• facebook
  • whatsapp
  • telegram

గుప్తులకాలం నాటి పరిస్థితులు

సామాజిక పరిస్థితులు

* ఫాహియాన్‌ రచనలు, స్మృతి గ్రంథాలు, కాళిదాసు నాటకాలు - కావ్యాలు, అప్పటి నాణేలు, శిల్పకళ, చిత్రలేఖనం గుప్తుల కాలంనాటి సామాజిక పరిస్థితులను తెలుపుతున్నాయి.

* చైనా యాత్రికుడు ఫాహియాన్‌ రెండో చంద్రగుప్తుడి ఆస్థానాన్ని సందర్శించి, అప్పటి పరిస్థితులను తన రచనల్లో వివరించాడు. వీటి ప్రకారం ఎక్కువ మంది పట్టణాల్లో నివసించేవారు, ప్రజల్లో అధికులు శాకాహారులు, మద్యం సేవించేవారు కాదు. ధర్మ, వైద్యశాలలు ఉండేవి.

* గుప్తులకాలంలో సమాజంలో వర్ణవ్యవస్థ ఉండేది. కులవ్యవస్థను కఠినంగా అమలు చేశారు. రాజు కులవ్యవస్థకు భంగం కలగకుండా చూసుకునేవాడు. 

కుల వ్యవస్థను కాపాడేందుకు రాష్ట్రస్థాయిలో ‘అభియదత్త’ అనే ఉద్యోగి ఉండేవాడు. 

* బ్రాహ్మణులకు సమాజంలో మంచి గౌరవం ఉండేది. వీరు వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారు.

  * సమాజంలో వివిధ వృత్తులు ఉండేవి. వైశ్యులు వ్యాపారం చేసేవారు. శూద్రులు అన్ని రకాల పనులను నిర్వర్తించేవారు. అంటరానివారిని హీనంగా చూసేవారు. బానిస వ్యవస్థ, వెట్టిచాకిరి ఉండేవి.

కుటుంబానికి తండ్రి పెద్దగా వ్యవహరించేవాడు. వివాహ వ్యవస్థ అమల్లో ఉంది. 

* యుక్త వయసు కంటే ముందే స్త్రీలకు వివాహం చేసేవారు. బహుభార్యత్వం, సతీసహగమనం ఉండేవి. క్రీ.శ. 510 నాటి ‘ఎరాన్‌’ శాసనంలో ఈ విషయాలు ఉన్నాయి. 

* దేవదాసీలు, నర్తకీమణులకు సంఘంలో మంచి ఆదరణ ఉండేది. ఉన్నత కులాల్లోని స్త్రీలకు మాత్రమే విద్యావకాశాలుండేవి. 

ఉజ్జయినిలోని మహంకాళీ ఆలయంలో దేవదాసీలు ఉన్నట్లు కాళిదాసు రచనల ద్వారా తెలుస్తోంది. 

ఆస్తిహక్కు వంశపారంపర్యంగా ఉండేది. ప్రజలు కర్మసిద్ధాంతాన్ని పాటించేవారు. బ్రాహ్మణులకు వేదాలు, మంత్రాల్లో ప్రవేశం ఉంది. వీరికి అగ్రహారాలుండేవి. భూములు, గోవులను దానంగా స్వీకరించేవారు. 

* ‘‘ప్రజలు నీతిమంతులు, అహింసా విధానం పాటించేవారు, దొంగతనాలులేవని’’ ఫాహియాన్‌ తన రచనల్లో రాశాడు. 

చదరంగం, వేట, కోడి - పొట్టేళ్ల పందేలు, పాచికలాట, సంగీతం, నృత్యం ప్రధాన వినోదాలు.

సమాజంలో శైవ, వైష్ణవ శాఖలుండేవి. ప్రజలు విష్ణువు, శివుడు, కార్తికేయుడు, గణపతి, లక్ష్మీ, పార్వతి, దుర్గ, భవానీ మొదలైనవారిని పూజించేవారు.


ఆర్థిక పరిస్థితులు 

* గుప్తులకాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రజలు పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందారు.

* గుప్త రాజులు నదులకు ఆనకట్టలు కట్టి, చెరువులు తవ్వించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. బంజరు భూములకు సాగునీరు అందించారు.

మౌర్యుల కాలంలో సౌరాష్ట్రలోని గిర్నార్‌ దగ్గర నిర్మించిన సుదర్శన తటాకాన్ని స్కందగుప్తుడు మరింత అభివృద్ధి చేశాడు.

* బావులు, చెరువుల నుంచి ‘పారశీక నీటి చక్రం’ (Persian Wheel) ద్వారా నీటిని పొలాలకు మళ్లించేవారు. 

ప్రజలు ఎక్కువగా దానధర్మాలు చేసేవారని ఫాహియాన్‌ పేర్కొన్నాడు. 

బ్రాహ్మణులకు, ప్రభుత్వ ఉద్యోగులకు భూములను విరివిగా దానం చేసేవారు. ఇది భూస్వామ్య వ్యవస్థకు కారణమైంది. భూస్వాములు ప్రజలపై అధికారం చెలాయించేవారు. 

* వరి, గోధుమ, అల్లం, కూరగాయ పంటలు పండించేవారు.

* నూలు, పట్టువస్త్రాల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. వీటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. రాగి, ఇనుము, కంచు మొదలైన లోహాలతో వివిధ రకాలైన పరికరాలను తయారుచేసేవారు. 

రెండో చంద్రగుప్తుడు ఢిల్లీ సమీపంలోని ‘మెహరౌలి’ వద్ద ఇనుప స్తూపాన్ని నిర్మించాడు. ఇది నేటికీ తుప్పు పట్టలేదు. ఇది ఆనాటి శాస్త్ర సాంకేతికతకి నిదర్శనం.

* వృత్తి పనివారు సంఘాలు (శ్రేణులు)గా ఏర్పడి, అనేక కుటీర పరిశ్రమలను స్థాపించారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు శిక్షణా కేంద్రాలు ఉండేవి. ఈ సంఘాలు ఆ కాలంలో బ్యాంకులుగా పనిచేశాయి. వీటిని ‘నిగమాలు’ అనేవారు. కొన్ని నిగమాలు కలసి ఒక బృహత్‌ సంఘంగా ఏర్పడ్డాయి. శ్రేణులు తమ లాభాల్లో కొంత భాగాన్ని ప్రజోపయోగ కార్యకలాపాలకు వెచ్చించేవారు. శ్రేణి పెద్దను శ్రేష్ఠి అనేవారు.

*ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. రైతులు తమ పంటలో 1/6 వంతు భాగాన్ని  భూమిశిస్తుగా చెలించేవారు. ఇవి ధన, ధాన్యరూపంలో ఉండేవి.

ఎగుమతి, దిగుమతి సుంకాలు, వర్తక సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. 

* అడవులు, గనులు, నాణేల ముద్రణ ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. 

‘‘ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆదాయం సమకూరేది. దీన్ని రాజు పరిమితంగా ఖర్చు చేసేవాడు. ఇదే గుప్తుల అభివృద్ధి సాధనకు కారణం’’ అని కామందకుడు తన ‘నీతిసారం’లో పేర్కొన్నాడు.


వర్తక-వాణిజ్యం 

* గుప్తులకాలంలో స్వదేశీ, విదేశీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. వీరు ‘రోమ్‌’ దేశంతో ఎక్కువగా వ్యాపార సంబంధాలు సాగించారు. ముఖ్యంగా సిల్కు, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేవారు.

* గంగా, యమున, నర్మదా నదుల ద్వారా నౌకాయానం బాగా అభివృద్ధి చెందింది. 

* ఆగ్నేయాసియా దేశాలతో ‘తామ్రలిప్తి’ (బెంగాల్‌) ఓడరేవు ద్వారా వ్యాపారం జరిగింది.

చేతివృత్తులు, వృత్తిసంఘాలు పట్టణ కేంద్రాల్లో ముఖ్యపాత్ర వహించాయి. 

* పశ్చిమాన ‘బరుకచ్చ’, తూర్పున ‘తామ్రలిప్తి’ ఓడరేవులు వర్తకంలో ప్రధానపాత్ర పోషించాయి. 

* రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, నీలిమందు, ఔషధాలు, దంతపు వస్తువులు ఎగుమతి చేసేవారు. బంగారం, వెండి, రాగి, మేలుజాతి అశ్వాలను దిగుమతి చేసుకునేవారు. 

దేశంలోని పెద్ద నగరాలన్నింటినీ రహదారులతో అనుసంధానం చేశారు. ఇది వాణిజ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. 

* బౌద్ధారామాలు, సంఘాలు వ్యాపారులకు ఆవాసాలుగా ఉండేవి. 

* ఉజ్జయిని, కాశీ, ప్రయాగ, మధుర, వైశాలి, గయ అప్పటి ప్రముఖ వర్తక కేంద్రాలు.

* బౌద్ధ సంఘాల పెద్దలు వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వీరు వర్తకులకు వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. అప్పుపై వడ్డీ సంవత్సరానికి 20% ఉండేది. 

* గుప్తులు భారతదేశంలో అధిక సంఖ్యలో బంగారు నాణేలు చలామణిలోకి తెచ్చారు. బంగారం, రాగి, వెండి, నాణేలు ముద్రించారు. ఇవి మారకంగా ఉపయోగపడ్డాయి. 

* గుప్తులకాలం నాటి బంగారు నాణేలను ‘రూపక’ అంటారు. పశ్చిమ ప్రాంతంలో వెండి నాణేలు, తూర్పు ప్రాంతంలో బంగారు నాణేలు లభించాయి.

* ఒక బంగారు నాణెం విలువ 15 వెండి నాణేలకు సమానం. ఫాహియాన్‌ ప్రకారం ‘కౌరీలు’ (గవ్వలు) కూడా మారకపు ద్రవ్యంగా ఉండేవి. 


మతపరిస్థితులు 

* గుప్తుల కాలంలో బౌద్ధమతం క్షీణదశకు చేరుకుని, బ్రాహ్మణ మతం ఆధిక్యం పొందింది. ఇది హిందూమత పునరుద్ధరణకు కారణమైంది.

* భక్తిమార్గానికి గుప్తుల కాలంలో ప్రాధాన్యం పెరిగింది. విగ్రహారాధనకు ప్రాధాన్యం ఉండేది. భాగవత మతం విస్తృత ప్రచారం పొందింది.

* రాజులు, ప్రజలు యజ్ఞయాగాదులు నిర్వహించారు. సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు అశ్వమేధయాగాలు చేశారు. 

* విష్ణుమూర్తి దశావతారాలు, రామాయణ, మహాభారతాలు ప్రాధాన్యం పొందాయి. భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథం అయ్యింది. 

* గుప్తులు అనేక దేవాలయాలను నిర్మించారు. పురాణ పఠనం, పుణ్యక్షేత్రాల దర్శనం, దానధర్మాలు చేయడం లాంటివాటిని పుణ్యకార్యాలుగా భావించారు. 

* రాజులే కాదు, సామాన్యులు కూడా ధనం సేకరించి దేవాలయాలు నిర్మించారు. 

* విదేశీయులు కూడా వైష్ణవ మతాన్ని స్వీకరించారు. శకులు, యవనులు, కుషాణులు వీరిలో ముఖ్యులు. 

* గుప్తులకాలంలో బుద్ధుడ్ని దశావతారాల్లో ఒకడిగా భావించారు. దీంతో బౌద్ధమతం ఆదరణ కోల్పోయింది.


శైవ-పాశుపతం 

* గుప్తులకాలంలో ప్రజలు శైవమతాన్నీ ఎక్కువగా ఆచరించారు. ఈ మతంలోని పాశుపతశాఖ ఎక్కువ ప్రజాదరణ పొందింది. 

* క్రీ.శ.38081 నాటి మధుర శాసనంలో ‘లకులీస పాశుపతం’ గురించి ఉంది. 

* మొదటి కుమారగుప్తుడి శాసనంలో అయోగ్య బ్రాహ్మణులు క్రతువులు, మతసాహిత్యంలో నిష్ణాతులు అని ఉంది. ఈ శాసనం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కరీమదండలో లభించింది. 

* ఆ కాలంలో సూర్యుడ్ని కూడా ఎక్కువ మంది ఆరాధించేవారు. వారి మత గురువులను ‘మాఘలు’ అనేవారు.


షడ్‌దర్శనాలు 

భారత తత్వశాస్త్ర ముఖ్య లక్షణాలుగా షడ్‌దర్శనాలను పేర్కొంటారు. అవి: న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత. ఇవి గుప్తుల కాలంలో ఉండేవి.

పురాణాలు, ధర్మశాస్త్రాలు రాయడంలో, సాంఘిక చట్టాలను పవిత్రంగా చేయడంలో ఇవి సహకరించాయి.

* గుప్తుల కాలంలోనే హిందూ మత పునరుద్ధరణ జరిగింది. యజ్ఞాలు, కర్మకాండల నిర్వహణ ఎక్కువైంది. 

దేవతలకు రూపాలిచ్చి విగ్రహాలను ప్రతిష్ఠించడం ఈ కాలంలోనే ప్రారంభమైంది.


బౌద్ధ - జైన మతం

* గుప్త పాలకులు వైదికమతాన్ని ఆచరించినప్పటికీ జైన, బౌద్ధ మతాల పట్ల సహనభావం ప్రదర్శించారు. 

* హిందువులు, బౌద్ధులు పరస్పర మైత్రితో జీవించారని ఫాహియాన్‌ తన రచనల్లో పేర్కొన్నాడు.

* గుప్త పాలకులు బౌద్ధులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదరించారు. ఉదాహరణకు సముద్రగుప్తుడు వసుబంధుడ్ని (అభిధర్మకోశ గ్రంథకర్త, విజ్ఞానవాద స్థాపకుడు) ఆదరించగా, రెండో  చంద్రగుప్తుడు తన సేనానిగా అమరకదేవుడ్ని నియమించాడు. 

* కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇది క్రీ.శ. 5వ శతాబ్దిలో బౌద్ధ అధ్యయన కేంద్రంగా ఆవిర్భవించింది. వల్లభి విశ్వవిద్యాలయం కూడా ఈ కోవకు చెందిందే. 

నలంద, సారనాథ్, మధుర, పాటలీపుత్రం మొదలైన ప్రాంతాల్లో గుప్తులకాలంలో కొన్ని జైన, బౌద్ధ విగ్రహాలను ప్రతిష్ఠించారు. 

* కపిలవస్తు, కుశినగరం, గయలో బౌద్ధమతం క్షీణదశలో ఉన్నట్లు ఫాహియాన్‌ రాశాడు. 

క్రీ.శ.453లో వల్లభిలో జైనమత పెద్దలు సమావేశమై జైన గ్రంథాలను క్రోడీకరించారు. మధుర, వల్లభి శ్వేతాంబర శాఖకు కేంద్రంగా ఉండేవి.


భాగవత తత్వం

* మౌర్యుల తర్వాతి కాలంలో భాగవత మతం ఆవిర్భవించింది. వీరికి విష్ణువు ప్రధాన ఆరాధ్య దైవం. ఇతడి రూపాలే నారాయణుడు, వాసుదేవుడు. తర్వాతి కాలంలో ఈ ముగ్గురూ కలసి భాగవత మత తత్వం ఆవిర్భవించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. 

* భక్తి, అహింస ఈ మతంలో ప్రధాన అంశాలు. 

* భగవద్గీత, విష్ణుపురాణం, విష్ణుస్మృతి భాగవత తత్వాన్ని చర్చించాయి. 

* సామాజిక వ్వవస్థకు హాని జరిగితే విష్ణువు తగిన రూపంలో అవతరించి, ధర్మాన్ని రక్షిస్తాడని సామాన్య ప్రజలు నమ్మారు. 

*క్రీ.శ.6 వ శతాబ్ది నాటికి విష్ణువును  త్రిమూర్తుల్లో ఒకరుగా ఆరాధించారు. 

* ఈ శాఖలోనూ విగ్రహారాధన, దేవాలయ నిర్మాణం, భక్తిభావం, పండుగలు జరుపుకోవడం లాంటివి ఉండేవి.

* భాగవతం వల్ల మహాయాన బౌద్ధమత శాఖకు ఆదరణ తగ్గింది. 

Posted Date : 28-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌