• facebook
  • whatsapp
  • telegram

చదువుకునే సమయంలో..

చదువుకునేటప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండటం కొంతమందికి అలవాటు. ఆ అలవాటు మీకుంటే కేరట్‌దోస లాంటి చిన్నచిన్నకాయగూర ముక్కలను దగ్గర ఉంచుకోండి. నూనె వస్తువుల కంటే ఇవి ఆరోగ్యానికి మంచివి.
     చదువుకునేటప్పుడు సంగీతం వినడం మరికొందరి అభిరుచి. చదువు సమయంలో వినవచ్చే ఇతర శబ్దాలవైపు దృష్టిపోకుండా ఉండేందుకు సంగీతం సహకరిస్తుంది. అయితే పెద్ద శబ్దాలతో సంగీతం వినడం మంచిది కాదు. అలాగే చాలాసార్లు లెక్కలు చేసేటప్పుడు సహకరించినట్లుగా సంగీతం చదువుకునేటప్పుడు సహకరించకపోవడం.. అంటే ఏకాగ్రత కుదరకపోవడం గమనించి ఉంటారు.
సంగీతం వినడం కంటే టీవి చూడటమే ఎక్కువ ఇష్టమైతే.. టీవి ముందు పుస్తకంతో కూర్చునే ప్రయత్నం చేయకండి. మీరు చదువుకునే ప్రదేశానికి దూరంగా టీవీ ఉండేలా చూడండి.
     పార్క్, పబ్లిక్ లైబ్రరీ వంటి ప్రదేశాల్లో చదువుకోవడం మంచి ఆలోచన. ఇంట్లో చదువుకునేటప్పుడు చిన్నచిన్న శబ్దాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. కానీ, బహిరంగ ప్రదేశాల్లో వచ్చే పెద్దపెద్ద శబ్దాలు కూడా కొన్నిసార్లు మన ఏకాగ్రతను ఏమాత్రం చెడగొట్టవు. అంతకంటే ముఖ్యంగా అక్కడ మీరెవరో ఎవ్వరికీ తెలియదు. మీకు మీరుగా చనువిస్తే తప్ప బహిరంగ ప్రదేశాల్లో మిమ్మల్ని ఎవ్వరూ పలకరించరు.
      బృంద అధ్యయనాలకు పాఠశాలల్లోని స్టడీ రూమ్‌లు, లైబ్రరీలు ఉపయోగపడతాయి. స్నేహితులు, తోటి విద్యార్థుల వల్ల ఎంతో కొంత సమయం వృథా అవుతుంది. కానీ ఒంటరిగా చదివినప్పుడు మనకు స్పురణకు రాని అంశాలు బృంద అధ్యయనాల్లో బయటకు వస్తాయి. అయితే మనసు విప్పి మాట్లాడేవారు, సహృదయులైన స్నేహితులను ఎంపిక చేసుకోవడం మీ బాధ్యత. రిఫరెన్స్ పుస్తకాలు అందుబాటులో ఉండే లైబ్రరీల్లో చదువుకోవడం మంచిది.
       ఎలా చదివినా ఎక్కడ చదివినా మన పాఠం సాధ్యమైనంత సులువుగా, మన బుర్రకెక్కడమే లక్ష్యం. మనం చదివే ప్రదేశం ఆ లక్ష్యాన్ని సాధించేలా ఉండాలి. దానికి అనుగుణంగానే ఆ ప్రదేశంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండాలి.
చదువు ముఖ్యంగా మానసికమైన పని కాబట్టి ఏకాగ్రత కుదరకపోవడం అనే సమస్య తరచుగా విద్యార్థులకు ఎదురవుతూ ఉంటుంది. దీన్ని ఎదుర్కోవడం అంత కష్టమేమీ కాదు. కాకపోతే కొంచెం పట్టుదలతో కృషి చేయాలి. పైన చెప్పుకున్నట్లు ఏకాగ్రత కుదరకపోవడం అన్న సమస్యలో రెండు దశలుంటాయి.

మరిన్ని సూచనలు
* పాఠాలను పదేపదే రిపీట్ చేయడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* మల్టిప్లికేషన్ టేబుల్స్ నేర్చుకునేటప్పుడు రిపీట్ చేయడం, బట్టీ పట్టడంవల్ల చాలా ప్రయోజనముంటుంది.
* పుస్తకం చూడకుండా బిగ్గరగా జ్ఞాపకం ఉన్నంతవరకు పాఠాలను మీరు అప్పజెప్పుకొంటున్నట్లుగా ప్రాక్టీసు చేయాలి.
* 'వచ్చేసిందిగా, ఎన్నిసార్లు చదువుతాం?' అని అనుకోకూడదు. ఎన్నిసార్లైనా చదవాలి. బోర్ ఫీలవ్వకూడదు.
* చదవడం ప్రారంభించేటపుడే మీకు ఇష్టమైనది. తేలికగా ఉండేది ఎంపిక చేసుకుని చదివితే బాగుంటుంది.
* మొదట తక్కువ సమయంలో పూర్తి అయిపోయే సబ్జెక్టులని కవరు చేయాలి. ఆ తరువాత పెద్ద టాపిక్స్‌ని కవర్ చేస్తే మంచిది.
* తేలికగా త్వరగా పూర్తయ్యే అంశాలు పూర్తయినపుడు మీకెంతో సంతోషం కలుగుతుంది. ఏదో సాధించామన్న తృప్తి ఉంటుంది.
* పరీక్షలు పూర్తయ్యేవరకు మీరెపుడూ వాటి గురించే ఆలోచించాలి. స్నేహితులతో ఆ చర్చలే జరపాలి. మనసు దారి మళ్లకుండా చూసుకోవాలి.
* చదివేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. వాటిని వీలైనంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
* ఇంట్లో ఫోను మోగినప్పుడల్లా మీరు తీయాల్సిన అవసరం లేదు. ఆపని ఎవరికైనా అప్పజెప్పండి. మీరు ఫోను తీశారంటే ఆ వివరాలు, వ్యవహారాలు తెలుసుకోవడంలో మీకెంతో సమయం వృథా అవుతుంది.
* ఇంటికెవరైనా అతిథులు వచ్చినా వారికోసం ఎక్కువ సమయం వృథా చేయకండి.
* మీ ఎగ్జామ్స్ పూర్తయ్యేదాకా మీ ఇంట్లో కేబుల్ టీ.వీ. కనెక్షన్ పూర్తిగా తీసేయండి. టీ.వీ. చూడటానికి బదులుగా మ్యూజిక్ వింటూ రిలాక్స్ కావాలి.

Posted Date: 11-09-2020


 

అధ్యయనం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం