్ష తరగతుల్లోని ‘అనుసంధానం’ ఒక లోటుగా ఉంటూ వస్తోంది. వర్చువల్ తరగతుల్లో, వెలుపలా కూడా విద్యార్థులు ఆ లోటును కొంతమేరకు భర్తీ చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో క్యాంపస్ కార్యకలాపాలు ఆరంభమయ్యేలోపు ఆన్‌లైన్ అభ్యాసంపై మనసుపెట్టి దాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవటానికి అవకాశం ఉంది. అందుకు కొన్ని పద్ధతులు పాటించాలి. సంపూర్ణ ఉన్నత అభ్యాసం అంటే.. అది ఇంటికే పరిమితమై, తెర తరగతుల ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది కాదు. సహాధ్యాయులనూ, అధ్యాపకులనూ ప్రత్యక్షంగా కలుసుకోవడం, నేరుగా నేర్చుకోవడం దేనికీ ప్రత్యామ్నాయం కావు. కానీ ఆన్‌లైన్ అభ్యాసం అనివార్యమైన పరిస్థితుల్లో వారితో అనుసంధానానికి ఏమాత్రం అవకాశం లేదని భావించకూడదు. అందుకు ఈ విధానాలను అనుసరించటానికి ప్రయత్నించాలి.
1. వర్చువల్ వ్యాయామాలు
కంప్యూటర్/ ల్యాప్‌టాప్/ టాబ్లెట్ తెరను కదలకుండా అదేపనిగా చూస్తూ వినటం వల్ల అసౌకర్యం ఏర్పడవచ్చు. క్యాంపస్‌కీ, బయటికీ వెళ్లే అవకాశం లేకుండా, గ్రూప్ వ్యాయామ తరగతుల్లో పాల్గొనడానికో, జిమ్‌కు వెళ్లడానికో అవకాశం లేదనేది నిజమే. కానీ శారీరక శ్రమకు సమయం కేటాయించలేకపోవడం సరికాదు. వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలకు మించి, సత్సంబంధాలనూ మెరుగుపరుస్తుంది. ఆన్‌లైన్ తరగతుల మూలంగా బయటకు వెళ్లే అవకాశం లేనందున వ్యాయామాన్ని ఆపాల్సిన అవసరం లేదు. అనేక విద్యా సంస్థలు యోగా నుంచి పైలేట్స్, ఏరోబిక్ వ్యాయామాలు, మెడిటేషన్ సెషన్‌లు లాంటివెన్నో నిర్వహిస్త్తున్నాయి. వీటిని ఉపయోగించుకుంటే విద్యార్థులు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతారు. మీ సహ విద్యార్థులను ప్రత్యక్షంగా కలవడానికి ముందు వారితో సాన్నిహిత్యం కొనసాగించడానికి ఈ వర్చువల్ వర్కవుట్ తరగతులు అద్భుతమైన మార్గం.
2. ఆన్‌లైన్ చర్చా బోర్డులు
అనేక ఆన్‌లైన్ కోర్సుల్లో చర్చాబోర్డులు ప్రధాన ఫీచర్‌గా ఉన్నాయి. కొన్నిచోట్ల వాటిలో పాల్గొనడం తప్పనిసరి కూడా. ఈ చర్చలలో పాల్గొనడం అనేది క్లాస్‌మేట్స్‌తో, అధ్యాపకులతో అనుసంధానం అవ్వడానికి చక్కని మార్గం. మీరు నేర్చుకుంటున్న పాఠ్యాంశాలను ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోవడం కూడా దీనివల్ల మెరుగుపడుతుంది. కానీ మొక్కుబడిగా వీటికి హాజరవ్వటం వల్ల ప్రయోజనం ఉండదు. నేర్చుకోవడంలో ఉత్సుకత, తరగతి గదిలో సహచరులతో సత్సంబంధాలు ఉన్నపుడు విద్యార్థుల స్థాయి ఉన్నతంగా మారుతుందనీ, విజయాన్ని సాధించగలుగుతారనీ పరిశోధనలు చెపుతున్నాయి. ఆన్‌లైన్ తరగతి చర్చల్లో చొరవగా పాల్గొనడం, అర్థవంతమైన ప్రశ్నలు అడగటం చాలా ముఖ్యం. దీని ద్వారా విద్యాభ్యాసాన్ని విజయవంతంగా మల్చుకోవచ్చు. ఈ చర్చల్లో మీ సొంత ఆలోచనలను పంచుకోవడానికే పరిమితం కాకూడదు. సహాధ్యాయుల, ప్రొఫెసర్‌ల వ్యాఖ్యలూ, ప్రశ్నలకు స్పందిస్తూ వారితో సందర్భానుసారం సంభాషించడం మర్చిపోకూడదు.
3. వర్చువల్ గేమ్స్, మూవీ నైట్స్
క్లాస్‌మేట్స్ (పియర్స్) ప్రభావం విద్యార్థులపై ఎక్కువ. పాఠ్యాంశాలపై సంపూర్ణంపై పట్టు సాధించడానికైనా, పాఠ్యేతర విషయాల్లో ఒక ముద్ర చూపించాలన్నా వారి సహకారం అవసరం. తరగతి గదిలో ఏర్పడే సంబంధాలు వ్యక్తిగత స్థాయిలో కలుసుకుంటున్నపుడు పటిష్ఠమవుతాయి. తోటి మిత్రులతో బంధం ఏర్పరుచుకోవడానికి అకడమిక్ షెడ్యూల్‌తో నిమిత్తం లేకుండా సమయాన్ని కేటాయించడం ముఖ్యం. దానికోసం గేమ్స్, మూవీ నైట్స్‌ను ఆస్వాదిస్తూ వర్చువల్‌గా అనుసంధానం అవ్వొచ్చు. మీరు ఒకే ప్రదేశంలోనో, ఒక కాఫీ టేబుల్ చుట్టూ కూర్చోలేకపోవచ్చు. కానీ వర్చువల్ గేమ్స్, మూవీ నైట్స్ సరదాగా ఉంటూనే నిజమైన స్నేహానికి తలుపులు తెరుస్తాయి. టెలిపార్టీ లాంటి యాప్‌లతో వర్చువల్ టీవీనో, మూవీ వాచింగ్ పార్టీనో ప్లాన్ చేసుకోవచ్చు. తరగతి గది వెలుపల మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఉంది కాబట్టి దానికి తగిన సమయం కేటాయించటం మేలు.

4. స్టూడెంట్ క్లబ్‌లూ, సంఘాలూ
సాంప్రదాయికంగా విద్యార్ధులు నిర్వహించే క్లబ్బులూ, సంఘాలూ విద్యార్ధులు తమ అకడమిక్ అంశాల అధ్యయనం నుంచి సేద దీరుస్తాయి. ఇవి పరస్పరం ఆసక్తులను పంచుకునేలా, ఒకే విధమైన భావాలున్న విద్యార్థులు కలిసేలా అవకాశాన్ని అందిస్తాయి. కరోనా పరిణామాలు వ్యక్తిగత సమావేశాలను తగ్గించినప్పటికీ, చాలా విశ్వవిద్యాలయాల్లో ఎక్స్‌ట్రా కరిక్యులర్ విభాగాలు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నిరవధికంగా కొనసాగుతున్నాయి. కొత్త సభ్యులను వర్చువల్‌గా నియమించుకుంటున్నాయి. విద్యాసంస్థలు అందించే ఈ తరహా క్లబ్‌ల గురించి అన్వేషించి, వాటిలో మీరెలా భాగం కావొచ్చో తెలుసుకోండి. కొత్త విషయాలు నేర్చుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం.. యూనివర్సిటీ విద్యాభ్యాస అనుభవంలో విస్మరించరాని అంశం.
- కరుణ్ కందోయి
జీఎం ఖీ హెడ్ ఆఫ్ ఇండియా ఆపరేషన్స్, Apply Board India