• facebook
  • whatsapp
  • telegram

కుషాణులు

            భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాల్ల్లో కుషాణులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమేకాకుండా భాష, సాహిత్యం, కళలు మొదలైనవాటిని బాగా ఆదరించారు. కుషాణుల్లో ప్రముఖుడు కనిష్కుడు. ఇతడిని రెండో అశోకుడిగా పేర్కొంటారు. కనిష్కుడి పాలన, కుషాణుల వంశం విశేషాల గురించి తెలుసుకుందాం.
            మౌర్య వంశ పతనానంతరం భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాలన్నింటిలో ప్రముఖమైంది కుషాణుల వంశం. వీరిని 'తాకారియన్లు' అని కూడా అంటారు. వీరు యూచి తెగకు చెందినవారు. మధ్య ఆసియా ఉత్తర భాగంలో చైనాకు దగ్గరగా ఉన్న గడ్డిమైదానాలకు చెందిన సంచార జాతిగా వీరిని పేర్కొంటారు. వీరు సింధూ మైదానంలోని దక్షిణ భాగంలో, గంగా మైదానంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమ అధికారాన్ని నెలకొల్పారు. వీరి సామ్రాజ్యం ఆక్సస్‌నది నుంచి గంగానది వరకు, మధ్య ఆసియాలోని ఖోరసాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వరకు విస్తరించి ఉండేది.
 మధ్య ఆసియాలో ఎక్కువ భాగం, నేటి రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కొన్ని భాగాలు, పాకిస్థాన్, ఉత్తర భారతదేశం మొత్తం.. ఇలా అనేక ప్రాంతాలను కుషాణులు ఒకే పరిపాలన కిందికి తెచ్చారు. అందుకే వీరి పాలనలో వివిధజాతులు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఒకరితో ఒకరు కలిసి జీవించేవారు. దీని ఫలితంగా ఒక కొత్త సంస్కృతి ఉద్భవించింది.
కుషాణులు ఎక్కడ జన్మించారు అనేదానిపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
           'రాజుల పేర్లను బట్టి కుషాణులు ఇరాన్ ప్రాంతవాసులు'. - ఎఫ్.డబ్ల్యూ. థామస్
           'కుషాణుల శరీర నిర్మాణాన్ని బట్టి టర్కీస్థాన్‌కు చెందినవారు'. - కల్హనుడు
           'వీరు చైనీస్ తుర్కిస్థాన్ ప్రాంతానికి చెందినవారు'.- స్టెన్‌కోన్
* మధ్య ఆసియాలోని తొలి కుషాణ నివాస స్థలమైన 'ఖల్చయాన్‌'లో వీరి ఇతిహాస వాక్యాలున్న నాణేలు బయటపడ్డాయి. ఇవి ఖరోష్ఠి, బ్రహ్మీ లిపుల్లో ఉన్నాయి. వీటి ఆధారంగా వీరు సాంస్కృతిక, వ్యాపార కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని,ప్రాకృతం మాట్లాడిన సమూహాలు భారత ఉపఖండం అవతల జీవించి ఉండవచ్చని చెప్పవచ్చు.


కుషాణ వంశస్థాపన
   కుషాణుల్లో రెండు రాజవంశాలు కనిపిస్తాయి. మొదటిది 'కాడ్‌ఫిసెస్', రెండోది 'కనిష్క'. కుషాణ రాజ్యస్థాపకుడు కుజుల కాడ్‌ఫిసెస్. ఇతడు యూచిలోని అయిదు తెగలకు చెందిన వారిని ఏకం చేయడమే కాకుండా హిందూకుష్ పర్వతాలు దాటి కాబూల్, కశ్మీర్‌లో తన అధికారాన్ని స్థాపించాడని చైనీస్ ఆధారాన్ని బట్టి తెలుస్తుంది.
 ఇతడి తర్వాత 'విమా కాడ్‌ఫిసెస్' రాజయ్యాడు. ఇతడు బంగారు నాణేలు ముద్రించాడు. నాణేలపై శివుడి ప్రతిమ ఉంటుంది. పాశుపత శైవాన్ని అభిమానించాడు.


కనిష్కుడు
      విమా కాడ్‌ఫిసెస్ తర్వాత కనిష్కుడు అధికారంలోకి వచ్చాడు. ఇతడు కుషాణుల్లో అత్యంత ప్రముఖుడు. ఇతడి పరిపాలనలో కుషాణ వంశం అత్యున్నత స్థితికి చేరుకుంది. కనిష్కుడు సమకాలీన ప్రపంచంలో గొప్పశక్తిగా ఎదిగాడు.
* భారతదేశంలో ఇతడి అధికారం దక్షిణాన సాంచి, తూర్పున బెనారస్ వరకు విస్తరించింది.ఇతడు మధ్య ఆసియాలో కూడా విశాలమైన రాజ్యభాగాల్ని స్వాధీనం చేసుకున్నాడు.ఇతడి రాజధాని పురుషపురం (నేటి పెషావర్). మధురలో లభించిన కుషాణుల నాణేలు, శాసనాలు, నిర్మాణాలు, శిల్పాలను బట్టి ఆ నగరం కుషాణులకు రెండో రాజధానిగా ఉండేదని భావిస్తున్నారు.
* కనిష్కుడు రాజ్యాధికారాన్ని చేపట్టిన సంవత్సరం గురించి చరిత్రకారుల్లో వాదోపవాదాలున్నాయి. కానీ క్రీ.శ. 78 వ సంవత్సరంలో రాజై ఉండొచ్చన్నది దాదాపు అందరూ అంగీకరించిన విషయం.
* కనిష్కుడి బిరుదులు దేవపుత్ర, సీజర్, రెండో అశోకుడు. 'దేవపుత్ర' అనే బిరుదు చైనీయ ప్రభావంతోనో లేదా రోమ్‌లో ప్రచారంలో ఉన్న 'దివ ఫిలియస్' అనే బిరుదు ప్రభావంతోనో వచ్చి ఉండవచ్చు.
* మరణానంతరం కూడా తమకు దైవత్వం ఆపాదించుకునేందుకు వీరు తాము నిర్మించిన సమాధులకు 'దేవకుల' అని పేరు పెట్టేవారు. ఇలాంటి బిరుదులు భారతదేశంలో అరుదుగా ఉండేవి. కుషాణులు తాము భారతదేశానికి వలస వచ్చామన్న సంగతి మరిచిపోకుండా, పరాయిచోట తమ గౌరవాన్ని పెంచుకోవడానికే ఈ పద్ధతిని ఎంచుకుని ఉంటారన్నది చరిత్రకారుల భావన.
* కనిష్కుడు పరిపాలనాదక్షుడు. యుద్ధ విజేత, బౌద్ధమతాభిమాని. ఇతడికి సంబంధించిన శాసనాలు అలహాబాద్, సారనాథ్, మధుర, భాగల్‌పూర్, రావల్పిండి ప్రాంతాల్లో బయటపడ్డాయి.
* చైనా చరిత్రకారుల కథనాల ప్రకారం కనిష్కుడు 'హాన్' వంశానికి చెందిన రాకుమారిని వివాహమాడతానని అడిగాడనీ, అందువల్లనే 'హాన్' వంశానికి చెందిన 'హా-ట్సీ' చక్రవర్తి సేనాని పాం-చా-వో చేతిలో ఓడిపోయాడని ప్రచారంలో ఉంది.
* మధ్య ఆసియాలోని సిల్క్‌రూట్‌కు ప్రధాన కేంద్రాలైన 'కాష్‌ఘల్, యార్కండ్, ఖోటాన్' ప్రాంతాలను కనిష్కుడు జయించినట్లు తెలుస్తుంది. ఇతడు మధ్య ఆసియా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
* కనిష్కుడు అనగానే బౌద్ధమతంతో (మహాయాన) అతడికి ఉన్న సంబంధం గుర్తుకు వస్తుంది. కశ్మీర్‌లోని కుందనవనంలో నాలుగో బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు.దీనికి వసుమిత్రుడిని అధ్యక్షుడిగా, అశ్వఘోషుడిని ఉపాధ్యక్షుడిగా నియమించాడు.
* కనిష్కుడు ఈ సభను బౌద్ధమత సిద్ధాంతాలకు, అధ్యయనానికి సంబంధించిన విషయాల గురించి చర్చించడానికి ఏర్పాటు చేశాడు. కానీ ఈ సమావేశంలో బౌద్ధమతం హీనయాన, మహాయాన అనే రెండు ప్రధాన శాఖలుగా విడిపోయింది.
* ఇతడు 'కస్యవమాతంగ' నేతృత్వంలో మహాయాన బౌద్ధ మిషన్‌ను చైనాకు పంపాడు. అంతేకాకుండా ఆసియాకు కూడా మత ప్రచారకులను పంపించాడు. పెషావర్‌లో బుద్ధుడి ఒక అవశేషంపై ఇతడు అనేక అంతస్తుల కట్టడాన్ని నిర్మించాడు.
* క్రీ.శ. 7వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ఈ స్తూపాన్ని గురించి విపులంగా వర్ణించాడు. 11వ శతాబ్దిలో 'ఆల్‌బెరూని'కూడా దీన్ని గురించి తెలిపాడు. పెషావర్‌లో జరిపిన తవ్వకాల్లో ఈ స్తూప పథకం, విహారాలు కట్టిన స్థలాలు, కొన్ని శిల్పాలు, బుద్ధుడి అవశేషాలను ఉంచిన పాత్రలు బయటపడ్డాయి.


నాణేలు..
      భారతదేశ చరిత్రలో అత్యధిక సంఖ్యలో బంగారు నాణేలను ముద్రించింది కుషాణులు. ఈ నాణేల్లోని బంగారం గుప్తులకాలం నాటి బంగారం కంటే ఎక్కువ నాణ్యమైంది.
*  వీరి నాణేలపై భాష - పారశీకం. కుజుల కాడ్‌ఫిసెస్ నాణేలపై బుద్ధ ప్రతిమ, విమా కాడ్‌ఫిసెస్ నాణేలపై శివుడు-నంది ప్రతిమ, కనిష్కుడి నాణేలపై బౌద్ధ చిహ్నాలు కనిపిస్తాయి. కానీ బౌద్ధ, భారతీయ దేవతా చిహ్నాలు లేని నాణేలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.
కనిష్కుడి వ్యక్తిగత ఆరాధ్య దేవతలు హెరాక్లిస్, హీలియస్, సెలీనా, మద్రనాన, మిరో మొదలైనవారు. ఇది తన సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో భిన్న సంస్కృతులు, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి ఇతడు పాటించిన మత విధానంగా చెప్పవచ్చు.


కళలు..
  కనిష్కుడు గొప్ప కళాపోషకుడు, సాహిత్యాభిమాని. ఇతడి ఆస్థాన కవులు వసుమిత్రుడు, అశ్వఘోషుడు, చరకుడు & ఆచార్య నాగార్జునుడు మొదలైనవారు.
* వసుమిత్రుడు - సంస్కృతంలో మహా విభాషశాస్త్రాన్ని, అశ్వఘోషుడు - బుద్ధచరిత (భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత కావ్యం), సౌందర్య నందనం, శారిపుత్ర ప్రకరణం అనే సంస్కృత నాటకాలు రచించారు. (మధ్య ఆసియాలోని ఖోటాన్ ప్రాంతంలోని తవ్వకాల్లో బయటపడిన నాటకం - శారిపుత్ర ప్రకరణం). చరకుడు - 'చరక సంహిత' అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు.
* ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ రూపశిల్పి. ఇతడు సుహృల్లేఖ, రసవాదం, శూన్యవాదం, మాధ్యమిక వాదం, ప్రాజ్ఞపారమిత శాస్త్రం, ద్వాదశనికాయ శాస్త్రం, రత్నావళి రాజుపరికథ మొదలైన సంస్కృత గ్రంథాలు రచించాడు. ఇతడి బిరుదులు - ఇండియన్ ఐన్‌స్టీన్, రెండో తథాగతుడు, ఇండియన్ మార్టిన్ లూథర్, ఆంధ్ర బౌద్ధ సారస్వత అరిస్టాటిల్ మొదలైనవి.


కనిష్కుడి వారసులు
    కనిష్కుడి తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టింది హవిష్కుడు. ఇతడు క్రీ.శ. 230 వరకూ తన పరిపాలనను కొనసాగించాడు. ఇతడి బిరుదులు మహారాజ, రాజాధిరాజ, దేవపుత్ర.
* హవిష్కుడి తదనంతరం రెండో కనిష్కుడు రాజయ్యాడు. ఇతడి బిరుదు 'కైజర్'.
* కుషాణు వంశంలో చివరివాడు 'వాసుదేవుడు'. శివ, అంబ, ఉమేశ్వరుల ప్రతిమలు ఇతడి నాణేలపై కనిపిస్తాయి. వాసుదేవుడి కాలంలోనే కుషాణుల ప్రత్యేకత క్షీణించింది. అయితే వీరు భారతదేశంలోనే స్థిరపడి ఉండొచ్చని వాసుదేవుడి పేరు సూచిస్తోంది.


శిల్పకళ..
     కుషాణుల కాలంలో వాయవ్య భారతదేశంలో 'గాంధార శిల్పకళారీతి', తూర్పు భారతదేశంలో 'మధుర శిల్పకళారీతి' ఆవిర్భవించాయి.

గాంధార శిల్ప శైలి
* గ్రీకు-భారతీయ- రోమ్ శిల్పకళల సమ్మేళనమే గాంధార శిల్ప శైలి.
* ఇందులో బుద్ధుడిని తెల్లని చలువ రాయితో మలిచారు.
* ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గాంధార శైలి ఆప్ఘనిస్థాన్‌లోని బీమారన్ దగ్గరున్న 'తఖ్-ఇ-బామి' వద్ద లభించింది.
* ఈ శైలిలో ఉన్న బుద్ధ విగ్రహాలు భారతదేశంలోని కశ్మీర్, విదిశ, అమరావతి మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి.
* ఈ శైలిలో బుద్ధుడు గ్రీకుల యుద్ధదేవుడిని తలపిస్తాడు. గ్రీకుల యుద్ధ దేవుడు ఒలంపస్.
* రోమన్ల కండలు తిరిగిన శరీరం, రింగురింగుల పొడవాటి వెంట్రుకలు, పలుచని వస్త్రాలు మొదలైనవి ఈ శైలిలో ఎక్కువగా కనిపిస్తాయి.
* విగ్రహాలు గడ్డాలు, మీసాలు పెంచుకుని భారతీయ యోగుల మాదిరిగా కనిపించడం దీని ప్రత్యేకత.
* ఈ శిల్పకళ సౌందర్యానికి ప్రాముఖ్యం ఇచ్చింది కానీ ఆధ్యాత్మికతకు ఇవ్వలేదు.


మధుర శిల్ప శైలి
* మధుర శైలిలో బుద్ధుడిని ఎర్రని ఇసుకరాయితో మలిచారు.
* ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శిల్పశైలి.
* ఇందులో బుద్ధుడు ధ్యానస్థితిలో ఉన్నట్లుగా రూపొందించారు.
* హిందూమతంలో భాగంగా శివుడిని పార్వతీ సమేతుడిగా, అర్ధనారీశ్వర రూపంలో తయారు చేశారు.
* ఈ శైలిలో జైన మతంలోని పార్శ్వనాథుడిని కూడా మలిచారు. ప్రస్తుతం ఈ ప్రతిమ లక్నో మ్యూజియంలో ఉంది.
* స్త్రీ ప్రతిమలైన సాలభంజికలు, యక్షణి మొదలైన వాటిని కూడా మలిచారు.
* ఈ శైలి పరమత సహనానికి నిదర్శనం.
* భారతీయులకు కోటు, బూటు, టోపీని పరిచయం చేసినవారు కుషాణులు. కనిష్కుడి శిథిల విగ్రహం మధురకు సమీపంలోని తిక్రితి లోయలో లభించింది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌