• facebook
  • whatsapp
  • telegram

భారత స్వాతంత్రోద్యమం - విప్లవకారులు

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం వివిధ వర్గాల వారు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వీరిలో వామపక్షాలు, సాయుధ పోరాట భావాలున్న వారు, మితవాదులు, అతివాదులు, విప్లవ జాతీయవాదులు ఉన్నారు. భారత స్వాతంత్రోద్యమాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
1) మితవాదుల దశ (1885-1905)
2) అతివాదుల దశ (1905-1919)
3) గాంధీయుగం (1919-1947)
* 1906 నుంచి 1920 వరకు సాగిన జాతియోద్యమ దశను ‘సమరశీల జాతీయోద్యమం’ లేదా ‘తీవ్రవాద జాతీయోద్యమం’గా పేర్కొంటారు.


మితవాదులు 
వీరు బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల విధేయత చూపారు. సమస్యలను సరైన, సంతులిత పద్ధతిలో విన్నవిస్తే ప్రభుత్వం వాటిని ఆమోదించి, పరిష్కరిస్తుందని భావించారు. రాజ్యాంగబద్ధ ఉద్యమం ద్వారా సక్రమ పద్ధతిలో, పరిమిత విమర్శలు, డిమాండ్లతో బ్రిటిష్‌వారిపై ఒత్తిడి తెచ్చి స్వాతంత్య్రాన్ని సాధించాలన్నారు.


అతివాదులు 
వీరు పూర్తిస్థాయి స్వాతంత్య్రాన్ని కోరారు. ప్రధానంగా స్వరాజ్య సాధన కోసం పోరాడారు. అతివాదులు తమ భావాలను కచ్చితంగా వ్యక్తం చేసి, ప్రజల్లో జాతీయభావాలను పెంపొందించడానికి ప్రయత్నించారు. ఉద్యమాల ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించారు.
* అతివాదుల్లో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్‌ తిలక్, బిపిన్‌ చంద్రపాల్‌ ముఖ్యులు. తిలక్‌ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని ప్రకటించారు. 
* తీవ్రవాద జాతీయవాదానికి వీరు బలమైన పునాదులు వేశారు. సమరశీల జాతీయవాదులు అతివాదులకు సమాంతరంగా సాయుధ పోరాటాలు నిర్వహించి జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించారు. కానీ వీరి విధానాలు వేరుగా ఉండేవి.


విప్లవ/ సమరశీల జాతీయవాదులు 
 సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్‌ పాలనను అంతమొందించవచ్చని వీరు భావించారు. బ్రిటిష్‌ సామ్రాజ్య వాదాన్ని, వారి సైనిక శక్తిని నిర్మూలించడానికి హింసాయుత విధానాలు అనుసరించారు.
* 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఉగ్రవాద విజృంభణకు కారణాలు ముఖ్యంగా బ్రిటిష్‌ ప్రభుత్వం అనుసరించిన అనేక హింసా విధానాలు, దమననీతి, రాజకీయ పోరాట వైఫల్యం, అతివాదుల ఆత్రుత, విప్లవకారుల వ్యక్తిత్వం.
* వీరు బ్రిటిష్‌ పరిపాలనా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి, వారికి సహకరించిన వారిని శిక్షించారు. బ్రిటిష్‌ వారిని హతమార్చి, బాంబువాదాన్ని అనుసరించారు.
* 20వ శతాబ్దం ప్రారంభం నాటికి అనేక సమితులు, రహస్య సంఘాలను స్థాపించారు. యువకులు, విద్యార్థులను వీటిలో సభ్యులుగా చేర్చుకున్నారు. వీరికి కుస్తీ పట్టడం, ముష్ఠియుద్ధ విధానం, జపాన్‌ వారి జిటోజిట్సు, కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ మొదలైనవి నేర్పించేవారు. 
* విప్లవ కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని చందాల రూపేణ, అవసరమైతే ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసేవారు. ప్రభుత్వ ధనాగారాలను కొల్లగొట్టి డబ్బు సంపాదించడం వారి కార్యక్రమాల్లో ఒక భాగంగా ఉండేది.
* వీరు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, చైనా హాంకాంగ్, సింగపూర్, అమెరికా, కెనడా, ఫిలిప్పీన్స్, టర్కీ, ఆఫ్గనిస్థాన్‌ మొదలైన దేశాల్లో విప్లవవాద సంస్థలను ఏర్పాటు చేసి, బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించారు.
* విదేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చారు.
* భారతదేశంలో బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, మద్రాస్, పంజాబ్, ఢిల్లీ మొదలైన ప్రాంతాలు విప్లవ కార్యక్రమాలకు కేంద్రాలయ్యాయి.


బెంగాల్‌ 
అరబిందో ఘోష్, అతడి సోదరుడు బరీంద్ర కుమార్‌ ఘోష్, స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్‌ దత్తా బెంగాల్‌లో విప్లవ ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమానికి ఆధ్యాత్మికతను జోడించి, భగవద్గీత సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
* 1906లో బరీంద్ర కుమార్‌ ఘోష్, భూపేంద్రనాథ్‌ దత్తా, అభినాష్‌ భట్టాచార్య కలిసి యుగాంతర్‌ అనే బెంగాలీ పత్రికను స్థాపించారు. రాజద్రోహం కింద వీరిపై అనేకసార్లు జరిమానాలు, శిక్షలు విధించారు. ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించింది. 
* బిపిన్‌ చంద్రపాల్‌ స్థాపించిన ‘వందేమాతరం’ పత్రికకు అరబిందో ఘోష్‌ సంపాదకుడిగా వ్యవహరించారు. ‘సంధ్య’ పత్రికను బ్రహ్మబంద్‌ ఉపాధ్యాయ ప్రచురించారు. వీటి ద్వారా విప్లవోద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
* బంకించంద్ర ఛటర్జీ, స్వామి వివేకానంద, అరబిందో ఘోష్‌ రచనల ప్రభావం విప్లవకారులపై  ఉండేది. 
* బెంగాల్‌ యువకుల్లో ధైర్య సాహసాలు నింపి, స్వాతంత్య్రం కోసం రక్తాన్ని ధారపోయాలని బరీంద్ర కుమార్‌ ఘోష్‌ బోధించారు.
* 1902లో కలకత్తాలో సతీష్‌ చంద్రబసు, ప్రమతనాథ్‌ మిత్రా కలిసి అనుశీలన్‌ సమితిని స్థాపించారు. వీరికి బరీంద్ర కుమార్‌ ఘోష్, అతడి అనుచరులు సహకరించారు.
* ఢాకా కేంద్రంగా పులిన్‌ బెహరి దాస్‌ అనుశీలన్‌ సమితిని స్థాపించారు. దీనికి తూర్పు బెంగాల్‌లో సుమారు 500 శాఖలుండేవి. ఈ సమితులకు అరబిందో ఘోష్, సిస్టర్‌ నివేదిత సహకరించారు.
* ఈ సమితులు కలకత్తా, ఢాకా కేంద్రాలుగా పనిచేస్తూ విప్లవ సాహిత్యాన్ని పంచి, అజ్ఞాత వర్గాలను (Underground Groups) నెలకొల్పాయి. రష్యన్, ఇటాలియన్‌ రహస్య సంఘాల్లాగానే ఇవీ పనిచేశాయి. సంఘాల్లోని సభ్యులను ఇబ్బందులు పెట్టే బ్రిటిష్‌వారిని ఇవి శిక్షించేవి.
* ‘ఆత్మోన్నతి సమితి’ విప్లవ సంఘాన్ని బిపిన్‌ బెహారి గంగూలీ బెంగాల్‌లో స్థాపించారు.
* బెంగాల్‌ భాష తెలిసిన మరాఠీ స్కాలర్‌ శకరాం గణేష్‌ దేశ్‌కర్‌ బెంగాల్, మహారాష్ట్ర విప్లవకారులను ఏకం చేశారు.
* 1905లో జరిగిన బెంగాల్‌ విభజన తర్వాత ఉగ్రజాతీయవాదం మరింత పెరిగింది.
* మైమన్‌ సింగ్‌ సుహృద్, సాధనా సమితులను స్థాపించారు. 
* స్వదేశీ బాంధవ్‌ సమితి (బారిసాల్‌), బ్రాతి సమితి (ఫరీద్‌పూర్‌) అనే విప్లవ సంఘాలు వెలిశాయి.
* ఘోష్‌ సోదరులు, భూపేంద్రనాథ్‌ దత్తా, సుబోధ్‌ మాలిక్‌ ‘యుగాంతర్‌’ (జుగాంతర్‌) అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే బ్రిటిష్‌ అధికారులను చంపడం, బాంబులు తయారు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఈ సంఘం పనిచేసింది.
* విప్లవకారులు తమ మొదటి బాంబును తూర్పుబెంగాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పుల్లర్‌పై ప్రయోగించారు. కానీ ఇది విఫలమైంది. తర్వాత 1907, డిసెంబరు 6న మిడ్నాపూర్‌ వద్ద బెంగాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రయాణిస్తున్న రైలును పేల్చేందుకు యత్నించారు. అదే నెలలో ఢాకా జిల్లా మాజీ మెజిస్ట్రేట్‌ లెన్‌ను కాల్చిచంపారు.
* కింగ్స్‌ఫోర్డ్‌ కలకత్తా మెజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు సుశీల్‌సేన్‌ అనే 15 ఏళ్ల యువకుడు వందేమాతరం అని అరిచినందుకు 16 కొరడా దెబ్బలు కొట్టించాడు. దీంతో విప్లవకారులు అతడ్ని హత్య చేయాలని భావించారు. దీన్ని పసిగట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ అధికారిని ముజఫర్‌నగర్‌ (బిహార్‌) మెజిస్ట్రేట్‌గా బదిలీచేసింది. 1908, ఏప్రిల్‌ 30న ఫోర్డ్‌ ప్రయాణిస్తున్న రైలు కోచ్‌పై ఖుదీరాం బోస్, ప్రపుల్లాచాకి అనే ఇద్దరు విప్లవకారులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో బ్రిటిష్‌ అధికారి కెన్నడీ భార్య, కుమార్తె మరణించగా, కింగ్స్‌ఫోర్డ్, కెన్నడీ తప్పించుకున్నారు.
* ప్రపుల్లా చాకి ఆత్మహత్య చేసుకోగా, ఖుదీరాం బోస్‌ను అరెస్ట్‌చేసి, విచారణ అనంతరం ఉరితీశారు. వీరి త్యాగాలను బాలగంగాధర్‌ తిలక్‌ ‘కేసరి’ పత్రికలో ప్రశంసించగా, ఆయనపై రాజద్రోహ నేరం మోపి ఆరేళ్లు మాండలే జైలుకు పంపారు. 


  అలీపూర్‌ కుట్రకేసు
కలకత్తా సమీపంలోని మానిక్‌ టోలాలో విప్లవకారులు (యుగాంతర్‌ సంఘం) బాంబులు తయారుచేసే కర్మాగారాన్ని నిర్వహించారు. 1908, మేలో పోలీసులు దీనిపై దాడిచేసి కొన్ని పేలుడు పదార్థాలు, ముఖ్యమైన ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరబిందో ఘోష్‌తోపాటు మరికొందరిని ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. కేసు విచారణలో నరేంద్రనాథ్‌ గోస్వామి బ్రిటిష్‌ ప్రభుత్వ సాక్షిగా మారి పోలీసులకు సహకరించాడు. వారి రహస్యాలను బ్రిటిష్‌ వారికి చెప్పాడు. దీంతో గోస్వామిని అతడి సహచరులైన కనియలాల్‌ దత్తా,  సత్యేంద్రనాథ్‌ బోస్‌ జైల్లోనే కాల్చిచంపారు. వీరిని 1908, నవంబరు 10న ఉరితీశారు. 
* ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న అశుతోష్‌ బిస్వాస్‌ను విప్లవకారులు కాల్చిచంపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు అరబిందో ఘోష్‌కు చిత్తరంజన్‌దాస్‌ సాయం చేశారు. అయితే బరీంద్రుడితో సహా మరికొందరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. దీన్నే ‘అలీపూర్‌ కుట్రకేసు’గా పేర్కొంటారు.
* 1908, నవంబరులో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సర్‌ ఆండ్రూ ప్రేజర్‌పై హత్యాయత్నం జరిగింది.
* మొదటి ప్రపంచయుద్ధ సమయంలో (191516) జతీంద్రనాథ్‌ ముఖర్జీ ఆధ్వర్యంలో విప్లవ సంఘాలన్నీ బందిపోట్ల నిర్వహణ, హత్యలు లాంటివి చేశాయి. ఈయన ‘బాగ్‌(పులి) జతిన్‌’గా పేరొందాడు.
* రాస్‌ బిహారి బోస్‌ ఆధ్వర్యంలో బెంగాల్, పంజాబ్‌ రాష్ట్రాల్లో విప్లవ కార్యకలాపాలు కొనసాగాయి. బోస్‌ ఆధ్వర్యంలో 1912లో వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింజ్‌పై బాంబు దాడికి ప్రయత్నం జరిగింది. బ్రిటిష్‌వారు బోస్‌ను వారణాసి, ఢిల్లీ, లాహోర్‌ కుట్రకేసుల్లో ఇరికించినా తప్పించుకుని జపాన్‌ చేరాడు. అక్కడ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో పని చేశాడు.
* రెండోదశ విప్లవ కార్యకలాపాలు సహాయనిరాకరణ ఉద్యమం తర్వాత ప్రారంభమయ్యాయి. ఆత్మశక్తి, సారథి లాంటి బెంగాల్‌ పత్రికల్లో గత విప్లవవాదుల సాహసాలు, త్యాగాల వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అనుశీలన్‌ సమితి, యుగాంతర్‌ విప్లవసంఘాలు తమ కార్యక్రమాలను పునరుద్ధరించాయి. 
* సూర్యసేన్‌ నాయకత్వంలో అధికారులను చంపడం, బహిరంగ దోపిడీలు, బాంబుల తయారీని ప్రారంభించారు. ఇతడిని ‘మాస్టర్‌దా’గా పిలిచేవారు. ఈయన చిట్టగాంగ్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా పనిచేశారు.   సేన్‌ ప్రధాన అనుచరులు అనంతసింగ్, గణేష్‌ ఘోష్, లోక్‌నాథ్‌ బాల్‌. 
* సూర్యసేన్‌ నాయకత్వంలో 1930, ఏప్రిల్‌ 18న చిట్టగాంగ్‌ ఆయుధగారంపై దాడి జరిగింది. ముగ్గురు బ్రిటిష్‌ సైనికులను హతమార్చి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ మందుగుండు తీసుకెళ్లడం మరిచారు. టెలిగ్రాఫ్‌ కార్యాలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. సేన్‌ అధ్యక్షతన విప్లవవాదులు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
* ఆంగ్ల ప్రభుత్వం ప్రతిచర్యలు ప్రారంభించగా విప్లవకారులు అడవుల్లోకి పారిపోయారు. 1930, ఏప్రిల్‌ 22న ‘జలాలాబాద్‌’ కొండపైన బ్రిటిష్‌వారికి, విప్లవకారులకు మధ్య 3 గంటల యుద్ధం జరిగింది. ఇందులో 11 మంది విప్లవకారులు; 64 మంది బ్రిటిష్‌ సైనికులు మరణించారు. బ్రిటిష్‌ ప్రభుత్వంతో సాయుధ పోరాటం సాధ్యమనే భావన ప్రజల్లో వ్యాపించింది. అనేక మంది యువకులు, స్త్రీలు ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. విప్లవకారులు ‘హిందుస్తాన్‌ రిపబ్లిక్‌ ప్రజాసైన్యం’ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించారు.
* సూర్యసేన్‌ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలో ఉంటూ కార్యక్రమాలను కొనసాగించారు. 1933, ఫిబ్రవరి 16న ఈయన్ని అరెస్టు చేసి, విచారించి ఉరిశిక్ష ఖరారు చేశారు. 1934, జనవరి 12న ఉరితీశారు. చిట్టగాంగ్‌ దాడి కేసులో 14 మందికి యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష విధించారు.
* ఈ విప్లవోద్యమంలో స్త్రీలు కల్పన దత్‌ (మాండలే జైలు నుంచి విడుదలయ్యాక పీసీ జోషి అనే కమ్యూనిస్ట్‌ని వివాహమాడి కల్పన జోషిగా ప్రసిద్ధిపొందారు.), ప్రీతిలత వడ్డేదార్‌ (చిట్టగాంగ్‌ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో 1932, సెప్టెంబరులో  బాంబు పేల్చారు), వీణాదాస్, భగవతీ చరణ్‌ ఓహ్రా భార్య దుర్గ ఓహ్రా, సుశీల మోహన్‌ లాంటివారు పాల్గొని ప్రాణాలర్పించారు.
* 1930  33 మధ్య 20 హత్యలు, 10 చోట్ల బాంబు దాడులు, ఒక సాయుధ దోపిడి, 8 బాంబు పేలుళ్లు జరిగాయి. న్యాయ, పోలీస్‌ శాఖలకు చెందిన యూరోపియన్‌ అధికారులు ఎక్కువగా హత్యలకు గురయ్యారు.

 

ఉత్తర్‌ ప్రదేశ్‌లో విప్లవం
ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన రాజామహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ బృందావనంలో ఇండిజీనియస్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఐరోపా వెళ్లి జర్మన్‌ల సాయంతో భారత్, విదేశాల్లో సాయుధ పోరాటాలు జరిపేందుకు యత్నించి విఫలమయ్యారు.
* 1923 తర్వాత విప్లవ కార్యక్రమాలను పునరుద్ధరించారు. రాంప్రసాద్‌ బిస్మల్, జోగేశ్‌ ఛటర్జీ, సచీంద్రనాథ్‌ సన్యాల్‌ కలిసి 1924, అక్టోబరులో కాన్పూర్‌లో హిందుస్థాన్‌  రిపబ్లికన్‌ సంఘాన్ని ఏర్పాటుచేశారు. దీని శాఖలు బిహార్, ఉత్తర్‌ ప్రదేశ్, ఢిల్లీ పంజాబ్‌ లో ఉండేవి. ఇదే తర్వాతి కాలంలో హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌గా మారింది. ఈ సంఘం ‘ప్రజా విప్లవం ప్రజల కోసమే’ అనే నినాదాన్ని ప్రతిపాదించింది. బ్రిటిష్‌వారి పట్ల దౌర్జన్యం, వీర త్యాగం మొదలైన చర్యల ద్వారా ప్రజలను ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేసింది.


కకోరి కుట్ర కేసు
రాంప్రసాద్‌ బిస్మల్‌ తన 9 మంది అనుచరులతో కలిసి షహరాన్‌పూర్‌ - లక్నో మార్గంలో కకోరి రైల్వేస్టేషన్‌ వద్ద గొలుసు లాగి రైలును ఆపారు. రైల్వే ఆదాయం, నిల్వ ధనాన్ని కొల్లగొట్టేందుకు ఇలా చేశారు. అష్ఫాఖుల్లా ఖాన్‌ రైల్వే సొమ్ము ఉన్న ఇనుప పెట్టెను బద్దలు కొట్టి, ధనంతో లక్నో వెళ్లిపోయాడు.
* 40 మంది అనుమానితులపై కేసులు పెట్టి, ఏడాది విచారణ చేశారు. కొందరికి జైలుశిక్ష; నలుగురికి ఉరి; నలుగురికి ద్వీపాంతరవాస శిక్ష విధించారు. దీన్నే కకోరి కుట్ర కేసుగా వ్యవహరించారు.
* ఈ కేసులో రాంప్రసాద్‌ బిస్మల్‌ను 1926, డిసెంబరులో  ఉరితీశారు. ఈ సందర్భంగా ‘బ్రిటిష్‌ సామ్రాజ్యం పతనం కావడమే మా లక్ష్యం’ అని ఆయన నినదించారు.
* రాజేంద్ర లాహిరీని ఉరిశిక్ష; మన్మద్‌నాథ్‌ గుప్తాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ తప్పించుకున్నారు.
* చంద్రశేఖర్‌ ఆజాద్‌ నేతృత్వంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లో బిజయ్‌ కుమార్‌ సిన్హా, శివ శర్మ, జైదేవ్‌ కపూర్‌; పంజాబ్‌లో భగత్‌ సింగ్, భగవతీ చరణ్‌ వోహ్రా, సుఖ్‌దేవ్‌ హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ సంఘం కార్యకలాపాలను నిర్వహించారు.
* 1928, సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఒక సమావేశం జరిగింది. ఇందులో హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ సంఘం పేరును ‘హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ సంఘం’గా మార్చారు. 


సైమన్‌ కమిషన్‌
* భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల స్వరూప స్వభావాన్ని అంచనా వేయడానికి  బ్రిటిష్‌ ప్రభుత్వం 1927, నవంబరు 8న ఒక కమిషన్‌ను నియమించింది. దీనికి జాన్‌ సైమన్‌ అధ్యక్షత వహించారు. కమిషన్‌లోని  సభ్యులంతా బ్రిటిష్‌వారే కావడంతో, దీన్ని బహిష్కరించాలని 1927, డిసెంబరులో జరిగిన మద్రాస్‌ కాంగ్రెస్‌ సభలో తీర్మానించారు.
* 1928, ఫిబ్రవరి 3న సైమన్‌ కమిషన్‌లోని సభ్యులు బొంబాయికి వచ్చారు. ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదంతో వారిని బహిష్కరించారు. కలకత్తా, పాట్నా, లాహోర్‌లో కూడా బహిష్కరణ ఉద్యమం జరిగింది.
* 1928, అక్టోబరులో సైమన్‌ కమిషన్‌ లాహోర్‌కు వచ్చింది. వారి రాకను నిరసిస్తూ లాలా లజపతి రాయ్‌ నాయకత్వంలోని హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ సంఘం పెద్ద ఊరేగింపు నిర్వహించారు. దీన్ని చెదరగొట్టడానికి వచ్చిన బ్రిటిష్‌ పోలీస్‌ అధికారి సాండర్స్‌ లజపతి రాయ్‌ను లాఠీ దెబ్బలతో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో 1928, నవంబరు 17న రాయ్‌ మరణించారు. లజపతి రాయ్‌కు పంజాబ్‌ సింహం అనే బిరుదు ఉంది. ఈయన పంజాబీ అనే పత్రికను స్థాపించారు.


లాహోర్‌ కుట్ర కేసు
* లజపతి రాయ్‌ మరణానికి కారకుడైన సాండర్స్‌ను 1928, డిసెంబరు 17న భగత్‌సింగ్, రాజ్‌గురులు, చంద్రశేఖర్‌ ఆజాద్, సుఖ్‌దేవ్‌లు కాల్చి చంపారు. 
* బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజా భద్రతా చట్టం; కార్మిక వివాదాల చట్టం బిల్లులను కేంద్ర శాసన సభలో ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భగత్‌సింగ్, బతుకేశ్వర్‌ దత్‌లు సభలోకి ప్రవేశించి బాంబులు విసిరారు.‘విప్లవం శాశ్వతంగా వర్ధిల్లాలి’ అనే భగత్‌ సింగ్‌ నినాదం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌గా స్థిరపడింది. వీరిని అరెస్ట్‌ చేశారు.
* 1929, మే 7న కోర్టు విచారణ ప్రారంభమై, జూన్‌ 12తో ముగిసింది. 1930, అక్టోబరు 7న రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భగత్‌సింగ్‌లకు ఉరిశిక్ష విధించారు. 1931, మార్చి 23న వారిని లాహోర్‌ జైలులో ఉరితీశారు. మహావీర్‌ తివారీ, విజయ్‌కుమార్‌ సిన్హాలకు ద్వీపాంతరవాస శిక్ష విధించారు. అనేక మందికి దీర్ఘకాల జైలుశిక్షలు వేశారు. చరిత్రలో దీన్నే లాహోర్‌ కుట్ర కేసుగా పేర్కొంటారు. జతీన్‌దాస్‌ జైల్లోనే 64 రోజులు దీక్షచేసి మరణించారు. కలకత్తాలో ఈయన అంతిమ సంస్కారానికి 6 లక్షల మంది హాజరయ్యారు. రెండు మైళ్ల పొడవున ఊరేగింపు నిర్వహించారు. వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన కరాచీలో కాంగ్రెస్‌ మహాసభ జరిగినప్పుడే ఉరిశిక్షలూ అమలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన యువకులు గాంధీజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
* లాహోర్‌లో విప్లవకారులు స్థాపించిన పెద్ద బాంబు తయారీ కర్మాగారాన్ని పోలీసులు  అసెంబ్లీ బాంబు ఘటన అనంతరం కనుక్కున్నారు. అందులో 7000 బాంబుల తయారీకి సరిపడా సామగ్రి లభించింది. షహరాన్‌పూర్‌లో మరో బాంబు తయారీ కర్మాగారాన్ని కనుక్కున్నారు.


చంద్రశేఖర్‌ ఆజాద్‌:
* చంద్రశేఖర్‌ ఆజాద్‌ 1929, డిసెంబరులో వైస్రాయ్‌ ప్రయాణిస్తున్న రైలుపై బాంబులు విసిరాడు. దాడిలో కొంత నష్టం జరిగినా వైస్రాయ్‌ తప్పించుకున్నాడు. సాయుధ పోరాటానికి ఆయుధాలు, ధనాన్ని సమకూర్చేందుకు ఆజాద్‌  1930, జులైలో ఢిల్లీలోని ఓ వ్యాపార కేంద్రంపై దాడిచేసి రూ.14,000 కొల్లగొట్టాడు.
* 1931, ఫిబ్రవరి 26న ఆజాద్‌ అలహాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూను కలిశారు. అనంతరం తన స్నేహితుడ్ని కలిసేందుకు పార్కుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు  చుట్టుముట్టి కాల్పులు జరపగా మరణించారు.

 

తిరునల్వేలి కుట్ర కేసు
* 1906లో తారకనాథ్‌ దాస్‌ మద్రాస్‌లో ‘తారకనాథ బ్రహ్మచారి’ పేరుతో సన్యాసాన్ని స్వీకరించి, ఒక రహస్య సంఘాన్ని స్థాపించారు. చిదంబర పిళ్లై న్యాయవాద వృత్తిని వదిలి, స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ, సొంతంగా ఒక స్వదేశీ నౌకా కంపెనీని స్థాపించారు.
* బిపిన్‌ చంద్రపాల్‌ 1907లో మద్రాస్, ఆంధ్రా ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగాలు చేశారు. తన పర్యటనల్లో వందేమాతరం నినాదం మారుమోగింది. 
* చిదంబరం పిళ్లై ‘వివేకవాణి’ అనే తమిళ పత్రికను; నీలకంఠ బ్రహ్మచారి ‘సూర్యోదయ’, ‘ఇండియా’ అనే పత్రికలను స్థాపించారు.
* నీలకంఠ బ్రహ్మచారి, వాంచి అయ్యర్‌ మరికొందరు కలిసి ‘భారతమాత సంఘం’ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. కాళీ వీరి ఆరాధ్య దేవత. వాంచి అయ్యార్‌ తిరునల్వేలి కలెక్టర్‌గా ఉన్న  ఆషిని 1911, జూన్‌ 19న వాంచి అయ్యర్‌ హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం 14 మందిపై తిరునల్వేలి కుట్రకేసు పెట్టింది.


అల్లూరి సీతారామరాజు:
* 192224లో ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటు చేశారు. మన్యం తిరుగుబాటు నాయకుడిగా పితూరి జరిపారు. బ్రిటిష్‌ వారిపై గెరిల్లా యుద్ధం సాగించారు. ఈయనకు గంటందొర, మల్లుదొర, అగ్గిరాజు ప్రధాన అనుచరులు. ఆ సమయంలో మన్యం ప్రాంత అధికారిగా రూథర్‌ ఫర్డ్‌ నియమితులయ్యాడు. 1924, మే 27న జమేదార్‌ కంచుమీనన్‌ సీతారామరాజును బంధించగా మేజర్‌ గుడాల్‌ రాజును కాల్చి చంపాడు.


ఇతర కుట్ర కేసులు
* గోదావరి జిల్లాలో ప్రతివాది భయంకర వెంకటాచారి ‘ఉజ్జీవన్‌ భారత్‌ సమ్మేళన్‌’ అనే విప్లవ సంస్థను స్థాపించారు. ఆ సమయంలో ముస్తఫా అలీఖాన్, డప్పుల సుబ్బారావు అనే పోలీసు అధికారులు ప్రజలను ఇబ్బందులు పెట్టేవారు. వీరిని అంతం చేసేందుకు కె.కామేశ్వర శాస్త్రి, సి.హెచ్‌.నరసింహాచారి, ఓ.రామచంద్రయ్య తదితరులు 1933, ఏప్రిల్‌ 6, 14 తేదీల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు కాకినాడ కుట్రకేసులో భయంకరాచారికి జైలు శిక్ష విధించి అండమాన్‌ జైలుకు పంపారు. మిగతావారికి ఇతర శిక్షలు వేశారు.
* 1933, మార్చిలో 20 మంది కలసి హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ అనుబంధ సంస్థను మద్రాస్‌లో స్థాపించారు. దీని శాఖలు ఆంధ్రాలోనూ ఉండేవి. మద్రాస్‌ కుట్రకేసు పేరుతో వీరిని బంధించి బ్రిటిష్‌ ప్రభుత్వం శిక్షలు విధించింది.
* పంజాబ్‌లో విప్లవోద్యమానికి కృషి చేసిన వారిలో అంబా ప్రసాద్‌; లాల్‌చంద్‌ హలక్‌;  ధనవత్‌రాయ్‌ ముఖ్యులు.
* అజిత్‌సింగ్‌ లాహోర్‌లోని భారతమాత సమితికి చెందినవారు. బెంగాల్‌ విప్లవకారులతో ఇతడికి సంబంధం ఉండేది. లాలా లజపతి రాయ్, అజిత్‌సింగ్‌లు 190607లో పంజాబ్‌లో రైతు ఉద్యమాన్ని చేపట్టారు.
* పంజాబ్, బెంగాల్‌ విప్లవోద్యమ సంధానకర్తగా రాస్‌ బిహారి ఘోష్‌ పనిచేశారు.
* 1904లో షహరాన్‌పూర్‌లో ఒక రహస్యసంఘాన్ని స్థాపించారు. తర్వాత రూర్కీ దీని ప్రధాన కేంద్రమైంది. లాలా హరదయాళ్‌ ఇందులో సభ్యుడిగా ఉంటూ సంఘానికి నాయకత్వం వహించారు. 1909లో ఈయన అమెరికాకు వెళ్లగా దీననాథ్, రాస్‌ బిహారీ బోస్‌లు సంఘానికి నాయకత్వం వహించారు.
* దేశంలోని మొదటి రాజకీయ హత్య 1897, జూన్‌ 22న పుణె (మహారాష్ట్ర)లో జరిగింది. ప్లేగ్‌ కమిటీ కమిషనర్‌ రాండ్‌ను హత్య చేశారు. ఇందులో చాపేకర్‌ సోదరులు (దామోదర్‌ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్, వాసుదేవ హరి చాపేకర్‌) కీలకపాత్ర పోషించారు. ఈ ఘటనలో లెఫ్టినెంట్‌ అయిరెస్ట్‌ కాల్పులకు గురయ్యారు. చాపేకర్‌ సోదరులను ఉరితీశారు.
* 1905లో శ్యామ్‌జీ కృష్ణవర్మ లండన్‌లో ‘ఇండియా హోమ్‌రూల్‌ సొసైటీ’ని స్థాపించారు. ఇది ‘ఇండియా హౌస్‌’గా ప్రసిద్ధి చెందింది.
* 1899లో నాసిక్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)లో వి.డి.సావర్కర్‌ ‘మిత్రమేళా’ను స్థాపించారు. 1904లో దీని పేరును అభినవ భారత్‌ సంఘంగా మార్చారు. 
* ఈయన తమ్ముడైన గణేష్‌ సావర్కర్‌ ఈ విప్లవ సంఘంలో కీలకపాత్ర పోషించారు. వీరి పత్రిక పేరు కల్‌. ఇది మహారాష్ట్ర నుంచి వెలువడింది.
* నాసిక్‌ కుట్ర కేస్బు1909్శలో గణేష్‌ సావర్కర్‌కు నాసిక్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ జాక్సన్‌ కాలాపాని శిక్షను విధించారు. 1909లో మదన్‌లాల్‌ ధింగ్రా లండన్‌లో కల్నల్‌ విలియం కర్జన్‌ వైలీని కాల్చిచంపాడు. గణేష్‌ సావర్కర్‌లను లండన్‌లో ఉరితీశారు.
* సచీంద్ర సన్యాల్, రాస్‌ బిహారీ బోస్‌లు వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింజ్‌ - II పై ఢిల్లీలో బాంబులు విసరగా ఆయన తప్పించుకున్నాడు. దీన్నే వారణాసి కుట్ర కేసుగా పేర్కొంటారు. అనంతరం బోస్‌ జపాన్‌ వెళ్లిపోగా, సచీంద్ర సన్యాల్‌ అరెస్టయ్యాడు. ఈయన బంధీజీవన్‌ అనే పుస్తకాన్ని రాశారు.
* శరత్‌చంద్ర ఛటర్జీ రచించిన పతెర్‌ దబి నవలను బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది.
* ఆంగ్లేయ చరిత్రకారులు విప్లవకారులను కుట్రదారులుగా, హంతకులుగా, బందిపోట్లుగా పేర్కొనగా, భారతీయులు వీరిని ‘సమరశీల జాతీయవాదులు’గా వర్ణించారు.

 

విదేశాల్లో భారత విప్లవకారులు (Revolutionary movements outside India)

విదేశాల్లో స్థిరపడిన కొందరు భారతీయులు భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయా దేశాల్లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు కొనసాగించారు. ముఖ్యంగా ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్, ఆఫ్గనిస్థాన్, జర్మనీ దేశాల్లోని భారతీయులు ఈ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమాలు, విప్లవకారుల గురించి పరీక్షార్థులకు అవగాహన అవసరం.


శ్యామ్‌జీ కృష్ణవర్మ
ఈయన 1857, అక్టోబరు 4న గుజరాత్‌లోని మాండవిలో జన్మించారు. శ్యామ్‌జీ ఆర్యసమాజ్‌ స్థాపకులైన దయానంద సరస్వతి శిష్యులు. 1875లో భాటియా వర్గానికి చెందిన భానుమతిని వివాహం చేసుకున్నారు.
* కృష్ణవర్మ న్యాయవాదిగా, పత్రికా రచయితగా పనిచేశారు. బొంబయిలోని విల్సన్‌ హైస్కూల్‌లో సంస్కృతం నేర్చుకున్నారు. 1877లో కాశీ పండిట్ల నుంచి ‘పండిట్‌’ బిరుదును పొందారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మానియర్‌ విలియమ్స్‌ సాయంతో లండన్‌లో బారిస్టర్‌ పరీక్ష ఉత్తీర్ణులై, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
* 1881లో బెర్లిన్‌లో జరిగిన ప్రాచ్య సంస్కృతి అభిమానుల సమ్మేళనానికి  (Berlin Congress of Orientalists) భారత ప్రతినిధిగా కృష్ణవర్మ హాజరయ్యారు. ఇంగ్లండ్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక ఉదయ్‌పూర్‌ సంస్థానంలో కౌన్సిల్‌ మెంబర్‌గా; జునాగఢ్‌ సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు.
* ఈయనపై స్వామి దయానంద సరస్వతి, లోకమాన్య తిలక్‌; హెర్బర్ట్‌ స్పెన్సర్‌ రచనల ప్రభావం అధికంగా ఉండేది.
* దేశానికి స్వాతంత్య్రం రావాలని కాంక్షిస్తూ 1897లో బ్రిటన్‌ వెళ్లి అక్కడ విప్లవభావాలను ప్రచారం చేశారు.
* 1905లో లండన్‌ కేంద్రంగా ‘ద ఇండియన్‌ సోషియాలజిస్ట్‌’ అనే ఇంగ్లిష్‌ మాసపత్రికను స్థాపించారు.  
* 1905, ఫిబ్రవరి 18న లండన్‌లో ‘ఇండియన్‌ హోమ్‌ రూల్‌ సొసైటీ’ని స్థాపించారు. స్వరాజ్య సాధన కోసం ప్రజలు ఏకం కావాలనే లక్ష్యంతో ఈ సొసైటీ పనిచేసింది.
* ప్రజల్లో విప్లవభావాలను పెంపొందించడానికి, ఇంగ్లండ్‌లోని భారతీయులను ఏకం చేసేందుకు ‘ఇండియా హౌస్‌’ను ఏర్పాటు చేశారు. వి.డి.సావర్కర్, మేడం బికాజీ కామా, ఎస్‌.ఆర్‌.రానా, వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ, లాలా హర్‌దయాళ్‌ మొదలైన వారికి దీంతో సంబంధాలు ఉండేవి.
* శ్యామ్‌జీ కార్యకలాపాలపై బ్రిటిష్‌ ప్రభుత్వం నిఘా పెట్టింది. దీంతో ఆయన పారిస్‌ వెళ్లిపోయారు. తర్వాత జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించారు. ‘ఇండియన్‌ హౌస్‌’ బాధ్యతలను వీర్‌ సావర్కర్‌కు అప్పగించారు.
* శ్యామ్‌జీ కృష్ణవర్మ 1930, మార్చి 30న జెనీవా (స్విట్జర్లాండ్‌)లో మరణించారు. ఆయన స్మారక చిహ్నాన్ని గుజరాత్‌లోని కచ్‌లో ‘క్రాంతి తీర్థ్‌’ పేరుతో ఏర్పాటు చేశారు. 1989, అక్టోబరు 4న ఈయన పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు.


మేడం బికాజీ కామా
ఈమె 1861, సెప్టెంబరు 24న బొంబయిలోని ఒక పార్శీల కుటుంబంలో జన్మించారు. 1885, ఆగస్టులో రుస్తుం కామాతో వివాహమైంది. జర్మనీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్‌ మొదలైన దేశాల్లో నివసించి, చివరకు లండన్‌ చేరారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ నిర్వహించే విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొంతకాలం దాదాభాయ్‌ నౌరోజీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు.
* యూరప్, అమెరికా, ఫ్రాన్స్‌ మొదలైన దేశాల్లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు కొనసాగిస్తూ భారత స్వాతంత్య్రం కోసం కృషి చేశారు.
* 1907, ఆగస్టు 22న జర్మనీలోని స్టట్‌గార్డ్‌లో జరిగిన ప్రపంచ సోషలిస్ట్‌ మహాసభకు హాజరయ్యారు. అక్కడ భారత జాతీయ పతాకాన్ని రూపొందించి, ఎగరేశారు. ఇలా జాతీయజెండాను విదేశాల్లో మొదటిసారి ఎగరేసిన స్త్రీగా గుర్తింపు పొందారు. ఆ జెండాలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులు ఉన్నాయి.
* 1935లో భారత్‌కు తిరిగివచ్చిన ఆమె 1936, ఆగస్టు 13న మరణించారు.


ఒబైదుల్లా
1872 మార్చి 10న సియాల్‌కోట్‌ (పంజాబ్‌)లో ‘సిక్కు ఖత్రీ’ అనే కుటుంబంలో  జన్మించారు. ఈయన పేరు ‘బూటాసింగ్‌ ఉప్పల్‌’. పదిహేనేళ్ల వయసులో ఇస్లాంను స్వీకరించి, ‘మౌలానా ఒబైదుల్లా సింధీ’గా పేరు మార్చుకున్నారు. ఈయన జాతి డైరీ (ఏన్‌ ఆటో బయోగ్రఫీ), సఫర్నామా- ఐ - కబుల్‌ అనే రచనలు చేశారు. విప్లవ చరిత్రలో ‘సిల్క్‌ లేఖల’ రచయితగా గుర్తింపు పొందారు.
* ఒబైదుల్లా తన గురువైన మహ్మద్‌ - అల్‌- హసన్‌ సలహా మేరకు ‘జమియత్‌ - ఉల్‌- అన్సార్‌’ సంస్థను స్థాపించారు. 
* బ్రిట్‌ష్‌వారిని భారత్‌ నుంచి వెళ్లగొట్టేందుకు మహ్మద్‌-అల్‌ హసన్‌ 1915లో ఒబైదుల్లాను కాబుల్‌కు పంపారు. అక్కడ రాజమహేంద్ర ప్రతాప్‌ బ్రిటిష్‌ వ్యతిరేక ప్రణాళికలు రచించారు. అవి ఒబైదుల్లాకు నచ్చడంతో జర్మనీ సహకారం కోసం ప్రయత్నించారు. 
* ఆఫ్గనిస్థాన్‌ అమీర్‌ హబీబుల్లాఖాన్‌  భారత జాతీయ కాంగ్రెస్‌తో సహకరించాలని  ఒబైదుల్లాను కోరాడు. అప్పటి జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ అన్సారీ సిఫార్సు మేరకు ఒబైదుల్లా అధ్యక్షతన కాబుల్‌లో కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటైంది.
* బెర్లిన్‌లో ఏర్పాటుచేసిన  భారత స్వాతంత్య్ర కమిటీ  (Indian Independence Committee) కాబుల్‌కు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. ఇందులో రాజమహేంద్ర ప్రతాప్, అబ్దుల్‌ హఫీజ్‌ మహ్మద్‌ బర్కతుల్లా, జర్మన్‌ అధికారులు వెర్నర్‌ ఒట్టో ఒన్‌ హెన్టీగ్, ఆస్కార్‌ నీడర్‌మేయర్, ఇతర సభ్యులు ఉన్నారు.
* భారతదేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా వీరు 1915, డిసెంబరు 1న ఆఫ్గనిస్థాన్‌లో తాత్కాలిక భారత ప్రభుత్వాన్ని  (Provisional government of India) ఏర్పాటుచేశారు. ఇందులో రాజమహేంద్ర ప్రతాప్‌ ప్రెసిడెంట్‌గా, బర్కతుల్లా ప్రధానమంత్రిగా, ఒబైదుల్లా భారత వ్యవహారాలు, హోం శాఖ మంత్రిగా, దియోబంద్‌ నాయకుడు మౌలావి బషీర్‌ యుద్ధమంత్రిగా, చంపకరామన్‌ పిళ్లై విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
* గాలిబ్‌ పాషా వీరికి సహకరించి బ్రిటిష్‌ ప్రభుత్వంపై ‘జిహాద్‌’ ప్రకటించారు.
* ఈ తాత్కాలిక ప్రభుత్వానికి చైనా, రష్యా, జపాన్, జర్మనీ మొదలైన దేశాల గుర్తింపు లభించలేదు. 
* మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ, టర్కీలు ఓడిపోవడంతో విప్లవకారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒబైదుల్లాను ఆఫ్గనిస్థాన్‌ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన మాస్కో (రష్యా), అంకారా (టర్కీ)కి వెళ్లారు. 
* 1939లో ఒబైదుల్లా భారత్‌కు తిరిగి వచ్చారు. 1944లో కాన్పూర్‌లోని దీన్‌పూర్‌ గ్రామంలో మరణించారు.


బర్కతుల్లా
ఈయన 1854, జులై 7న భోపాల్‌ (మధ్యప్రదేశ్‌)లో జన్మించారు. అసలుపేరు అబ్దుల్‌ హఫీజ్‌ మహ్మద్‌ బర్కతుల్లా. ఈయన ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ భారత జాతీయవాదులతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. లాలా హర్‌దయాళ్, రాజమహేంద్ర ప్రతాప్‌తో కలిసి పనిచేశారు. గదర్‌ పార్టీ స్థాపకుల్లో ఒకరు. 
* 1904లో యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ హిందుస్థానీగా నియమితులయ్యారు. 
* శ్యామ్యూల్‌ లుకాస్‌ జోషితో కలిసి పాన్‌  - ఆర్యన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు.
* ‘ఇస్లాం ఫ్రెటర్నిటీ’ అనే పత్రికను ప్రచురించారు. అయితే, బ్రిటిష్‌ ప్రభుత్వ ఒత్తిడి వల్ల జపాన్‌ ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించింది.
* 1914లో బెర్లిన్‌ వెళ్లి అక్కడ ఇండియన్‌ నేషనల్‌ పార్టీలో చేరారు. 
* జర్మనీలో ‘నయా ఇస్లాం’ అనే పత్రికకు  సంపాదకుడిగా పనిచేశారు.
* ఈయన 1927 సెప్టెంబరు 20న అమెరికాలో మరణించారు.
* ఈయన గౌరవార్థం భోపాల్‌ యూనివర్సిటీ పేరును 1988లో ‘బర్కతుల్లా యూనివర్సిటీ’గా మార్చారు.


రాజమహేంద్ర ప్రతాప్‌సింగ్‌
* ఈయన 1886, డిసెంబరులో ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించారు. మహమ్మదన్‌ ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజ్‌  (Muhammadan Anglo-Oriental college)లో విద్యనభ్యసించారు. ఇదే యూపీలో ప్రస్తుతం ఉన్న అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ. 
* 1906లో కోల్‌కతా కాంగ్రెస్‌ సమావేశానికి హాజరై అనేకమంది నాయకులను కలిసి, స్వదేశీ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. ఈయనపై దాదాభాయ్‌ నౌరోజీ, బాలగంగాధర్‌ తిలక్, మహారాజా ఆఫ్‌ బరోడా, బిపిన్‌ చంద్రపాల్‌ల ప్రభావం ఉండేది.
* 1909, మే 24న బృందావన్‌లో ‘ప్రేమ్‌ మహావిద్యాలయ’ను స్థాపించారు.
* బెర్లిన్‌లోని ‘ఇండియన్‌ సొసైటీ’లో చేరారు.
* 1929లో జపాన్‌లో వరల్డ్‌ ఫెడరేషన్‌ అనే మాస పత్రికను ప్రారంభించారు. ఆల్‌ ఇండియా జాట్‌ మహాసభ, ఇండియన్‌ ఫ్రీడం ఫైటర్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.
* 1932లో మహేంద్ర ప్రతాప్‌ నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. ఈ బహుమతికి నామినేట్‌ అయిన మొదటి విప్లవకారుడు ఈయనే.
* మై లైఫ్‌ స్టోరీ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు.
* 1940లో జపాన్‌లో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు.
* 1946లో భారతదేశానికి తిరిగి వచ్చి 1957-62 మధ్య కాలంలో ఎంపీగా పనిచేశారు. 92 ఏళ్ల వయసులో 1979, ఏప్రిల్‌ 29న మరణించారు.


గదర్‌ పార్టీ - లాలా హర్‌దయాళ్‌
* హర్‌దయాళ్‌ 1884, అక్టోబరు 14న ఢిల్లీలో జన్మించారు. పూర్తి పేరు లాలా హర్‌దయాళ్‌ సింగ్‌ మాథూర్‌. పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. 1905లో ఉపకారవేతనంపై ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేరారు. శ్యామ్‌జీ కృష్ణవర్మతో కలిసి ఐరోపా ఖండంలో బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
* లాలా హర్‌దయాళ్‌ 1913, నవంబరులో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గదర్‌ పార్టీని స్థాపించారు. విదేశాల్లో నివసించే భారతీయులను విప్లవంలో భాగస్వాముల్ని చేయడం దీని లక్ష్యం. దీనికి అధ్యక్షులుగా సోహన్‌ సింగ్‌ భక్నా ఎన్నికయ్యారు.
* గదర్‌ పార్టీ సమావేశాలు లాస్‌ఏంజెల్స్, వియన్నా, వాషింగ్టన్, షాంఘైల్లో జరిగాయి.
* గదర్‌ పార్టీ ఉద్యమాల్లో హర్‌దయాళ్‌కు భాయ్‌ పరమానంద్, సోహన్‌ సింగ్‌ భక్నా, హర్నామ్‌సింగ్‌ సహకరించారు.
* బ్రిటిష్‌ ప్రతినిధి ఫిర్యాదుతో అమెరికన్‌ అధికారులు హర్‌దయాళ్‌ను నిర్భంధించి వలస చట్టం (Immigration Law) ప్రకారం విచారించారు. బెయిల్‌పై విడుదలైన హరదయాళ్‌ అమెరికా నుంచి జెనీవా (స్విట్జర్లాండ్‌) వెళ్లారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ, వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ, తారక్‌నాథ్‌ దాస్, చంపక రామన్‌ పిళ్లె, చంద్ర చక్రవర్తి, బర్కతుల్లా మొదలైన వారితో కలిసి విప్లవ కార్యక్రమాలు కొనసాగించారు.
* మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యాక  గదర్‌ పార్టీకి చెందిన దాదాపు 3 వేల మంది భారతదేశానికి వచ్చారు. వీరు 1915, ఫిబ్రవరి 21ని విప్లవదినంగా ప్రకటించారు. కానీ  సరైన నాయకత్వం లేకపోవడం, వీరి సమాచారం బ్రిటిష్‌ వారికి తెలియడంతో విప్లవకారులు అరెస్టయ్యారు.
* ఆంధ్రా ప్రాంతానికి చెందిన దర్శి చెంచయ్య గదర్‌ పార్టీలో కొన్నిరోజులు పనిచేశారు.
* లాలా హర్‌దయాళ్, మరి కొందరు విప్లవకారులు భారత స్వాతంత్య్ర పోరాట నిర్వహణకు జర్మనీలోని బెర్లిన్‌లో ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ కమిటీ’ని స్థాపించారు. దీనికి ఆ దేశ మద్దతును పొందారు. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓడిపోవడంతో కమిటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
* లాలా హర్‌దయాళ్‌ అవర్‌ ఎడ్యుకేషన్‌ ప్రాబ్లం, థాట్స్‌ ఆన్‌ ఎడ్యుకేషన్, సోషల్‌ కాంక్యుస్ట్‌ ఆఫ్‌ హిందూ రేస్‌ అనే రచనలు చేశారు. ఈయన 1939, మార్చిన 4న అమెరికాలో మరణించారు.

 

వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ (1880-1937)
* ఈయన 1880లో హైదరాబాద్‌లో జన్మించారు. 
* వీరేంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ సరోజినీ నాయుడికి సోదరుడు.
* ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ వీర్‌ సావర్కర్‌తో కలిసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
* ఛటోపాధ్యాయ బహుభాషా కోవిదుడు. తెలుగు, తమిళం, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిష్ణాతులు. అనంతరం ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, డచ్, రష్యన్, స్కాండినేవియన్‌ భాషలు నేర్చుకున్నారు.
* మద్రాస్, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు.
* ఇంగ్లండ్‌లో ‘తల్వార్‌’ అనే విప్లవ పత్రికలో పనిచేశారు.
* మేడం బికాజీ కామాతో కలిసి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
* 1919లో బెర్లిన్‌లో భారత విప్లవకారుల రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* బెర్లిన్‌లో స్థాపించిన ‘ఇండియా స్వాతంత్య్ర కమిటీ’కి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
* 1920లో భారత్‌లో ఎం.ఎన్‌.రాయ్‌ కొనసాగించిన విప్లవాత్మక జాతీయవాద ఉద్యమానికి ఆర్థిక, రాజకీయ మద్దతు అందించారు.
* వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ 1921, డిసెంబరులో రాస్‌ బిహారీ బోస్‌తో కలిసి ‘ఇండియన్‌ న్యూస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌’ బ్యూరోను జపాన్‌లో ఏర్పాటు చేశారు.
* ఎం.ఎన్‌.రాయ్‌ సలహాతో ‘కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ జర్మనీ’లో చేరారు.
* 1937, జులైలో ఈయన్ను అరెస్టు చేసి సెప్టెంబరులో ఉరితీశారు.


జతిన్‌ ముఖర్జీ (1879-1915)
* ఈయన బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  బెంగాల్‌లో తిరుగుబాటు చేశారు. యుగాంతర్‌ పార్టీలో ప్రధాన నాయకుడు.
* 1906లో పులితో పోరాడి విజయం సాధించడం వల్ల ఈయన్ను బాఘ్‌ జతిన్, టైగర్‌ జతిన్‌ అని కూడా పిలుస్తారు.
* గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదాన్ని వ్యాప్తి చేసేందుకు గ్రామ బోర్డులను ఏర్పాటు చేశారు.
* ఈయన బోలానందగిరి అనే సన్యాసి శిష్యుడు.
* బరీంద్రకుమార్‌తో కలిసి దియోఘర్‌లో బాంబు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 
* కొన్ని రోజులు యుగాంతర్‌ రహస్య సమాజం అనే సంఘానికి నాయకత్వం వహించారు.
* జిడ్డు గోపాల ముఖర్జీ ఈయన కార్యకలాపాలకు సహకరించేవారు.
* 1915, సెప్టెంబరు 10న బ్రిటిష్‌ పోలీసుల చేతిలో గాయపడిన జతిన్‌ ఒడిశాలోని బాలాసోర్‌లో మరణించారు.

 

చంపక్‌ రామన్‌ పిళ్లై (1891-1934)
* 1891, సెప్టెంబరు 15న కేరళలోని తిరువనంతపురంలో తమిళ దంపతులకు జన్మించారు.
* భారత్‌ నుంచి వెళ్లి జర్మనీలో స్థిరపడ్డారు. 
* మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీలో భారతీయ స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఐరోపాలోని భారతీయ సైనికులను చేర్చుకునేందుకు ప్రయత్నించారు.
* లాలా హర్‌దయాళ్, తారక్‌నాథ్‌ దాస్, బర్కతుల్లాతో కలిసి బెర్లిన్‌లో భారత జాతీయ పార్టీని స్థాపించారు. 
* 1915లో ఆప్ఘనిస్థాన్‌లో రాజమహేంద్ర ప్రతాప్‌ స్థాపించిన తాత్కాలిక భారత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
* రామన్‌ పిళ్లై వలస ప్రజల కోసం పీడిత జాతుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 


దర్శి చెంచయ్య (1890-1964)
* 1890, డిసెంబరు 28న ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జన్మించారు. 
* చిన్నతనంలో ఈయనపై వీరేశలింగం ప్రభావం ఎక్కువగా ఉండేది. 
* ఒంగోలులో మెట్రిక్యులేషన్, చెన్నైలో బీఏ పూర్తి చేశారు. వ్యవసాయ శాస్త్రంపై మక్కువతో 1912లో అమెరికా వెశ్లారు. అక్కడ చదువుకుంటూనే గదర్‌ పార్టీలో వ్యవస్థాపక సభ్యులుగా చేరారు.
* బర్మా సరిహద్దులో ఉన్న తిరుగుబాటు దళాలకు సంధానకర్తగా వ్యవహరించారు.
* ఈయన్ను కాన్పూర్‌ కుట్రకేసులో ఇరికించాలని బ్రిటిష్‌వారు విఫలయత్నం చేశారు. 
* స్త్రీ విద్యావ్యాప్తి, వేశ్యా వృత్తి నిర్మూలనకు కృషి చేశారు. 
* ఈయన 1964, డిసెంబరు 30న మరణించారు.


అరబిందో ఘోష్‌
* విప్లవవాద జాతీయోద్యమ నాయకుల్లో అరబిందో ఘోష్‌ ప్రముఖుడు. ఈయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదివి ఐసీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐసీఎస్‌ పదవిని నిరాకరించి, 1892లో భారతదేశానికి వచ్చారు.
* బొంబాయికి చెందిన ఇందు ప్రకాశ్‌ పత్రికలో ‘న్యూ ల్యాంప్స్‌ ఫర్‌ ఓల్ట్‌’ శీర్షికతో 1893, ఆగస్టు నుంచి 1894, మార్చి వరకు వ్యాసాలు రాశారు.
* వందేమాతరం పత్రిక నిర్వహణలో బిపిన్‌ చంద్రపాల్‌కు సహకరించారు. బెంగాల్‌లో యుగాంతర్‌ అనే దినపత్రికలో వ్యాసాలు రాశారు.
* బెంగాల్‌లో జాతీయ కళాశాలను స్థాపించారు.


మరికొందరు వ్యక్తులు..
* ఇంగ్లండ్‌లో మదన్‌లాల్‌ దింగ్రా అనే విప్లవకారుడు ‘కర్జన్‌ విళ్లై’ అనే బ్రిటిష్‌ అధికారిని హత్యచేశాడు. 1992లో భారత ప్రభుత్వం దింగ్రా పేరుమీద స్టాంప్‌ను విడుదల చేసింది.
* సావర్కర్‌ సోదరులు 1904లో అభినవ భారత్‌ మండలి  (Young India Society)ని స్థాపించారు. 
* వి.డి. సావర్కర్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే 1899లో మిత్రమేళా అనే సంస్థను స్థాపించారు.

 

కోమగటమారు సంఘటన
* పంజాబ్‌లోని చాలా మంది సిక్కులు బ్రిటిష్‌ కొలంబియా (కెనడా పశ్చిమ తీరం)లో స్థిరపడ్డారు. కెనడా చట్టాల ప్రకారం భారతదేశం నుంచి నేరుగా వచ్చేవారికి ప్రవేశ అనుమతి లభించేది. 
* 1914, ఏప్రిల్‌ 14న హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న 165 మంది భారతీయులు దూరప్రాచ్యంలో వాణిజ్యవేత్త అయిన గురుదత్‌ సింగ్‌ నాయకత్వంలో కెనడాలోని వాంకోవర్‌ నగరానికి కోమగటమారు అనే జపాన్‌ నౌకలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మరికొన్ని రేవు పట్టణాల్లో నివసించే భారతీయులు కూడా వారితో కలిశారు.  ఆ నౌక 376 మంది (351 మంది సిక్కులు) ప్రయాణికులతో మే 23న వాంకోవర్‌ రేవును చేరింది. కానీ అందులోని ప్రయాణికులను కెనడా ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆ నౌక తిరిగి భారతదేశానికి (కలకత్తా) రావాలని బ్రిటిష్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ నౌక కలకత్తాలోని బడ్జ్‌ - బడ్జ్‌ రేవుకు వచ్చింది.
* కోమగటమారు నౌకలోని ప్రయాణికులను గదర్‌ పార్టీకి చెందిన విప్లవకారులుగా   భావించిన బ్రిటిష్‌వారు వారిని అరెస్ట్‌ చేయాలనుకున్నారు. దీంతో బ్రిటిష్‌ పోలీసులకు, నౌకలోని ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్‌ కాల్పుల్లో 18 మంది మరణించగా, 202 మందిని అరెస్టు చేశారు. గురుదత్‌ సింగ్‌ గాయాలతో అక్కడి నుంచి  తప్పించుకొని పారిపోయారు.
* గదర్‌ పార్టీ పిలుపు మేరకు మనీలా, షాంఘై, హాంగ్‌కాంగ్‌ల నుంచి సిక్కులతో కూడిన తోసమరు అనే మరో ఓడ 1914, అక్టోబరు 29న కలకత్తాకు చేరింది. వీరిలో కొంతమందిని బంధించి జైలుకు పంపగా, మరికొందరు రహస్య విప్లవ కార్యకలాపాలు కొనసాగించారు.
* మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యాక ఆయుధాలు, సైనికుల మద్దతు కోసం మహ్మద్‌ బర్కతుల్లా, భగవాన్‌సింగ్, రామ్‌చంద్ర మొదలైనవారు బహిరంగ సమావేశాలు నిర్వహించి, భారత్‌లో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. కర్తార్‌ సింగ్‌ శరభ, రఘువర్‌ దయాల్‌ గుప్తా లాంటి వారు భారతదేశానికి వచ్చారు.
* సుమారు 8000 మంది గదర్‌ పార్టీ కార్యకర్తలు భారతదేశానికి వచ్చి విప్లవంలో  పాల్గొన్నారు. బ్రిటిష్‌ వారు వీరిని అణిచివేశారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌