‣ కెనడీ - లూగర్ యూత్ ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ వివరాలు
అమెరికాలో డిప్లొమా.. ఆ దేశం ఖర్చుతో! అమెరికా వెళ్లడం చాలామంది విద్యార్థుల కల. కానీ ఆ కల కూడా కనలేని పేదరికంలో ఉన్న విద్యార్థులు ఇంకా ఎందరో మన దేశంలో ఉన్నారు. వారికే గనుక నిజంగా అక్కడికి వెళ్లి చదువుకునే అవకాశం వస్తే? ఆశ్చర్యంగా ఉంది కదా..! ఆ కలను నిజం చేస్తోంది కెనడీ - లూగర్ యూత్ ఎక్ఛ్సేంజ్ ప్రోగ్రామ్. దీని గురించి ఇంకా తెలుసుకుందామా..
యూఎస్ వెళ్లడానికి ఎంత ఖర్చవుతుందో, ఎంత కష్టమో అందరికీ తెలుసు. ప్రభుత్వ సంస్థల్లో చదివేవారు, ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఖర్చు గురించి ఆలోచించే వెనకడుగేస్తారు. కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా చిన్నవయసులోనే, అమెరికా దేశపు ఖర్చుతోనే ఏడాదిపాటు అక్కడ ఉండి చదువుకునే అవకాశం కల్పిస్తోందీ కార్యక్రమం. చాలా ఏళ్లుగా దీన్ని మన దేశంలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికి ఇప్పటికే పలువురు విద్యార్థులు ఇలా వెళ్లేందుకు ఎంపికయ్యి ప్రయాణానికి సిద్ధం అవుతున్నారు.
ఏంటిది?
కెనడీ - లూగర్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా కొన్ని దేశాల నుంచి కొందరు విద్యార్థులను ఆహ్వానించి తమ వద్ద ఉండి చదువుకునే అవకాశం కల్పిస్తోంది. మనదేశంలో పదోతరగతి దాటిన విద్యార్థులను వివిధ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తోంది. అక్కడ చదువుకునే సమయంలో వారికి స్టైపెండ్ ఇవ్వడంతోపాటు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం కల్పించి, వివిధ దేశాలతో సత్సంబంధాలు కలిగే ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికోసం ఏటా మన దేశంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు వివిధ దశల వారీగా ఉంటాయి. ఇప్పటివరకూ దీని ద్వారా 700 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికా వెళ్లి వచ్చారు.
అర్హత
దీనికి పోటీ పడే విద్యార్థులు 15 నుంచి 17.7 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దరఖాస్తు సమయానికి 8, 9, 10, 11 తరగతుల్లో ఏదైనా చదువుతూ ఉండాలి. ఈ ఏడాది, గత రెండేళ్లలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 5 లక్షల్లోపు ఉంటూ విద్యార్థి ప్రొఫైల్ అమెరికా వెళ్లేందుకు జె-1 వీసా నిబంధనలకు లోబడి ఉండాలి. ముఖ్యంగా ఈ విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదువుతూ ఉండాలి. వడపోత అనంతరం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అక్కడ ఏం చేయాలి?
‣ ఇలా ఎంపికైన విద్యార్థులు అక్కడ వీరికి కేటాయించిన కుటుంబం వద్ద ఉండి ఏడాదిపాటు డిప్లొమా కోర్సు చదువుకుంటారు.
‣ ఈ కార్యక్రమాన్ని ఆ దేశపు స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే కోఆర్డినేటర్లు వీరిని, హోస్ట్ ఫ్యామిలీలను సమన్వయం చేస్తారు. సర్వం సమకూరుస్తారు.
‣ ఇలా వెళ్లిన విద్యార్థుల భద్రత కోసం రెండు దేశాల ఎంబసీలు పనిచేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన సహాయం అందించడం, అవసరం అయితే వెంటనే ఖాళీ చేయించడం వంటి చర్యలు తీసుకుంటాయి. విద్యార్థులకు అక్కడున్నంత కాలం ఎటువంటి ఇబ్బందీ లేకుండా జాగ్రత్త వహిస్తాయి.
గొప్ప అవకాశం
2022 ఆగస్టులో వెళ్లి, 2023 జూన్ 12న తిరిగి వచ్చాను. విస్కాన్‌స్సిన్ స్టేట్ రాయోలా అనే పట్టణంలో ఉన్నాను. అక్కడ మార్లిస్ లిమ్ లాన్సన్ అనే పేరెంట్ వద్ద నన్ను ఉంచారు. ఏడాదిపాటు అక్కడ రాయో జూనియర్ అండ్ సీనియర్ హైస్కూల్‌లో మేజర్ వెటర్నరీ, మైనర్ అగ్రికల్చర్ సబ్జెక్టులతో డిప్లొమా చదివాను. అప్పుడు నాతోపాటు 38 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అందరినీ వివిధ రాష్ట్రాల్లో ఉంచారు. నన్ను ఉంచిన కుటుంబం చాలా బాగా చూసుకుంది. ఆ దేశ ప్రభుత్వం నెలకు 200 డాలర్లు (సుమారు రూ.16,500) స్టైపెండ్ ఇచ్చేది. మా అవసరాలకు ఈ డబ్బు సరిపోయేది.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలోని జి.కొత్తూరు అనే మారుమూల పల్లెటూరు మాది. ఇక్కడి నుంచి అక్కడి వరకూ వెళ్లడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. కొత్తలో ఒక నెల ఇబ్బంది అనిపించింది. భాష అంతగా రాక, ఎలా ఉండాలో తెలియక కంగారు పడేవాడిని. తర్వాత అలవాటు అయిపోయింది. అక్కడి ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించారు. అక్కడికి వెళ్లాక ఆ దేశం గురించి నేర్చుకోవడంతోపాటు మన సంస్కృతి, జీవన విధానం గురించి కూడా వారికి తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా తరచూ అందరం కలుసుకుని కొంత సమయం మాట్లాడుకునేవాళ్లం. ఒకరి వంటకాలు ఒకరికి పరిచయం చేసుకునేవాళ్లం. మన పండగల విశిష్టత, ఎలా చేసుకుంటాం, అన్నీ వివరించాను. వారికి నేను చేసిన ఆమ్లెట్, పులిహోర అంటే చాలా నచ్చేది. ఇప్పుడు నాకు అంతర్జాతీయంగా చాలా మంది స్నేహితులయ్యారు. ఇప్పటికీ అందరూ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్.చదువుతున్నాను. డిగ్రీకి అక్కడికే వెళ్లాలి అనుకుంటున్నాను. అక్కడి యూనివర్సిటీల నుంచి స్కాలర్‌షిప్ అవకాశాలు వస్తున్నాయి. అక్కడ డిప్లొమాలో నాలుగు మిడ్ ఎగ్జామ్స్, రెండు సెమిస్టర్లలోనూ ఏ ప్లస్ గ్రేడ్ వచ్చింది. ఆనర్స్ బయాలజీ క్లాసు తీసుకున్నా. అక్కడా టాప్ గ్రేడ్ వచ్చింది. విద్యార్థులు బాగా చదివి ఇటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. - చిట్టిమూరి తేజ, అమెరికా వెళ్లి వచ్చిన విద్యార్థి.
త్వరలోనే వెళ్తున్నా..
దరఖాస్తు చేసుకున్నాక ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదట నా గురించి తెలియజేస్తూ ఒక వ్యాసం రాశాను. ఆ దశ నుంచే విద్యార్థుల వడపోత మొదలవుతుంది. తర్వాత ప్రీ అప్లికేషన్ అని ఒక ఫామ్ ఇచ్చారు. దానిలో ఆరోగ్యానికి సంబంధించి, కుటుంబం గురించి పూర్తి వివరాలు రాయాలి. తర్వాత దశలో హైదరాబాద్ వెళ్లాను. అక్కడ అధికారులు ప్రతి విద్యార్థినీ వ్యక్తిగతంగా పరిశీలించారు. మొత్తం మూడు ఇంటర్వ్యూలు చేశారు. ‘నీ గురించి చెప్పు, ఏం అవ్వాలి అనుకుంటున్నావు, కుటుంబం గురించి వివరించు’ వంటి ప్రశ్నలు అడిగారు. అప్పుడే ఇంగ్లిష్ వ్యాకరణ పరీక్ష, పదిమందితో బృంద చర్చ నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి వచ్చేశా. కొన్నాళ్లకు మళ్లీ హైదరాబాద్ పిలిచి మరిన్ని వివరాలు లోతుగా ప్రశ్నించారు. రెండోసారి కూడా ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఒక అంశం ఇచ్చి దాని గురించి అన్నికోణాల్లో చర్చించమని చెప్పారు. ఆ ప్రక్రియ తర్వాత తదుపరి దశ దరఖాస్తు పంపారు. కొన్ని మెడికల్ టెస్టులు చేయించి, ఆ దరఖాస్తు నింపి జతచేసి పంపాలి. అనంతరం తుది ఎంపిక జాబితా నిర్ణయించారు. ఎంపికయ్యాక దిల్లీలో ‘ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్’ తరగతి చెప్పారు. అమెరికాలో ఉండే నిబంధనలు, మేం నడుచుకోవాల్సిన తీరు వివరించారు. రెండోసారి దిల్లీ తీసుకెళ్లి ‘గేట్ వే ఓరియంటేషన్’ నిర్వహించారు. మొదటిసారి అంతర్జాతీయ విమానం ఎక్కుతుండటం వల్ల ఎలా ఉంటుంది, ఏం చేయాలనేది నేర్పించారు. మొత్తం ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి ఏడాది పట్టింది. ఎంపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో నాకు 410 మార్కులు వచ్చాయి. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అక్కడకు వెళ్లి అందులో డిప్లొమా చదువుతా. - సింగంపల్లి జ్ఞానేశ్వరరావు, కాగిత, నక్కపల్లి మండలం, ప్రస్తుతం ఎంపికైన విద్యార్థి.
సన్నద్ధత ముఖ్యం

-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇవి పాటిస్తే.. భవిష్యత్తు మీదే! ‣ బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
‣ ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్'
‣ బెల్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు
‣ హెచ్‌పీసీఎల్‌లో 276 కొలువుల భర్తీ
‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!
‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు
- Read Latest job news, Career news ,Education news and Telugu news
- Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.