• facebook
  • whatsapp
  • telegram

సంస్కృతి

     చరిత్ర అంటే రాజకీయ చరిత్రే కాదు.. సామాజిక, సాంస్కృతిక చరిత్ర కూడా ప్రధానం. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1, 2, 3; ఇతర పరీక్షల సిలబస్‌లో సామాజిక సాంస్కృతిక చరిత్రకు పెద్దపీట వేసింది. గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్ పేపర్‌లో ప్రకటించిన సిలబస్‌లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేరుగా రాజకీయ చరిత్రను ఎక్కడా పేర్కొనలేదు. గ్రూప్-1లో భారతదేశానికి సంబంధించి 'భారతదేశ చరిత్ర-సాంస్కృతిక వికాసం' అని, తెలంగాణకు సంబంధించి 'తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, కళలు, సాహిత్యం' అని పేర్కొన్నారు. అయితే రాజకీయ చరిత్ర నుంచి కూడా ప్రశ్నలు వస్తాయనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
     ''సమ్యక్ కృతి సంస్కృతి.. అంటే 'చక్కగా తీర్చిదిద్దినదీ' అని అర్థం. సంస్కృతి అంటే 'సంస్కరించి నది' ఈ సంస్కరించడమనేది నాగరకత పరంగా కావచ్చు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టూబొట్టు, కళలు, సాహిత్యం.. ఇలా ఒక జాతి ప్రజల జీవన విధానమే సంస్కృతి.''
     ఒక జాతి / దేశం / ప్రజలు హీన స్థితి నుంచి మహోన్నత స్థితికి చేరడానికి చేసే ప్రయత్నమే సంస్కృతి. అంటే నాగరకత పరంగా ఆదిమ దశ నుంచి ఉన్నత స్థితికి.. సంచార స్థితి నుంచి స్థిర జీవితం గడిపే దశకు.. అవ్యవస్థీకృతమైన పాలన (ఉదా: తెగలు) నుంచి సువ్యవస్థీకృతమైన ప్రజాస్వామ్య పాలన దిశగా పయనించడానికి జరిగిన ప్రయత్నాలు.. ఈ పరిణామాలను క్రమానుగతంగా అధ్యయనం చేయడమే సంస్కృతి చరిత్ర.

 

చరిత్ర - సంస్కృతి
చరిత్ర, సంస్కృతి అనే మాటలను అనేక సందర్భాల్లో ఒకే పదబంధంగా ప్రయోగిస్తున్నారు. ఈ రెండింటికీ నిర్దిష్ట వ్యత్యాసం ఉంది. చరిత్ర కేవలం రాజకీయ చరిత్రకు (పాలకులకు) ప్రాధాన్యమివ్వగా.. సంస్కృతి ప్రజల (పాలితులు) చరిత్రను విశదీకరిస్తుంది. ప్రజల సమగ్ర విధానాన్ని చిత్రించేదే సంస్కృతి.
     20వ శతాబ్దం వరకు చరిత్రను రాజకీయ చరిత్రగానే భావించారు. ఎప్పుడైతే గతి తార్కిక భౌతికవాద దృక్పథంతో చరిత్రను అధ్యయనం చేయడం ప్రారంభమైందో.. అప్పటి నుంచి సామాజిక చరిత్రకు, సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యం పెరిగింది. మహాకవి గురజాడ అప్పారావు 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అన్నారు. మహాకవి శ్రీశ్రీ రచించిన 'దేశ చరిత్రలు' అనే ఖండిక చరిత్రకు కొత్త భాష్యం చెప్పింది.
     'తారీఖులు, దస్తావేజులు, ఏ యుద్ధం ఎందుకు జరిగింది? ఆ ముట్టడికి అయిన ఖర్చు.. ఇవి కావోయ్ చరిత్రకు అర్థం. నైలునదీ నాగరకతలో సామాన్యుని జీవితమెట్టిది? ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు.. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసిన బోయిలెవ్వరు?' అంటూ మహాప్రస్థానం ద్వారా చరిత్ర అధ్యయన గతిని మలుపు తిప్పారు శ్రీశ్రీ.

     భారతదేశంలో ప్రఖ్యాత చరిత్రకారులు రొమిలా థాపర్, ఎ.ఎల్.భాషమ్, డి.డి.కోశాంబి కృషి ఫలితంగా ప్రజల సామాజిక, సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి గతి తార్కిక భౌతిక దృష్టి, దృక్ఫథం తోడయ్యాయి. నాటి సమకాలీన సాహిత్యాన్ని కూడా ఈ ధోరణి ప్రభావితం చేసింది. తెలుగునాట అభ్యుదయ కవిత్వానికి ఇది ఆలంబనగా నిలిచింది.తెలంగాణ ప్రాంతం నుంచి మొదటి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందిన రచన కూడా ప్రజల చరిత్రే. తెలంగాణ భాష, సాంస్కృతిక ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించిన సురవరం ప్రతాపరెడ్డి రచించిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' అనే గ్రంథానికి ఈ పురస్కారం దక్కింది. తెలుగులో మరో ప్రముఖ సాంస్కృతిక చరిత్ర గ్రంథం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి'. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేశారు.
 

భారతీయ సంస్కృతి ప్రాతిపదిక
     సంస్కృతి రూపొందడంలో ప్రధానంగా రెండు విభిన్నమైన సిద్ధాంతాలున్నాయి. ఒకటి ఆదర్శవాద సిద్ధాంతం, మరొకటి భౌతికవాద సిద్ధాంతం.

 

ఆదర్శవాద సిద్ధాంతం
     వేద కాలంలో రుషులు దైవ ప్రేరణ / అతీంద్రియ శక్తుల వల్ల ఏర్పరచుకున్న భావాలు కాలక్రమేణా ఆర్యుల సంస్కృతికి బీజాలు వేశాయి. వీరు ఈ ఆదర్శాన్ని సింధు, గంగా నది పరిసరాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆచరించారు. వీటి మూలంగా ఏర్పడిన భావాలు, సంస్థలు వేద సంస్కృతికి ప్రధానమైన భావాలు, సంస్కృతులుగా పరిణమించాయి.

 

భౌతికవాద సిద్ధాంతం
     ఒక సంస్కృతి ప్రారంభమవడానికి భౌతిక పరిసరాలే మౌలికమైన అవసరాలు / అంశాలు. ఆదిమ దశలో పరిసర వాతావరణం, భౌతిక వనరులు, ప్రజలు ఉపయోగించిన ఉత్పాదక సాధనాలు మానవ సమష్టి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. తద్వారా జీవితానుభవాల్లో తారసిల్లిన సిద్ధాంతాలకు, విశ్వాసాలకు స్థానం ఏర్పడి క్రమంగా నూతన సిద్ధాంతాలుగా, ప్రధానమైన భావాలుగా రూపుదిద్దుకున్నాయి.

     చారిత్రక, పురావస్తు శాస్త్ర అధ్యయనం ప్రకారం.. భౌతిక పరిసరాలు, ఆది భౌతిక సిద్ధాంతాల సమన్వయ ఫలితంగానే 'సంస్కృతి' పరిణామం చెందింది. ఈ రెండు సిద్ధాంతాల్లోనూ సంస్కృతి పరిణామ దశలో భౌతిక పరిసరాలు ప్రముఖ పాత్రను పోషించాయి. ప్రఖ్యాత చరిత్రకారుడు ఎస్.ఆబిద్‌హుస్సేన్ అభిభాషణ ప్రకారం.. భావాలు, సిద్ధాంతాలు, నమ్మకాల కంటే భౌతిక పరిసరాలు, సామాజిక పరిస్థితులే సంస్కృతి పరిణామానికి ప్రధానంగా దోహదం చేశాయి. అయితే ఈ భావాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే సంబంధించినవి కావు. వాటికి వర్ణం, జాతి, భౌగోళిక ఎల్లలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఇవి స్థాపితమయ్యాయి. సంస్కృతి అనేది ఒక ప్రత్యేక ప్రాంతంలోన ేరూపుదిద్దుకుంటుంది. ప్రతి దేశంలోనూ విభిన్నమైన భావాలు, నమ్మకాలు ఉన్నప్పటికీ.. ఆయా దేశాల భౌగోళిక, సామాజిక పరిస్థితులపై అక్కడి సంస్కృతి ఆధారపడి ఉంటుంది. ఒక దేశ ప్రత్యేక సంస్కృతిలో అక్కడి భౌగోళికాంశాలు ప్రధానమైనవిగా ఉంటాయి. ఇవి భౌతిక రూపాలను ఏర్పరచడమే కాకుండా మానసిక వాతావరణం ఏర్పడేందుకు కూడా దోహదం చేస్తాయి. విభిన్న మతాలు, తాత్విక దృక్పథాలు ఉన్నప్పటికీ ఆ వాతావరణం ప్రజల మధ్య సమాన దృష్టిని, సమాన దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఈ జాతీయ మనస్తత్వం, మేధోసంపత్తే 'జాతీయ సంస్కృతి'కి ఆయువుపట్టు. ఈ భిన్న సంస్కృతులను జాతీయ సంస్కృతిలో భాగంగా మనం గ్రహించాలి. ప్రజలు తాము ఏ సమాజానికి చెందినా ఈ సమ్మిళిత, సమ్మిశ్రిత సంస్కృతిని తమదిగా భావించుకోవాలి. అప్పుడే 'జాతీయ సంస్కృతి' రూపొందుతుంది.
     భారతీయ సంస్కృతి ఆవిర్భవించడానికి ప్రధాన కారణాలు భారత ప్రజల మేధోసంపత్తి, వివిధ ఉద్యమాల వైజ్ఞానిక ప్రభావం, వివిధ సంస్కృతుల సమ్మేళనం. చారిత్రక పూర్వయుగంలో భారతదేశంతో ఏర్పడిన తాత్కాలిక సంబంధ బాంధవ్యాల వల్ల విదేశీయులు ఇక్కడికి వచ్చి భారత్‌ను తమ దేశంగా భావించారు. అనంతరం విప్లవాత్మక, వైజ్ఞానిక ఉద్యమాలు కాలానుగుణంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ సంస్కృతి ఏర్పడింది.
* శకులు, ఇండో గ్రీకులు తదితరుల రాక వల్ల ఒక విశిష్టమైన సంస్కృతి ఏర్పడింది.
* బౌద్ధులు, జైనుల వల్ల గాంధార శిల్పకళ, వాస్తు శైలి అభివృద్ధి చెందాయి.
     భౌతిక పరిస్థితులు, భౌతిక శక్తుల ప్రభావాలను పరిశీలిస్తే.. భారతదేశ ఆర్థిక విధానం వ్యవసాయ సంబంధమైందిగా అవతరించింది. ఈ భౌగోళిక పరిస్థితులు శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను ప్రోత్సహించాయి. యుద్ధం, దండయాత్రలు లాంటి విచ్ఛిన్నకర పరిస్థితులకు దారి తీయలేదు. ఈ చైతన్యమే భారతీయ సాంస్కృతిక చరిత్రలో ప్రతిబింబిస్తుంది.
     ప్రజల జీవన విధానాన్ని గమనిస్తే.. వివిధ ప్రాంతాల్లో వైవిధ్యం కనిపిస్తుంది. అలాగే విద్యావంతులైన భారతీయుల్లోనూ, భారతీయ నాగరకతలోనూ ఎన్నో సమాన లక్షణాలు కనిపిస్తాయి. అనాదిగా ఈ దేశం ఎన్నో విదేశీ దండయాత్రలకు గురైంది. ఎన్నో విధాల అనైక్యతలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ భారతీయుల్లోని ఏకత్వ, సమానత లక్షణాలు జాతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటిచెప్పాయి.

 

తాత్విక జీవన విధానం
     ప్రపంచం అంటే ఏమిటి?, రేపు - ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో సతమతమవుతున్న ప్రజల ఆలోచనల్లో ప్రేమ, భక్తి అంకురించాయి. ఇలాంటి ఆలోచనలు మత సంబంధమైనవే కానీ తాత్విక సంబంధమైనవి కావు. అందుకే మత సంబంధమైన ఆలోచనావిధానం భారతదేశ సాంస్కృతిక జీవన విధానంలో భాగమైంది. ఈ రకమైన ఆలోచనల్లోని ఔన్నత్యం, భిన్నత్వంలో ఏకత్వమనే భావనలను భారతీయ మేధోసంపత్తి విశిష్ట లక్షణాలుగా పేర్కొనవచ్చు. ఇక్కడి ప్రజల వ్యవసాయ జీవన విధానం, భౌగోళిక పరిస్థితులు దేశ రాజకీయ నిర్మాణాన్ని, దేశాభివృద్ధిని మలచడంలో ప్రముఖపాత్ర పోషించాయి. భౌతిక, సామాజిక పరిసరాల ప్రభావం కూడా ఒక అంశమే అయినప్పటికీ.. దేశ రాజకీయ నిర్మాణంలో 'సంస్కృతి' కీలక భూమిక వహించింది. ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ భారతీయ మనస్తత్వం ఏకత్వాన్ని సాధించింది. కొన్ని అంశాలు సంఘర్షణకు పురిగొల్పినా అవి సామరస్యతను సంతరింపజేసుకుని ఒక విశిష్టమైన, మహోన్నతమైన సంస్కృతికి పునాది వేశాయి.

 

సంస్కృతి నిర్మాణం
     భారతదేశంలో చారిత్రక యుగానికి పూర్వమే ప్రసిద్ధిగాంచిన హరప్పా సంస్కృతి - సింధు నాగరకత వెల్లివిరిశాయి. వైదిక యుగం ప్రారంభంతో సువిశాల జాతీయ సంస్కృతి ఏర్పడింది. దీనిపై కొంత కాలానికి తలెత్తిన నిరసన భావాల ఫలితమే బౌద్ధ, జైన సంస్కృతుల ఆవిర్భావం. తర్వాత ఎన్నో సంఘర్షణలను తట్టుకుని భారతదేశ సాంస్కృతిక జీవన విధానం హైందవ సంస్కృతిగా పునరావిష్కృతమైంది. మళ్లీ మధ్యయుగంలో విచ్ఛిన్నకర శక్తుల ప్రభావానికి గురైనా.. మొగల్ చక్రవర్తుల హిందూ ముస్లింల సాంస్కృతిక సమ్మేళనంతో హిందుస్థానీ సంస్కృతి నిర్మాణం జరిగింది.
     దేశంలో విభిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ప్రాంతాలు, భాషలు, మనస్తత్వాలు ఉన్నాయి. గతంలో ఎంతోమంది విదేశీయులు దండయాత్రలు చేశారు. అయినా భారత జాతీయ సంస్కృతి ఏకత్వం, సామరస్యం, వసుధైక కుటుంబ భావనతో మహోన్నతమైన సంస్కృతిగా వేల ఏళ్లుగా అప్రతిహాతంగా వెలుగొందుతోంది. ఇదే భారతీయ సంస్కృతి ఔన్నత్యం, గొప్పదనం.

 

ప్రపంచ ప్రఖ్యాత నాగరకత
     ఒక జాతి సమగ్ర జీవన విధానం సంస్కృతి.. సంపూర్ణ వికాసం పొందిన తీరును చిత్రించేది సంస్కృతి చరిత్ర. వేల ఏళ్ల కిందటే భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశిష్ట నాగరకత-సంస్కృతులు విలసిల్లాయి. నదీలోయలు సాంస్కృతిక వికాస కేంద్రాలయ్యాయి. తెలుగు నేలను ఏలిన తొలి చక్రవర్తులైన శాతవాహన సంస్కృతి కూడా పవిత్ర గోదావరి తీరాన్నే విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు ప్రవచించిన బౌద్ధ ఆధ్యాత్మిక ప్రవచనాలను కృష్ణవేణి తరంగిణులు ప్రతిధ్వనింపజేశాయి.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌