• facebook
  • whatsapp
  • telegram

బౌద్ధ మతం  

  (క్రీ.పూ. ఆరో శతాబ్దం-భిన్నమతాల ఆవిర్భావం)  

గుణగణాలే  మోక్షసాధనాలు!

ప్రాచీన భారతదేశంలో పుట్టి అచిరకాలంలోనే అశేష ప్రజాదరణ పొందిన బౌద్ధమతం భారతీయ సంస్కృతిని విశేషంగా ప్రభావితం చేసింది. హైందవ సంస్కృతిలోని లోపాలను ప్రశ్నించి, సంస్కరించి, పరిపుష్టం చేసింది. ఆచరణీయ అహింసా వాదాన్ని పరిచయం చేసి ఆమోదయోగ్యంగా మలిచింది. సమానత్వం, శాంతియుత జీవనం, అహింస, వ్యక్తిగత గుణగణాలకు ప్రాధాన్యమిచ్చింది. సరళమైన మత నియమాలను బోధించి, ఆసియా దేశాల్లో విస్తరించింది. కోరికలే అన్ని చింతలకు కారణమని, వాటిని అదుపులో ఉంచుకోవాలనే గొప్ప తత్వాన్ని మానవాళికి బోధించిన బౌద్ధం పుట్టుక, విస్తరణ తీరును పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. పురోగామి ధోరణులున్న ఈ మతంలో క్రమానుగతంగా సంభవించిన మార్పులు, భిన్న అభిప్రాయాలతో ఏర్పాటైన శాఖల గురించి అవగాహన పెంచుకోవాలి.

క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఆవిర్భవించిన మతాల్లో బౌద్ధం అత్యధిక ప్రజాదరణ పొంది ఆసియా ఖండ మతంగా ఎదిగింది. బౌద్ధ మత స్థాపకుడు సిద్ధార్థుడు. ఆయన శాక్యవంశ రాజు శుద్ధోదనుడు, రాణి మాయాదేవి దంపతులకు హిమాలయ ప్రాంతంలోని లుంబినివనంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో, పినతల్లి గౌతమి దగ్గర పెరిగాడు. యుక్తవయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు రాహులుడు. సిద్ధార్థుడికి చిన్నప్పటి నుంచి ప్రాపంచిక విషయాలపై అనురక్తి లేదు. అంతఃపురానికే పరిమితమయ్యాడు. బౌద్ధ మత ఆధారాల ప్రకారం సిద్ధార్థుడు ఒకరోజు కపిలవస్తు నగరంలో పర్యటిస్తుండగా నాలుగు దృశ్యాలు 

1) వృద్ధుడు 

2) వ్యాధిగ్రస్తుడు  

3) శవం 

4) సర్వసంగ పరిత్యాగి అయిన ఒక యోగిని చూశాడు. మొదటి మూడు దృశ్యాలు మానవ జీవిత సత్యాలను ఆవిష్కరించి, సిద్ధార్థుడి మనసుపై ప్రగాఢముద్ర వేశాయి. జీవితం అశాశ్వతం, దుఃఖమయం అని గ్రహించాడు. సత్యాన్వేషణ కోసం కుటుంబ బంధాలను విడిచిపెట్టి తన 29వ ఏట అడవులకు ప్రయాణమయ్యాడు. ఈ సంఘటనను బౌద్ధమతంలో ‘మహాభినిష్క్రమణ’ అంటారు. తొలిదశలో సిద్ధార్థుడు ఇద్దరు వేదపండితులైన అలారా కలామ, ఉద్దక రామపుట్టలను ఆశ్రయించి ధ్యాన విధానం అభ్యసించాడు. ఆ తర్వాత ఉరువేళ చేరి, శరీరాన్ని శుష్కింపజేసుకుని ధ్యానంలో గడిపాడు. అనంతరం ‘గయ’ (ప్రస్తుత బిహార్‌ రాష్ట్రంలో ఉంది) చేరుకుని, రావి చెట్టు కింద 49 రోజులు కఠిన నియమాలతో ధ్యానంలో మునిగిపోయాడు. వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం సిద్ధించింది.


బోధనలు: జ్ఞానం పొందిన సిద్ధార్థుడు, సారనాథ్‌ వద్ద జింకల వనానికి చేరుకొని, తన పూర్వ సహాధ్యాయులు ఒప్పన, బాడిగ, అస్సాగి, మహనామా, కొండనలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశాడు. తాను గ్రహించిన సత్యాలను వివరించాడు. అవి 

1) ప్రపంచం చింతలతో నిండి ఉంది 

2) కోరికలే చింతలకు మూలకారణం 

3) కోరికలను జయించినప్పుడే చింతలు తొలగుతాయి 

4) దానిని సాధించడానికి ‘అష్టాంగమార్గం’ ఆచరించాలి.


అష్టాంగమార్గం: 

1) సమ్యక్‌ వాక్కు 

2) సమ్యక్‌ క్రియ 

3) సమ్యక్‌ జీవనం 

4) సమ్యక్‌ శ్రమ 

5) సమ్యక్‌ ఆలోచన 

6) సమ్యక్‌ ధ్యానం 

7) సమ్యక్‌ నిశ్చయం 

8) సమ్యక్‌ దృష్టి. 

దీనినే ‘మధ్యేమార్గం’ అని కూడా అంటారు. అష్టాంగ మార్గం ఆచరించడం ద్వారా జన్మరాహిత్యం/నిర్వాణం/మోక్షం పొందుతారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని బౌద్ధమత సాహిత్యంలో ‘ధర్మచక్ర ప్రవర్తన’ అని పిలుస్తారు. బుద్ధుడి మూల బోధనలు ధర్మచక్ర ప్రవర్తనలో ఉన్నాయి. సిద్ధార్థుడిని ప్రజలు బుద్ధుడు, శాక్యముని, తథాగతుడు అని సంబోధించారు. ఆయన తన బోధనల్లో భగవంతుడి ఉనికి గురించి, ఆత్మ గురించి ప్రస్తావించలేదు. శీలవంతమైన జీవితం గడపడం ద్వారా నిర్వాణం (మోక్షం) పొందవచ్చని, దానికి జంతు హింసతో కూడిన యజ్ఞయాగాదులు మార్గం కాదని తెలిపాడు. ప్రతి వ్యక్తి దయ, దాతృత్వం, జాలి, కృతజ్ఞత వంటి ఉత్తమ గుణాలను పెంపొందించుకోవాలన్నాడు. అసత్యం చెప్పకూడదని, జీవహింస చేయకూడదని, భూతదయ కలిగి ఉండాలని బోధించాడు. సమాజంలోని కులవ్యవస్థను నిరసించి సమానత్వాన్ని చాటాడు. వైదిక మతంలోని కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను అంగీకరించాడు. జీవితమంతా, బోధనలు చేస్తూ తన 80వ ఏట క్రీ.పూ.483లో కుశీనగరం వద్ద మహాపరినిర్వాణం చెందాడు.


బౌద్ధమత గ్రంథాలు: పాళీ భాషలో రాసిన సుత్త పిటక, వినయ పిటక, అభిదమ్మ పిటక (త్రిపిటకాలు) బౌద్ధమత గ్రంథాలు. బౌద్ధ తాత్విక చింతనను ‘ప్రతిథ్య సముత్పాద సిద్ధాంతం’ అంటారు. 


బౌద్ధ మతం ఎదుగుదలకు కారణాలు:  తొలిదశలో బుద్ధుడి విలక్షణ వ్యక్తిత్వం, సరళమైన మత సిద్ధాంతాలను వాడుక భాషలో (పాళీ) బోధించడంతో ప్రజలు ఆకర్షితులయ్యారు. అనేకమంది రాజులు (అశోకుడు, కనిష్కుడు, హర్షుడు, ధర్మపాలుడు తదితరులు) బౌద్ధ మతానికి ప్రోత్సాహం అందించారు. ఈ కారణాలతో బౌద్ధం అచిరకాలంలోనే గొప్ప మతంగా ఎదిగింది. బుద్ధుడి కాలంలో గంగానది లోయ ప్రాంతానికి పరిమితమైన మతం, ఆ తర్వాత భారతదేశంలో, ఆసియా ఖండంలో ప్రముఖ మతంగా విస్తరించింది.


బౌద్ధ సంగీతులు: బౌద్ధ సంఘ సమావేశాలను సంగీతి అంటారు. ప్రాచీన భారతదేశ చరిత్రలో నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి. ః మొదటి సంగీతి బుద్ధుడి మహాపరినిర్వాణం చెందిన క్రీ.పూ.483లో, హార్యాంక వంశ రాజు అజాతశత్రు కాలంలో రాజగృహ నగరంలో జరిగింది. మహాకశ్యపుడు అధ్యక్షత వహించాడు. ఈ సమావేశ ఫలితంగా బుద్ధుడి బోధనలను ‘సుత్త పిటక’గా ఆనందుడు; బౌద్ధ మఠం, భిక్షువుల నియమావళిని ‘వినయ పిటక’గా ఉపాలి సంకలనం చేసి గ్రంథస్థం చేశారు. ః సరిగ్గా వందేళ్ల తర్వాత రెండో బౌద్ధ సంగీతి వైశాలి నగరంలో, సభకామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం మఠ నియమావళిపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. దీంతో బౌద్ధ సంఘం మొదటిసారి స్థావిర్‌ వాదులు (మార్పు కోరని వారు), మహా సాంఘికులు (మార్పు కోరేవారు) అనే రెండు శాఖలుగా విడిపోయింది. ః మూడో సంగీతిని అశోకుడి కాలంలో క్రీ.పూ.257వ సంవత్సరంలో నిర్వహించారు. అప్పటికే మతంలో వచ్చిన అనేక చీలికలు, భేదాభిప్రాయాలు నివారించడానికి, మతాన్ని సంఘటితపరచడానికి మొగలిపుత్త తిస్స అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సుత్త పిటక, వినయ పిటకలపై వ్యాఖ్యానం రూపంలో పాళీ భాషలో ‘అభిదమ్మ పిటక’ రూపుదిద్దుకుంది. సమావేశానంతరం అశోకుడు బౌద్ధ మతవ్యాప్తికి విదేశాలకు ప్రతినిధులను పంపాడు. అందులో భాగంగా తన కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రలను సింహళ దేశానికి పంపాడు. 


* నాలుగో బౌద్ధ సంగీతి క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో కుషాణు రాజు కనిష్కుడి కాలంలో, వసుమిత్రుడి అధ్యక్షతన జరిగింది. ఇందులో సంఘంలో నెలకొన్న భేదాభిప్రాయాలు నివారించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఈ సమావేశానంతరం బౌద్ధ సంఘం హీనయాన, మహాయాన శాఖలుగా విడిపోయింది. సుత్త పిటక, వినయ పిటకలపై వ్యాఖ్యానం ‘మహా విభాష శాస్త్ర’ అనే గ్రంథంగా సంస్కృతంలో వెలువడింది.


బౌద్ధ మత ప్రధాన శాఖలు: పరిణామ క్రమంలో బౌద్ధమతం అనేక శాఖలుగా ఏర్పడింది.


1) హీనయాన మతం: వీరు బుద్ధుడి బోధనలనే మోక్ష మార్గం (నిర్వాణం)గా ఆచరిస్తారు. విగ్రహారాధనను విశ్వసించరు. బుద్ధుడి జీవితంలో సంఘటనలను గుర్తుల రూపంలో ఆరాధిస్తారు. ఉదా: అశ్వం (మహాభినిష్క్రమణ), బోధి వృక్షం (జ్ఞానం పొందడం), చక్రం (ధర్మచక్ర ప్రవర్తన), స్తూపం (మహాపరినిర్వాణం).


2) మహాయాన మతం: బుద్ధుడు, అతడి వెనుక జన్మలైన బోధిసత్వుల భౌతిక రూపాలను విగ్రహాల రూపంలో ఆరాధిస్తారు. ఈ శాఖలో రెండు ప్రధాన తాత్విక చింతనలున్నాయి. అవి మాధ్యమిక వాదం (నాగార్జునుడు), యోగకార (మైత్రేయనాథుడు)


3) వజ్రయాన మతం: క్రీ.శ.8వ శతాబ్దంలో బెంగాల్‌లో పాల వంశ రాజుల కాలంలో బౌద్ధంలో వచ్చిన మరో శాఖ వజ్రయానం. మంత్ర, తంత్ర శక్తుల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని వీరి విశ్వాసం.


బౌద్ధం క్షీణతకు కారణాలు: వైదిక మతానికి తిరిగి ప్రోత్సాహం లభించడం, మహాయాన మతానికి, వైదిక మత విధానాలకు పెద్దగా తేడా లేకపోవడం, భిక్షువుల్లో పెరిగిన అనైతికత, బౌద్ధ మఠాలు అసాంఘిక కార్యకలాపాలకు స్థావరాలు కావడం, సంస్కృతానికి మతంలో ప్రాముఖ్యం ఇవ్వడం, ముస్లిం దండయాత్రలు వంటి అనేక కారణాలతో బౌద్ధ మతం 13వ శతాబ్దం నాటికి భారతదేశంలో ప్రజాదరణ కోల్పోయింది.


బౌద్ధం భారతీయ సంస్కృతికి చేసిన సేవ: అనంతమైన భారతీయ సంస్కృతీ పరిణామ దశలో బౌద్ధ మతం అమోఘమైన పాత్ర నిర్వహించింది. వైదిక మత సిద్ధాంతాలను ప్రభావితం చేసింది. మానవ సమానత్వాన్ని ప్రబోధించింది. సంక్లిష్ట మత వ్యవస్థను సరళీకృతం చేసింది. వ్యక్తి గుణగణాలకు, సచ్ఛీలతకు ప్రాధాన్యం ఇచ్చి మతంలో నైతికతను జొప్పించింది. ఆచరణీయ అహింసా సిద్ధాంతాన్ని అందించింది. ఆహారపు అలవాట్లలో శాకాహారులు, మాంసాహారులు అనే మార్పు తెచ్చింది. బౌద్ధ మత పండితులు అనేకమంది (నాగార్జునుడు, అశ్వఘోషుడు, అసంగుడు, దిగ్‌నాగుడు, ధర్మకీర్తి తదితరులు) మత సాహిత్యాన్ని, సిద్ధాంతాలను పరిపుష్టం చేశారు. బౌద్ధ సంఘాలు, విశ్వవిద్యాలయాలు (నలంద, వల్లభి) విద్యావ్యాప్తికి తోడ్పడ్డాయి. భారతీయ సంస్కృతికి - స్తూపం, చైత్యం, విహారం రూపంలో విలక్షణమైన వాస్తును బౌద్ధం అందించింది. మతంలో విగ్రహారాధనను ప్రవేశపెట్టి గాంధార, మధుర, అమరావతి శైలుల రూపంలో అపురూప శిల్పకళను అందించింది. ప్రాంతీయ భాషల అభివృద్ధికి తోడ్పడింది. విదేశాలతో సత్సంబంధాలను నెలకొల్పి, భారతీయ సంస్కృతీ వైభవాన్ని, ప్రపంచ శాంతి ఆవశ్యకతను చాటి చెప్పింది.
 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 

Posted Date : 13-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌