• facebook
  • whatsapp
  • telegram

గుప్తయుగం - పాలకులు

గుప్తవంశ స్థాపకుడు 

‘శ్రీగుప్తుడు’. ఇతడు క్రీ.శ. 4వ శతాబ్దంలో రాజ్యపాలన చేసినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇతడి కుమారుడు ‘ఘటోత్కచ గుప్తుడు’. ఇతడి కొడుకు మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు మరణించాక సముద్రగుప్తుడు రాజ్యపాలన చేశాడు.


రామగుప్తుడు 

* సముద్రగుప్తుడి తర్వాత అతడి కుమారుడు ‘రామగుప్తుడు’ గుప్త సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతడి కాలంలో శకులు గుప్త సామ్రాజ్యంపై దండెత్తారు. ఈ యుద్ధంతో రామగుప్తుడి రాజ్యంతో పాటు భార్య ధ్రువాదేవిని శకులు హస్తగతం చేసుకున్నారు. 

* ఈ సమయంలో రామగుప్తుడి సోదరుడు ‘రెండో చంద్రగుప్తుడు’ శకరాజును హతమార్చి ధ్రువాదేవిని కాపాడి, రాజ్యాధికారం చేపట్టాడు.


రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 380-414)  

* ఇతడి పాలనలో రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. ఇతడు యుద్ధాలు, వివాహ సంబంధాల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. రెండో చంద్రగుప్తుడికి విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. రెండో చంద్రగుప్తుడి తండ్రి సముద్రగుప్తుడు. తల్లి ‘దత్తాదేవి’. 

* భార్యలు: ధ్రువాదేవి, కుబేరనాగ. కుమారులు: కుమారగుప్తుడు, గోవిందగుప్తుడు. కుమార్తె: ప్రభావతి గుప్త. 

* ఇతడు తన కుమార్తెను వాకాటకరాజు రెండో రుద్రసేనుడికిచ్చి వివాహం చేశాడు. రుద్రసేనుడు మరణించాక రెండో చంద్రగుప్తుడు వాకాటకులపై అధికారం చెలాయించాడు. 

కుబేరనాగ నాగవంశానికి చెందింది. ఈమెను వివాహం చేసుకోవడం ద్వారా నాగరాజుల సాయంతో మధ్య భారతదేశంలో తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు.

* కదంబవంశ రాజు కుంతలదేశ రాజ్యాధిపతి ‘కుకుత్సవర్మ’ కుమార్తెను రెండో చంద్రగుప్తుడు వివాహం చేసుకున్నట్లు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.


దండయాత్రలు: పశ్చిమ భారతదేశాన్ని పాలిస్తున్న శకక్షాత్రపులతో ఇతడికి వైరం ఉండేది. రెండో చంద్రగుప్తుడు శకరాజు రుద్రసింహుడ్ని ఓడించి, వారి వంశాన్ని పూర్తిగా అంతం చేసి, ‘శకారి’, ‘సహాసాంక’ అనే బిరుదులు పొందాడు.

* శకులపై విజయానికి గుర్తుగా వెండి నాణేలు ముద్రించాడు. దానికి ఒకవైపు గరుడ బొమ్మ, రెండోవైపు ‘పరమభాగవత’, ‘మహారాజాధిరాజ’ అనే బిరుదులు ముద్రించాడు. ఇవేకాక పులిని చంపుతున్నట్లున్న బొమ్మను ముద్రించిన నాణేలూ విడుదలచేశాడు. 

* హర్షచరిత్ర, దేవీచంద్రగుప్తం గ్రంథాలు సైతం శకులపై రెండో చంద్రగుప్తుడి విజయాలను తెలుపుతున్నాయి. శకులపై విజయం తర్వాత ఇతడు ‘ఉజ్జయిని’ని రెండో రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు.

* రెండో చంద్రగుప్తుడి సేనాని ‘అమరక దేవుడు’. ఇతడు రాజు విజయాలపై అనేక శాసనాలు వేయించాడు. 

* మెహ్రౌలి శాసనంలో ఇతడు వంగరాజ్య కూటమిని అణచి, సప్తసింధూనదిని దాటి బాక్ట్రియా రాజ్యాన్ని జయించాడని ఉంది. 


ఇతర విశేషాలు: ఇతడు సింహం బొమ్మ ఉన్న బంగారు నాణేలను జారీ చేశాడు. దీంతో ఇతడు ‘సింహవిక్రమ’ అనే బిరుదు పొందాడు. 

* చంద్రగుప్తుడికి దేవగుప్తుడు లేదా దేవరాజు, దేవశ్రీ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడు వైష్ణవ భక్తుడు. శకులపై విజయం సాధించాక ఇతడు ఐరోపా, ఆఫ్రికా ఖండాలతో వర్తక, వాణిజ్యం చేశాడు.

రెండో చంద్రగుప్తుడి కాలంలో చైనా యాత్రికుడు ‘ఫాహియాన్‌’ భారతదేశంలో పర్యటించి (క్రీ.శ.399-414) ఇతడి ఆస్థానంలో మూడేళ్లు ఉండి, సంస్కృతం నేర్చుకున్నాడు. 

* చంద్రగుప్తుడి ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే సుప్రసిద్ధ సంస్కృత కవులు ఉండేవారు. 

* ప్రఖ్యాత కవి, నాటకకర్త ‘కాళిదాసు’ ఇతడి ఆస్థానంలోని వారే. అమరసింహుడు, వరరుచి, భేతాళభట్టు, క్షపణికుడు, శంకు లాంటి కవులు నవరత్నాల్లోని ప్రముఖులు.


మొదటి కుమారగుప్తుడు (క్రీ.శ. 414-455) 

రెండో చంద్రగుప్తుడి తర్వాత మొదటి కుమారగుప్తుడు రాజయ్యాడు. ఇతడు అశ్వమేథయాగం చేసి, దానికి గుర్తుగా బంగారు నాణేలు విడుదలచేశాడు. 

* ఇతడికి ‘మహేంద్రాదిత్య’ అనే బిరుదు ఉంది. ఇతడు ‘కార్తికేయుడ్ని’ పూజించాడు. కార్తికేయ ప్రతిమ ఉన్న నాణేలు ముద్రించాడు.

ఇతడు పుష్యమిత్రులతో యుద్ధం చేసి, వారిని ఓడించాడు.

ఇతడి రాజ్యంలో బౌద్ధ, శైవ, సూర్య, విష్ణు ఆరాధనలు జరిగేవి. కుమారగుప్తుడి చివరి దశలో పుష్యమిత్రులు మళ్లీ దండెత్తగా, అతడి కొడుకైన స్కందగుప్తుడు వారిని ఓడించినట్లు ‘బిత్రి’ శాసనంలో ఉంది.


చివరి గుప్తపాలకులు 

* స్కందగుప్తుడి తర్వాత అతడి తమ్ముడు పురుగుప్తుడు కొద్దికాలం రాజ్యపాలన చేశాడు. 

* ఇతడి పాలనా కాలంలో గుప్తరాజ్యంలోని పశ్చిమభాగం వేరుపడింది. 

* స్కందగుప్తుడి తర్వాత రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు, నరసింహగుప్తుడు, మూడో కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు రాజ్యపాలన చేశారు. 

* వీరి కాలంలో కేంద్రపాలన పటుత్వం తగ్గింది. సరిహద్దు ప్రాంతాల్లోని రాజులు, సామంతులు వీరిని ధిక్కరించారు. 

* నరసింహగుప్తుడి కాలంలో హూణులు ‘తోరమానుడి’ నాయకత్వంలో దండెత్తి పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్, సౌరాష్ట్ర, మాళ్వాలను జయించారు.

* ఎరాన్‌ యుద్ధంలో భానుగుప్తుడు హూణులను ఓడించాడని కొన్ని శాసనాల్లో ఉంది. నరసింహగుప్తుడి కాలంలో మళ్లీ హూణులు దాడిచేయగా, వారికి కప్పం కట్టాడని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. 

చివరి గుప్తచక్రవర్తి ‘విష్ణుగుప్తుడు’ లేదా ‘జీవగుప్తుడు’. ఇతడు క్రీ.శ. 550లో నామమాత్ర అధికారంలో ఉండగా క్రీ.శ.7వ శతాబ్దం నాటికి కనౌజ్‌ పాలకుడైన హర్షవర్ధనుడు గుప్తసామ్రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. 


గుప్తసామ్రాజ్య పతనానికి కారణాలు

* స్కందగుప్తుడి తర్వాత వచ్చిన పాలకులంతా బలహీనులు, అసమర్థులు. వీరు ఇతర రాజ్యాలపై దండెత్తలేదు. రాజ్యంలో జరిగే తిరుగుబాట్లని అణచలేకపోయారు.

* మొదటి కుమారగుప్తుడి తర్వాత అధికారం కోసం వారసుల మధ్య అంతర్గత కలహాలు, యుద్ధాలు ప్రారంభమయ్యాయి. మొదటి కుమారగుప్తుడు తన వారసుడిగా పురుగుప్తుడ్ని ప్రతిపాదించగా, రెండో కుమారగుప్తుడు దీన్ని వ్యతిరేకించాడు. ఇదే వారసత్వ యుద్ధానికి కారణమైంది.

నరసింహగుప్తుడి కాలంలో చైనాకి చెందిన హూణులు తోరమానుడు, మిహీరకులుడి నాయకత్వంలో దండయాత్రలు చేశారు. వీరిని ఎదుర్కోవడానికి అతడు మందసోర్‌ పాలకుడు యశోధర్ముడి సహాయం తీసుకున్నాడు. ఈ యుద్ధంలో నరసింహగుప్తుడు ఓడిపోయి, హూణులకు కప్పం చెల్లించాడు. ఈ దండయాత్రలు రాజకీయంగా, ఆర్థికంగా గుప్తసామ్రాజ్యానికి నష్టాన్ని కలిగించాయి. 

* చివరి గుప్తరాజుల పాలనాకాలంలో అనేక సామంత రాజ్యాలు స్వాతంత్య్రం ప్రకటించుకోగా, మరికొందరు తిరుగుబాటు చేశారు. 


ఉదా: పుష్యభూతి వంశస్థులు మొదట తిరుగుబాటు చేయగా, మందసోర్‌ పాలకుడు యశోధర్ముడు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. కనౌజ్‌లో ‘మౌఖరి’ వంశస్థులు, గుజరాత్‌లో మైత్రక తెగ పాలకుడు భట్టారకుడు, పశ్చిమ మాళ్వా పాలకులు, బెంగాల్‌లో గౌడ పాలకులు తమను తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. వీరిని గుప్తపాలకులు అణచలేకపోయారు. 

* చివరి గుప్తులు రెండువర్గాలుగా విడిపోయారు. ఒకవర్గం ‘మగధను’ కేంద్రంగా చేసుకుని పాలించగా, రెండోవర్గం ‘మాళ్వా’ కేంద్రంగా గుప్తరాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ అనైక్యతకు కారణమైంది. 

* గుప్తపాలకులు హిందూ మతాభిమానులు. అయితే బుధగుప్త, తథాగతగుప్త, బాలాదిత్యగుప్త బౌద్ధమతాభిమానులు. వీరు సైనిక శక్తిని నిర్లక్ష్యం చేశారు. దీంతో విదేశీ దాడులను, స్థానిక తిరుగుబాట్లను, స్వాతంత్య్రం ప్రకటించుకున్న సామంతులను ఎదుర్కోలేకపోయారు.

* పరిపాలనా వ్యవస్థలో లోపాలు, భూదానాలు, భూస్వామ్య వ్యవస్థ గుప్తుల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశాయి.


స్కందగుప్తుడు (క్రీ.శ. 455-467)

* స్కందగుప్తుడు పుష్యమిత్రులు, హూణులు, వాకాటకులతో యుద్ధాలు చేసి విజయం సాధించాడు. ఇతడికి ‘విక్రమాదిత్య’ అనే బిరుదు ఉంది.

* కుమారగుప్తుడి తర్వాత స్కందగుప్తుడు రాజైనట్లు ‘ఆర్యమంజుశ్రీ మూలకల్ప’ అనే గ్రంథంలో ఉంది. 

* ఆర్‌.జి.భండార్కర్‌ అనే చరిత్రకారుడు పురుగుప్తుడు, స్కందగుప్తుడు ఒకరే అని పేర్కొన్నారు. డాక్టర్‌ ఆర్‌.జి.బసక్‌ అభిప్రాయం ప్రకారం కుమారగుప్తుడి తర్వాత పురుగుప్తుడు, స్కందగుప్తుడు రాజ్యాన్ని పంచుకుని పాలించారు. 

* ఆర్‌.కె.ముఖర్జీ అనే చరిత్రకారుడు స్కందగుప్తుడ్ని ‘దిగ్విజయుడు’, ‘ధర్మవిజయుడు’ అని కీర్తించాడు. 

* ఐరోపా, ఆసియా ఖండాల్లో హూణులను ఓడించిన ఏకైక వ్యక్తి స్కందగుప్తుడని కె.పి.జైస్వాల్‌ పేర్కొన్నారు.


గుప్తుల పరిపాలనా విధానం

వీరు దాదాపు మొత్తం ఉత్తర భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని పరిపాలించారు. ఫాహియాన్‌ రచనలు, కౌటిల్యుడి అర్థశాస్త్రం, కామాందకుడి నీతిసారం, శాసనాలు, నాణేలు గుప్తుల పాలనను తెలుపుతున్నాయి. గుప్తులు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, సుస్థిర పాలనను అందించి, రాజకీయ ఐక్యతను సాధించారు.


కేంద్ర ప్రభుత్వం: గుప్తరాజులు ప్రాచీన హిందూ శాస్త్రాలకు అనుగుణంగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశారు. కేంద్ర ప్రభుత్వంలో రాజే సర్వాధికారి. 

* రాజును ప్రజలు దైవంగా భావించేవారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా గుప్తులు రాజ్యపాలన చేశారు.

* రాజరికం వంశపారంపర్యంగా వచ్చేది. రాజు నిరంకుశుడిగా ఉండేవాడు. 

* పాలనలో రాజుకు సహకరించడానికి మంత్రిమండలి ఉండేది. 

* కామాందకుడి నీతిసారంలో ‘మంత్రవికల్ప ప్రకరణం’ అనే ఒక అధ్యాయం ఉంది. అందులో మంత్రి పరిషత్‌ విధులు, కార్యక్రమ నిర్వహణ విధానం గురించి వివరించారు. 

* మంత్రిమండలిలో మహాప్రధాన అమాత్య, సచివ, కుమారామాత్య, సంధివిగ్రహ, మహిదంత నాయక, రణభాండాగారిక లాంటి ఉద్యోగులు ఉండేవారు. 

*  రాజుకు, మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా కంచుకి వ్యవహరించేవాడు. 

* జాతి, కుల, మత బేధాలు లేకుండా శక్తి, సామర్థ్యాల ఆధారంగా ఉద్యోగులను నియమించేవారు.

* గుప్తరాజులకు పరమదేవత, పరమభట్టారక, మహిరాజాధిరాజ, పృథ్విపాల, చక్రవర్తి లాంటి బిరుదులు ఉండేవి. 

* వివిధ పాలనా అంశాల్లో రాజుకి తోడ్పడటానాకి ఉపారిక, దశపరాధిక, చేరోద్ధారనిక, దండిక, దండపాషిక, గౌల్మిక, క్షేత్ర, ప్రాంతపాల, కొట్టపాల, అంగరక్షక, అయుక్తక, వియుక్తక, రజక అనే వివిధ రకాల ఉద్యోగులు ఉండేవారు.

* గుప్తచక్రవర్తులు వారసులను ముందుగానే ప్రకటించేవారు. 

* మంత్రిమండలి నిర్ణయాలను ‘అమాత్య’ ద్వారా రాజుకు తెలిపేవారు. అన్ని విషయాల్లో తుది నిర్ణయం రాజుదే. 


రాష్ట్రపాలన: గుప్తులు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ‘భుక్తులు’గా విభజించారు. భుక్తికి అధికారి ‘ఉపరిక’. ఇతడు సాధారణంగా యువరాజు లేదా రాజకుటుంబ సభ్యుడై ఉండేవాడు.

*ఉపరికకు పాలనలో సాయం చేయడానికి బాలాధికరనిక, దండపాషిక, వినయస్థితిస్థాపక లాంటి ఉద్యోగులు ఉండేవారు. 

* భుక్తిని (రాష్ట్రాలు) మళ్లీ విషయాలుగా విభజించారు. విషయాలు అంటే జిల్లాలు. దీనికి అధికారి విషయపతి. ఇతడికి సలహాలు ఇచ్చేందుకు కొందరు సభ్యులున్న సంఘం ఉండేది. దీన్ని ‘అధికారణ’ అనేవారు.  

* దీనిలో నగరశ్రేష్ఠి (పట్టణవర్తక సంఘం పెద్ద), ప్రథమకాలికుడు (కార్మిక శ్రేణి అధ్యక్షుడు), సార్ధవాహుడు (వర్తక సంఘం అధ్యక్షుడు), ప్రథమ కాయస్తుడు (లేఖకుల పెద్ద), పుస్తపాల (పత్ర సంరక్షకుడు) ఉండేవారు. 

* నగరభుక్తి, పండ్ర వర్ధనభుక్తి, అహిక్షత్రభుక్తి, తీరభుక్తి, ఉత్తరమండలభుక్తి లాంటివి గుప్తుల పాలన కింద ఉండేవి. 

* పట్టణపాలనకు ‘నగరసభ’ ఉండేది. పట్టణ వ్యవహారాలు వృత్తి సంఘాలు, శ్రేణుల అధీనంలో ఉండేవి. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వీరి ప్రధాన విధులు. 


గ్రామపాలన: గుప్తులు ప్రతి విషయాన్ని గ్రామాలుగా విభజించారు. గ్రామికుడు గ్రామానికి పెద్ద. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడటం ఇతడి ప్రధాన బాధ్యత. 

* గ్రామపాలనలో గ్రామాధ్యక్షుడికి సలహాలు ఇచ్చేందుకు పెద్దలతో కూడిన ‘పంచమండలసభ’ ఉండేది. కొన్ని గ్రామాల సముదాయాన్ని ‘విత్తి’ అంటారు. 

* గ్రామానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జోక్యం ఉండేది కాదు. గ్రామాలు స్వయంప్రతిపత్తిగా ఉండి, అధికార వికేంద్రీకరణను సూచించేవి.


న్యాయపాలన: చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి. గ్రామస్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు న్యాయవ్యవస్థ ఉండేది. ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయకుడు అనేవారు. 

* ఫాహియాన్‌ తన రచనల్లో శిక్షలు కఠినంగా ఉండేవి కాదని, ఉరిశిక్షలు లేవని రాశాడు. అంగచ్ఛేదనం శిక్షాస్మృతిలో ఉంది.

గుప్తరాజులు పౌర, నేర విభాగాలుగా న్యాయవ్యవస్థను విభజించారు. ఆస్తి తగాదాలు, వారసత్వ వివాదాలు పౌరన్యాయ చట్టంలో పొందుపరచారు. క్రిమినల్‌ వ్యవహారాలు నేరవిభాగం కింద ఉండేవి. 

* నేరం చేసినప్పుడు శిక్షల కంటే ఎక్కువగా జరిమానాలు విధించేవారు.  దీనివల్ల న్యాయవ్యవస్థ అంత పటిష్ఠంగా లేదని తెలుస్తోంది. 

* దేశద్రోహం, రాజద్రోహం చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించేవారు. మరణదండన తప్పనిసరి అయినప్పుడు ఏనుగులతో తొక్కించి చంపేవారు. 

* కొన్ని కులాలకు ప్రత్యేక శిక్షలు, చట్టాలు ఉండేవి. 

* గుప్తుల కాలంలో నారద, యజ్ఞవల్క్య, బృహస్పతి స్మృతులను రూపొందించారు.


సైనికపాలన: గుప్తుల సైన్యంలో గజ, అశ్వ, రథ పదాతి దళాలు ఉండేవి. నౌకాదళం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

* వీరు సైన్యం కోసం సామంతులపై ఆధారపడ్డారు. ఈ కారణం వల్లే చివరి గుప్త పాలకుల కాలంలో తిరుగుబాట్లను అణచలేకపోయారు. 

* సైనికరంగంలో సేనాపతి, మహాసేనాపతి, బలాధికృత, మహాబలాధికృత, దండనాయక, సంధివిగ్రహక, గోప్య అనే ఉద్యోగులు ఉండేవారు.

గజదళాధిపతిని ‘మహాపీలుపతి’ అని, అశ్వదళాధికారిని ‘భటాశ్వపతి’ అని, సైనికులకు జీతభత్యాలు చూసే అధికారిని ‘రణభాండాగారికుడు’ అని పిలిచేవారు. 

* యుద్ధవ్యూహాన్ని మహాబలాధికృత రూపొందించేవాడు. మహాసేనాధిపతి యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపేవాడు. 

సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడి కాలంలో సైన్యం పటిష్ఠంగా ఉండేది.

Posted Date : 28-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌