• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇవి పాటిస్తే.. భవిష్యత్తు మీదే!

కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు



విద్య, ఉద్యోగం, ఆట, పాట.. ఎందులో టాపర్‌గా నిలవాలన్నా మంచి అలవాట్లు, చక్కని ప్రణాళిక ఎంతో కీలకం. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వీటిని ప్రణాళికతో అమలు చేస్తే భవిష్యత్తులో కోరుకున్న విభాగంలో రాణించడం సులువవుతుంది. రోజూ తరగతులకు హాజరై, అసైన్‌మెంట్లు పూర్తిచేస్తే సరిపోదు. దీంతోపాటు ఆచరించాల్సిన ఇతర అంశాలెన్నో ఉన్నాయి. వాటిని దినచర్యలో భాగం చేసుకోవాలి!


విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఒక్కటే విజయాన్ని అందించలేదు. ముఖ్యమైన జీవన నైపుణ్యాలను అలవర్చుకున్నవారే జీవితంలో రాణించగలరు. మేటి అకడమిక్‌ పరిజ్ఞానంతోపాటు విశ్వనైపుణ్యాలను సొంతం చేసుకున్నవారు వృత్తి జీవితంలోకి ధైర్యంగా అడుగుపెట్టి, రాణించగలరు. జిజ్ఞాస, సమర్థ సమయ పాలన, బుద్ధి స్థిరత్వం, వేగంగా సంగ్రహించుకోగలగడం.. ఇలా ఎన్నో అంశాలు విజయాన్ని ప్రభావితం చేస్తాయి.


సమయం

ఇది ఎంతో విలువైన వనరు. విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కాలపట్టీ కీలకం. చదువుకునే సమయం, విరామం, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, పర్సనల్‌ రిలాక్సేషన్‌ వీటన్నింటినీ దినచర్యలో భాగం చేయాలి. వీటిని తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలి. దీంతో విద్య, వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం కుదురుతుంది. సమయ పాలనపై పట్టు దక్కుతుంది. 


లక్ష్యాలు

విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. అవి అధిగమించే విధంగా ఉండాలి. అలా జరగాలంటే ఆ లక్ష్యాల వెనుక బలమైన కారణాలు ఉండాలి. వాటిని అందుకోవాలంటే ఏం చేయాలో ప్రణాళిక తప్పనిసరి. లక్ష్యం బాగా పెద్దదైనప్పుడు చిన్నవిగా విభజించుకోవాలి. గడువు నిర్దేశించుకుని ఒక్కొక్కటీ పూర్తి చేయాలి. దీంతో ఆత్మవిశ్వాసం పెంపొంది, తర్వాత లక్ష్యాలను చేరుకోవడం వీలవుతుంది. అప్పుడప్పుడూ వీటిని సమీక్షించుకోవడమూ తప్పనిసరి. అలాగే అవసరమైన మార్పులూ చేసుకోవాలి. లక్ష్యాలను చేరుకోలేకపోతున్నట్లైతే అందుకు కారణాలు తెలుసుకుని, అధిగమించాలి. ఇతరులతో పోల్చుకోవద్దు.


పఠనం.. మెలకువలు

విస్తృత పరిజ్ఞానం సొంతం చేసుకోవడానికి, విశ్లేషణకు, తార్కికంగా ఆలోచించడానికి.. ఇలా ఎన్నో ప్రయోజనాలకు పుస్తకాలు బాగా చదవడం ఎంతో ముఖ్యం. అందువల్ల మీ దినచర్యలో పుస్తక పఠనం భాగం కావాలి. కేవలం అకడమిక్‌ పుస్తకాలకే పరిమితం కాకుండా మీరు కోరుకున్న రంగంలో లేదా మీ ఆసక్తులకు సంబంధించి లేదా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన పుస్తకాలూ చదవాలి. పద సంపద పెంపొందడం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మెరుగుపడటంలోనూ పుస్తక పఠనం ఉపయోగపడుతుంది. ఇందుకోసం.. చదవడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోండి. ఎలాంటి అవాంతరాలూ లేకుండా చూసుకోండి. ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉంచండి. చదివే ప్రాంతంలో అవసరమైన పుస్తకాలు, నోట్సులు, కావాల్సిన స్టేషనరీ తప్ప ఇతర ఎలాంటివీ అక్కడ ఉంచకండి. అలాగే ఎన్ని గంటలు చదివామన్నది ప్రామాణికం కాదు. ఎంత విషయాన్ని సంగ్రహించగలిగామనేది కీలకం. అందువల్ల మూసగా గంటల కొద్దీ పఠనం కొనసాగిస్తే ప్రయోజనం దక్కదు. అర గంట చదివి, ఏం తెలుసుకున్నారో ఐదు నిమిషాలు విశ్లేషించుకోవాలి. మధ్యలో చిన్న విరామం తీసుకోవాలి. మళ్లీ ఆర గంట చదువు కొనసాగించి.. ముందు చదివింది, ఇప్పుడు తెలుసుకున్నది రెండూ గుర్తుకు తెచ్చుకోవాలి. చదవడం ద్వారా గ్రహించిన ముఖ్యాంశాలు పుస్తకంలో రాసుకుంటే బాగా గుర్తుంటాయి.  నిర్ణీత వ్యవధిలో ఒక అంశంపైనే దృష్టి సారించండి. అది పూర్తయిన తర్వాతే మరో లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. 



శ్రద్ధగా వినాలి 

అకడమిక్స్‌లో విజయం సాధించడానికి పాఠాలు/ ఉపన్యాసాలు శ్రద్ధగా వినడం ప్రాథమిక కర్తవ్యం. అలాగే విన్నదాన్ని ప్రభావవంతంగా, గుర్తుండిపోయేలా నోట్సు రాసుకోవాలి. వింటున్నప్పుడే ముఖ్యాంశాలు సంగ్రహించుకోవాలి. వినడం పూర్తయిన తర్వాత ఆ అంశాలు విశ్లేషించుకోవాలి. ఇందుకోసం ఆడియో/ వీడియో ప్రసంగాలు ఉపయోగడతాయి. వాటిని విని, రాయడాన్ని సాధన చేస్తే విషయ పరిజ్ఞానం, రాయగలిగే నైపుణ్యం పెంపొందుతాయి. ఎక్కువ రోజులు గుర్తుంచుకోవచ్చు కూడా. 


నిర్వహణ నైపుణ్యాలు

గడువులోగా అసైన్‌మెంట్లు, లక్ష్యాలు పూర్తిచేయడంలో నిర్వహణ నైపుణ్యాల పాత్ర ఎంతో కీలకం. ఎప్పుడు ఏ పని పూర్తి చేయాలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ‘అత్యవసరం’, ‘అవసరం’, ‘ప్రస్తుతం అవసరం కాదు’.. చేయాల్సినవాటిని ఇలా విభజించుకుంటే ఆశించిన విధంగా పనులు పూర్తవుతాయి. ఇందుకోసం ప్లానర్స్, డిజిటల్‌ క్యాలెండర్లు, టాస్క్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌ల సహాయమూ తీసుకోవచ్చు. 


అప్‌డేట్‌

దేన్నైనా నేర్చుకోవడానికి పరిమితులు ఉండవు. సమాచారం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అప్‌డేట్‌ అయితేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలం. అందువల్ల నేర్చుకోవడం నిరంత ప్రక్రియగా గుర్తించాలి. కేవలం అకడమిక్‌ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా వీలైనన్ని కొత్త విషయాలూ తెలుసుకోగలగాలి. దీంతో విలువైన ఆలోచనలకూ అవకాశం ఉంటుంది. మేధాపరమైన వికాసానికి నిరంతం నేర్చుకుంటూ ఉండటం దివ్యాస్త్రం లాంటిది. 


కమ్యూనికేషన్‌

అకడమిక్, వృత్తిగత లక్ష్యాలను అందుకోవడంలో బలమైన కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు తప్పనిసరి. ఆలోచనలను సమగ్రంగా ఒక దగ్గర రాసుకోవాలి. అసైన్‌మెంట్లు, ప్రెజెంటేషన్లు, చర్చలు.. వీటన్నింటి ద్వారా కమ్యూనికేషన్‌ మెరుగుపరచుకోవచ్చు. చెప్పాలనుకున్న/ రాయాలనుకున్న అంశంలో అవగాహన ఉంటే కమ్యూనికేషన్‌ తేలికవుతుంది. నిపుణులు ప్రసంగాలు వినడం, అవసరమైన పుస్తకాలు చదవడంతో కమ్యూనికేషన్‌ పెంపొందించుకోవచ్చు. పాఠశాల స్థాయిలోనే వ్యాసరచన, వక్తృత్వం, ఇతర పోటీల్లో భాగం కావాలి. చిన్న చిన్న బాధ్యతలూ తీసుకోవచ్చు. 


నెట్‌వర్కింగ్‌

మీ తోటివారు, నిపుణులు, మీ రంగానికి చెందిన వ్యక్తులతో అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. దీనిద్వారా విలువైన సూచనలు పొందడం, కొత్త విషయాలు తెలసుకోవడం, కొత్త అవకాశాలపై అవగాహన, సందేహాలు నివృత్తి చేసుకోవడం, తాజా సమాచారం గ్రహించడం ఇవన్నీ సాధ్యమవుతాయి. విద్యార్థిగా ఉన్నప్పుడే పాఠశాల పూర్వ విద్యార్థులతో మమేకం కావడం, వివిధ పోటీలు, శిక్షణలో పాల్గొనడం లాంటి అలవాట్లు పెంపొందించుకోవాలి. సానుకూల దృక్పథం, మీలాంటి లక్ష్యం ఉన్న వ్యక్తులతో స్నేహం చేయండి. మీ మెంటర్‌తో అభిప్రాయాలు పంచుకోండి. మీ సందేహాలూ నివృత్తి చేసుకోండి. 


వ్యాయామం

విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విజయం సాధించడంలో దీని పాత్ర ఎక్కువే. అందువల్ల ప్రతి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి. నడవడం, పరుగెత్తడం, ఏదైనా ఆట ఆడటం.. ఇలా మీకు ఏది ఇష్టమైతే దాన్ని చేయాలి. దీంతో ఒత్తిడీ తొలగుతుంది. సానుకూల దృక్పథం అలవడుతుంది. బద్ధకం లేకుండా చూసుకోవచ్చు. అలాగే సరైన నిద్ర, సమతులాహారం రెండూ కీలకమేనని గుర్తుంచుకోండి.

పై లక్షణాలన్నీ అలవర్చుకున్నవారు అకడమిక్స్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ వృద్ధి చెందగలరు. అయితే ఇవన్నీ ఒక్క రోజులోనే సాధ్యపడవు. అందువల్ల సహనం అవసరం. ప్రయత్నంతో కొద్ది వ్యవధిలోనే మేటి మార్పు దిశగా మీ ప్రయాణం మొదలవుతుంది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్'

‣ బెల్‌లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు

‣ హెచ్‌పీసీఎల్‌లో 276 కొలువుల భర్తీ

‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!

‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

Posted Date : 30-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.