• facebook
  • whatsapp
  • telegram

ఆర్య నాగరికత

సనాతన భారతీయతకు సమున్నత మూలాలు!


ఆధునిక భారతీయ సంస్కృతికి అనాది కాలంలోనే ఆర్య నాగరికత పునాదులు వేసింది. నాడు ప్రభవించిన వేద సాహిత్యం సామాజిక నిర్మాణానికి, వర్ణ, కుల వ్యవస్థలకు మూలమై నిలిచింది. ప్రకృతికి దైవత్వాన్ని జోడించి వేదాలు శ్లోకాలుగా, ఆచారాలుగా, తాత్విక బోధనలుగా మార్గనిర్దేశం చేశాయి.  ఆధ్యాత్మిక, సాంస్కృతిక నైతికతలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించాయి. కాలాతీతమైన జ్ఞానాన్ని పంచాయి. వాటిని శక్తిమంతమైన వాఙ్మయ రూపంలో ఆర్యులు తరతరాలకు అందించారు. ఈ నేపథ్యంలో ఆ విశిష్ట నాగరికత మూలాలు, వేదాలు, ఉపనిషత్తుల సారాంశాలు, వాటి అనుబంధ సాహిత్యాల విశేషాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.


సింధు నాగరికత అనంతరం ఉత్తర భారతదేశంలో ఆర్య నాగరికత వర్ధిల్లింది. ఇది క్రీస్తు పూర్వం సుమారు 1500 నుంచి 600 వరకు కొనసాగింది. సింధు నాగరికత, సంస్కృతి మాదిరిగానే ఆర్య నాగరికత, సంస్కృతులు కూడా భారతీయ సమాజంపై ప్రగాఢ ముద్ర వేశాయి. ఆర్య అనే పదం ఉత్తముడు, ఉన్నతుడు, పూజ్యుడు అనే అర్థాలు ఇస్తుంది. ఆర్య నాగరికత లేదా వేద నాగరికతను నిర్మించినవారు నార్డిక్‌ తెగకు చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం. వీరి జన్మస్థలం గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ తన గ్రంథం ‘ద ఆర్కిటిక్‌ హోమ్‌ ఇన్‌ ద వేదాస్‌’లో ఆర్యుల జన్మస్థలం ఉత్తర ధ్రువ ప్రాంతమని పేర్కొన్నారు. ఆర్యులు ఐరోపా ఖండ వాసులని విలియం జోన్స్‌ చెబితే, మధ్య ఆసియా ప్రాంత వాసులని మాక్స్‌ముల్లర్‌ అన్నారు. 


ఎక్కువమంది చరిత్రకారుల ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుంచి భారత దేశానికి వలస వచ్చి, స్థానిక జాతులను ఓడించి, క్రీ.పూ.1500 నాటికి భారతదేశ పశ్చిమోత్తర ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడి నుంచి క్రమక్రమంగా మధ్య భారతదేశంలోకి వ్యాపించి స్థిర నివాసాలను ఏర్పరచుకుని వ్యవసాయ, వాణిజ్యాలు సాగించి తమదైన నాగరికత సంస్కృతులను స్థాపించారు. వీరిది గ్రామీణ సంస్కృతి. అందుకే ఆ కాలం నాటి పురావస్తు ఆధారాలు ఎక్కువగా లభ్యం కాలేదు. అయినప్పటికీ ఆర్య నిర్మితమైన అద్భుతమైన వాఙ్మయం వారి చరిత్రకు ఆధారంగా నిలిచింది. వేద వాఙ్మయం సాయంతో ఆర్య నాగరికత, సంస్కృతులను, ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. ఆర్య నాగరికత కాలాన్ని రెండు దశలుగా విభజించి అధ్యయనం చేస్తారు. అవి రుగ్వేద నాగరికత కాలం (సుమారు క్రీ.పూ.1500 నుంచి క్రీ.పూ. 1000 వరకు), మలివేద కాలం (క్రీ.పూ.1000 నుంచి క్రీ.పూ. 600 వరకు).


వేద సాహిత్యం: వేదం అనే పదం విద్‌ అనే ధాతువు నుంచి ఉద్భవించింది. దీని అర్థం జ్ఞానం. వేదాలు సాక్షాత్తు భగవంతుడే ప్రవచించాడని, మానవ నిర్మితాలు కావన్నది నమ్మకం. అందుకే వేదాలను ‘అపౌరుషేయాలు’ అంటారు. వేద సాహిత్యాన్ని ప్రధానంగా శ్రుతి సాహిత్యం, స్మృతి సాహిత్యాలుగా విభజిస్తారు. వేదాలు నాలుగు అవి.. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. వీటినే వేద సంహితలు అని కూడా అంటారు. వీటి అనుబంధ గ్రంథాలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇవన్నీ శ్రుతి సాహిత్యాలు. ఇక వేదాంగాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు స్మృతి సాహిత్యం కిందకు వస్తాయి.

రుగ్వేదం: వేదాల్లో ప్రాచీనమైంది. ఇందులోని సూక్తాలు లేదా శ్లోకాలు వివిధ ప్రకృతి శక్తులకు దైవత్వం ఆపాదించి చేసిన ప్రార్థనలు. మొత్తం 10 మండలాలుగా విభజించి, 1028 సూక్తాలతో ఉంది. ఈ గ్రంథంలో రెండో మండలం నుంచి ఏడో మండలం వరకు మూలమని,   మిగతావి తర్వాత చేసిన చేర్పులని చరిత్రకారుల అభిప్రాయం. ఏడో మండలంలో దశ రాజ గణ యుద్ధం, పదో మండలంలో భారతీయ సామాజిక వ్యవస్థ మూలమైన ‘పురుషసూక్త శ్లోకం’ ఉంది. క్రీ.పూ. 1500 - 1000 సంవత్సరాల మధ్య నాటి ‘సప్త సింధు ప్రాంతం’లో ఆర్యులు సంచరించారు (ఆధునిక  అఫ్గానిస్థాన్‌ తూర్పు ప్రాంతం, పంజాబ్, హరియాణా ప్రాంతాలు). పశుపోషక, సంచార జీవితాన్ని ప్రతిబింబింపజేసే తొలి ఆర్యుల గురించి ముఖ్య సమాచారాన్ని రుగ్వేదం అందిస్తుంది. రుగ్వేద పండితుడిని ‘హోత్రి’ అంటారు.

సామ వేదం: సామన్‌ అంటే శ్రావ్యం అని అర్ధం. రుగ్వేదంలోని సూక్తాలను ఏ విధంగా ఉచ్చరించాలో సామవేదం చెబుతుంది. సామవేద పండితుడిని ఉద్ఘాత్రి అంటారు. ఇందులో భారతీయ శాస్త్రీయ సంగీత మూలాలున్నాయి.

యజుర్వేదం: పద్య, గద్య సంకలనం. ఈ గ్రంథంలో వివిధ శ్లోకాలు, మత క్రతువుల నిర్వహణ కోసం రూపొందించినవి ఉన్నాయి. యజుర్వేదాన్ని పఠించే పండితుడిని ‘అధ్వార్యు’ అంటారు. యజుర్వేదం శ్వేత యజుర్వేదం, కృష్ణ    యజుర్వేదం అని రెండు రకాలు.

అధర్వణ వేదం: దీనినే బ్రహ్మ వేదం అంటారు. మతేతర విషయాలైన వైద్యం, క్షుద్రవిద్యలు, యుద్ధ విద్యలు లాంటివి ఇందులో ఉన్నాయి. కొన్ని ఆర్యేతర విశ్వాసాలు కూడా ఉండటం గమనిస్తే ఈ గ్రంథంపై అనార్యుల ప్రభావం కనిపిస్తుంది. అధర్వణ వేదం పఠించే పండితుడిని ‘బ్రాహ్మణ’ అంటారు.


బ్రాహ్మణాలు: బ్రాహ్మణాలు అనేవి సంహితలకు వ్యాఖ్యాన రూప గ్రంథాలు. ఇవి గద్య రూపంలో, వేద సంహితకు అనుబంధంగా ఉండి, యజుర్వేదంలో చెప్పిన క్రతువుల నిర్వహణ విధానాన్ని తెలియజేస్తాయి. ఇందులో పాలకులు నిర్వర్తించే రాజసూయ, అశ్వమేధ, వాజపేయ లాంటి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి. ఇవి మోక్ష సాధనకు కర్మ మార్గాన్ని బోధిస్తాయి. ఒక్కో సంహితకు కొన్ని బ్రాహ్మణాలు అనుబంధంగా ఉంటాయి.

ఉదా: రుగ్వేదానికి ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం; సామ వేదానికి తాండ్యమాహ బ్రాహ్మణం, జైమిని బ్రాహ్మణం; యజుర్వేదానికి శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణం అనుబంధాలు.

అరణ్యకాలు: ఇవి బ్రాహ్మణాల చివరి భాగాలు. ఇవి కూడా బ్రాహ్మణాల మాదిరిగానే కర్మవిధుల్ని ప్రస్తావిస్తాయి. కానీ వీటిలో కర్మల భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి అరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.

ఉపనిషత్తులు: ‘ఉపనిషత్‌’ అనే పదం ‘ఉపనిషాద్‌’ అనే ధాతువు నుంచి పుట్టింది. దీనికి అర్థం గురువు చుట్టూ విద్యార్థులు చేరి జ్ఞానమార్జించడం. ‘ఉప’ అంటే గురువు సమీపంలో, ‘ని’ అంటే నిష్ఠతో   శ్రవణం చేసినవారికి అజ్ఞానం నశించి, ‘షత్‌’ అంటే పరమాత్మ ప్రాప్తి చేకూరడం అని అర్థం. ఇవి పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానం, జన్మ, పునర్జన్మ, మోక్షం, పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి వివరించేవి. ఉపనిషత్తులు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ ఇంతవరకు 108 మాత్రమే   లభ్యమయ్యాయి. ఇవి కూడా వేద సంహితలకు అనుబంధంగా ఉంటాయి.

ఉదా: రుగ్వేదానికి ఐతరేయ, కౌశతకి ఉపనిషత్తులు; సామ వేదానికి చాందోగ్య, కేనా ఉపనిషత్తులు; యజుర్వేదానికి కదా ఉపనిషత్తు, బృహదారణ్య ఉపనిషత్తులు; అధర్వణ వేదానికి ముండకా, మాండూక్య ఉపనిషత్తులు అనుబంధాలుగా ఉన్నాయి.


వేదాంగాలు: వేదాంగాలు ఆరు. ఇందులో మొదటిది ‘శిక్ష’. వేదాల్లో స్వరం ప్రధానం. ఇది వేదాన్ని ఉచ్ఛరించాల్సిన పద్ధతిని బోధిస్తుంది. రెండోది ఛందస్సు అంటే గణ విభజన. మూడోది నిరుక్తం అంటే పద వ్యుత్పత్తి శాస్త్రం. నాలుగోది వ్యాకరణం, అయిదు జ్యోతిషం (వేదాల్లో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాల నిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాల నియమాలు జ్యోతిషంలో ఉంటాయి), ఆరోది కల్పసూత్రాలు. ఈ ఆరు గ్రంథాలూ వేదపఠనానికి, వేదాలను అర్థం చేసుకోవడానికి, వేద జ్ఞానం సమాజ హితం కోసం ఉపయోగించడానికి మార్గాన్ని సూచిస్తాయి.

ఉపవేదాలు: మొత్తం నాలుగు. అవి ధనుర్వేదం - యుద్ధ విద్యకు, ఆయుర్వేదం - వైద్య విద్యకు, గాంధర్వ వేదం - గాన విద్యకు, శిల్ప వేదం - శిల్ప కళకు సంబంధించినవి. ఇవన్నీ మత ప్రసక్తి లేని దైనందిన జీవితానికి సంబంధించిన విషయాలతో ఉన్న గ్రంథాలు.


ఇతిహాసాలు: వాల్మీకి మహర్షి రాసిన శ్రీ మద్రామాయణం, వ్యాసుడు రచించిన మహాభారతం ఇతిహాసాలు. ఆర్య సంస్కృతి దక్షిణాదికి వ్యాపించిన విధానాన్ని ‘శ్రీ మద్రామాయణం’, ఉత్తర దేశ సార్వభౌమాధికారం కోసం ఆర్య గణాలు తమలో తాము జరిపిన పోరాటాలను ‘మహాభారతం’ తెలియజేస్తాయి. 

క్రీ.పూ. 1500-600 మధ్య కాలానికి సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణం కోసం ప్రత్యేకంగా గ్రంథాలు లేవు. దాంతో నాటి ఉత్తర భారతంలో ఆర్యుల జీవన విధానాన్ని, సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి వేద సాహిత్యమే ఆధారంగా నిలిచింది.



 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 

Posted Date : 03-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌