• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగరికత

క్రీ.శ. 1921 లో జరిగిన ఒక సంఘటన భారతదేశ చరిత్రనే కాకుండా పురావస్తు శాస్త్ర గతిని కూడా మార్చేసింది. రాయ్‌బహద్దూర్ దయారాం సహాని 1921 లో ప్రసిద్ధ హరప్పా నగరాన్ని సింధునదికి ఉపనది అయిన రావి నది ఒడ్డున కనుక్కున్నారు. 1922 లో ఆర్.డి. బెనర్జీ సింధునది కుడి ఒడ్డున ఉన్న మొహంజోదారోను కనుక్కున్నాడు.
సింధు నాగరికతకు పురావస్తు శాస్త్రజ్ఞులు వివిధ పేర్లను ప్రతిపాదించారు. క్రీ.పూ. 3000 నాటి సుమేరియా నాగరికతతో హరప్పా నాగరికతకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా దీన్ని మొదట ఇండో-సుమేరియా నాగరికతగా పిలిచారు. ఇది సింధు నది లోయలో అభివృద్ధి చెందడం వల్ల దీన్ని సింధు నాగరికత అని కూడా అంటారు. సర్ జాన్ మార్షల్ దీన్ని హరప్పా నాగరికత (లేదా) సంస్కృతిగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఏ ప్రదేశంలో ఒక నాగరికతను మొదట కనుక్కుంటారో దాని ఆధారంగా ఆ సంస్కృతికి పేరు పెట్టడం పురావస్తు శాస్త్ర సంప్రదాయం. అనేక సింధు లోయ ప్రదేశాలు హక్ర - ఘగ్గర్ నదీ ప్రాంతంలో కనుక్కోవడం వల్ల దీన్ని సరస్వతి సింధు నాగరికత అని పిలుస్తున్నారు.


* కాలం: వేద సాహిత్యం ప్రకారం క్రీ.పూ. 2000 సంవత్సరానికి ముందు భారతదేశ చరిత్ర, సంస్కృతి ఉన్నట్లు ఆధారాలు లేవు. అయితే, మొహంజోదారో, హరప్పా, చాన్హుదారో, ఇతర సింధులోయ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల ఆధారంగా క్రీ.పూ. 3200 ఏళ్లనాటి సంస్కృతి వెలుగులోకి వచ్చింది. సుమేరియా, అక్కడ్, బాబిలోనియా, ఈజిప్టు, అస్సీరియా లాంటి గొప్ప ప్రాచీన నాగరికతలకు ఏమాత్రం తీసిపోని నాగరికత హరప్పా ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. రేడియో కార్బన్ డేటింగ్ విధానం ద్వారా క్రీ.పూ. 2500 - 1750 మధ్య ఈ నాగరికత పరిణితి చెందే దశలో ఉన్నట్లు తెలుస్తోంది.


* భౌగోళిక వ్యాప్తి: ఈ నాగరికత ప్రస్తుత పాకిస్థాన్, వాయవ్య భారతదేశంలో ఉండేది. ఇది ఉత్తరాన జమ్మూలోని మాండ నుంచి దక్షిణాన దైమాబాద్ వరకు, తూర్పున పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్ నుంచి పశ్చిమాన బెలూచిస్థాన్‌లోని సుత్కాజెండర్ వరకు విస్తరించింది. పాకిస్థాన్‌లోని హరప్పా, మొహంజోదారో, చాన్హుదారో, భారత్‌లో గుజరాత్‌లోని లోథల్, రంగపూర్, సుర్కోటుడా, రాజస్థాన్‌లోని కాలిబంగన్, హరియాణాలోని బన్వాలి, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్‌లు ఈ నాగరికతకు చెందిన ప్రధాన నగరాలు. దీనికి సంబంధించి తాజాగా కనుక్కున్న ప్రదేశం గుజరాత్‌లోని ధోలవీరా. డాక్టర్ జగపతిజోషి, డాక్టర్ ఆర్.ఎస్. బిస్త్‌లు ఈ ప్రదేశంలో నిర్వహించిన తవ్వకాల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఇది సింధులోయ నాగరికతకు సంబంధించిన అతిపెద్ద ప్రదేశం. హరప్పా సంస్కృతి 1.3 మిలియన్ చ.కి.మీ.ల మేర వ్యాపించి, క్రీ.పూ. 3000 - 2000 మధ్య విలసిల్లింది. ప్రపంచ నాగరికతల్లో ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించిన నాగరికతగా ఇది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.


సామాజిక జీవనం
    హరప్పా ప్రజల సామాజిక జీవనం గురించి తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన ఆధారం అక్కడి తవ్వకాల్లో లభించిన వస్తువులే. వీటికి సంబంధించిన శాసనాలు కానీ, లిఖిత ఆధారాలు కానీ లేవు. హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి. దాన్ని చదివి, అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరి సామాజిక జీవితానికి సంబంధించిన ప్రధాన లక్షణాలను కింది విధంగా వివరించవచ్చు.
* హరప్పా సంస్కృతి నాటి సమాజాన్ని ఆర్థిక హోదాను బట్టి విభజించినట్లు తెలుస్తోంది. హరప్పా నగరాలను అనేక భాగాలుగా విభజించడమే దీనికి నిదర్శనం. హరప్పా సమాజం మాతృస్వామిక సమాజమని సర్ జాన్ మార్షల్ అభిప్రాయం. ఇతడు రెండు కారణాల వల్ల ఈ అభిప్రాయానికి వచ్చాడు.
a) హరప్పా నగరాల్లో లభించిన బంకమట్టితో చేసిన బొమ్మల్లో పురుషుల కంటే స్త్రీల బొమ్మలు అధిక సంఖ్యలో ఉండటం.
b) హరప్పా ప్రజలు అమ్మతల్లిని పూజించడానికి ఎక్కువ ఇష్టాన్ని చూపించడం. దీంతోపాటు బంకమట్టితో చేసిన అమ్మతల్లి బొమ్మలు ఎక్కువ సంఖ్యలో లభించడం.
* హరప్పా ప్రజల సామాజిక జీవనంలో మరో ప్రధాన లక్షణం జంతువులను మచ్చిక చేసుకోవడం. హరప్పా ప్రజలు ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వ్యవసాయం, గృహ అవసరాలు, వేట మొదలైనవి హరప్పా ప్రజలు జంతువులను మచ్చిక చేసుకునేలా చేసి ఉండొచ్చు. హరప్పా ప్రజలకు గుర్రం గురించి తెలుసు. బంకమట్టితో చేసిన గుర్రపు నమూనాలు, గుర్రానికి చెందిన అవశేషాలు మొహంజోదారో, లోథల్, సుర్కోటుడాల్లో లభించాయి. అయితే హరప్పా ప్రజలు గుర్రాన్ని ఎక్కువగా ఉపయోగించలేదు. సమకాలీన సుమేరియన్లు హరప్పా ప్రజలు మచ్చిక చేసుకున్న జంతువులనే మచ్చిక చేసుకున్నారు. అయితే గుజరాత్‌లోని హరప్పా ప్రజలు వరిని పండించారు. ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. కానీ, సుమేరియన్లకు వీటి గురించి తెలియదు.
* దుస్తులు, కేశాలంకరణ, ఆభరణాలు: హరప్పా సంస్కృతికి చెందిన స్త్రీ, పురుషులు దుస్తులు, కేశాలంకరణ పట్ల ఎక్కువ ఇష్టం ప్రదర్శించారు. నూలు, ఉన్నితో చేసిన దుస్తులను వాడేవారు. మొహంజోదారోలో కనుక్కున్న బంకమట్టితో చేసిన బొమ్మ ఆధారంగా హరప్పా ప్రజలకు అల్లికలు, కుట్ల గురించి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. హరప్పా స్త్రీలు అలంకారప్రియులు. ఆ కాలంనాటి ప్రజలు కొయ్య, దంతాలతో చేసిన దువ్వెనలు, గాజులు, వివిధ ఆభరణాలను ఉపయోగించేవారు. బంకమట్టితో చేసిన బొమ్మల ఆధారంగా స్త్రీలు చేతినిండా గాజులు ధరించినట్లు తెలుస్తోంది. అందాన్ని ఇనుమడింపజేసేలా కేశాల మధ్యలో దువ్వెనలు, పువ్వులు పెట్టుకునేవారు. పురుషులకు గడ్డం క్షవరం చేసుకోవడం గురించి తెలుసు.
* స్నానపు అలవాట్లు: హరప్పా నగరంలో చాలావరకు స్నానపు ఘట్టాలను ఏర్పాటు చేశారు. మొహంజోదారోలో ప్రసిద్ధి చెందిన గొప్ప స్నాన వాటిక ఉండేది. స్నానపు గదులు ఇంటి మూలలో లేదా వరండాలో ఉండేవి. ఇది హరప్పా ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల ఉన్న అవగాహనకు నిదర్శనం.
* ఆహారం: హరప్పా ప్రజలు శాకాహారం, మాంసాహారం తినేవారు. కోడి, చేప, మాంసం, గోధుమలు, వరి మొదలైనవి వారి ఆహారంలో ప్రధానమైనవి.
* వినోదాలు: హరప్పా ప్రజలకు ఇంట్లో ఆడుకునే ఆటలైన నృత్యం, జూదం గురించి తెలుసు. అయితే వారికి రథపు పందాలు, వేట గురించి తెలియదు.
* పై లక్షణాలను బట్టి హరప్పా ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో జీవించినట్లు తెలుస్తోంది. ఉన్నతవర్గాల వారు విలాసవంతమైన జీవితాన్ని, సామాన్య ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. హరప్పా సమాజంలో అసమానతలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.


ఆర్థిక వ్యవస్థ
    హరప్పా ప్రజలది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ. వీరు వ్యవసాయం కోసం సారవంతమైన వరద మైదానాలను ఉపయోగించేవారు. వీరికి భూమి దున్నడం తెలుసు. దీనికోసం కొయ్యతో చేసిన నాగలిని ఉపయోగించేవారు. కాలిబంగన్‌లో కనుక్కున్న నాగలితో దున్నిన చాళ్లు, బన్వాలిలో లభించిన బంకమట్టితో చేసిన నాగలి నమూనా ఇందుకు నిదర్శనం. హరప్పా ప్రజలు కాలువల ద్వారా పంటలకు నీటి పారుదల సౌకర్యం కల్పించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సింధు హరివాణం సారవంతంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రతి సంవత్సరం సింధునది వరదలకు గురికావడమే. హరప్పా ప్రజలు వరదనీటి మట్టం తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబరు నెలలో విత్తనాలు వేసి, వరదలు రావడానికి ముందే ఏప్రిల్‌లో గోధుమ, బార్లీ పంటల నూర్పిడి పూర్తిచేసేవారు.
* సింధు హరివాణంలో గోధుమ, బార్లీ, పత్తి మొదలైన పంటలను, గుజరాత్, కథియవార్ ప్రాంతాల్లో వరిని పండించేవారు. హరప్పా ప్రజలు ప్రపంచంలోని మొదటిసారి వరి, పత్తి పంటలను పండించారు. గ్రీకులు క్రీ.పూ. 4 వ శతాబ్దంలో పత్తి పంటను పరిశీలించి, దానికి సింధునది పేరు మీదుగా సిండాన్ అనే పేరు పెట్టారు. లోథల్, కాలిబంగన్‌లలో జరిపిన తవ్వకాలు వరి వాడకం గురించి తెలియజేస్తున్నాయి. ధాన్యాగారాల ఏర్పాటు హరప్పా ప్రజల ప్రధాన లక్షణం. ఆహార ధాన్యాలను సులభంగా రవాణా చేయడానికి ధాన్యాగారాలను నదీ తీరాల్లో ఏర్పాటు చేసేవారు. అనేక హరప్పా నగరాల్లో ధాన్యాగారాలు ఉండటం హరప్పా ప్రజలు వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడటాన్ని తెలియజేస్తోంది.


వ్యాపారం
   హరప్పా నగరాల్లో అవసరమైన ముడిపదార్థాలు లభించనందువల్ల హరప్పా ప్రజలు భారత ఉపఖండం లోపల, ఉపఖండం బయట వర్తక సంబంధాలను నెలకొల్పారు. అంతేగాక, హరప్పా ప్రజలు తాము తయారుచేసిన వస్తువులను అమ్ముకోవడానికి కూడా వర్తక సంబంధాలు అవసరమయ్యాయి.
* ఉపఖండం లోపల వర్తకం: ఉపఖండం లోపల వర్తకం అంటే హరప్పా నగరాల మధ్య అంతర్గత వ్యాపారమే కాకుండా ఇరుగు పొరుగున ఉన్న దక్కను, దక్షిణ భారతదేశం మొదలైన ప్రదేశాలతో జరిపిన వ్యాపారం అని అర్థం. హరప్పా ప్రజలు వివిధ రకాలైన లోహాలు, విలువైన రాళ్లను వేర్వేరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వీరు దక్షిణ భారతదేశం, అఫ్గనిస్థాన్, ఇరాన్ నుంచి బంగారం, రాజస్థాన్‌లోని ఖేత్రి గనుల నుంచి రాగి, బిహార్ నుంచి తగరం, దక్షిణ భారతదేశం, సౌరాష్ట్ర, రాజస్థాన్, దక్కనుల నుంచి విలువైన రాళ్లను దిగుమతి చేసుకునేవారు.
* రవాణా సౌకర్యాలు, వ్యాపార స్వభావం: హరప్పా కాలంనాటి ఓడరేవులు లోథల్, సుర్కోటుడా, సుక్తాజెండర్. వీరు పశ్చిమ ఆసియా దేశాలతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం సాగించేవారు. ఎస్.ఆర్. రావు లోథల్‌లో జరిపిన తవ్వకాల్లో ప్రాచీన ఓడరేవు బయటపడింది. ఇది హరప్పా ప్రజలకు చెందిన గొప్ప సంపన్నమైన ఓడరేవై ఉండొచ్చని పరిశోధకుల అభిప్రాయం.
* మొహంజోదారోలో బయటపడిన ముద్రికలపై ఓడబొమ్మలు అంతర్జాతీయ వ్యాపారాన్ని, వ్యాపారం కోసం పడవల వాడకాన్ని తెలియజేస్తున్నాయి. హరప్పా ప్రజలకు లోహపు నాణేల వాడకం గురించి తెలియదు. బహుశా ముద్రికలను వ్యాపార చిహ్నాలుగా వాడి ఉండొచ్చు. హరప్పా ప్రజల వ్యాపారం వస్తుమార్పిడి ద్వారా జరిగింది. వారు ఉత్పత్తి చేసిన వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి లోహాలు, ముడిసరకులను దిగుమతి చేసుకునేవారు. రవాణా కోసం పడవలు, ఎడ్లబండ్లను వినియోగించేవారు. వీరికి బలమైన చక్రాలతో కూడిన బండ్ల వాడకం గురించి తెలుసు. దీని ఆధారంగా హరప్పా ప్రజలకు కావలసినంత వ్యవసాయ మిగులు ఉండేదని, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని, లాభదాయకమైన అంతర్గత, అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలుస్తోంది. వీరి కాలంలో దిగుమతుల కంటే, ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండేది.

 

ముఖ్యమైన ప్రాంతాలు
         సింధు నాగరికత దాదాపు 1000 ప్రాంతాల్లో విస్తరించింది. ఈ నాగరికత క్రీ.పూ.3000 - క్రీ.పూ.1500 మధ్య కాలం నాటిది. సింధు నాగరికత ఉత్తరాన రూపర్ (పంజాబ్) నుంచి దక్షిణాన భగత్రావ్ (గుజరాత్) వరకు సుమారు 1100 కి.మీ. వ్యాపించి ఉండేది. పశ్చిమాన సుత్కాజెండర్ (పాకిస్థాన్ సరిహద్దు) నుంచి తూర్పున అలంగీర్‌పూర్ (ఉత్తర్ ప్రదేశ్) వరకు దాదాపు 1600 కి.మీ. విస్తరించింది.

 

సింధు నాగరికత కాలంలో బయటపడిన ప్రధాన నగరాలు, వాటి ఉనికి 
1. హరప్పా: పశ్చిమ పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్)
2. మొహంజోదారో: సింధ్ - లార్కానా జిల్లా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.)
3. చాన్హుదారో: సింధ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)
4. సుత్కాజెండర్: పాకిస్థాన్ - ఇరాన్ సరిహద్దుల్లోని బెలూచిస్థాన్‌లో ఉంది.
5. రూపర్: పంజాబ్ (భారతదేశం)
6. బన్వాలీ: హరియాణాలోని హిస్సార్ జిల్లాలో ఉంది.
7. కాలిబంగన్: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఉంది.
8. లోథాల్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.
9. అలంగీర్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలో ఉంది.
10. రంగపూర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.
11. సుర్కోటుడా: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది.
12. ధోలవీర: ఇది ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది.


సింధు నాగరికత పతనం
         సింధు నాగరికత పతనం గురించి కూడా చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రీ.పూ.1700 నాటికి వరదల కారణంగా హరప్పా నాగరికత పతనమైంది. ఉపరితలానికి 50 నుంచి 80 అడుగుల ఎత్తులో కూడా కొన్నిచోట్ల ఇసుక మేటలు కనిపించాయి. కాబట్టి భారీ వరద సంభవించి నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉండొచ్చని చరిత్రకారుల ఊహ. అలాగే సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడ్డారనేది మరో అభిప్రాయం.
* పక్కనున్న ఎడారి విస్తరించడంతో ఇక్కడి భూములు బీడు భూములుగా మారి, సారం కోల్పోయి ఉంటాయని, ఆర్యుల దాడిలో ఈ నాగరికత నాశనమై ఉంటుందని మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌