• facebook
  • whatsapp
  • telegram

అకడమిక్‌ యాంగ్జైటీని అధిగమిద్దాం!

కెరియర్‌ సక్సెస్‌కు నిపుణుల సూచనలుబాగా చదవడం మంచిదే.. కానీ అదే పనిగా తాపత్రయపడుతుంటే? మంచి మార్కులు రావాల్సిందే.. కానీ రానప్పుడు కుంగిపోతుంటే? పరీక్షలన్నా, నియామకాలన్నా.. ఏదన్నా విపరీతమైన కంగారు పుడుతుంటే? దీన్నే నిపుణులు అకడమిక్‌ యాంగ్జైటీ అంటున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా అంటే..


ఎప్పుడూ ఏదో ఒక కంగారు.. కాలేజీలో జరిగే ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా ఆలోచించడం.. ప్రతి పరీక్షలోనూ మొదటి మార్కులనే రావాలి అనుకోవడం, అలా తెచ్చుకోలేకపోతే తీవ్రంగా బాధపడటం.. ఇవన్నీ అకడమిక్‌ యాంగ్జైటీ లక్షణాలు. దీన్ని గుర్తించడం, బయటపడటం గురించి విద్యార్థులందరూ తెలుసుకోవాలి. 


నేర్చుకునే వయసులో ఉన్న వారందరికీ.. ముఖ్యంగా కాలేజీ యువతలో అకడమిక్‌ యాంగ్జైటీ కనిపిస్తుంది. నిజానికి ఇటువంటి భయం, ఆందోళన తక్కువ స్థాయిలో ఉంటే అది విద్యార్థులకు మేలే చేస్తుంది, వారు మెరుగైన మార్కులు సాధించేలా దోహదపడుతుంది. దీన్నే ఫెసిలిటేటివ్‌ యాంగ్జైటీ అంటున్నారు. ఎటొచ్చీ మితిమీరిన పర్ఫెక్షనిజంతోనే సమస్య వస్తుంది.


లక్షణాలేంటి..

1. అకడమిక్‌ పర్ఫెక్షనిజం: ప్రతి చిన్న పరీక్షలోనూ మంచి మార్కులే రావాలని ప్రయత్నించడం, అలా రాకపోతే బాధపడటం.. నలిగిపోవడం.  

2. నలుగురిలో కలవలేకపోవడం: ఇలాంటి యాంగ్జైటీ ఉన్న విద్యార్థులు నలుగురినీ కలిసే ప్రతి సందర్భాన్ని తప్పించుకుంటూ ఉంటారు. గ్రూప్‌ ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లలో పాలుపంచుకోవడానికి ఇష్టపడరు.

3. విపరీతమైన ఆందోళన: వివిధ పరిస్థితులను చూసి ఎక్కువగా కంగారు పడటం.. తరగతులు, పరీక్షలు, స్నేహాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌.. ఇలా ఏదైనా ఆందోళన చెందడం. 

4. శారీరకంగానూ..: యాంగ్జైటీ లక్షణాలు శారీరకంగానూ కనిపిస్తాయి. కడుపునొప్పి, తలనొప్పి, వికారం, ఆందోళన, చెమటలు పట్టడం తరచూ జరుగుతుంటాయి.

5. వాయిదా: ఆందోళనను అదుపు చేయడం తెలియక పనులు వాయిదా వేస్తుంటారు. 

6. ఏకాగ్రతలేమి: ఏ పని మీదా ఏకాగ్రత నిలబడకపోవడం.. ఫోకస్‌ పెట్టలేకపోవడం. 

7. ప్రతికూల ఆలోచనలు: ఇటువంటి ఇబ్బంది ఉన్న విద్యార్థులు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటారు. తమ సామర్థ్యాల గురించి తక్కువగా అంచనా వేసుకుంటారు. 

8. నిలకడ లేకపోవడం: కుదురుగా కూర్చోలేకపోవడం, నిరంతరం అసహనంగా కనిపించడం, దేని మీదా నిలకడలేకపోవడం.. ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలు.


సందర్భానుసారం..

కొన్నిసార్లు అకడమిక్‌ యాంగ్జైటీ సందర్భానుసారం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కంగారు పడటానికి కారణం (పరీక్ష, ప్రెజెంటేషన్, ప్రాజెక్టు..) దగ్గరగా వచ్చినప్పుడు ఇది మరింత ఎక్కువ కావడం.. ఒక్కసారి ఆ టాస్క్‌ పూర్తికాగానే తగ్గిపోవడం జరుగుతుంటుంది. మళ్లీ ఇటువంటి ముఖ్యమైన పనులకు సమయం సమీపించినప్పుడు పెరుగుతుంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియలా జరుగుతుంది. దీనికి తగిన చర్యలు తీసుకుంటే ఈ హెచ్చు తగ్గులను అదుపులో ఉంచుతూ ప్రశాంతంగా ఉండొచ్చు.


ప్రయత్నించాలి..

విద్యార్థుల్లో చదువు పట్ల యాంగ్జైటీ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇష్టం లేని కోర్సుల్లో చేరడం, ఇష్టం ఉందని చదివే సామర్థ్యం లేకపోయినా కష్టమైన సబ్జెక్టులు ఎంచుకుని ఇబ్బంది పడటం.. లక్షల్లో ఫీజు కట్టిన తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి, ఉద్యోగం దొరుకుతుందో లేదోననే కంగారు.. ఇలా విభిన్నమైన అంశాలు దీనికి కారణమవుతుంటాయి. 

చదివింది అర్థం కాకపోవడం, పరీక్షల ఒత్తిడి, ఇంట్లో మద్దతు లేకపోవడం.. వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే అది డిప్రెషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల ఇతర చెడు వ్యాపకాలవైపు మళ్లుతున్న విద్యార్థులను మనం బయట గమనించవచ్చు. సోషల్‌మీడియా, సినిమాలు, స్నేహితులు.. ఇలా తమకు తెలిసిన పద్ధతిలో దాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది సరికాదు. భవిష్యత్తు  మీద భయాన్ని సరైన దిశలో ఫోకస్‌ చేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో వారికి సహకరించాలి. సాధ్యం కాని లక్ష్యాలు పెట్టుకుని ఒత్తిడికి లోనుకాకూడదు. వీలైతే అధ్యాపకుల సాయంతో మెరుగైన ప్రదర్శన చూపేందుకు ప్రయత్నించాలి. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. మన ఒత్తిడి మంచి ఫలితాలు సాధించేలాగానే ఉండాలి తప్ప.. లక్ష్యసాధన నుంచి పక్కకు తప్పించేలా ఉండకూడదు.


శారీరక లక్షణాలైతే.. 

అరచేతులు చెమటలు పట్టడం, వికారం, గుండెదడ, శ్వాసవేగం పెరగడం, ఇతర శారీరక లక్షణాలను అదుపులో ఉంచుకునేందుకు కొన్ని పద్ధతులు పాటించవచ్చు.

ధ్యానం 

దీర్ఘంగా శ్వాస తీసుకునే విడిచే సాధన 

సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించడం  

మంచి విషయాలే తలచుకోవడం. ప్రవర్తనపరమైన లక్షణాల అదుపునకు.. 

‘పాజిటివ్‌ సెల్‌ఫ టాక్‌’ సాధన 

ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడం 

ఒత్తిడిని అదుపు చేసే మెలకువలు నేర్చుకోవడం  

స్టడీ స్కిల్స్, టెక్నిక్స్‌.. (నోట్స్‌ రాయడం, రివైజ్‌ చేయడం) వంటివి సాధన చేయడం ద్వారా ప్రవర్తనపరమైన లక్షణాలను అదుపుచేయవచ్చు.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

Posted Date: 06-09-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం