• facebook
  • whatsapp
  • telegram

శాసనోల్లంఘన ఉద్యమం

 స్వరాజ్య సాధనలో శాసన ధిక్కారం!

 

  పౌర హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమం సత్యాగ్రహం రూపంలో తెలిపే శాంతియుత నిరసనల శక్తిని లోకానికి చాటింది. స్వరాజ్య సాధన లక్ష్యంగా బ్రిటిష్‌ శాసనాలను ధిక్కరించి ఉజ్జ్వల సమరంగా సాగింది.  ఆ సమయంలో సంపూర్ణ స్వాతంత్య్రమే అంతిమ ధ్యేయమని నెహ్రూ వంటి నాయకులు ఇచ్చిన పిలుపు భారతీయులను చైతన్యవంతం చేసింది. ఉప్పు తయారీపై తెల్లవారి గుత్తాధిపత్యాన్ని ఎదిరిస్తూ దండి దారిపట్టిన మహాత్ముడికి జనం అపూర్వ నీరాజనాలు పలికారు. ఫలితంగా కాంగ్రెస్‌ డిమాండ్లకు ఆంగ్లేయులు తలొగ్గాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 

 

  ఇరవయ్యో శతాబ్దం రెండో దశకం చివరి సంవత్సరాలు స్వాతంత్రోద్యమ చరిత్రలో గొప్ప మైలురాళ్లు. సైమన్‌ కమిషన్‌ భారతదేశ పర్యటనను భారతీయులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ కమిషన్‌ తన పని తాను చేసుకొని ఇంగ్లండ్‌ వెళ్లిపోయింది. కానీ సైమన్‌ బహిష్కరణ ఉద్యమం రూపంలో బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ పరిపాలనను భారతజాతి తిరస్కరించింది. స్వయంపాలిత రాజ్యాంగం కావాలనే ఆకాంక్షను ముక్తకంఠంతో వ్యక్తం చేసింది. అంతకు ముందే భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ బిర్కెన్‌హెడ్‌ ‘‘వివిధ జాతులు, మతాలు ఉన్న భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా?’’ అని భారతీయులకు సవాలు విసిరాడు. ఆ విధంగా ఎవరైనా రూపొందిస్తే తాను ఆమోదింపజేస్తానని ప్రకటించాడు.

 

నెహ్రూ నివేదిక - 1928: బిర్కెన్‌హెడ్‌ విసిరిన సవాలును భారత జాతీయ నాయకులు స్వీకరించారు. ముఖ్య రాజకీయ పార్టీలు, నాయకులు కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించాలనుకున్నారు. ఇందుకోసం దిల్లీ, పుణెలలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. మోతీలాల్‌ అధ్యక్షతన ఒక ఉపసంఘం ఏర్పాటైంది. ఛైర్మన్‌గా మోతీలాల్‌ నెహ్రూ, ముఖ్య సభ్యులుగా సర్‌ అలీ ఇమామ్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు. కొంతకాలానికి ఎంఆర్‌ జయకర్, అనీబిసెంట్‌ ఈ కమిటీలో చేరారు. మోతీలాల్‌ కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కమిటీ తయారుచేసిన నివేదికనే నెహ్రూ నివేదిక అంటారు. దీన్ని చట్టపరమైన శైలిలో రాశారు. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్‌ స్టేటస్‌) నిర్ద్వంద్వంగా ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి, కార్యనిర్వాహక మండలి శాసనసభలకు బాధ్యత వహించడం, వయోజన ఓటింగ్‌ వంటివి ఉన్నాయి. పౌరుల ప్రాథమిక హక్కుల ప్రాధాన్యాన్ని గుర్తించిన కమిటీ నివేదికలో ఆ అంశాన్ని పొందుపరిచింది.

 

ముస్లిం లీగ్‌ అభ్యంతరాలు: కలకత్తాలో 1928, డిసెంబరులో జరిగిన అఖిలపక్ష సమావేశం నెహ్రూ నివేదికను ఆమోదించలేదు. మహమ్మద్‌ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లింలీగ్‌ 14 డిమాండ్లను ప్రతిపాదించింది. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు, కేంద్ర శాసనసభలో మూడో వంతు స్థానాలు, బెంగాల్, పంజాబ్‌ రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన  సీట్ల కేటాయింపు వంటివి ముస్లింలీగ్‌ డిమాండ్లు. ఫలితంగా అఖిలపక్ష సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.

 

  అనంతరం 1928లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో అధినివేశ ప్రతిపత్తి ఇవ్వకపోతే సంపూర్ణ స్వరాజ్యం స్థాపిస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నాటి సమావేశంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌లు సైతం అధినివేశ ప్రతిపత్తిని వ్యతిరేకించారు. అయితే గాంధీజీ వారిని సమన్వయపరిచారు. ఒక ఏడాదిలోగా బ్రిటిష్‌ ప్రభుత్వం అధినివేశ ప్రతిపత్తి ఇవ్వకపోతే సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటాన్ని, దాని సాధనకు శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించారు.

 

  ఇదే సమయంలో దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. 1929లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంక్షోభాన్ని సృష్టించింది. రైతులు, కార్మికుల్లో అశాంతి తలెత్తి బ్రిటిషర్లపై తీవ్ర అసంతృప్తికి దారితీసింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిర్వహించిన బార్డోలీ సత్యాగ్రహం రైతులను సంఘటితం చేసింది. విప్లవవాదులైన భగత్‌సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్‌ల కార్యక్రమాలు, సాండర్స్‌ హత్య, సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీపై బాంబు దాడి మొదలైనవి భారతీయుల్లో ధైర్యాన్ని పెంచాయి. దేశసేవలో నిమగ్నత, త్యాగబుద్ధి, కర్తవ్యం వంటి సుగుణాలను విప్లవవాదులు భారతీయుల్లో పెంచి, భారత స్వాతంత్య్రోద్యమాన్ని చైతన్యం చేశారు. సహాయ నిరాకరణోద్యమం తర్వాత గాంధీజీ చేపట్టిన కార్యక్రమాలైన అస్పృశ్యతా నివారణ, మహిళాభ్యుదయ పద్ధతులు, మద్యపాన నిషేధం, కుష్ఠు నివారణ వంటివి గాంధీ నాయకత్వం పట్ల నమ్మకాన్ని పెంచాయి.

 

లాహోర్‌ కాంగ్రెస్‌ (1929) - పూర్ణ స్వరాజ్‌ తీర్మానం:  లాహోర్‌లో 1929, డిసెంబరులో రావి నది ఒడ్డున పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశం నూతన, సమరశీల రాజకీయ చైతన్యానికి, నిర్ణయాలకు కేంద్రమైంది. సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ ధ్యేయమని, దాన్ని సాధించడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధపడాలని నెహ్రూ ఇచ్చిన పిలుపు భారతీయులను ఉత్తేజపరిచింది. 1929, డిసెంబరు 31న లాహోర్‌ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని అధ్యక్ష స్థానంలో ఉన్న నెహ్రూ ఆవిష్కరించారు. 1930, జనవరి 26న సంపూర్ణ సాతంత్య్ర దినంగా సంబరాలు జరపాలని నిర్ణయించారు. పూర్ణ స్వరాజ్య లక్ష్యాన్ని సాధించడానికి కాంగ్రెస్‌వాదులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేయాలని, వచ్చే ఎన్నికల్లో పాల్గొనరాదని తీర్మానించారు. స్వాతంత్య్ర సాధనకు ఉద్యమం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించాలనే విషయాల్లో కాంగ్రెస్‌ గాంధీజీకి పూర్తి స్వేచ్ఛ, అధికారం ఇచ్చింది. అయితే గాంధీజీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇవ్వాలనుకున్నారు. 11 డిమాండ్లతో కూడిన పత్రాన్ని నాటి భారత గవర్నర్‌ జనరల్‌ (వైస్రాయ్‌) ఇర్విన్‌కు సమర్పించారు. వాటిని అంగీకరిస్తే శాసనోల్లంఘన ఉద్యమాన్ని వాయిదా వేస్తానని ప్రకటించారు.

  * గాంధీ డిమాండ్లలో మద్యపాన నిషేధం, రూపాయికి పూర్వపు మారకపు రేటు ఇవ్వడం, భూమి శిస్తు తగ్గింపు, సైనిక వ్యయం తగ్గింపు, సివిల్‌ ఉద్యోగుల వేతనాల తగ్గింపు, ఉప్పుపై పన్ను రద్దు, విదేశీ వస్త్రాలపై పన్ను విధించడం, రాజకీయ ఖైదీల విడుదల, సీఐడీ శాఖ రద్దు వంటివి ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లను లార్డ్‌ ఇర్విన్‌ తిరస్కరించారు. దీంతో శాసనోల్లంఘన ఉద్యమం అనివార్యమైంది. గాంధీజీ ప్రజలతో ‘‘ప్రభుత్వం ఎలాంటి హింసాయుత విధానం అనుసరించినా హింసకు ప్రతి హింస చెయ్యను’’ అని ప్రతిజ్ఞ చేయించారు. శాసనోల్లంఘన ప్రారంభ కార్యక్రమంపై పలువురు నాయకులు పలు విధాలుగా చెప్పినప్పటికీ, గాంధీజీ తన అంతర్వాణి ప్రకారం ఉప్పుపై పన్ను నిరాకరణతో ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు.

 

శాసనోల్లంఘన ప్రారంభం (1930): ఉప్పు భారతీయులందరికీ నిత్యావసర ఆహార పదార్థం. అయితే ఉప్పు తయారీపై ప్రభుత్వానికే గుత్తాధిపత్యం ఉండేది. పౌరులెవరూ దీన్ని తయారు చేయకూడదు. దానిపై పన్ను కూడా ఉంది. దీన్ని భారతీయులందరూ తప్పనిసరిగా వినియోగించడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాలని నిర్ణయించిన తర్వాత తగిన మార్గనిర్ణయం చేయమంటూ గుజరాత్‌ భౌగోళిక పరిస్థితులు బాగా తెలిసిన సర్దార్‌ పటేల్‌ను గాంధీజీ కోరారు. 1930, మార్చి 12న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో బయలుదేరారు. గాంధీజీకి ఆయన సతీమణి కస్తూర్బా తిలకం దిద్ది, స్వయంగా వడికిన నూలు దండ వేశారు. ప్రార్థనా గీతం తర్వాత యాత్ర ప్రారంభమైంది. దారిపొడవునా స్వాగతాలు హోరెత్తాయి. సత్యాగ్రహులు రోజూ నిర్దేశించిన మైళ్లు నడవాలి, నిత్యం రాట్నం వడకాలి, ప్రార్థన చేయాలి, డైరీ రాయాలి, స్వయం వంట, సాధారణ భోజనం వంటి మార్గనిర్దేశాలు ఉన్నాయి. ఈ మహత్తర యాత్రను, గాంధీని ప్రత్యక్షంగా చూసేందుకు దారి పొడవునా జనం బారులు తీరేవారు. మహా నాయకుడిగా గాంధీజీ ముందు నడుస్తుంటే సత్యాగ్రహులు ఆయన్ను అనుసరించేవారు. దారిలో గ్రామం వస్తే చిన్న సభ జరిగేది. గాంధీ ప్రసంగించేవారు. ఈ యాత్ర అంతా అద్భుత దృశ్యం. నిర్ణయించిన విధంగా యాత్ర గుజరాత్‌ తీరంలో ఉన్న ‘దండి’ గ్రామం చేరింది. 1930, ఏప్రిల్‌ 6న ఉప్పు తయారు చేయడంతో ఒక మహా ప్రజా ఉద్యమానికి (శాసనోల్లంఘన ఉద్యమం) తెరలేచింది.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 31-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌