• facebook
  • whatsapp
  • telegram

‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌ 

* మైక్రోసాఫ్ట్‌ టూల్‌కు పెరుగుతున్న డిమాండ్‌


 

ఇంటర్నెట్‌ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది. అందుకే దీన్ని నిర్వహించే టూల్స్‌కు, వాటిని ఉపయోగించగలిగే ఉద్యోగులకు గిరాకీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ ఇటువంటి శక్తిమంతమైన టూల్‌ మాత్రమే కాదు, కెరియర్‌కూ పవర్‌ను ఇచ్చే స్కిల్‌! మరి దీని సంగతులేంటో ఇంకా చూద్దామా!

పెద్దస్థాయిలో జరిగే వ్యాపారాల్లో గుట్టలుగుట్టలుగా వచ్చే డేటాను ఓ పద్ధతి ప్రకారం నిర్వహించడం, దాన్నుంచి అవసరమైన సమాచారాన్ని రాబట్టడం అంత సులువైన పని కాదు. ఆధునిక వ్యాపారంలో డేటా అనేది ఆలోచనల భాండాగారం. దాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటే  అంతగా సత్ఫలితాలు పొందవచ్చు. అందుకే డేటా టూల్స్‌ వినియోగం పెరుగుతోంది.


అంటే..?

పవర్‌ బీఐ మైక్రోసాఫ్ట్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఒక బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌. ఇది బిజినెస్‌ అనలిటిక్స్, డేటా విజువలైజేషన్‌ అనే అంశాల ఆధారంగా పనిచేస్తుంది. వినియోగదారులకు అత్యంత అనుకూలమైన ఇంటర్‌ఫేస్‌ కలిగి ఉండి, సమాచార అనుసంధానం (డేటా ఇంటిగ్రేషన్‌)కు అవకాశం కల్పిస్తుంది. ఇది రియల్‌టైమ్‌ డేటా ప్రాసెసింగ్‌కు అనుకూలం కావడంతో మారుతున్న వివరాలను ఎప్పటికప్పుడు తాజాగా చూసే వీలుంటుంది. 

వివిధ రకాలైన మార్గాల ద్వారా డేటాను సేకరించడం, దాన్ని నిర్వహించడం, విశ్లేషించడం.. ఇవన్నీ అవలీలగా చేయగలుగుతుంది. పవర్‌ బీఐ క్లౌడ్‌ బేస్డ్‌ ప్లాట్‌ఫామ్‌. విభిన్నమైన డేటా సోర్సులకు సులభంగా అనుసంధానం కాగలదు. బేసిక్‌ ఎక్సెల్‌ స్ప్రెడ్‌ షీట్స్, డేటాబేస్, యాప్స్‌తో కలిసి పనిచేయగలదు. ఇది తొలుత డేటా మొత్తాన్ని ఒకచోటకి తీసుకొస్తుంది. దాన్ని చూడటానికి అనుకూలమైన గ్రాఫ్‌లు, చార్టుల రూపంలో విశ్లేషిస్తుంది. ఉపయోగకరమైన ఇన్‌సైట్స్‌ను తయారుచేస్తుంది. దీన్ని వినియోగదారులు తమ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. 

‣ ఇది మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌ ఆధారంగా తయారైనది. పవర్‌బీఐ అనే పదాన్ని విస్తృతమైన అర్థంలో వాడుతున్నారు. విండోస్‌ డెస్క్‌టాప్‌ అప్లికేషన్, ఆన్లైన్‌ ఎస్‌ఏఏఎస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌), విండోస్‌ ఫోన్స్, లాప్‌ట్యాప్స్‌లో ఉండే యాప్స్, ఐవోఎస్, యాండ్రాయిడ్‌ డివైజ్‌లలో వాడే అప్లికేషన్లు అన్నీ ఇదే కోవలోకి వస్తాయి.

ఏం చేస్తుంది?

వ్యాపార సంస్థలు డేటాను ఆర్గనైజ్‌ చేసి ఉపయోగించుకుంటే తప్ప ఆలోచనలుగా మార్చుకోవడానికి వీలుండదు. ఇక్కడే పవర్‌ బీఐ చక్కగా ఉపయోగపడుతుంది. కంపెనీ డేటా ఆధారంగా నివేదికలు తయారుచేయడం, ఇన్‌సైట్స్‌ ఇవ్వడం, జరుగుతున్న మార్పులను గుర్తించడం.. ఇలా ఎన్నో చేస్తుంది. విభిన్న రకాలైన సోర్సులకు అనుసంధానమవుతూ.. తనకు ఇచ్చిన సమాచారానికి - కమాండ్‌కు పరిమితమై ఉంటుంది, అందువల్ల ఉపయోగించడం తేలిక. దీని ద్వారా తయారుచేసిన నివేదికలు, విశ్లేషణలను ఇతర వినియోగదారులు, అప్లికేషన్లతో పంచుకోవచ్చు.

‣ పవర్‌ బీఐ గతంలోనూ వర్తమానంలో ఏం జరిగింది అనేదే కాదు.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంచనాలు సైతం చూపించగలుగుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ మెషీన్‌ లెర్నింగ్‌తో మిళితమై పనిచేస్తుంది, దాని ఆధారంగా ఈ వివరాలను అంచనా వేయగలదు. 

‣ దీన్ని హెల్త్‌కేర్, ఫైనాన్స్, రిటైల్, మాన్యుఫాక్చరింగ్‌.. వంటి అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. అడోబ్, కేప్‌మిని, డెల్, నెస్లే.. వంటి చాలా కంపెనీలు పవర్‌ బీఐని వినియోగిస్తున్నాయి.


ఎందుకు?: ఎక్సెల్‌ను మించి అనలిటిక్స్‌ కావాలి అనుకునే ఉన్నత శ్రేణి వ్యాపార సంస్థలకు పవర్‌ బీఐ మంచి ఎంపిక. ఇతర మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ అయిన షేర్‌పాయింట్, ఆఫీస్‌ 365, డైనమిక్స్‌ 365 వంటివి వాటితో సులువుగా అనుసంధానమై పనిచేయగలదు. అలాగే మైక్రోసాఫ్ట్‌ ప్రొడక్ట్స్‌ కాకపోయినా స్పార్క్, హడూప్, గూగుల్‌ అనలిటిక్స్, ఎస్‌ఏపీ, సేల్స్‌ఫోర్స్‌ వంటి అప్లికేషన్లతోనూ కలిసి పనిచేయగలదు. దీని ద్వారా యూజర్‌కు అత్యంత అనుకూలమైన పని వాతావరణం ఉంటుంది.


పవర్‌ బీఐలో వివిధ భాగాలున్నాయి. అవి... 

క్వెరీ : వివిధ వనరుల నుంచి డేటాను తీసుకోవడం, కలపడం, మెరుగుపరచడం చేస్తుంది.  

పెవెట్‌ : డేటా మోడల్స్‌ తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. 

వ్యూ : చార్టులు, గ్రాఫ్స్, మ్యాప్స్, ఇతర విజువల్స్‌ తయారుచేస్తుంది.  

క్యూ అండ్‌ ఏ : డేటా గురించి వివిధ ప్రశ్నలు అడిగేందుకు వీలు కల్పిస్తుంది.


 

సర్టిఫికేషన్లు..

పవర్‌ బీఐలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ అందించే ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్లు పొందడం ద్వారా జాబ్‌ మార్కెట్‌లో ముందంజ వేయొచ్చు. అయితే ఇందుకోసం తగిన పరీక్ష రాయాలి. 

‣ ఐటీలో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు పొందేందుకు ఎంసీఎస్‌ఏ మిడ్‌ లెవెల్, ఆపైన ప్రయత్నించేందుకు ఎంఎస్‌సీఈ సర్టిఫికేషన్లు ఉపయోగపడతాయి.


ఉద్యోగాలు...

పవర్‌ బీఐతో వివిధ రకాలైన ఆసక్తికర, లాభదాయకమైన ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు. అవి... 

బీఐ ఆర్కిటెక్ట్‌ : వీరు డేటాబేస్, డేటా వేర్‌హౌస్, ఇతర స్టోరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లతో పనిచేస్తారు. వాటి సాయంతో డేటా స్ట్రక్చర్స్‌ను అభివృద్ధి చేస్తారు. డేటాను పూర్తిస్థాయిలో వాడుకునేలా తీర్చిదిద్దుతారు. 

బిజినెస్‌ అనలిస్ట్‌ : ఇది కొంత సాంకేతిక, మరికొంత బిజినెస్‌ ఆధారిత ఉద్యోగం. ఈ నిపుణులకు వ్యాపార అవసరాలు తెలిసి ఉండటంతోపాటు, సమాచార నైపుణ్యాలు ఉండాలి. కొత్త బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్స్‌ను తయారుచేయడం వీరి ప్రధాన లక్ష్యం. నివేదికల తయారీ తెలిసి ఉండాలి. 

డేటా అనలిస్ట్‌ : వీరు రిపోర్టులు తయారుచేయడం, అనాలిసిస్‌ను ప్రయోజనకరమైన ఇన్‌సైట్స్‌గా రూపొందించడం, వ్యాపారానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం చేస్తారు. 

బీఐ డెవలపర్‌ :  ఇతర డెవలపర్స్‌ మాదిరిగానే బీఐ డెవలపర్లు టూల్స్, సొల్యూషన్స్‌ను తయారుచేస్తారు. వ్యాపార అవసరాలకు తగినట్టుగా అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు తోడ్పడతారు.


నేర్చుకోవడం ఎలా?

ఆన్‌లైన్‌లో మైక్రోసాప్ట్‌ లెర్న్‌ ద్వారా దీని గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చు. సింప్లీలెర్న్, యుడెమీ, కోర్సెరా వంటి లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో దీనికి సంబంధించిన వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరి సులభంగా నేర్చుకునే వీలుంది. ఎంత గట్టి పట్టు సంపాదిస్తే అంతగా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి!



మరింత సమాచారం... మీ కోసం!

‣ దూరవిద్యలో వైవిధ్య కోర్సులెన్నో!

‣ పేద విద్యార్థులకు ఉచితంగా అమెరికా విద్య!

‣ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో 153 కొలువుల భర్తీ

‣ ఇవి పాటిస్తే.. భవిష్యత్తు మీదే! ‣ బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్'

Posted Date: 31-08-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌